మానసవీణ -19 - అచ్చంగా తెలుగు

మానసవీణ -19

ప్రతాప వెంకట సుబ్బారాయుడు


సాయంకాలం!

మానసకు ఎందుకో బెంగగా అనిపించి..శ్రావణిని అప్పటికప్పుడు చూడాలనుకుంది.

సరితకు కాల్ చేసి కొద్దిసేపు మాట్లాడి శ్రావణిని గుడికి తెమ్మని అభ్యర్థించింది.

ఒక అరగంట తర్వాత చక్కగా ముస్తాబైంది మానస, ఆశ్రమంలోని పూవనంలో వనదేవతలా తిరుగుతూ రకరకాల పూలను కోసి పూల సజ్జలో నింపుకుని దేవాలయానికి బయల్దేరింది.

ఆమె వెళ్లేసరికి అప్పుడప్పుడే భక్తులు గుడికి వస్తున్నారు, దేవాలయంలో ఏర్పాటు చేసిన మైకులోంచి ’అయిగిరి నందిని’ మంద్రంగా వినిపిస్తోంది. శుభ్రంగా కడిగిన గుడి ప్రాంగణం, అగరు సువాసనలతో మానస మనసు అలౌకికానుభూతికి లోనయ్యింది.

చిన్నగా మెట్లెక్కుతూ దుర్గాదేవి దగ్గరకు చేరింది. పచ్చని చీరా జాకెట్టుతో, పూలతో అలంకరించిన అమ్మవారు అటు ఇటు ఉంచిన దీపాల కాంతిలో వెలిగిపోతోంది. ముఖ్యంగా ముక్కెర వెలుగులు కళ్లద్వారా మనసులోకి ప్రవేశించి దివ్యమైన వెలుగులు నింపుతున్నాయి.

అప్పటికే మానస ఆ దేవాలయానికి రెండు మూడుసార్లు రావడం వల్ల పూజారికి పరిచయమైపోయింది. మానసను ఆయన మంగళ స్వరూపిణి అయిన జగన్మాతగా భావిస్తాడు. 

మానస తన చేతిలోని పూలసజ్జను ఆయన చేతిలో పెడుతూ శ్రావణి పేరుమీద అర్చన చేయమంది. శ్రావణి, మానసల గురించి తెలిసి ఉండడం చేత గోత్రం అడకుండానే అర్చన చేయడానికి గర్భ గుడిలోకి వెళ్లాడు.

అర్చన ముగించి పూజారి రావడం, అదే సమయంలో శ్రావణిని అందంగా ముస్తాబు చేసి సరిత తీసుకురావడం ఒకేసారి జరిగాయి. 

శ్రావణిని చూస్తుంటే, ఎందుకో ఆమె తన తల్లే అన్న భావన మానస మనసులో బలంగా కలుగుతోంది.

వెళ్లి చెమర్చిన కళ్లతో ఆమెని గాఢంగా కౌగిలించుకుంది. శ్రావణి కూడా వెతకబోతున్న పెన్నిధి దొరికినట్టుగా గట్టిగా కరచుకుపోయింది. అప్రయత్నంగా పూజారితో సహా అక్కడున్న అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ విడివడ్డారు. అయినా మానస చేతిని గట్టిగా పట్టుకునే ఉంది శ్రావణి.

ఎదురుగా దేవత, ఇటు శ్రావణి, మానసలు ముగ్గురమ్మలు. పూజారి మనసులో దణ్నం పెట్టుకున్నాడు.

‘అమ్మా! జగజ్జననివి. ఈమెకి తన కూతుర్ని, నాకు మా అమ్మను చూపించవూ. నువ్వు తప్ప మాకు వేరే దారిలేదు. కరుణా సముద్రురాలివి. మాతృమమకారం తెలిసినదానివి. నువ్వు తప్ప మా గోడు ఎవరు పట్టించుకుంటారు? అని మనసులో అనుకుంది.

పూజారి ఇచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకుని అక్కడ కొద్ది దూరంలో ఉన్న అరుగు మీద కూర్చున్నారు. శ్రావణి ఏం మాట్లాదడం లేదుగాని తన మనసులో కలుగుతున్న భావ సంచలనం చేతి ద్వారా మానస మనసుకు అందుతోంది. అలా ఎంతసేపయిందో తెలీదు. "అమ్మా, ఇక మేము పోతామమ్మా, చీకటి పడుతోంది" అంది సరిత.

మానస ఈ లోకంలోకి వచ్చి చూసింది. నిజమే చీకట్లు ముసురుకుంటున్నాయి.

అలాగే అన్నట్టుగా వాళ్లని సాగనంపింది మానస. ఇంతకు ముందులా శ్రావణి వెళ్లేప్పుడు గోల చెయ్యడం లేదు. ఒకటి రెండు సార్లు వెనక్కి తిరిగి మాత్రం చూసింది.

మానస ఆశ్రమానికి వెళ్లడానికి నడుచుకుంటూ వెళుతోంది.

అంతలో హఠాత్తుగా ముఖానికి మంకీ క్యాపులు ధరించిన ఇద్దరు ఆగంతకులు ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు.

"మానసా, నువ్వేదో మదర్ థెరెసా అన్నంత ఫోజుతో కాలేజీని, స్వామీజీ ఆశ్రమంగా మార్చేశావు. ఇదివరకు లెక్చరర్స్ ను ఆటపట్టించొచ్చని, అమ్మాయిలను ఏడిపించొచ్చని ఎగురుకుంటూ కాలేజీకి వచ్చేవాళ్లం. ఇప్పుడు నాన్ వెజ్ తినేవాడికి, కంచం నిండా వెజ్ పెట్టినట్టుగా అనిపిస్తోంది. మా రాజేష్ గాడు ఇంతకుముందు ఎవరి మాటా వినేవాడు కాదు. వాడితో పాటు మేమూ ఫుల్లుగా ఎంజాయ్ చేసేవాళ్లం. ఇప్పుడు వాడి మీద ఏం మాయ చేశావో, ఏ మత్తుమందు చల్లావో పూర్తిగా బుద్ధుడయిపోయాడు. వెనకటిలా మారమంటే ప్రవచనాలు చెబుతున్నాడు. అందుకే..అందుకే కాలేజీకి నీ పీడ విరగడ చేస్తున్నాం. ఇదిగో ఈ బాటిల్లో యాసిడ్ ఉంది. ఇక్కడ పెద్దగా జనం లేరు. నిన్ను రక్షించే నాథుడు లేడు. చూస్కో" అని సీసా ఊపుతూ మాట్లాడాడు.

మానసకు గుండె ఆగినంత పనైంది. మృత్యువు ఎదురుగా నిలబడి వికటాట్టహాసం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇన్నాళ్లు పేపర్లలో, టీవీల్లో కనిపించిన దారుణాలు తన విషయంలో జరగబోతోందని తెలిసి, అంతటి ధైర్యస్థురాలూ పులిని చూసిన లేడిలా వణికిపోతోంది. 

వాళ్లిద్దరిలో ఒక ఆగంతకుడు యాసిడ్ బాటిల్ మూ..త..తీయడా..ని..కి ఉద్యుక్తుడవుతున్న సమయంలో నల్ల డ్రస్సు వేసుకున్న మరో ఆగంతకుడు హఠాత్తుగా, లాఘవంగా వాళ్లిద్దరి మీదా లంఘించి, ఆ బాటిల్ అందుకుని, మెరుపు వేగంతో దాన్ని ఒక పొదలమాటులో భద్రంగా పెట్టి, అంతే వేగంతో వాళ్లమీదపడి పిడిగుద్దులు గుద్దాడు. వాళ్లు ఆ దెబ్బలు తాళలేక పరుగు లంకించుకున్నారు.

ఆ ఆగంతకుడు కనీసం మానస వంక చూడనైనా చూడకుండా, పొదల్లో ఉంచిన ఆ యాసిడ్ బాటిల్ అందుకుని చీకట్లో మాయమైపోయాడు.

ఆ వచ్చిన ఇద్దరు ఆగంతకులు రాజేష్ దుష్ట స్నేహితులు. ఆమెపై యాసిడ్ దాడి చేస్తే, రాజేష్ మళ్లీ తమకు దక్కుతాడని భావించి వచ్చారు.

తర్వాత వచ్చిన ఆగంతకుడు GTR మనిషి. మానసను ఎల్లవేళలా కాపాడమని GTR గతంలో బాధ్యత అప్పగించిన మనిషి. 

**** 

మరుసటి రోజు విషయం తెలిసి GTR, సువర్చల, కృషీవలరావు, దినేష్ కుమార్, అనిరుధ్, విజయ్ అందరూ ఆఘమేఘాల మీద మానసను పరామర్శించడానికి వచ్చారు.

జరిగిన సంఘటన అందరిలోకి మానసికంగా ఎక్కువ కుంగదీసింది అనిరుధ్, విజయ్ లకే!  

వాళ్లు ఒక్కొక్కరుగా ఆమె వద్దకెళ్లి, ఆమెకి మాత్రమే వినబడేట్టు చెవిలో "పొరబాటు జరిగిపోయింది. ఇహనుంచి నీ మీద ఈగ వాలనియ్యను" అన్నారు.

దిలీప్ కుమార్, ఆమె పక్కగా స్టూలు మీద కూర్చుని ఇన్ ఫర్మేషన్ లాగుదామని ప్రయత్నించబోగా " కొద్దిగా ఓపికపట్టండి, మీకు కావలసిన ఇన్ ఫర్మేషన్ నేనిప్పిస్తా" అని GTR అనడంతో, లేచి వెళ్లి వాళ్ల మధ్యలో నుంచున్నాడు. 

సరిగ్గా అప్పుడే ఆ రూం కి ఉన్న కిటికీకి అవతల వైపు ఓ వ్యక్తి, లోపల జరిగేవన్నీ తెలుసుకోవాలని ఎవ్వరికీ కనబడకుండా, చెట్ల మాటున ఒంగి చెవులు రిక్కించి నుంచున్నాడు.

(సశేషం)

No comments:

Post a Comment

Pages