ఈ దారి మనసైనది - 36 - అచ్చంగా తెలుగు

 ఈ దారి మనసైనది - 36 

అంగులూరి అంజనీదేవి 


(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత. ఆత్మహత్య చేసుకోబోయిన మన్వితను పరమర్శిస్తుంది ప్రియబాంధవి .)

“అది కూడా నేనిప్పుడు అనటం లేదు. నా మనసు మార్చు కున్నాను. ఎందుకంటే దాన్ని ప్రేమించిన అబ్బాయి ఇంతకు ముందే వచ్చి దాంతో మాట్లాడి వెళ్లాడు.” అంది కృష్ణవేణి.

ఆ మాటలు వింటూ తల్లి, కొడుకు లోలోన షాకయ్యారు. ఎవరా అజ్ఞాత వ్యక్తి ? అని ఆలోచించసాగారు.

ఎంతకీ అర్థం కాక ఆ తర్వాత ఏం చెబుతుందా ? అని అతి శ్రద్ధగా వినసాగారు.

కృష్ణవేణమ్మ ఇంకేం చెప్పకుండా ... వరుసగా వున్న పేషంట్ల బెడ్ల వైపు వెళ్లింది. అక్కడ పేషంట్ల తాలూక బందువులతో మాట్లాడుతూ కూర్చుంది.

అనురాగ్ - తల్లితో కలిసి మన్విత దగ్గర కెళ్లి కూర్చున్నాడు.

మన్విత ను పలకరించి .... ఎప్పటిలాగే ప్రేమగా తలనిమిరింది ప్రియబాంధవి.

మన్విత ఒక్క క్షణం చూసినా... ఆ చూపులు అనురాగ్ గుండెల్ని చీల్చి ... “ప్లీజ్” అనురాగ్ ! ఇప్పటికైనా నన్ను నీ మనుసులోకి రానియ్యవా ?” అన్నట్లు అర్థిస్తున్నాయి. తన దగ్గర సమాధానం లేనట్లు అతని చూపులు నేలకి అతుక్కున్నాయి.

విషయం తెలియకపోతే .... ఎలా వుండేదో కాని, ఇప్పుడు అనురాగ్ మనసులో దీక్షిత వున్నందుకు సంతోషించాలో - మన్విత మనసులో అనురాగ్ వున్నందుకు బాధ పడాలో అర్థం కాకుండా వుంది.ప్రియబాంధవికి....

... మాట్లాడకుండా మౌనంగా చూస్తున్న మన్వితది మామూలు జ్వలనం కాదు. నిశ్శబ్ద జ్వలనం అని గ్రహించింది ప్రియబాందవి

******

తర్వాత రోజు ....

ఎప్పటి లాగే స్టెతస్కోప్ పట్టుకొని ధీరజ్ వచ్చాడు. అతను నిన్నటి నుండి మన్వితకి శ్రద్దగా ట్రీట్ మెంట్ ఇస్తున్నాడు.

మన్వితకి స్నాక్స్ తినిపించి, పాలు తాగించి అక్కడే కూర్చుని వున్న సంజన - ధీరజ్ ని చూడగానే లేచి బయట కెల్తోంది.

అతనొస్తుంటే ఇది బయటకెళ్తుందేం ? దీనికేమైనా తిక్కా? “సంజనా ! వుండవే ! నువ్వెందుకెళ్తావ్ ?” అంది మన్విత.

సంజన అదేం వినిపించుకోకుండా ... మన్విత వైపు సాఫ్ట్గా, ప్లజంటగా చూస్తూ ... తన పెన్సిల్ హై హీల్ శాండిల్స్న స్మూతగా నేలపై అనేలా నడుచుకుంటూ క్షణంలో బయటకెళ్లింది.

మన్విత చూస్తుండగానే సంజన ఖాళీ చేసి వెళ్లిన స్టూల్ మీద కూర్చున్నాడు ధీరజ్.

" ఎలా వున్నావ్? మందులు వేసుకున్నావా?” అన్నాడు దీరజ్

“ వేసుకున్నాను సర్ ?” అంది మన్విత .

నిన్నా - మొన్నాలాగా కాకుండా కొత్త మన్విత కన్పించింది ధీరజ్డి.

“వెరీ గుడ్ ! నిన్నలా చూస్తుంటే నాకో కోరిక కల్గుతోంది.” అన్నాడు.

కోరిక అనగానే అర్థం కాక అమె భృకుటిముడిపడింది.

“మీ డ్రీమ్స్, లైఫ్ డిజైన్ ఎక్సెట్రా తెలిసికోవాలిన్నదే నా కోరిక....” అన్నాడు కూలిగా చూస్తూ ... “చచ్చి పోవటం ఎలా అన్నదే నా డ్రీమ్ !” అంది.

" ఆ డ్రీమ్కి  పెద్ద కష్టపడనవసరం లేదు. బ్రతకాలంటేనే కష్టపడాలి .... ప్లానింగ్స్ కావాలి. చదవాలి కెరీర్ పెంచుకోవాలి. మంచి ఫ్రెండ్స్ని సంపాయించుకోవాలి. వున్న టైంలోనే మన మనసుకి నచ్చినట్లు టైంని మెయిన్టెయిన్ చేసుకోవాలి. ఇలా ... చాలా... చాలా...” అన్నాడు. 

డాక్టర్ - పేషంటికి మధ్య వుండే రిలేషనే కాకుండా తనేంటో తెలుసుకోవాలనుకుంటున్న ధీరజ్ గురించి ఆలోచిస్తోంది మన్విత. తనకి స్పెషల్ ట్రీట్ మెంట్ యివ్వటమే కాకుండా తన గురించి అతనిలా ఆలోచించటం గొప్ప విషయమే.

ఎందుకంటే ... గత వారం రోజులుగా - తమ కాలేజీలో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల్ని పట్టించుకోవడం లేదు. కారణం కిట్స్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివే ఇద్దరమ్మాయిలపై యాసిడ్ పోసిన ముగ్గురబ్బాయిల్ని ఎన్ కౌంటర్ కింద పోలీసులు చంపేయటమే... 

అప్పటి నుండి కొందరబ్బాయిలు అమ్మాయిల్ని పలకరించాలన్నా ... అమ్మాయిలకి అవసరమైన హెల్ప్ చెయ్యాలన్నా ... ముందుకు రావడం లేదు. “మనకెందుకులే.... ఏ మాత్రం తేడా వచ్చినా పోలీసులు, జైళ్లూ, లేని పోని తల నొప్పులు' అని అనుకుంటున్నారు. అమ్మాయిలతో స్నేహంగావుండడం కూడా ఇక ముందు టైం వేస్ట్ అనుకుంటున్నారు. అదే ఇంతకముందు... ఎక్కడ పడితే అక్కడ - సబ్జక్ట్ పరంగా నైతే నేమి, సమ్ ఫీలింగ్స్ పంచుకోవడంలోనైతే నేమి గంటలు, గంటలు మాట్లాడుకుంటూ గడిపేవాళ్లు.

ఇదిలా వున్నా .... టివి నెన్ ఛానల్ వాళ్లు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట 'అమ్మాయిల్ని టీజ్ చేస్తున్న అబ్బాయిల్ని అరెస్ట్ చేస్తున్న పోలీసులు' అన్న న్యూస్ ని ప్రసారం చేస్తూనే వున్నారు. అబ్బాయిల్లో అనుకున్న మార్పు ఆశిస్తూ ప్రజలు – ప్రభుత్వాలు ఘోషిస్తున్నా ఇదేనా మార్పు? అంటున్నాయి మహిళా సంఘాలు.... 

కానీ ... మొన్నొక రోజు దినేష్ కన్పించి...." అర్థ రాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడి రోడ్డు మీద నడిస్తే (ఎందుకు నడవాలో) స్వాతంత్ర్యం వచ్చినట్లు అని ఇన్ని రోజులు విన్నాను. కానీ ... ఈ రోజు నుండి ఆ డైలాగు మా అబ్బాయిలకి వర్తిస్తోంది. అంటే మాకున్న స్వాతంత్ర్యం మికొచ్చిందన్న మాట. నడిచే ముందు దగ్గర్లో అమ్మాయి లేకుండా నడుచుకోవాలి అని మేమంతా డిసైడ్ అయిపోయాం, ఎందుకంటే అకూ-ముళ్లూ సొమెతలా అమ్మాయి వెళ్లి అబ్బాయికి సైటేసినా, అబ్బాయి వెళ్లి అమ్మాయికి సైటేసినా చివరకి తుపాకి తూటా దిగేది అబ్బాయి గుండెల్లోనే కదా!' అన్నాడు మా భయం మాకుంది అన్నట్లుగా ....

అది గుర్తొచ్చి - నవ్వింది మన్విత.

“నన్నిక్కడే వుంచుకొని ఎటెళ్లావు మన్వితా?” ఆమె నవ్వునే చూస్తూ అన్నాడు ధీరజ్. అతని పిలుపులో అప్యాయత వుంది. 

“దినేష్ మాటలు గుర్తొచ్చాయి.” అంది మన్విత.

“ అదీ .... అలా నవ్వు తెప్పించే విషయాలను గుర్తుకి తెచ్చుకుంటూ నవ్వుతూ వుండాలి. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ” అన్నాడు.

అతని మాటలు సరదాగా అన్పిస్తున్నాయి. అతని సమక్షం కూడా అనీజీగా లేదు. ఇప్పుడు అతని మీద కోపం కూడా రావడం లేదు. కానీ తన మనసే దాగలేదు. అతనితో హ్యాపిగా మాట్లాడగలిగేంత హాయిగా లేదు.

“మెడిసిన్ పూర్తయ్యాక ఏం చెయ్యాలనుకుంటున్నావు మన్వితా ?ఐమీన్ ప్రాక్టీస్ పెట్టాలనుకుంటున్నావా ? లేక హయ్యర్ స్టడీస్ వెళ్లాలనుకుంటున్నావా?” అన్నాడు. 

సడన్గా అతనలా అడిగే సరికి ఏం చెప్పాలో తెలియనట్లు తడబడింది. అయినా తనకి ఫ్యూచరేంటి ? సంజన నిన్నటి నుండిఎటూ పోకుండా కనిపెట్టుకొని సర్వీస్ చేస్తుంటే తనకి వీలు కావడం లేదు కాని, అదెప్పుడు తనని వదిలిపెస్తుందా, చచ్చిపోదామ అని ఎదురు చూస్తోంది.

“నాకు బ్రతకాలని లేదు.” అంది ఫ్రాంకుగా.

“ఎందుకని? అడిగి నిన్ను ఇబ్బంది పెట్టను. ఎందుకంటే ఏదో బాధ వుండబట్టే అలాంటి నిర్ణయానికి వచ్చావు. కానీ ఆ నిర్ణయం తప్పు.” అన్నాడు.

“మరి ... నా బాధ? ”అంది

“ఈ జీవన సముద్రంలో ... సమరంలో ... అన్ని బాధలు కొట్టుకు పోతాయి . ఏ బాధా నిలవదు. అలా కొట్టుకు పోయే బాధల్లో ప్రస్తుతం నీ బాధ ఒకటి ..” అన్నాడు.

“ నాది అలాంటి బాధ కాదు ....” అంది స్థిరంగా

“కావచ్చు ... కానీ... అన్ని బాధలకన్నా జీవితం గొప్పది”. అన్నాడు.

“ నా జీవితం నేను కోరుకున్నది ఇవ్వడం లేదు. ” అంది 

“పాజిబుల్గా వుండి... అందే దాన్నే కోరుకోవాలి.” అన్నాడు.

“మీరనేది నాకు అర్థమైంది నేను ఆకాశానికి నిచ్చెనలు వెయ్యడం లేదు. అందుబాటులో వున్న దాన్నే ఆశిస్తున్నాను.” అంది.

" అది దొరకనప్పుడు దాన్ని ఆకాశమే అనుకోవాలి. మనల్ని మనం దారి మళ్లించుకోవాలి.” అన్నాడు.

అది సాధ్యం కాదు అన్నట్లుగా చూసింది మన్విత.

అదే ద్యాసలో వున్న మన్విత మనసును దారి మళ్లించాలన్న ఉ ద్దేశ్యంతో .....

“ నీ కిప్పుడు జీవితం విలువ తెలియాలి మన్వితా ! వేడి అన్నంలో పప్పు, నెయ్యి, అవకాయ వేసుకొని రెట్టింపయిన ఆకలితో తింటున్నప్పుడు ఒక్కో ముద్ద లోపలకి దిగుతుంటే - ఆ రుచికి ఎవరికైనా సంతోషంకలుగుతుంది ఆ రుచి లాంటి అద్భుతమైంది నీ జీవితం. నువ్వా రుచిని అస్వాదిస్తున్న సమయంలో నీ పంటి క్రింద రాయిపడి నీ ముఖంలో రంగులు మారుతున్నాయి. తింటున్న రుచిని మరిచి, ఆరాయి గురించే ఆలోచిస్తున్నావు. వండిన వాళ్ల శ్రమని, వడ్డించిన వాళ్ల ప్రేమని ... అంటే తల్లి దండ్రుల్ని, సమాజాన్ని మరిచిపోయి పాడురాయి మీదనే దృష్టినిలిపి జీవితమనే వడ్డించిన ప్లేటుని పక్కకి నెట్టేస్తున్నావు. ఇది తప్పు. జీవితమనే అన్నం ముద్దలో ఆ రాయి చిన్న కష్టం లాంటిది. మనసును రాయి చేసుకొని జీవితమనే అన్నంలో వచ్చిన రాయిని పక్కన పెట్టి... నీ కోసం ఎదురు చూసే భవిష్యత్తు విందును ఇష్టంగా ఆరగించు ...లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకో ...” అన్నాడు. అవి అతను ఎక్కడో చదివిన వాక్యాలు. బాగా నచ్చడంతో మన్వితకి చెప్పాడు.

అతని మాటలు ఆమె మనసు మీద బాగా పని చేస్తున్నట్లు అమె ఫీలింగ్స్ ని బట్టి తెలుస్తోంది ధీరజ్ కి .....

" ఓ.కె. మన్వితా ! మళ్లీ కలుస్తా ...” అంటూ స్టూల్ మీద నుండి లేచి క్యాజువాలిటీ వైపు నడిచాడు.

వెళ్తున్న ధీరజ్న దూరాన్నుండి చూసి - మన్విత దగ్గరకి వచ్చింది సంజన.

" ఏమంటున్నాడే ?మళ్లీ వచ్చాడుగా ....” అంది సంజన

" నువ్వు అనవసరంగా బయటకెళ్లి మిస్ అయ్యావు కాని ... అతని మాటలు వింటుంటే ఓ రాజారాం మోహన్ రాయ్, ఓ గురజాడ లాంటి వాళ్లు గుర్తిస్తున్నారు...” అంది మన్విత.

“వాళ్లు సంఘ సంస్కర్తలు ... వాళ్లెందుకొచ్చారు మిమధ్యలోకి?” అంది సంజన అర్థం కాక...

“కరక్ట్గా చెప్పడం రావడం లేదు సంజనా ! అతని మాటలు వింటుంటే ... అతనిలో ...” అంటూ మాటల కోసం ఆగింది మన్విత.

"శ్రీ, శీ ,చలం, యండమూరి కన్పించారా ? ”

“ నీ జోకులు పాడుగాను ... నువ్వుండవే... అతన్ని చూస్తుంటే...?”

“ఆ ... ఈసారి సిద్ధార్థ, సచిన్ కన్పిస్తున్నారా?” అంది వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ..

“ కాదు ... నువ్వలా నవ్వాపుకుంటుంటే సానియా మీర్జా కన్పిస్తోంది...” అంది మన్విత.

ఇంకేం మాట్లాడకుండా... ప్రూట్ జ్యూస్ తెచ్చి మన్విత చేత త్రాగించింది సంజన.

• • • •

మన్వితను హాస్పిటల్ నుండి డిశ్చార్జి చేశారు..

మూడీగా వున్న మన్వితను చూస్తుంటే సంజనకి ఏం అర్థం కాలేదు....

“మన్వితాను ఇంటికి తీసికెళ్లి, నాలుగురోజులు వుంచుకోండి అంటీ ! హాస్టల్లో వుంటే ఇదే సంఘటన గుర్తు తెచ్చుకొని బాధపడ్తుంది.” అని చెప్పింది సంజన.

" అలాగే” అంటూ ... కూతురి బట్టల్ని సర్దుతూ సంజనతో మాట్లాడుతోంది కృష్ణవేణి.

జీవితం చాలా రుచికరమైందని - దాన్ని ఆస్వాదిస్తూ అందులోని అర్ధాన్ని తెలుసుకోమని ధీరజ్ చెప్పినప్పటి నుండి అలోచిస్తోంది మన్విత ... సంజన చెప్పింది కూడా నిజమే . హాస్టల్ కి వెళ్తే ఫ్రెండ్స్ ఏదో ఒకటి అంటూ తన మనసు గాయాన్ని కెలుకుతారు. ఇంటికెళ్లి మానసిక బలాన్ని తెచ్చుకోవాలనుకుంది.

కానీ ... మన్విత ఇంటి కెళ్లాక ఆమె ఆశించిన వాతావరణం లేదక్కడ... 

ఎప్పుడైనా ఇంట్లో ... సోఫాలో కూర్చునో, మెట్ల మీద కూర్చునో పీస్ పుల్గా చదువుకునేది . డయాగ్రామ్స్ వేసుకునేది. రికార్డ్స్ రాసుకునేది. మన్వితను అలా చూసి - ఆ వీధిలో వాళ్లు కృష్ణవేణి కూతురు చదువుల సరస్వతి అనేవాళ్లు ... విశ్వనాధం కన్నా ఆ వీధిలోకృష్ణవేణమ్మ అందరికి తెలుసు కాబట్టి మన్వితను కృష్ణవేణి కూతురుగానే పిలుస్తారు. 

డ్రమ్స్ వాయించినట్లు కేకలు వేస్తుందనే గాని కృష్ణవేణమ్మ మనసు మంచిది పద్ధతైన మనిషి అనుకుంటారు. అందుకే ఆమె అంటే అందరికి అభిమానం ... మన్విత అంటే గౌరవం.

" ఇంకొద్ది రోజుల్లో ... మన్విత డాక్టరే వస్తే అందరం అమె దగ్గరే చూపించుకోవాలి. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు గుంజుతారు. ఎక్కువ సేపు ఓ.పి. లో కూర్చోబెత్తారు. ఈ లోపల కొత్త రోగాలు కూడా బయటపడ్డాయి అని కూడా అనుకునేవాళ్లు. | కానీ ... ఈ ఒక్క సంఘటనతో అంతా ముక్కుమీద వేలేసు కున్నారు. ఒక్కరు కూడా ఎం.జి.ఎం. హాస్పిటల్ కి వెళ్లి మన్వితను పరామర్శించలేదు. ఇంటికి వచ్చాక మాత్రం... కృష్ణవేణితో ఏ టైంలో ఏ అవసరం వస్తుందోనని మన్వితను పలకరించి వెళ్లారు.

మన్వితను చూసి పక్కకి వెళ్లాక ....

“ కృష్ణవేణమ్మకి ఇదేం పోయేకాలం ? కూతురికి బుద్ది చెప్పుకొని, పెంచుకోకుండా గాలికి వదిలేసింది... అలా వదిలేస్తే ఎవరైనా అలాగే చేస్తారు ... తల్లి ఎప్పుడైనా ... బిడ్డ ఎలా వుందో ! ఏం చేస్తుందో ! ఎక్కడ తిరుగుతుందో ! చూసుకోవద్దా ? కన్న కూతురు అక్కడెవర్నో ప్రేమించి, ప్రాణం తీసుకునే దాకా వస్తే ! ఇక్కడ ఈవిడ గారు ఏం చేస్తున్నారో ? తినడం, పడుకోవడం తప్ప మరో ద్యాస లేనట్లుంది” అని ఆ వీధిలోని వాళ్లంతా తల్లిని కామెంట్ చేస్తుంటే ... తన వల్ల తల్లికి మాటలొచ్చాయని మన్విత బాధపడింది.

“ తన ప్రాణం మీదే తనకి తీపి లేక నరాలను అడ్డంగా కోసుకొంది. రేప్పొద్దున ఈ పిల్ల డాక్టరై మనల్నేం కాపాడుతుంది? ” అని అన్న వాళ్లు లేక పోలేదు. వాళ్ల మాటలు చాలెంజ్గా మన్వితను తాకాయి

కృష్ణ వేణమ్మ కూతురు ఇలా చేసింది ... అలా చేసింది ... అని అంటున్నారేకాని విశ్వనాధంని కాని, అయునతల్లి వర్ధనమ్మను కాని ఎవరు ఏమి అనడం లేదు. ఏదైనా తల్లి పెంపకంలోనే వుంటుందని కూడా అంటున్నారు. ఆ మాటలు వింటుంటే కోసి కారం పెట్టనట్లుంది కృష్ణవేణమ్మకి.

ఇన్ని రోజులు ఇంట్లో మనుషుల్లా వున్న ఆ వీధిలో వాళ్లు వింత పక్షుల్లా అరుస్తున్నారని భర్తతో చెబితే ఆయన పెదవి కదపకుండా పిల్లలకి పాఠాలు చెప్పుకోటానికి బమ్మెర వెళ్లాడు... నేను ఈ మాటలు పడలేకపోతున్నా కనీసం మీరైనా వాళ్లనోళ్లు మూయించండి!' అని అత్తగారితో చెబితే ... చెవిటి వాడి ముందు శంఖం వూదినట్లు - స్వతగాహాగా నోరెత్తని వర్ధనమ్మకి కోడలకి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు.

వర్ధనమ్మకి తెలిసి చాలా మంది ఏ మాత్రం అవకాశం దొరికినా ... నిద్ర లేచినప్పటినుండి నీళ్లు తాగినంత సులభంగా ఇంట్లో వాళ్లకి, బంధువులకి, స్నేహితులకి, తెలిసినవాళ్లకి నీతులు చెబుతూనే వుంటారు. అలా చెబుతున్నప్పుడు వాళ్లు వాళ్ల అర్హతల్ని కూడా మరిచి పోతుంటారు. మంచి చెబుతున్నామన్న ద్యాసలోనే వుంటారు.

“నేనిక్కడ గొంతు ఇంత చేసుకొని మాట్లాడుతుంటే ఏమిటా పరద్యానం అత్తయ్యా ? మీ ద్యాస మీదేనా ? చచ్చింది చావక ... మళ్లీ బ్రతికి నన్ను చంపుకుతింటోంది. నీ మనవరాలికి ఏ చదువు చదవాలో, ఏ తిండి తినాలో, ఏ బట్టకట్టాలో తెలిసినప్పుడు-ఎలా ప్రవర్తించాలో తెలియలేదా? నలుగురు నడిచే దారిని వదిలేసి 'ప్రేమ' అంటూ ఈ కొత్త దారులు ఎందుకు ? ఈ మాటలెందుకు ? వచ్చిన మాటలు పోతాయా? పోయిన పరువు వస్తుందా?” అంది కృష్ణవేణమ్మ హాస్పటల్లో వున్నప్పుడు కూతురు బ్రతికితేచాలనుకున్న ఆమెకు ఇప్పుడదేం గుర్తురావడం లేదు.

వీధిలో వాళ్ల మాటలేమో కాని తల్లి మాటలు బలంగా గాయ పరుస్తున్నాయి మన్వితను.

వర్ధనమ్మకి కోడలి మాటలు బాధగా అన్పించాయి. కొన్ని పనులకి శిక్ష పడటానికి పోలీస్ స్టేషన్లు, కోర్టులు వున్నట్లే, ఇలాంటి ప్రేమ వ్యవహారాలకి వీధిలో వాళ్లే జడ్జీలు... ఇంట్లో వాళ్లు పోలీసులు. వాళ్లకి భయపడే ఒకప్పుడు తన తండ్రి పెళ్లికి ముందు తనో ముస్లిం కుర్రాడిని ప్రేమించానని తెలిసి కూడా తెలియనట్లే నటించి పెళ్లిచేశాడు. అలాగని తను చనిపోయిందా?

కానీ... ప్రేమంటే జోక్ కాదు. ఈ ప్రేమలనేవి... పురాణ కాలం నుండి వున్నాయి. ఈ ప్రేమ వల్లే ప్రపంచ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. లక్షలమంది ఎగిరిపోయారు. చాల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. హత్యలు చేశారు. సమాధి అయిపోయిన వాళ్లు కూడా వున్నారు. ఈ ప్రేమకి దేవతలు, దేవుళ్లు కూడా ఎక్సెప్షన్ కాదు. అలాంటి ప్రేమలో పడి తన మనవరాలు ఎంత మానసిక స్ట్రగులకి గురి అయివుంటుందో తను అర్థం చేసుకోగలదు. ఎంతయినా చనిపోవాలనుకోవడం తప్పు... అయినా తన కోడలు - కన్న బిడ్డను కడుపులో పెట్టుకోవలసింది పోయి ఈ మాటలేంటి? ఈ వాదన ఏంటి?

“ఎవరేం అంటున్నా నోరు ఎత్తని బుద్ధిమంతులు మిరు ? మరి నేను? రాళ్ల దెబ్బలు తినే చెట్టునా ? మాట్లాడరేం అత్తయ్యా?” అంది.

“ఏం మాట్లాడాలి కృష్ణవేణి? ఎన్ని దెబ్బలు తిన్నా కాయలున్నాయి కాబట్టి చెట్టులా తట్టుకోవాలి. ఒక్క రోజన్నా దాన్ని ప్రేమగా చూసుకున్నావా? కనీసం ఇప్పుడు కూడా .... చచ్చి బతికి ఇంటికి వస్తే - లోకులేదో అంటున్నారని దానిమీద పడి ఏడ్వలేక నా మీద పడి ఏడుస్తున్నావు.” అని అనాలనివున్నా ... అసలే ఆవేశంగా వున్న కోడల్ని చూసి నోరు మెదపలేకపోతుంది. కారణం మొన్నా మధ్యన ఒక కోడలు తన బిడ్డను కొడ్తుంటే చూడలేని అత్త అడ్డం పోతే ఆకోడలు అత్తను కొట్టిందట. సందర్భం రావాలేకాని తనకోడలు కూడా తక్కువేం కాదు అనుకొంది వర్దనమ్మ

ఇక లాభం లేదనుకొని ...

“మీ కొడుకూ, మీరు మాట్లాడుకొని దానికి బుద్ది చెప్పండి! నా మాటంటే దానికి మొదటి నుండి లెక్కలేదు. లెక్క వుంటే ఇలా చేసేది కాదు.” అంది కృష్ణవేణమ్మ.

అప్పటికే కాలేజి బ్యాగ్లో తన బట్టల్ని పెట్టుకొని, ఆ బ్యాగాను భుజానికి తగిలించుకొంది మన్విత.

“నేను హాస్టల్ కి వెళ్తున్నా నానమ్మా!” అంది గేటు వరకు వెళ్లి... అక్కడే వున్న తల్లితో మాట్లాడాలంటే మనస్కరించక తలవంచుకొని నిలబడింది.

కోపంలో వున్న కృష్ణవేణమ్మ మన్విత వైపు చూడలేదు. ఆమెకు బిడ్డంటే ప్రేమలేక కాదు. లోకుల మాటల్ని తట్టుకోలేక... వాళ్లను ఎదురించి, ఆ బిడ్డను కడుపులో పెట్టుకోలేక...

మనిషన్నాక ... జీవితం అన్నాక... ఎన్నో జరుగుతుంటాయి. అన్నిటికి సమాధానంగా, ధైర్యంగా నిలబడాలి కాని, ... ఇలా ఎవరో, * కడుపులో ఉన్న బిడ్డ కొరుకుతుందని” చేబితే నమ్మి కడుపు చీల్చి ఆ బిడ్డను లాగి బయట వేస్తారా ? మనవరాలు ఇప్పుడు హాస్టల్ కి వెళ్లడం ఇష్టం లేని దానిలా మన్వితకి దగ్గరగా వెళ్లి...

“తొందరేముంది మన్వితా ?రేపు వెళ్తువు గార్లే ! ” అంది మనవరాల్ని దగ్గరకు తీసుకుంటూ ... ఆమె కళ్లలోని బాధ కంఠంలో ఒలికింది. నానమ్మ లోని ప్రేమకి, దయకి కదిలిపోతూ ... నానమ్మనే చూస్తూ నిలబడింది.

ఈ ప్రేమ కావాలి మన్వితకి ... తన కోసం బాధపడే మనిషి కావాలి... తనకోసం ఒక్క క్షణమైనా ఎదుటివాళ్ల కళ్లు తడవాలి... ఆ ప్రేమను తనెంతగా కోరుకుంటుందో అంతగా దూరమవుతోంది.

“ నాకేం కాదు నానమ్మా ! నువ్వేం కంగారు పడకు. నీ భయం నాకు తెలుసు. నేనిలాంటి పని ఇంకెప్పుడు చెయ్యను.” అంది నానమ్మ భుజాల చుట్టూ చేయివేసి దగ్గరకి తీసుకొని...

వర్ధనమ్మ కళ్లు తుడుచుకొంది.

మన్విత అక్కడ నుండి కదిలి... కొద్ది దూరం నడుచుకుంటూవెళ్లి, అటో ఎక్కి మెడికల్ కాలేజీ ముందు దిగింది. 

అక్కడే వున్న సంజన అటో దిగుతున్న మన్వితను చూసి “అప్పుడే వచ్చావేం?” అంటూ ప్రశ్నించి... మన్విత నవ్వుని సమాదానంగా తీసుకొని... ఇద్దరు మాట్లాడుకుంటూ హాస్టల్ కి వెళ్లారు.

(సశేషం )

No comments:

Post a Comment

Pages