చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 3 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 3

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల)  - 3

అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ) 

ఆంగ్ల మూలం :  The Moonstone Castle Mystery

నవలా రచయిత : Carolyn Keene

 

(పోస్టాఫీసు వద్ద నాన్సీ వెంటపడ్డ వ్యక్తి వెంట బెస్, జార్జ్ పడ్డారు.  పోస్టాఫీసు నుంచి తన యింటికి పోతున్న నాన్సీ కారు వెనుక పరుగుతీసాడా వ్యక్తి.  అయితే నాన్సీ యింటి వద్ద తన వెంట పడ్డ యిద్దరు అమ్మాయిలను అతను రోడ్డున పోతున్న బస్సును ఎక్కి తప్పించుకొన్నాడు.  విషయం విన్న నాన్సీ పోలీసు చీఫ్ కి ఫోను చేసి అపరిచితుడి విషయం చెబుతుంది.  తరువాత. . . .)

@@@@@@@@@ 


తన ఎదురుగా కూర్చుని ఉన్న అమ్మాయిలతో నాన్సీ యిలా చెప్పింది:  "నాన్న పని చేస్తున్న కేసు గురించి మీరు వినాలనుకుంటున్నారా?  ఇది రహస్యం కానందున నేను మీకు చెప్పగలను.” 


  "కానీ ఇది ఒక రహస్యం అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని బెస్ అంది.  ఆమె కళ్ళు ఆసక్తితో మెరుస్తున్నాయి. 


  "అవును.  ఇదొక వింత కబురు కూడా!  ఆఫ్రికాలో అడవి ఖైదీలు మరియు సంయుక్త రాష్ట్రాల్లో కలవరపరిచే అంతర్ధానం." 


  డ్రూ యింట్లోని ఉల్లాసకరంగా ఉన్న గదిలో నేలపై  బాసినపట్టు వేసి కూర్చున్న జార్జ్ "కానీయి" అంది.


  నాన్సీ ఉద్రిక్తమైన ముఖంతో చెప్పసాగింది, "పదిహేనేళ్ళ క్రితం బోవెన్ దంపతులు ఆఫ్రికాలోని ఒక ప్రాంతానికి మత బోధకులుగా వెళ్ళటానికి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించారు.  అక్కడ గిరిజనులు విరామం లేకుండా తమలో తాము ఎప్పుడూ పోట్లాడుకొంటూ ఉంటారు.  బోవెన్లు అక్కడ కేవలం మూడు నెలలు మాత్రమే ఉన్నారు.  ఆ సమయంలోనే వారి శత్రుబృందం వారిని ఎత్తుకుపోయి, ఇటీవల వరకు విడుదల చేయలేదు."


  "ఓహ్! ఎంత క్రూరం!" ఆకుపచ్చ బూడిద చారల సోఫా మీద నాన్సీ పక్కన కూర్చున్న బెస్ ఆశ్చర్యపోయింది.  "మీ నాన్న రంగంలోకి ఎలా వచ్చారు?"


  "బోవెన్ దంపతులు కొద్ది వారాల క్రితమే ఈ దేశానికి తిరిగొచ్చారు.  వారు నేరుగా డీప్ రివర్ లోయలోని డీప్ రివర్ పట్టణానికి వెళ్ళారు.  అక్కడ వారు 'జోనీ' అని పిలవబడే తమ రెండున్నర సంవత్సరాల మనుమరాలు జోన్ ని ఆమె అమ్మమ్మ హోర్టన్ వద్ద విడిచిపెట్టారు.  ఆ పాప సొంత తల్లిదండ్రులు బోవెన్లు ఆఫ్రికాకి వెళ్ళటానికి కొద్ది రోజుల ముందే చనిపోయారు."


  నాన్సీ పక్కకు వాలి సోఫా చివర్లో ఉన్న టేబుల్ సొరుగుని తెరిచింది.  దానిలో నుంచి ఒక చిన్న పాప ఫొటోని బయటకు తీసింది.  


  "ఎంత ముద్దుగా ఉందో!" బెస్ ఆశ్చర్యంగా అంది.  "తనకేదో జరిగిందని నాతో చెప్పొద్దు!"


  "అదే నేనూ భయపడ్డాను" నాన్సీ బదులిచ్చింది.  "బోవెన్లు వెళ్ళిపోయిన ఆరు నెలలకు అమ్మమ్మ హోర్టన్ చనిపోయింది.  ఇతర బంధువులు ఎవరూ లేరు.  ఆ పాప మాయమైంది."


  "మాయమైందా?" నమ్మశక్యంగానట్లుగా జార్జ్ తిరిగి వల్లించింది.  


  "ఇది దాని కన్నా ఘోరంగా ఉంది" అని నాన్సీ చెప్పసాగింది.  "డీప్ రివర్లో ఎవరూ ఆ పాప గురించి వినలేదు, కనలేదు.  శివార్లలో నివసించే ఆమె అమ్మమ్మ హోర్టన్, జోనీ వచ్చిన తరువాత ఏనాడు ఆ పట్టణంలోకి రాలేదు.  ఆమెకు ఆరోగ్యం బాగులేదని పట్టణంలో అందరు భావించారు."


  "జోనీ కూడా చనిపోయి ఉండొచ్చు" బెస్ సూచించింది.  


  "ఆమె చావుకి సంబంధించిన రికార్డులేమీ లేవు.  అంతే కాకుండా ఆమె అమ్మమ్మ హోర్టన్ తన ఆస్తినంతా జోనీకే విడిచిపెట్టింది.  ఆస్తి విషయం పరిష్కారమైపోయింది.  కానీ యిప్పటివరకు నాన్నకు పాప సంరక్షకుడెవరన్న విషయంలో ఏ రికార్డు దొరకలేదు.  అంతేగాక పాప ఆచూకీకి సంబంధించిన సమాచారమూ లేదు."


  బెస్ జోనీ ఫోటోకేసి కన్నార్పకుండా చూసింది.  "దురదృష్టవంతురాలు!  ఆమె సజీవంగా ఉందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.  బోవెన్లు ఆమెను కనుక్కోవచ్చు."


బాసినపట్టు వేసి నేలపై కూర్చున్న జార్జ్ తన మోకాళ్ళను పట్టుకొని ముందుకు వెనక్కు ఊగింది.  "ప్రస్తుతం జోనీకి పదిహేడు, పద్దెనిమిది ఏళ్ళు ఉండవచ్చు.  ఈ ఫొటోని బట్టి ఆమెను గుర్తు పట్టడం కష్టం.  అది సరె! అమ్మమ్మ హోర్టన్ న్యాయవాదితో మీ నాన్న మాట్లాడలేదా?" 


  "ఆయన చాలాకాలం సెలవులో ఉండటం వల్ల తనని కలవలేకపోయానని నాన్న అన్నారు.  నేను అతని పేరు కూడా తెలుసుకోలేకపోయాను.  ఆ పాపకు సహాయం చేయగల చాలామంది బంధువులు చనిపోయి అయినా ఉండవచ్చు లేదా డీప్ రివర్ ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు."


  "పనివాళ్ళు ఎవరూ లేరా?" జార్జ్ అడిగింది.


"ఉన్నారు.  శ్రీమతి హోర్టన్ దగ్గర ఒక జంట ఉండేది.  కానీ వాళ్ళు ఆమె చనిపోయే సమయంలో కనిపించకుండా పోయారు."


  "ఈ కేసు మీ నాన్న దగ్గరకు ఎలా వచ్చింది?" బెస్ అడిగింది.


  " బోవెన్లకు పరిచయం ఉన్న ఎవరో నాన్నను సూచించారట!  జరిగిన మొత్తం విషయంపై వాళ్ళు గుండెలు బద్దలై ఉన్నారు.  ఆ బాధలో ఈ రహస్యాన్ని పరిష్కరించమని కోరటం సహజమే కదా!"  అకస్మాత్తుగా నాన్సీ కిటికీ బయటకు చూసింది.  "అదిగో నాన్న వస్తున్నారు."


    న్యాయవాది తన కారుని గారేజీలోకి పోనిచ్చాడు.  పొడవుగా, అందంగా ఉండే నాన్సీ తండ్రి ఆ గదిలోకి రాగానే, నాన్సీని ముద్దు పెట్టుకొన్నాడు.  


  "హల్లో బెస్! జార్జ్! మీ అమ్మాయిలు యిక్కడ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది.  ఎందుకంటే మీతో ప్రతిపాదించటానికి నా వద్ద విషయమొకటి ఉంది." 


(ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages