పుణ్య పురుషులు వేరయా! - అచ్చంగా తెలుగు

పుణ్య పురుషులు వేరయా!

Share This

 పుణ్య పురుషులు వేరయా!

(మాజొన్నవాడ కధలు)

టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)


ఆరోజు శుక్రవారం. దేవళంలో  బాగా తోపులాటగా, గలభాగా, గందరగోళంగా ఉంది. అందరూ ఎవరి తొందరలో వాళ్ళు. అప్పటికి పూజారి కృష్ణశాస్త్రిగారు ఓపిగ్గా తీర్ధ ప్రసాదాలు ఇస్తున్నాడు. 70 యేళ్ళు పైబడ్డా ఇంకా ఆవయసులో అలా పని చెయ్యడం భక్తులందరికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన చేతి తీర్ధంకోసం జగ ఎగబడతారు. దయ్యం, భూతం పట్టినవారికి ఆయన వేపమండతో పసుపునీళ్ళు చల్లితే చాలు. వెంటనే వెళ్ళిపోయాతని  ఒక నమ్మకం. అంతటి నిష్టా గరిష్టుడు.  మహామహోపాధ్యాయ మద్దులపల్లి మాణిక్యశాస్త్రిగారితో  సమానమైన మంత్రశక్తిగల వాడని జనం చెబ్తుంటారు.

ఉదయం 11 గంటలయింది. అమ్మవారికి ఫట్టుచీర సమర్పించిన భక్తులకు తీర్ధం ఇవ్వబోతూ, ఒక భక్తురాలు నడిచే దారిలో అడ్డంగా బెట్టిన పెద్ద టెంకాయల  బస్తా చూసుకోకుండా శాస్త్రిగారు తట్టుకుని జారిపడి మోకాలికి బాగా రక్తస్రావం అయింది. వెంటనే అక్కడ ఆర్.ఎం.పి డాక్టరు చేత ప్రధమ చికిత్స చేయించి కార్లో నెల్లూరుకు పంపారు. డాక్టరు బి.పి, షుగరూ ఎక్కువగా ఉన్నాయన్ని చెప్పి మందులిచ్చాడు. విషయం తెలిసి చెన్నై నుండి రాత్రికి రాత్రే హుటాహుటిన వచ్చిన కొడుకులిద్దరూ ఇంక దేవళం డ్యూటి మానుకోమని, వాళ్ళతో పాటే వచ్చి వుండాల్సిందేనని చాలా పెద్ద గొడవచేశారు. "ఒరేయ్! ముప్పై ఏళ్ళనుంచీ అలవాటైన ప్రాణంరా! కామాక్షమ్మను చూడకుండా, ఆ తల్లితో రోజూ మాట్లాడకుండా, ఉండలేనురా! పైగా ఇలా అకస్మాత్తుగా మానేయలేను గదా!. కొద్ది రోజులన్నా టైం పడుతుంది. ఈ నెలాఖరులో ఎలాగూ కమిటీ మీటింగు ఏదో ఉందంటున్నారు. దేవళం ఛైర్మన్ కు చెప్పి వేరే పూజారిని చూసుకోమని చెప్తాను." అన్నాడు శాస్త్రిగారు. "అవున్రా! వాళ్ళూ… వేరే ఆయన్ను ఎవర్నన్నా…. చూసుకోవాలి కదరా!" అని వత్తాసు పలికింది వాళ్ళమ్మ సుందరమ్మ.

*  *  *

ఛైర్మన్‌గారు దేవళం హుండీ డబ్బు లెక్కబెట్టించడం, అందరి సంతకాలు తీసుకోవడం, బ్యాంక్‌లో జమచేయించడం తదితర కార్యక్రమాలు అయ్యాక  దేవళంలో వస్తున్న చిన్న చిన్న తగాదాల విషయాలు సర్ది చెప్పి, రాబోయే రోజుల్లో అందరూ ఎలా ఉండాలి అన్న విషయాలు చెబుతున్నారు.  కమిటీ మీటింగ్ ప్రారంభం కాబోతుండగా పూజారి శాస్త్రిగారు "అయ్యా! రెడ్డిగారూ! నాదొక విన్నపం!" అన్నాడు. ఏమిటన్నట్టుగా చూసే సరికి మొన్న జరిగిన సంఘటన, మీదబడుతున్న తన వయసు సంగతి ప్రస్తావించి, "వీలైనంత తొందరలో నేను అమ్మణ్ణి సేవ ముగించుకుందామనుకుంటాను" అని దణ్ణం పెట్టి చెప్పాడు. మెంబర్లందరూ ఒక్కసారి అవాక్కయ్యారు.  "శాస్త్రిగారూ! మీరు చెప్పేది నిజమే! కాని ఇప్పటికిప్పుడు మీ అంత శాస్త్రం తెలిసిన పూజారి ఎక్కడ దొరుకుతాడు? తెలిసినా మీ అంత నిష్టగా ఉంటారా అందరూ? ఈ దేవళానికి ఇంత పవిత్రత వచ్చిందంటే మీరే గదా కారణం. మీ స్థానంలో ఇంకో పూజారిని ఊహించుకోలేకపోతున్నాను.  పైగా పెద్ద పెద్ద మినిస్టర్లు అందరూ వచ్చే దేవళం. మీరు బ్రతికున్నంతవరకూ మీరే పూజారి అంతే!" అనేసరికి " రెడ్డిగారూ! నేను ఇప్పటికిప్పుడు ముగించుకుంటానని చెప్పడం లేదు. నెల్లూరులో మంచి మంచి వేద పండితులున్నారు. వాళ్ళను చూసి కొంతమందితో  మాట్లాడి వాళ్ళకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేయిస్తాను." అనేసరికి "మీ పిచ్చిగాని అయ్యోరా! మీలాంటి పూజారి దొరుకుతాడంటారా?  అయినా చూద్దాం! కానీండి" అన్నాడు.

*  *  *

"రెడ్డిగారూ! ఈ నెలరోజుల్లో చాలా మందిని చూశాను.  వయసు ఎక్కువ ఉన్న వాళ్ళే అంతా! యిద్దరు మాత్రం మనకు సరిపోతారని అనిపించింది. మీ అనుమతితో వారిని మీ ముందు కొన్ని ప్రశ్నలడుగుతాను. మీరు కూడా ప్రశ్నలు వేసి మీకు సంతృప్తికరంగా ఉన్నవారిని తీసుకోవచ్చు" ఛైర్మన్‌గారితో చెప్పిన మాటలకు తలూపి "మా తమ్ముడు సుబ్బారెడ్డి ఈదూరు నుండి అమ్మణ్ణి దర్శనం కోసం వచ్చాడు. వాడికీమధ్యే హటాత్తుగా భార్యా వియోగం. బయట కార్లో కూర్చొని ఉన్నాడు. కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు.  ఈ పని మనకు బాగా టైం పడుతుంది కదా! మీకభ్యంతరం లేకపోతే వాడ్నీ లోపలకు పిలుద్దాం. వాడికి జీవితంలో శుభం జరగాలని దీవించండి." అన్న మాటకు "హయ్యో! ఎంత మాట తప్పకుండాను!" అని గుర్నాధానికి రెడ్డిగారి తమ్ముణ్ణి  పిలవమని చెప్పాడు. "రెడ్డిగారూ! వచ్చిన వాళ్ళల్లో ఒకడు 20 యేళ్ళ పిలగాడు. ఇటీవలే కృష్ణయజుర్వేదంలో పట్టాతీసుకున్నాడు. స్మార్తంలో దిట్ట. వాడి పేరు మహంకాళి సూర్యనారాయణశాస్త్రి.  వాళ్ళ నాయన కందుకూరు దగ్గర ఉన్న శింగరభొట్లపాళెం అగ్రహారంలో వేద పాఠశాలలో గురువు. ఇంకొకాయన 35 యేళ్ళవాడు. పేరు మండాది విష్ణుమూర్తి. ఇరగాళమ్మ దేవళంలో, వరిగొండ జ్వాలాముఖి దేవళంలోను, ఇంకా ఈదూరు ప్రక్కన సాలిపేట శివాలయంలోను అక్కడా ఇక్కడా 10 సంవత్సరాలు  సహాయ  అర్చకుడిగా పని చేశాడు. ఎక్కడన్నా స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు.  “మొదట ఆ అబ్బాయిని పిలవండి” అన్న రెడ్డిగారి మాటలు విని, గుమాస్తా గుర్నాధం వైపు చూశాడు.

ఆ అబ్బాయి లోపలికి రాగానే "సర్వేభ్య: నమస్కార:" అని నమస్కారం పెట్టి "చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు” అని ప్రవర చెప్పి  చివర  “మహంకాళి సూర్యనారాయణశాస్త్రి అహంభో అభివాదయే!" అని అని అనగానే రెడ్డిగారు చిరునవ్వుతో "కూర్చోవయ్యా శాస్త్రీ!" అని  ప్రశంసాపూర్వకంగా కృష్ణశాస్త్రి వేపు చూశాడు. "అబ్బాయీ! నీకు నమకం చమకం కంఠస్తం వచ్చునా!" అన్న శాస్త్రి ప్రశ్నకు వచ్చు అన్నట్టు తలూపాడు. "నేను కొంత చదువుతాను. నేను ఆపిన దగ్గరనుండి నువ్వు అందుకో అని "నమో భవాయచ రుద్రాయచ నమశ్శర్వాయచ పశుపతయేచ" అని ఆపగానే "నమో నీలగ్రీవాయచ.. శితికంఠాయచ... అని సుస్వరంగా చదువుతూ శ్రుతసేనాయచ" అని గాలి పీల్చి మళ్ళీ అందుకోబోతుండగా చాలని చేసిన సైగకు ఆపాడు.  ఛైర్మన్ గారు ఒక ఆశీర్వచన పనస చదవమనగానే అద్భుతంగా చదివి వినిపించాడు. రెడ్డి ఇక చాలన్నట్టు పూజారి వైపు చూడగానే "నువ్వు బయటకూర్చో మళ్ళీ పిలుస్తాం" అన్నాడు. రెండో ఆయన విష్ణుమూర్తి శాస్త్రి లోపలికి వచ్చి మర్యాద పూర్వకంగా అందరికి నమస్కారం పెట్టాడు. ఆయన్ను కూర్చోబెట్టి వివరాలు అడిగి వచ్చిన పూజలు, పునస్కారాలు గురించి అడిగారు. అన్నిటికి సంతృప్తికరంగానే సమాధానాలు చెప్పాడు. ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన పూజలు అన్నీ నోటికి వచ్చని ఋజువైంది. బయట కూర్చో మళ్ళీ పిలుస్తామని చెప్పగానే  "అయ్యా! నాకు ఒక ఆడపిల్ల, యిద్దరు మొగపిల్లలు. అంతా చదువుకుంటున్నారు. నా జీతమ్మీదే అందరూ బ్రతకాలి. దయచేసి ఈ ఉద్యోగం నాకు యిప్పించండి. 10 సంవత్సరాల నుంచీ నా బతుకు సహాయపూజారి గానే తెల్లవారి పోతోంది.  పేద బ్రాహ్మణుణ్ణి. మీకు  జీవిత కాలం ఋణపడి ఉంటాను" అని దణ్ణం పెట్టి బయటికి వెళ్ళాడు.

ఆలోచనలోపడ్డ రెడ్డిగారిని చూస్తూ " అయ్యా! నాకైతే యిద్దర్నీ తీసుకుందామని ఉంది. పీఠాధిపతి లాగా పిలగాడు శిక్షణ పొందుతాడు" అన్న శాస్త్రి  మాటకు నవ్వి "నిజమే! మనకు ఎండోమెంట్ నిబంధనలు శానా ఉళ్ళా... మన దేవళం అంతఖర్చు భరించబళ్ళా! నా మటుకు నాకు అనుభవం ఉన్న పెద్దయ్యోరిని తీసుకుంటే మంచిదనిపిస్తా ఉంది అంటూ తమ్ముడి వైపు చూస్తూ... "కమీషనర్‌కు ఫోన్ జేసి ఒక మాట చెప్పాలి. లేకపోతే ఆయన సొమ్మేదో మనం తిన్నట్టు నాలిక పీక్కుంటాడు. ఇవాళో రేపో నెల్లూర్‌క్లబ్ లో కలుస్తాళ్ళే!  నేనానయనకు చెప్పింతర్వాత మీకు ఫోన్ చేస్తా! అంతవరకూ ఎవ్వరికి ఏమీ చెబ్బాకయ్యోరో! ఇరుకున బడతాం" అన్నాడు. తమ్ముడు సుబ్బారెడ్డి కూడా పెద్దాయన్నే బలపరుస్తూ, “ఆయన్ను ఎప్పుడో సాలిపేట శివాలయంలో చూసినట్టు లీలగా గుర్తుంది. అయినా, నాదొక సలహా అన్నా.. మన కృష్ణశాస్త్రిగారు మటుకు ఇంకో సంవత్సరం గౌరవవేతనం మీద ఈణ్ణే ఉండాల!  ముక్కూ మొహం తెలీనాయన  మీద ఇంత పెద్ద దేవళం వదిలి పెట్టడం మంచిపద్ధతి కాదని నా అభిప్రాయం ఇక మీ ఇష్టం” అనగానే, గౌరవ వేతనానికి ఎండోమెంటు బోర్డు అనుమతి కావలసి వస్తుందన్న ఛైర్మన్ మాటలకు, “అనుమతులేం  బల్లేదులే అన్నా!,  ఆ డబ్బేదో ప్రతినెలా నేనే ఇస్తాలే! ప్రతి రోజు ఉదయం రెండు గంటలు, సాయంత్రంపూట రెండు గంటల సేపు ఉంటే చాలు"  అన్న సుబ్బారెడ్డి మాటకు పూజారి భక్తిపూర్వక నమస్కారం చేశాడు.  

*  *  *

ఒక నెలరోజులకు విష్ణుమూర్తి ఎండోమెంటు అనుమతి వచ్చింతర్వాత పనిలో జేరాడు. అన్ని విషయాలు కృష్ణశాస్త్రిగారి వద్ద తర్ఫీదు పొందాడు. ఒకరోజు పెద్దపూజారి లేని సమయం చూసి "గుర్నాధమా! ఏందిది? విచిత్రం గాకపోతే అందరు భక్తులు పెద్దాయనున్నప్పుడే దేవళానికి కట్టగట్టుకోని రావాల్నా?  నేను ఉన్నప్పుడేమో ఈగ్గూడా వాలదేందో గాని!" అనగానే గుర్నాధం నవ్వి "విష్ణుమూర్తయ్యోరా! ముప్పైయేళ్ళకాడ్నుంచి ఆయనకు ఈ దేవళంతప్ప ఇంకో లోకమే తెలవదు. ఇదుగో సామీ.. రహస్యం ఒకటి జెప్పాల నీకు… ఏందంటే…  పెద్దయ్యోరు ఇంట్లో  అమ్మణ్ణమ్మ పంచలోహ విగ్రహం ఉందంట!  కామాక్షమ్మోరితో రోజూ అయ్యోరు మాట్లాడతాడంట…. ఆయనింట్లోకి మేమెవ్వరం బోము గదా! యింట్లో వాళ్ళు గూడా ఆయన పూజ రూములోకి బోరు.  ఆయన ఇట్టా చెప్పులేసుకోని ఇంట్లోంచి దేవళానికి కదలడం ఆలశ్యం! జనం ఆవంతన లగెత్తుకోనొస్తారు దేవళానికి! " అన్నాడు.  "అయితే ఈ సామున్నంతవరకు మనకు హారతి పళ్ళెంలో పైసా రాలదు గామాల.  సరే! ఇట్టా జీతం డబ్బుల్తో బతకడమే మన గతి!" అని గొణుకున్నాడు మనసులో. 

*  *  *

ఒక శుక్రవారం నాడు పెద్దపూజారి వళ్ళు బాగాలేదని మదరాసుకు చెకప్‌కు బొయున్నప్పుడు నెల్లూరు నుంచి మినిస్టర్, ఆయనతో పది మంది ఉదయం 11 గం.కు దర్శనానికి వస్తున్నారని ఛైర్మన్ కాడ్నుంచి ఫోనొచ్చిందని గుర్నాధం చెప్పగానే హడావుడి పడి “గుర్నాధమా! కాస్తా ఈడ్నే ఉండు! ఏడకీ బోబాక! కాళ్ళు చేతులు ఆడ్డంలా నాకు” అని పూర్ణకుంభం, దండలు, ప్రసాదాలు  అవీ ఇవీ గబగబా ఆఘమేఘాల మీద రెడీ జేయించాడు. దేవళంలోకి ఆ టైములో పురుగ్గూడా రాకుండా జేశాడు.  వాళ్ళు కార్లు దిగీ దిగ్గానే సన్నాయి మేళంతో ఎదురెళ్ళి వేదాశీర్వచనంతో లోనకి దీసుకొచ్చి, వాళ్ళ గోత్ర నామాదులతో, వాళ్ళు ఎంతమంది పేర్లు జెబితే అంతమంది పేర్లతో, పూజలు జేసి అందరికి భుజాల మీద పూలమాలలయీ `వేసి, అమ్మవారి రవిక ముక్కలు, నాలుగైదు రకాల ప్రసాదాలు అవీ ఇచ్చి ఆర్భాటం జేశాడు.  ఆ యవ్వారమూ..ఆ హడావుడీ జూసిన గుర్నాధం "హమ్మో! ఈ అయ్యోరు మామూలోడు గాదురో నాయనో! పెద్ద పూజారి గూడా పనికిరాడీన ముందు. అందర్నీ నిముషంలో బుట్టలో యేసుకున్నాడే!" అనుకోని ముక్కుమీద వేలేసుకున్నాడు. వాళ్ళు పోతూ పోతూ సంతోషంకొద్దీ తలా ఐదొందలు ఇచ్చేసరికి మొత్తం నాలుగు వేలు పైచిలుకు పోగైంది. మనుసులో వీళ్ళు నెలకొకతూరి వస్తే బాగుణ్ణు అనుకుని "కామాక్షమ్మ చిన్న ఫొటో ఫ్రేములిచ్చి, అయ్యా! తమరు ప్రతి మాసం వీలుచూచుకుని అమ్మణ్ణిని దర్శించు కోవాలని నా విన్నపం. ఈ సారికూడా మనపార్టీనే గెలవాలని, మీకు సమస్త ధన, కనక వస్తు వాహానాదులు రావాలని అమ్మణ్ణికి ప్రార్ధన చేశాను.  శుభం" అని నమస్కారం చేశాడు. మినిస్టర్ "అట్నేలే అయ్యోరా! మాకు మాత్రం రావాల్నే ఉంటుళ్ళా!.. తీరికేడ చెప్పు!  చీటికిమాటికి రాజధానికి తిరగాల్సుండె.  ట్రై జేస్తాంలే!" అని నమస్కరించి వెళ్ళిపోయారు. ఫోన్లో ఛైర్మన్‌కు అంతా బాగా జరిగిందని చెప్పాడు గుర్నాధం.

*  *  *

కొడుకుల పనివత్తిడి వలన వెంటనే మదరాసు నుండి రాలేకపోయాడు కృష్ణశాస్త్రిగారు. ఛైర్మన్ పొలాల పనిమీద నరసింహకొండకు వచ్చి, పనిలో పనిగా దేవళానికొచ్చి “మంత్రిగారు బాగా కుషీ అయ్యాడయ్యోరా! అంత బిజీలోగూడా ఫొన్‌జేసి చెప్పినాడు.” అంటూ దేవళం స్టాఫందరి ముందూ విష్ణుమూర్తిని స్వయంగా అభినందించాడు. విష్ణుమూర్తి ఉబ్బితబ్బిబయ్యాడు.  పెద్దయ్యవారిని ఎలాగో పంపిచ్చేస్తే  ఇక పగ్గాలు చాలా వరకు చేతికొచ్చేసినట్టే నని సంతోషపడ్డాడు విష్ణు. ఆ వారంరోజుల్లో సంపాదన మార్గాలు చాలా తెలిశాయి. వాటిని అంచలంచలుగా అమలు జెయ్యాలని, తొందరపడకూడదని, గత అనుభవాల ద్వారా అనుకున్నాడు. 

ఇంతలో అనుకోని విపత్తొకటి వచ్చి పడింది.  తోడబుట్టిన చెల్లెలు సుచిత్ర పెళ్ళి జరిగి ఆర్నెల్లు కాకుండానే భర్త అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడంతో షాక్‌కు గురైంది విష్ణు భార్య శాంతమ్మ.  ఆరోజే వచ్చిన కృష్ణశాస్త్రికి విషయం చెప్పి రెండు రోజులు సెలవడిగి వెంటనే ఇంటిల్లపాది హుటాహుటిన నెల్లూరు  చేరారు.  అక్కడ కార్యక్రమాలు పూర్తయింతర్వాత రెండో రోజు సుచిత్ర దగ్గర కొద్ది రోజులు శాంతను తోడుగా ఉండమని, ఒక్క సారి సుచిత్రకు చెబ్దామని వెళ్ళగానే "బావా!" అంటూ పొదివి పట్టుకుని, కౌగలించుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. "ఏం పర్వాలేదు! సుచిత్రా! బాధపడకు! జీవితంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ధైర్యంగా ఉండు. నీకు నేనుళ్ళా.. అన్ని జూసుకోడానికి. నీ కిష్టమైతే కొద్ది రోజులు జొన్నవాడ వచ్చి అమ్మణ్ణి దగ్గరుండు. ఊరుమారితే కాస్త శాంతి దొరుకుతుంది" అన్న విష్ణుతో సరే అన్నట్టు తలూపింది.

*  *  *

ఒక పదిహేను రోజులకు భార్యా  పిల్లలతో సుచిత్రకూడా పెట్టె బేడాతో వచ్చింది. సుచిత్ర శాంతక్క వంటలో సాయం చేయడమే కాకుండా దేవళానికి నైవేద్యం తీసుకెళ్ళడం అక్కడి పనులు కూడా బాగా చేస్తుండడంతో విష్ణుకు బాగా సన్నిహితమయింది. పిలుపు "సుచిత్రా!" కాస్తా శాంత లేనప్పుడు "సుచీ!" అని పిలవడం, సన్నిహితంకావడం...ఊసులు చెప్పుకోవడం మొదలయింది. శాంత పనిమీద పుట్టింటికి అల్లూరుకు వెళ్ళినప్పుడు సుచిత్ర బావతో కలిసి నెల్లూరు సినిమాలకు పోవడం లాంటివి బాగా అలవాటు చేసుకుంది. సుచిత్ర మంచి అందగత్తె కావడంతో విష్ణు ఆమె వ్యామోహంలో పడి  పూర్తిగా దాసోహమయి పోయాడు.  ఇంట్లో పెత్తనం కూడా తనదే!  అలా మూణ్ణెల్లు గడిచాయి.

శాంతక్క లేని సమయం చూసి ఒకరోజు "బావా! అక్కను ఈ మధ్య గమనించావా? అనుమానంగా చూస్తోంది నా వైపు… చుట్టుపక్కల అమ్మలక్కలు ఏమైనా పురి ఎక్కించారో ఏమో!. "అవును సుచీ! మొన్న నువ్వు కూరలకో ఎక్కడికో పొయినట్టున్నావు శాంత టిఫిన్ పెడుతుంటే... నేను నోరు జారి సుచిత్ర ఎక్కడకు వెళ్ళింది అని అడిగితే….. ఏం మీ మరదలు పెడితే గానీ టిఫిన్ నొట్లోకి పోదా? అని దెప్పి పొడిచింది. "అట్టాంటప్పుడు నాకెందుకు! నాకిక్కడ ఎక్కువ రోజులుండడం ఇష్టంలేదు. నెల్లూర్లో ఉంటా" అన్న మాటకు  "నీకు మతిగానీ పోయిందా ఏందే! ఒక్క దానివే ఎలా ఉంటావే!  హమ్మో!  వద్దు!" అన్నాడామె గడ్డం పట్టుకుని  "అలా కాదు బావా! నా మాట విను కొంచెం! నేను ఇంటర్ వరకు చదివాను కదా! డి.కె.డబ్ల్యు కాలేజీలో చేరి  బి.ఎ అయ్యాక బి.ఎడ్ చదివి టీచర్ ఉద్యోగం చెయ్యాలనుంది" అని దగ్గరగా కూచోని గోముగా అడిగే సరికి మెత్తబడ్డాడు. "నీ ఐడియా బాగానే ఉంది కానీ ఎక్కడ ఉంటావు?" "రూంలో ఉంటాను. హాస్టల్ అయితే ప్రైవసీ ఉండదు కదా మనకు! అన్నిటికీ" అంది చివరిమాట ఒత్తి పలుకుతూ.  “సర్లే! ఇది ఫిబ్రవరి కదా! వచ్చే సంవత్సరం ప్లాన్ చేద్దాం! ఈ లోపు నీ సర్టిఫికేట్లు అన్నీ తెప్పించుకో!" అన్నాడు. “ధ్యాంక్యూ బావా!” అని ముద్దుపెట్టుకోగానే “ ఇష్ !! శాంత వస్తుంది” అన్నాడు. 

అలా మే నెలాఖరుకు సుచిత్ర మకాం నెల్లూరుకు మారింది. విష్ణు, కావాలసినవన్నీ సమకూర్చి రెండు-మూడు రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్ళేవాడు. అలా కొద్ది కాలం గడిచాక ఒక రోజు ఛైర్మన్‌గారు అనుకోకుండా జొన్నవాడ దేవళానికి వచ్చాడు. కృష్ణశాస్త్రిగారు ఆయన పేరుమీద పూజలు, అభిషేకాలు జరిపించాక ఆయన విష్ణును ఒక్కసారి ఆఫీసులో తనగదికి రమ్మని పిలిచాడు. "నమస్కారం సార్! మీ దయవల నా కుటుంబం ఒడ్డున పడింది" అనగానే నీకుటుంబమే కాదు నీ మరదలి కుటుంబం కూడా కదా!" అని పెద్దగా నవ్వాడు. ఒక్కక్షణం బిత్తరపోయి వెంటనే తేరుకుని "ఆ బాధ్యత కూడా నామీద పడింది సార్! అమ్మాయిని చదివి ఉద్యోగం చేస్తానంటోంది. అందుకే నెల్లూళ్ళో జేర్చా! " అన్న మాటకు " విష్ణూ! నాకన్నీ తెలుసులే గానీ.. ఉద్యోగం ఎందుకు డబ్బుల కోసమే కదా! అదే మనగ్గానీ డబ్బులు బాగా ఉంటే ఈ చదువులు.. ఉద్యోగాలు ఎందుకు చెప్పు? పనికిమాలిన యవ్వారాలు. అందుకని నేనొక విషయం చెప్పడానికి పిలిచాను. జాగ్రత్తగా విను! అన్నట్టు కృష్ణశాస్త్రి గారు జూన్‌లో మదరాసు వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడే సంవత్సరం గడిచి పోయింది.   వారికీ వయసు మీద పడింది కదా! మనం బలవంత పెట్టడం కూడా కరెక్టు కాదు. ఆయన పోతే నీకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. కానీ… నాకొక పెద్ద చిక్కొచ్చి పడిందయ్యోరా!" అని రెడ్డిగారు ఆగేసరికి ఏం కొంపముణుగుతుందో అని భయం భయంగా చూశాడు విష్ణు. "సార్! ఏమైంది? నా ఉద్యోగానికి ఏమైనా చిక్కులున్నాయా?" అడగ్గానే " అన్నిటికీ భయపడాకయ్యోరా! మనసుంటే మార్గం ఉంటుందని సామెతుళ్ళా.. పెద్దోళ్ళు చెప్పిళ్ళా….రా! కారెక్కు! నీతో శానా యవ్వారాలు మాట్లాడాల..మళ్ళీ ఇంకో అరగంటలో యిక్కణ్ణే దింపుతాగాని! కృష్ణశాస్త్రిగారికి  చెప్పిరా! పో! " అని బయటకు వచ్చి కార్లో కూర్చున్నాడు.

*   *  *

ఏం కొంప ముణుగుతుందోనని భయపడుతూనే కారెక్కాడు విష్ణు. కారు నరసింహకొండ వేపు తిప్పి ఒక కిలోమీటర్ ముందు ఆపి, దిగమన్నాడు. ఏం వినాల్సొస్తుందోనని టెన్షన్‌గా దిగాడు. ఒక రెండు నిముషాల అనంతరం గొంతు సవరించుకొని "శాస్త్రీ! నువ్వు నిజంగా… మనస్పూర్తిగా… మీ మరదలి క్షేమం కోరుకుంటున్నావా?" అని అడిగిన ప్రశ్నకు బిత్తరపోయి ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నాడో అర్ధం కాక  మైండ్‌బ్లాంక్ అయినా వెంటనే తేరుకుని "అవును సార్! నూటికి నూరుపాళ్ళూ" అన్న జవాబు విని,  “అయ్యోరా! నేను విషయం నాన్చదలుకోలేదు...డైరెక్టుగా పాయింటుకు వస్తాను.  మా తమ్ముడు ఈదూరు సుబ్బారెడ్డి తెలుసనుకుంటాను. అతను మొన్నీ మధ్య సినిమా హాల్లో నిన్నూ మీ మరదలినీ చూశాడంట.  సినిమా యాక్టరు మాదిరుంటాదంటగదా! అతనికి మీ మరదలు బాగా నచ్చేసినాదంట! " ఆశ్చర్యంగా కళ్ళప్పగిచ్చి  అలాగే నిలువుగుడ్లేసుకుని చూస్తున్నాడు విష్ణు. “ వాడికి పెళ్ళాం పొయిన బాధలో ఉన్నాడు. పిల్లలు లేరు. కనుక అతడికిచ్చి సింపుల్‌గా మన దేవళంలోనే పెళ్ళి జేయిస్తా! నిన్ను పెర్మనెంటు జెయిడం మాత్రం పెళ్ళయినాకే!" అని బాంబు పేల్చాడు. “ఈ పెళ్ళికి సుచిత్ర ఒప్పుకుంటుందా?” అన్న ప్రశ్నకు రెడ్డిగారు "ఆవిషయాలు   నీకెందుకయ్యా! మేము చూసుకుంటాం లే అయ్యోరా!  మనం యిక పోదాం పా!" అన్నాడు. రాత్రంతా ఆలోచించి,   పక్కరోజు ఉదయం సుచిత్రతో రహస్యంగా మాట్లాడి, యిద్దరి భవిష్యత్తు ముడిపడిన విషయమని బ్రతిమాలి, ఒప్పించేసరికి తలప్రాణం తోకకొచ్చింది. సుచిత్రకూడా డబ్బున్న రెడ్డిగారనే సరికి కిక్కురుమనకుండా ఒప్పేసుకుంది.   వెంటనే రెడ్డిగారికి ఫోన్ చేసి అంగీకారం తెలిపాడు.

*  *  *

సుచిత్ర పెళ్ళై ఈదూరు వెళ్ళేసమయంలో సుచిత్రను ఒంటరిగా కలిసి ఛైర్మన్‌గారు తనకు పెట్టిన కండిషన్ల గురించి చెప్పి, తను ఈదూరుకు రాలేనని చెప్పి తన ప్రేమకానుకగా ఉంచమని ఒక చంద్రహారం రహస్యంగా ఇచ్చాడు.  ఆ తర్వాత ఎండోమెంట్సు కమీషనర్ హైదరాబాదు నుండి పర్మిషన్ వచ్చిన అనంతరం, కృష్ణశాస్త్రిని రిలీవ్ చేసి, విష్ణుమూర్తికి అర్చకుడిగా పర్మినెంటు చేయించాడు ఛైర్మన్‌గారు. ఇటు ఆర్డర్ రాగానే దేవళంలో తన విస్తృత విన్యాసాలు మొదలెట్టాడు. భక్తులిచ్చిన వెండి వస్తువులను, చిన్న చిన్న బంగారు కానుకలు కొట్టేయడం,  మొదలైన పనులు అడ్డూ ఆపూ లేకుండా  సాగిపోతున్నాయి.  

ఆరోజులలో ఒకనాడు ఛైర్మన్‌గారు ఈదూరుకు వెళ్ళి తమ్ముడి కుటుంబం చూసి, తిరుగు ప్రయాణంలో సాలిపేటలో శివాలయం దర్శనం చేసుకున్నాడు. జొన్నవాడ ఛైర్మన్‌గా బాగా యెరిగిన పూజారి బృందం రెడ్డికి ఘనంగా సన్మానం చేసిన అనంతరం అక్కడి పూజారి కృష్ణశాస్త్రిని గొప్పగా పొగుడుతూ, దైవాంశ సంభూతుడుగా వర్ణిస్తూ, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేయగా, ఇటీవలే ఆయన స్థానంలో విష్ణుమూర్తిని నియమించిన విషయం చెప్పాడు. విన్న వెంటనే పూజారి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఊరుకున్నాడు. కారు ఎక్కబోతుండగా  రెడ్డిగారిని పక్కకు బిలిచి "అయ్యా! ఒక విన్నపం. మీ నియామకం మీద నాకు గౌరవం ఉంది.  కానీ విష్ణుమూర్తికి లేని వ్యసనం లేదు.  ఉత్త వెధవ! వాడికి దబ్బులదగ్గర ఉచ్ఛనీచాలు లేవు. ఇక్కడ మారుతాళంతో హుండీ లోంచి డబ్బులు కొట్టేశాడని బయటబడితే తీసేసాం. అలాగే ఇరుకళల పరమేశ్వరి దేవళంలో కూడా ఏదో వెధవ పనులు చేస్తే బాగా తన్ని పంపించారని విన్నాం. తోటి బ్రాహ్మడి పొట్ట మీద కొట్టకూడదని మేం ఇవన్నీ బయటికి చెప్పo. మీరు వాణ్ణి మాత్రం వేయికళ్ళతో చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ తరువాత అనుకుంటే ప్రయోజనం ఉండదు" అని చెప్పి సెలవు తీసుకున్నాడు. రెడ్డి దీర్ఘాలోచనలో మునిగిపోయాడు.

*  *  *

విష్ణు ఏదో సందర్భంలో నాలుగు రోజులు సెలవడిగిన సమయం చూసి రెడ్డిగారు దగ్గరుండి,  దేవళంలో మొత్తం వైరింగ్లో భారీ మార్పులు చేయించాడు. విష్ణు సెలవునుంచి వచ్చాక కూతురు పెళ్ళి జరపాలన్న ఆతృతతో విన్యాసాల జోరు పెంచాడు. ఒకరోజు బుచ్చిరెడ్డిపాళెం నుంచి వచ్చిన ఒకావిడ అమ్మణ్ణికి మ్రొక్కుకుంటే మొగపిల్లవాడు కలిగాడన్న సంతోషంతో తన ఒంటిపై ఉన్న నగలు నిలువుదోపిడి ఇచ్చింది. ఆ నగలన్నీ మూటకట్టి హుండీలో వేయాల్సి ఉండగా మూట అమ్మవారి ముందు పెట్టి పూజ చేసే మిషతో గర్భగుడిలోకి తీసుకువెళ్ళి బయట గుగ్గిలంతో ధూపం వేయించి, ఏమీ కనుపించకుండా పొగలో “సందట్లో సడేమియా” అన్నట్టు, లోపల రెండు చైనులు తీసి బొడ్లో దోపుకుని మళ్ళీ యధావిధిగా మూటకట్టి బయటకు తెచ్చి ఆవిడనే హుండీలో వేయమన్నాడు. ఆవిడ  తెలియక మూట అలాగే వేసి సంతోషంగా ఇంటికి వెళ్ళింది.

*  *  *

ఇది జరిగిన పదిరోజుల తర్వాత ఛైర్మన్‌గారు ఉదయాన్నే ఫోన్ చేసి ఆరోజు మధ్యాన్నం రెండు గంటలకు అర్జెంటుగా నెల్లూరులో ఇంటికి రమ్మని ఫోన్ చేశాడు.  విష్ణు ప్రసాదాలు, జైహింద్ మిఠాయి అంగట్లో మలైకాజా, రక రకాల పండ్లు తీసుకుని అడుగుపెట్టాడు. క్రింద హాల్లో కృష్ణశాస్త్రి, సూర్యనారాయణశాస్త్రి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండడంతో విషయం అర్ధం కాలేదు. కృష్ణశాస్త్రికి పాదాభివందనం చేసి, రెడ్డిగారు మిద్దె మీద గదిలో ఉన్నారని తెలిసి అక్కడ కలిసాడు. 

“ఇవన్నీ ఏంబళ్ళా గానీ..  కూర్చో అయ్యోరా…. శానా యవ్వారాలు మాట్లాడాల… నీతో అన్నాడు కోపంగా.  ఎదురుగా ఎవరితోనో మాట్లాడుతూ “ఈనే విష్ణు… మన జొన్నవాడ పూజారి” అని చెప్పాడు.  ఆయన వెంటనే బ్రీఫ్‌కేసులోంచి ఒక కవరు తీసి రెడీగా చేతిలో ఉంచుకున్నాడు. విషయం అర్ధంగాక ఎందుకు పిలిచారన్నట్టు చూడగా ఛైర్మన్‌ "విష్ణూ.. నిన్ను సాలిపేటలో, ఇరగాళమ్మ దేవళంలో ఎందుకు తీసేసారు? చెప్పు ముందల. " అని సూటిగా ప్రశ్నించాడు. విష్ణుకు నొట్లో తడి ఆరిపొయింది. గుటకలు మింగుతూ "అక్కడా.. అక్కడా.. ఆదాయం సరిపోవడంలేదని…. " అనబోతూ ఉండగా.."పోలీసులను పిలవకముందే నిజం చెప్పు?  ఆయన ఎండోమెంట్ కమీషనర్  ఆఫీసులో ఉండే సూపరిండెంటెంటు తెలుసా నీకు?" అనేసరికి  భయంగా లేచి నిలబడ్డాడు. ఏ.సి రూంలో సన్నని వణుకుతో బాటు చెమటలు కూడా పట్టాయి. "అయ్యా! పేద బ్రామ్మణ్ణి! పిల్లలు గలవాణ్ణి! కుర్రతనంలో  ఏవో పొరబాట్లు జరిగినట్టున్నాయి. తమరు పెద్దమనసుతో క్షమించాల" అని దణ్ణం పెట్టాడు. " ఈమద్దిన జొన్నవాడలో ఏం ఘనకార్యం జేసావో జెప్పు!" అని గద్దించాడు. "ఒట్టు రెడ్డిగారు! నేనే పాపమూ చేయ్యలేదు" అనేసరికి… "నా యెర్రిగాని… దొంగలు దొంగలమని ఒప్పుకుంటారా?” అని  గుమాస్తాను పిలిచి “టి.వి ఆన్ చేసి.. మొన్న నాకు చూపిచ్చిన వీడియో ఒకసారి ప్లే జెయ్యవయ్యా!” అన్నాడు. టి.వి.లో చూసిన దృశ్యంతో విష్ణు కళ్ళు తిరిగిపోయాయి. నిలువుగుడ్లేసుకుని నిల్చున్నాడు. బాపనోడివి గాబట్టి పోలీసు కేసు లేకుండా వదిలేస్తున్నాం. మాతో వచ్చి నగలు తెచ్చి  అప్పజెప్పు. ఈ కవరు తీసుకో! రేపటినుండి నుండి నువ్వు డ్యూటీకి రాబళ్ళా.." అనే సరికి ఇద్దరి కాళ్ళ మీద పడి ఎంత ప్రాధేయ పడ్డా ప్రయోజనం లేకపోయింది.      

*  *  *

జొన్నవాడ దేవళంలో కృష్ణశాస్త్రిగారి ఆధ్వర్యంలో సూర్యనారాయణ శాస్త్రి డ్యూటీలో చేరాడన్న విషయం విష్ణుమూర్తికి తెలిసిందన్న విషయం నేను మీకు వేరే చెప్పక్కర్లేదుగదా!  విష్ణు  నెల్లూరు దగ్గర   అల్లీపురంలో ఊరిచివర ఉన్న పోలేరమ్మ దేవళంలో రోజు కూలికి ఉన్నాట్ట. రోజూ తనకు మంచి రోజులు రావాలని దణ్ణం పెట్టుకుంటూనే ఉన్నాడు. అఘమర్షణ మంత్రం ఎన్ని వేల సార్లు జపించినా చేసిన పాపం అంత తొందరగా పోతుందా! అమ్మలగన్న  అమ్మ క్షమిస్తుందంటారా!  కాలమే సమాధానం చెప్పాలి.

*  *  *

No comments:

Post a Comment

Pages