బ్రతుకున బ్రతుకై - అచ్చంగా తెలుగు

బ్రతుకున బ్రతుకై

డా.బొగ్గవరపు మల్లిఖార్జునరావు 

(MyBigBreak సంస్థ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో రెండొవ బహుమతి పొందిన కథ )


సోఫాలో కూర్చున్న ఆమె, తన కాళ్ళ దగ్గర నేల మీద కూర్చుని ఒడిలో తల పెట్టుకుని, తన్మయత్వంతో భర్త చెప్తున్న మాటలు వింటోంది . " లలితా ! ఒక వాక్యం జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఇదివరకు ఎవరైనా అంటే నవ్వేసే వాడినేమో ! ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను". 

***** 

“అమ్మా ! బయటినుంచి ఏమైనా కావాలా ఇంట్లోకి ?" కేకేశాడు అనంత్ జాగింగ్ కని షూస్ లేసులు కట్టుకుంటూ. 

"పాలు రెండు ప్యాకెట్లు పట్టుకుని రా. ఇంకేమీ వద్దు. అన్నట్లు ఇవాళ లాయరుగారు రమ్మన్నారు.గుర్తుందిగా ?"

"గుర్తుంది !" కొంచెం విసుగ్గా అన్నాడు. 

తల్లిని మనసులోనే తిట్టుకున్నాడు . 

బయటకు వచ్చి స్కూటర్ స్టార్ట్ చేస్తూ తనను కూడా తిట్టుకున్నాడు. 

అనంత్ భార్యను పుట్టింట్లో వదిలేసి మూడేళ్ళయింది. తల్లిదండ్రులు చేసిన పెళ్ళే ! ఏడేళ్ళ తర్వాత గర్భిణీ వచ్చి ఆడ పిల్ల పుట్టింది . అది కూడా ఎన్నో హార్మోన్ మందులు వాడాక. ఆ హార్మోన్ ల వలన లలితకి బాగా ఒళ్లు వచ్చేసింది. పుట్టిన ఆడపిల్ల చిదిమి దీపం పెట్టినట్టు ఉండేది . అనంత్ కి ఎంతో ముద్దుగా ఉండేది. 

కానీ విధి వశాత్తు పిల్ల పుట్టిన రెండో నెలలో అనంత్ తండ్రి హఠాత్తుగా నిద్రలో ప్రాణం వదిలాడు. లలితకు సిజేరియన్ అవడం వలన రాలేక పోయింది. అనంత్ అన్నయ్య అపర కర్మలు జరిపాడు. 

పిల్ల పుట్టిన వెంటనే భర్త పోయాడనో లేక లావైపోయిన కోడలిని చూసి వైమనస్యం కలిగిందో అనంత్ తల్లి లలితమ్మ కొడుకుకి  ఆ మాటా ఈ మాటా చెప్పి మనసు విరిగి పోయేలా చేసింది. మొదట్లో అనంత్ తండ్రి పోయిన దుఃఖం లో ఉన్న తల్లిని గట్టిగా మందలించలేక పోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా అతనికి కూడా తల్లి బోధలు తలకెక్కాయి. 

నెమ్మదిగా ఆరోగ్యం పేరు చెప్పి ఒక ఆరు నెలలు, తనకు క్యాంపులున్నాయని ఇంకొక నాలుగు నెలలు భార్యను తీసుకు రాకుండా తాత్సారం చేసి నెమ్మదిగా ఫోన్ చేయడం కూడా మానేశాడు. ముందు సర్దుకు పోయినా ఆమెకు అనుమానం మొదలై చివరికి తండ్రిని సంప్రదించి ఆయనకు విషయం వివరించి భర్త దగ్గరికి పంపింది. 

కానీ దురదృష్టవశాత్తు అదే సమయానికి భర్త క్యాంపు వెళ్లడంతో అత్తగారే ముసుగులో గుద్దులాట లేకుండా కరాఖండిగా చెప్పింది - మనవరాలు పుట్టిన వెంటనే తాతను పొట్టన పెట్టుకుంది అనీ , అందు వలన తమకు ఆమెను మళ్ళీ ఇంటికి తెచ్చుకోవడం సుతరామూ ఇష్టం లేదని చెప్పింది. విడాకుల నోటీసు వస్తుందని కూడా అనేసింది.  నిర్ఘాంతపోయిన ఆ బడిపంతులు వియ్యంకుడు గుడ్ల నీళ్లు కుక్కుకుని తిరుగు ప్రయాణమయ్యాడు.

కొడుకు వచ్చేసరికి ఈ విషయం గొప్పగా చెప్పిందావిడ. కొడుకు కూడా నిర్ఘాంతపోయాడు . ఆ రాత్రి తల్లీ కొడుకులకు తీవ్ర వాగ్యుద్ధం జరిగి వారం రోజులు మాట్లాడుకోలేదు. అనంత్ కి భార్య అంటే ప్రేమ లేకపోలేదు. ఆమె ఊబకాయం తప్పితే అతనికి ఆమెను కాదనుకోవడానికి కారణాలు ఏమీ లేవు 

***** 

మెల్లమెల్లగా ఆవిడ కొడుకుని కన్నీటితో, సాధింపు తో, నెమ్మది మీద విడాకుల కోసం లాయర్ ని సంప్రదించేందుకు ఒప్పించ గలిగింది. ఆ రోజు లాయర్ తోటి మాట్లాడడానికి మళ్ళీ ఏమి సాకు చెబుతాడో అని జాగ్రత్త పడి గుర్తు చేసింది అందుకే !

***** 

జాగింగ్ కి పార్కుకు వెళ్లిన అనంతు రెండు రౌండ్లు పూర్తి చేసి అలవాటు కొద్దీ ఐదు నిమిషాల పాటు బెంచి మీద జారగిలబడి కూర్చుని టవల్ తో మొహం తుడుచుకుంటూ చుట్టూ చూశాడు . కొద్ది  దూరం నుంచి ఒక నడి వయసు జంట ఆ బెంచ్ వైపే వస్తున్నారు. వారిని గత కొద్దిరోజులుగా చూస్తున్న అనంత్ కి వారిని చూసే సరికి కొంత ఉత్సుకత కలిగింది. ఆవిడ ఎటో చూస్తూ నడుస్తోంది. భర్త జాగ్రత్తగా ఆమెను చెయ్యి వదలకుండా పక్కనే నడుస్తున్నాడు. ఒక్కోసారి ఆవిడ బలవంతంగా చెయ్యి విడిపించుకుని వేరే వెళ్లిపోవాలని చూసినా గట్టిగా పట్టుకుని ఆమెను తాను ఉన్న బెంచ్ వైపే రావడం చూసి అనంత్ బెంచ్ ఒక చివరికి జరిగాడు వాళ్లకి చోటివ్వడానికా అన్నట్లు. 

ఒక నిమిషం ఆలోచించి ఆ భర్త ఆమెను ఆ బెంచీ మీద కూర్చుని ఆమెను కూర్చోబెట్టి, మంచి నీళ్ల సీసా ఇచ్చి టవల్ తో మొహం తుడిచాడు. 

"ఎందుకూ ? అడిగిందావిడ వింతగా మొహం పెట్టి. " దాహం వేసి ఉంటుందిగా తాగు” అన్నాడాయన. 

"నువ్వెవరు ? " అడిగిందావిడ. 

చిరునవ్వు తోటి " కృష్ణని గుర్తు లేదా ?" అడిగాడు.

"మరి నేనెవరు?" అడిగిందావిడ.

"నువ్వు రాధవి !” అన్నాడు ఆయన ఇంకా విశాలంగా నవ్వుతూ. 

ఆవిడ కూడా నవ్వేసి "నువ్వు నాకేమౌతావు ? మనమెందుకిక్కడికి వచ్చాము?" అనడిగింది. 

"చల్లగా హాయిగా ఉంది కదా ! సరదాగా వాకింగ్ కి వచ్చాము " అన్నాడు ఆయన. 

'ఓహో !" అందావిడ. ఇంకేమీ రెట్టించకుండా. 

తమతో తెచ్చుకున్న మొబైల్ లో పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం పెట్టి. హెడ్ ఫోన్ ఆమెకు తగిలించాడాయన. ఆ సంగీతం వింటూ ఆమె ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది.

అనంత్ ఆయనతో మాటలు కలిపాడు. " ఆవిడ మీ భార్యేనా ? మీరు నాకేమవుతారు అంటారేమిటి ?" అన్నాడు.

ఆయన అంతే ప్రసన్నంగా " ఆవిడ నా భార్య ! సందేహం వద్దు. ఆవిడకి జ్ఞాపక శక్తి లేదు అంతే !" అన్నాడు. 

నిర్హాంత పోయిన అనంత్ "ఎన్నాళ్ళ నుంచి ? ఏదైనా జబ్బా ? లేక తలకి ఏదైనా దెబ్బ తగిలిందా ?" అని అడిగాడు. 

"అవేమీ కాదు. ఆపరేషన్ తర్వాత కాంప్లికేషన్ వలన అలా మార్పు వచ్చింది" అన్నాడాయన. 

మెల్ల మెల్లగా వివరాలు చెప్పుకొచ్చాడాయన... 

వారికి చాలా ఏళ్ల క్రితం లేకలేక కవల పిల్లలు పుట్టారు. సిజేరియన్ అవుతుందని ఆసుపత్రిలో చేర్చారు. తీరా ఆపరేషన్ కి పావుగంట ముందు మెంబ్రేన్ రప్చర్ అయి ఉమ్మనీరు పోయి లోపల బిడ్డల గుండెలు మందగించడంతో స్పైనల్ కి బదులు జనరల్ అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్ చేశారు. ఇద్దరూ ఆడ పిల్లలు. చక్కగా ఉన్నారు కానీ బొడ్డు తాడు ఇద్దరి మెడలకి చుట్టుకోవడం వల్ల వారిని రివైవ్ చేసే హడావుడిలో అనస్థటిస్టు ఆపరేషన్ పూర్తి అయి పోతున్నది కదా అని అక్కడ నుంచి పిల్లల దగ్గరకు వెళ్లి వారి మీద దృష్టి పెట్టి ఉండడం వలన తల్లికి పెట్టిన ఆక్సిజన్ సిలిండర్ ఖాళీ అయిపోయింది గమనించ లేదు. సర్జన్ " డాక్టర్ గా రోయ్ ! సైనోసిస్ వచ్చింది. ఆక్సిజన్ అయిపోయింది !" అని గావు కేక పెట్టేసరికి పిల్లల్ని వదిలేసి ఆపరేషన్ టేబుల్ దగ్గరకు   పరుగున వచ్చి స్పేర్ సిలిండర్ ఓపెన్ చేసాడు. మళ్ళీ రక్తం నీలం రంగు నుంచి ఎరుపు రంగు లోకి వచ్చాక సర్జన్ కూడా "హమ్మయ్య" అనుకుని కుట్లు వేసి ఆపరేషన్ పూర్తి చేసింది కానీ ఏదో కీడు శంకిస్తుండగా పేషేంట్ పూర్తిగా స్పృహలోకి వచ్చేదాకా అక్కడే ఉంటానన్నది. ఆ ఉండడం దాదాపు పన్నెండు గంటలు అక్కడే ఉన్నదావిడ. కారణం: రాధ స్పృహలోకి రానే లేదు. ఎమర్జెన్సీగా న్యూరాలజిస్టు, ఇంకొక సీనియర్ అనెస్టెటిస్ట్ ను పిలిపించారావిడ. మొత్తం మీద దాదాపు పన్నెండు గంటల దీర్ఘ పోరాటం అనంతరం రాధ కళ్ళు తెరిచింది. కానీ ఆమె మెదడు జ్ఞాపక శక్తిని కోల్పోయింది.

***** 

అనంత్ కదిలిపోయాడు ఆ వివరాలు విని.

"ఇది జరిగి ఎన్నాళ్ళయింది ?" జీరబోయిన గొంతుతో అడిగాడు.

"సరిగ్గా మొన్న ఫస్ట్ తారీకుకి  ఇరవై ఆరు సంవత్సరాలు." అన్నాడాయన. 

"మరి ఇన్నాళ్లు ? మీ కూతుళ్లు ? ... " పూర్తి చేయలేక పోయాడు. 

"మా కూతుళ్లు ఇద్దరూ పెద్ద వాళ్ళై పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఇద్దరూ కెనడా లో ఉన్నారు. భర్తలిద్దరూ కూడా విచిత్రంగా కెనడాలోనే ఉంటారు కాకపొతే కవలలు కాదు" అని పకపకా నవ్వాడాయన. 

"మరి మీ శ్రీమతి ? ఆవిడ ఏమీ కోలుకోలేదా?" 

"కొంత నయం. కానీ కొంత మాత్రమే జ్ఞాపకం ఉన్నది, తన చిన్నప్పటి విషయాలు ఏమైనా కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తూ ఉంటాయి." నవ్వాపి చెప్పాడాయన. 

"మిమ్మల్ని ?" అన్న అనంతు ప్రశ్నకు  ఆయన నిట్టూర్చి "నేనెవరో ఆమెకి గుర్తు లేదు" అన్నాడు. 

"మరి ఆవిడని చూసుకోవడం ? మీ అత్త వారేమైనా ?"

"మా అత్తామామాలిద్దరూ ఈ సంఘటన జరిగిన ఏడాదికి కారు ఆక్సిడెంట్ లో పోయారు. నాకు బావ మరుదులు, మరదళ్ళు  ఎవరూ లేరు" అన్నాడు క్లుప్తంగా. 

"ఆవిడ ఆలనా పాలనా ?"

"అన్నీ నేనే ! మా అమ్మాయి లిద్దరూ కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళూ సహాయం చేసేవారు" కళ్ళు మెరుస్తూండగా చెప్పాడాయన. 

"మరి వాళ్ళని గుర్తు పడతారా ? "

"చిత్రంగా వాళ్ళని గుర్తు పడుతుంది. వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తుంది. వాళ్లకి పేర్లు తానే పెట్టింది. చిన్ని, బన్నీ" అని మళ్ళీ నవ్వాడాయన.

"పెళ్లిళ్లు ? "

"నేనే చేసాను. పెళ్లి పీటల మీద నా పక్కన కూర్చుని ఎలా చెప్తే అలాగే చేసింది మా బంగారం ! పెళ్లి అయ్యాక పిల్లలు విడవలేక ఏడుస్తుంటే చాలా సముదాయించింది చిత్రంగా !"" అన్నాడు కంఠం రుద్ధమవుతుండగా. 

"మీరు మరి ఆ డాక్టర్ మీద, ఆస్పత్రి మీద కేసు వెయ్య లేదా ?"

"నాయనా ! ఆ డాక్టర్ నిద్రాహారాలు లేకుండా పన్నెండు గంటలు పోరాడింది. ఆస్పత్రి స్టాఫ్ కూడా ఎంతో సహాయం చేశారు. కేసు వేయాలన్న ఆలోచన కూడా రాలేదు."

"మరి ఆ మత్తు మందు డాక్టర్ ?"

"ఆయన టైముకి సరైన యాక్షన్ తీసుకోకపోయి ఉంటే  పిల్లలు నాకు దక్కేవారు కాదు. ఆ తర్వాత నా భార్యకు సమయానికి ఆక్సిజన్ పెట్టడంతో పాటు గబగబా అనేక రకాల మందులిచ్చి తనని నాకు దక్కేలా చేసాడు."

"అయినా !...."

"నాయనా ! నేను డాక్టర్ నే. మెడిసిన్ అయిపోయి మా నాన్నగారు హఠాత్తుగా పోవడం వలన మా నాన్నగారి ఫార్మాస్యూటికల్ బిజినెస్ చూడాల్సి వచ్చి వ్యాపారం వైపు వచ్చేసాను. డాక్టర్ల సాధక బాధకాలు తెలుసు !"

నిరుత్తరుడయ్యాడు అనంత్ !

"ఇంక మేము బయల్దేరుతాము. నీ పేరేంటో తెలియదు నాకు" అన్నాడాయన.

"నా పేరు అనంత నారాయణ. కె పీ ఎం జీ లో ఆడిటర్ గా పని చేస్తున్నాను" అన్నాడు. 

"మంచిది నాయనా . ఆల్ ది బెస్ట్ !" అని భార్యను లేపుతున్న ఆయనను మొహమాటంగా                " మిమ్మల్ని ఒక్క మాట అడగ వచ్చా ?" అన్నాడు అనంత్.

"తప్పకుండా అడగండి" అన్నాడాయన.

"మీకు ఎప్పుడూ విడాకులు తీసుకోవాలని ఆలోచన రాలేదా ?" అన్నాడు అనంత్.

కొంచెం వింతగా చూసి అడిగాడాయన." విడాకులా ? ఎందుకూ ?" 

"అంటే ! అంటే !....." నీళ్లు నములుతూ అడిగాడు అనంత్ "ఆవిడకు మీరు ఎవరో పాతికేళ్లుగా గుర్తు లేదు కదా ? "

'తను నాకు భార్య అన్నది నాకు గుర్తు ఉంది కదా !" క్లుప్తంగా అని భార్యను చేయి పట్టుకుని ఆప్యాయంగా లేపాడాయన 

అప్రతిభుడై పోయాడు అనంత్ .

***** 

ఇంటికి వచ్చి తల్లితో "అమ్మా ! ఇవాళ సాయంత్రం బయలుదేరి వెళుతున్నాను, రేపు లలితని, పాపని తీసుకొస్తున్నాను" అని దృఢంగా చెప్పి గిరుక్కున తిరిగి వెళ్ళిపోతున్న కొడుకు వైపు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది అతని తల్లి. 

****


No comments:

Post a Comment

Pages