నెత్తుటి పువ్వు - 30 - అచ్చంగా తెలుగు

                                         నెత్తుటి పువ్వు - 30 

మహీధర శేషారత్నం


కళ్ళు నవ్వుతాయని కథలలో చదివి రచయితల వర్ణనలని నవ్వుకున్నాను. కాని నిన్ను చూస్తే నిజము అని తెలిసింది” అంది నవ్వుతూ రేవతి.

సరోజ ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది. ఆ అమ్మాయిని చూస్తున్న శంకరం ఇలాంటి అమ్మాయిని నాగరాజు లాంటివాడు ఎలా వదులుకోగలడు? అనుకున్నాడు.

ఊఁ! ఏమిటి శంకరంగారూ! ఏదో పనిమీద వచ్చినట్టున్నారు? అంది రేవతి. శంకరంవైపు తిరిగి అదే! సరోజకి ఏదైనా తన కాళ్ళమీద తాను నిలబడేట్టు సాయం చేయగలరేమోనని నసిగాడు శంకరం.

మొఖమాట మెందుకు సార్! అందుకే కదా మనమున్నది? 

పెళ్ళయ్యిందా? మోసపోయిందా?....

“అయింది నా మొగుడు సంపాదనకి మొన్ననే దుబాయ్ పోయాడు” గమ్మున అనేసింది సరోజ. శంకరం బిత్తరపోయాడు.

ఇద్దరిని పరీక్షగా చూస్తున్న రేవతి నవ్వేసింది. దుబాయ్ పోయాడో, దొబ్బుకు పోయాడో కాని నువ్వు ప్రస్తుతం ఒంటరివి అంతేగా అనేసింది సంకోచం లేకుండా రేవతి.

శంకరంగారూ! నలభై, యాభై ఏళ్ళ క్రితం ఆడది చదువుకుని ఉద్యోగం చేస్తే స్వతంత్రంగా బ్రతకచ్చు స్త్రీకి విద్య అవసరమా? కాదా? అంటూ చర్చలు ఉపన్యాసాలు నానా గందరగోళం చేసారు. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు నాదీ అదే భావజాలము. కాని వాస్తవము నడ్డిమీద తన్నింది. నేనైతే బంధాన్ని వదిలించేసుకున్నాను. మంచో, చెడో కాని నాకు పిల్లలు కూడా లేకపోవడం పూర్తిగా నా కాలాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నాను.

ఉద్యోగాలు ఆడవాళ్ళకి సుఖాన్నిచ్చాయా? పడక సుఖం ఇచ్చినా, జేబులోకి తెచ్చినా, రుచికరంగా వంటచేసి కడుపు నింపినా... ఎంత చేసినా ఆడది రెండోస్థాయి సిటిజన్. మగవాడిదే ఆధిపత్యం.... అది అంట్లు తోమే అప్పలమ్మైనా కావచ్చు, ఐ.ఎ.ఎస్. ఆఫీసరైనా కావచ్చు. ప్రపంచమంతా ఇంతే. మనం గొప్పగా చెప్పుకునే తెల్లతొక్క తోలుబొమ్మలు హాలీవుడ్ నిర్మాతల, డైరెక్టర్ల చేతుల్లోపడే వేధింపులు చూడటం లేదా పేపర్లలో.. ఆవేశంగా అంది రేవతి.

“అక్కా! నాకు నాది అనే సంపాదన కావాలి...” తలవంచుకుని అంది సరోజ. 

“ఏం! నిన్ను తల్లిని చేసిన మొగాడు తిండిపెట్టనన్నాడా?” కసిగా అంది రేవతి.

“అలా అనకక్కా! అతను మంచివాడు. నిజంగా మంచివాడు... కాని నా బాధ్యతను అతనిమీద వేయదలచుకోలేదు. నేను చదువుకోలేదు. కాని నాకు మనుషులు బాగానే తెలుసు... అదంతా వదిలెయ్. నాకు నాలుగు నెలలు నిండాయి. రేపు బాబో, పాపో పుట్టాక కొన్నాళ్ళు నా ఖర్చులకు నేను డబ్బు దాచుకోవాలి” సరోజ రేవతిని సూటిగా చూసింది.

“సరే నాకు తెలిసిన డ్వాక్వా గ్రూప్ వాళ్ళున్నారు అందులో ఒకమ్మాయి కట్టలేక మధ్యలో మానేసింది మరి. నువ్వు ఆ కట్టాల్సిన డబ్బు కట్టి వాళ్ళ గ్రూపులో చేరగలవా? కొంత లోను వస్తుంది. మెల్లిగా వాళ్ళ పనుల్లో కలిసి మెలిసి చేస్తూ కొంత సంపాదనలో పడచ్చు.. ఆలోచిస్తూ అంది రేవతి.

“ఎంత కట్టాలో మరి... నా దగ్గర ఐదేలు ఉన్నాయి” సంకోచంగా అంది.

సరేలే! అవసరమైతే నేనో, శంకరంగారో సర్దుతాం. అది సరే ఎక్కడ ఉంటున్నావు? నీ అడ్రస్, ఫోన్ నెంబరు ఇయ్యి. నేను అన్నీ కనుక్కుని నీకు ఫోన్ చేస్తాను. డబ్బుకట్టి, బ్యాంకు లోన్ తీసుకుని కొంచెం కొంచెం తీర్చవచ్చు. ఈలోపు పనికూడా ఏదైనా నేర్చుకోవచ్చు అంది రేవతి కుర్చీలోంచి లేస్తూ. అర్థం చేసుకుని శంకరం కూడా లేచాడు.

“మా ఇంట్లోనే ఉంటోంది ఒక గదిలో, నా అడ్రస్ ఫోన్ నెంబరు ఇస్తాను” అంటూ కాగితం మీద రాసిచ్చేదు. శంకరం, సరోజ బయటికి వచ్చారు.

శంకరం లూనా స్టార్ట్ చేసి “ఎక్కు” అన్నాడు. సరోజ మొదట సంకోచించినా వెంటనే ఎక్కేసింది. శంకరం నేరుగా తమ ఇంటికే తీసుకువచ్చాడు. ముందు గదిలో సరోజని కూర్చోపెట్టి లోపలికెళ్ళి భార్యతో చాలాసేపు మాట్లాడాడు.

సరోజకి తను వచ్చిన ఇల్లే అయినా ఈసారి పరిస్థితి వేరు కనుక కొంచెం ముఖమాటపడింది. ఇంతలో శంకరం భార్య మంచినీళ్ళ గ్లాసు, టీ పట్టుకొని బయటికి వచ్చింది.

ఏం! సరోజా! బాగున్నావా? అంటూ పలకరించింది, కాని ఆమె చూపులు సరోజ పొట్టమీదే ఉన్నాయి. సరోజ ఇబ్బందిగా కదిలి, మంచి నీళ్ళు గట గటా తాగేసింది.

ఉన్నట్టుండి పార్వతి సరోజ భుజం మీద చెయ్యేసి ఆయన నాకు అంతా చెప్పారు నీకేం భయంలేదు. ఇంట్లో గది ఒకటి ఖాళీచేసి ఇస్తాం. అది పెరటివైపు ఉంటుంది. నీకు అన్ని విధాలుగా వీలుగా ఉంటుంది. మొఖమాట పడకుండా వచ్చేయ్ అంది. సరోజ సంకోచంగా పార్వతి చెయ్యి పట్టుకుని “వదినా!” అంది. ఊరికే ఇవ్వట్లేదమ్మాయ్! నీ కొడుకో, కూతురో నన్ను అమ్మ అంటే చాలు అంది నవ్వుతూ

సరోజ వంగి పార్వతి కాళ్ళు కళ్ళకద్దుకో పోయింది. ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు టీ తాగు అంది. ఇంతలో శంకరం ముఖం తుడుచుకుంటూ వచ్చాడు.

“నీకు టీ స్టవ్వు గట్టుమీద పెట్టాను తెచ్చుకో!” అంది పార్వతి. 

శంకరం లోపలికెళ్ళి టీ తెచ్చుకు తాగాడు. 

“మరి బయల్దేరదామా! సరోజా!” అన్నాడు.అలాగే అన్నయ్యా! వెడతా వదినా అందిలేస్తూ 

“వెడతా అనకూడదు. వెళ్ళిస్తా అనాలి.” అంది నవ్వుతూ పార్వతి. “ఊఁ! ఎలాగూ ఇక్కడికే వస్తుందిగా, ఫస్టు తారీఖున అన్నీ తెచ్చుకుని వస్తుందిలే అన్నాడు నవ్వుతూ శంకరం.

ఇంటికొచ్చాక సరోజకి ఊపిరి సలిపి నట్టనిపించింది. ఉన్నట్టుండి గుబులు పుట్టుకొచ్చింది.

శంకరం అన్నయ్య వాళ్ళింటికి వెడితే నాగరాజు మొహమాటంతో రాడేమో! చూడకుండా ఎలా ఉండాలి? నాగరాజుకి మిస్డ్ కాల్ ఇచ్చింది. చూసుకుని వీలున్నప్పుడు అతడే చేస్తాడని అలాగే ఇస్తుంది. కాని ఈసారి నాగరాజు వెంటనే లిఫ్ట్ చేసాడు.

పక్కన ఎవరూ లేకపోయినా మెల్లిగా “వీలుంటే సాయంత్రం ఒకసారి రా!” అంది.

“ఒంట్లో బాగుందా!” నాగరాజు కంగారుగా అడిగాడు. బాగానే ఉండా! కొంచెం గుబులుగా ఉండాది. ఒకసారి తప్పకుండా రా!” అంటూనే జవాబు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా పెట్టేంది.

నాగరాజు సాయంత్రం వచ్చాడు వస్తూ వస్తూ మల్లెపూలు, మామిడి పండ్లు తెచ్చాడు. వస్తూనే సరోజని ఆరాటంగా దగ్గరకు తీసుకు పూలు జడలో తురిమేడు. రసాల మామిడిపండ్లు రోజు ఒకటి రెండు తిను ఎక్కువ తినకు వేడిచేస్తుంది అన్నాడు చేతిలో పెడుతూ! 

“ఒకద్దాని కిన్నెందుకు తెచ్చావు?”

“ఒకద్దానివేమిటి? ఇద్దరు సగం నీకు, సగం నా కొడుక్కి నా కొడుకువాటా న్యాయంగా వాడికిచెయ్యాలి” అన్నాడు సుతారంగా ముక్కుపట్టుకుంటూ.

“అబ్బో! కొడుకుపై ఎంత ప్రేమో!” “లేకపోతే నీపై నాకెందుకు ప్రేమ.. చెవితమ్మి పై నాలిక సుతారంగా తాకిస్తూ అన్నాడు. 

“అబ్బా! అట్టా చెయ్యిబోకు, నాకెట్టాగే ఉంటుంది” నవ్వుతూ విడిపించుకుంది. 

(సశేషం)

No comments:

Post a Comment

Pages