జ్యోతిష్య పాఠం - 6 - అచ్చంగా తెలుగు

జ్యోతిష్య పాఠం - 6

Share This

జ్యోతిష్య  పాఠం -  6

భావాలు స్థానాలు

PSV రవి కుమార్ 




ముందు పాఠాలలో మనం భావాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం భావ స్థానాల విభజన తెలుసుకుందాం. 

కేంద్రం:

లగ్నం నుండి 1,4,7,10 స్థానాలని కేంద్ర స్థానాలు అంటారు. దీనినే విష్ణు స్థానం అంటారు .  ఈ స్థానాల అధిపతులు పాప గ్రహాలు అయినచో అవి శుభ ఫలితములు ఇచ్చును.  ఆ స్థాన ఫలితములు అభివ్రుద్ది చేయును.

కేంద్రాదిపతులు పాప గ్రహాలు అయ్యి అవి ఏ స్థానానికి ఆధిపత్యం వహించునో ఆ స్థాన ఫలితాలు అభివ్రుద్ది చేయును.

(మనం పాఠం 3 లో పాప గ్రహాలు, అశుభ గ్రహాలు గురించి తెలుసుకున్నాం).

కేంద్ర స్థానము లందు ఉన్న పాప గ్రహములు, ఏ భావమునకు ఆధిపత్యం వహించునో ఆ భావ ఫలితములు సంపూర్ణం గా ఇచ్చును కాని, ఏ కేంద్ర స్థానముల యందు ఉన్నదో ఆ కేంద్ర స్థానం యొక్క ఫలితములను పాడు చేయును. 

కేంద్రాదిపత్యం పాప గ్రహములకు మంచిది. కేంద్రములలో పాప గ్రహములు ఉండుట మంచిది కాదు.

కోణం: 

లగ్నం నుండి 1,5,9 స్థానాలను కోణాలు అంటారు. దీనినే లక్ష్మీస్థానం అంటారు . ఈ స్థానాల అధిపతులు ఎప్పుడూ శుభ ఫలితాలు ఇస్తాయి. 

కోణ స్థానలలో శుభ గ్రహములు ఉన్న లేక శుభ గ్రహములు ఆధిపత్యం వహించిన ఆ గ్రహం ఉన్న భావం, ఆ కోణాధిపత్యం వహించిన భావం కి గల ఫలితములు పూర్తి గా ఇచ్చును.

అదే కోణాధిపతి పాప గ్రహం అయిననూ, లేదా కోణ స్థానలలో పాప గ్రహం ఉన్ననూ ఆ గ్రహం ఉన్న భావ ఫలితమును పూర్తి గా ఇచ్చును కాని ఏ కోణానికి అయితే ఆధిపత్యం వహించునో ఆ ఫలితమును ఇవ్వడు.

లగ్నాది పతి కేంద్ర కోణాధి పతులు అగుటచేత ఆ గ్రహం కు ఏదైన దోషం ఉన్ననూ అది తగ్గును (ఆ లగ్నాదిపతి ఏ స్థానం లో ఉన్నదో కూడా పరిశీలించాలి).  

ఉపచయములు:

లగ్నం నుండి 3,6,10,11 స్థానాలను ఉపచయములు అందురు. ఈ స్థానముల యందు పాప గ్రహములు ఉన్నచో అద్భుత ఫలితములుఇచ్చును.

ముఖ్యం గా శని, కుజ, రాహువు, కేతువు ఈ స్థానములయందు  ఉన్నచో శుభ ఫలితములు ఇచ్చును.

ఈ స్థానములు జాతకుని లాభములు, అభివ్రుద్ది, సంపాదన వంటి విషయములు తెలుపును.

దుస్థానములు:

లగ్నం నుండి 6,8,12 దుస్థానములు అందురు. ముఖ్యంగా 8, 12 స్థానములలో పాప గ్రహములు ఉన్నచో అవి చెడు ఫలితములు ఇచ్చును. శుభ గ్రహములు ఉన్ననూ పాప ఫలితములు ఇచ్చును. 6 వ స్థానం లో మాత్రం  పాప గ్రహం శుభ ఫలితం ఇచ్చును, శుభగ్రహం 6 వ స్థానం లో ఉండుట మంచిది కాదు. 

రవి, గురు, కుజ శని , రాహువు 8, 12 స్థానముల యందు ఎక్కువగా పాప ఫలితాలు ఇచ్చును.

రాజ యోగం: 

ఎదయినా ఒకటే గ్రహం కేంద్రానికి, కోణానికి ఆధిపత్యం వహించిన ఆ గ్రహము రాజ యోగం ఇచ్చును. లేదా కేంద్రాదిపతి కోణం లో ఉన్ననూ, కోణాదిపతి కేంద్రం లో ఉన్ననూ, దానిని రాజయోగం గా తెలిపారు.

మూల త్రికోణములు:

ఒకొక్క గ్రహానికి ఒకొక్క రాశి మూల త్రికోణం గా చెప్పబడింది. ఆ గ్రహం మూల త్రికోణం లో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. 

రవి - సింహం చంద్రుడు - వ్రుషభం

కుజుడు – మేషం బుధుడు - కన్యా

గురుడు - ధనస్సు శుక్రుడు - తులా

శని – కుంభం          రాహువు - కర్కాటకం 

కేతువు - మకర

కేంద్రాదిపత్య దోషం:

ఎదయిన ఒకటే గ్రహం రెండు కేంద్రాలకు ఆధిపత్యం వహిస్తే అది కేంద్రాదిపత్య దోషం గా పరిగణించబడుతుంది.

ఈ దోషం ముఖ్యం గా బుధ మరియు గురు గ్రహం కి వర్తిస్తుంది. అనగా ఈ దోషం 4 లగ్నాల వారికే వర్తిస్తుంది. అనగా ఆ గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వడు.మిథున, కన్య, ధనస్సు, మీన లగ్నం వారికి ఈ దోషం ఉంటుంది.

మిథున లగ్నం వారికి బుధుడు 1, 4 స్థానాలకి అధిపతి మరియు గురుడు 7, 10 స్థానాలకు అధిపతి.

కన్యా లగ్నం వారికి బుధుడు 1, 10 స్థానాలకి అధిపతి మరియు గురుడు, 4, 7 స్థానాలకు అధిపతి.

ధనస్సు లగ్నం వారికి గురుడు 1, 4 స్థానాలకు అధిపతి మరియు బుధుడు 7, 10 స్థానాలకు అధిపతి

మీన లగ్ణం వారికి గురుడు 1, 10 స్థానాలకి అధిపతి మరియు బుధుడు 4, 7 స్థానాలకు అధిపతి.

కానీ ఈ దోషం కు కొన్ని ప్రత్యేక పరిమితులు ఉన్నాయి. అన్ని సార్లూ ఈ దోషం వర్తించదు.

ఉదాహరణకు మిథున లగ్నం తీసుకుంటే, బుధుడు కేంద్రానికి, కోణానికి ఆధిపత్యం వహిస్తున్నడు( అనగా 1,4) 1 వ స్థానం కోణం గా కూడా పరిగణించబడుతుంది కాబట్టి, మిథున లగ్నం వరికి బుధ గ్రహం రాజయోగం ఇస్తుంది.  గురుడుకి మాత్రమే కేంద్రాదిపత్య దోషం ఉండి, గురు మహా దశ అంతగా యోగించదు. 

అలగే కన్యా లగ్నానికి బుధుడు 1, 10 స్థానానికి ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి కన్యా లగ్నానికి కూడా బుధుడు రాజయోగం ఇస్తుంది.గురుడుకి మాత్రమే కేంద్రాదిపత్య దోషం ఉండి, గురు మహా దశ అంతగా యోగించదు. 

ధనస్సు మీన లగ్నాల వారికి గురుడు కోణాదిపతి, కేంద్రాదిపతి అవ్వటం వలన గురుడు రాజయోగం ఇస్థాడు.బుధుడు మాత్రమే కేంద్రాదిపత్య దోషం ఉండి, బుధ మహా దశ అంతగా యోగించదు.

అలాగే కేంద్రాదిపత్య దోషం ఉన్న గ్రహం స్వక్షేత్రం లో ఉంటే ఆ దోషం ఉండదు. అనగా మిథున లగ్నం, కన్యా లగ్నం వారికి, గురుడు స్వ క్షేత్రం అనగా (ధనస్సు, మీనం ) లలో ఎదయినా ఒక రాశి లో ఉన్నట్టయితే ఆ దోషం వర్తించదు.

అలాగే ధనస్సు, మీన లగ్నం వారికి బుధుడు స్వక్షేత్రంలో ఉంటే (మిథున, కన్యా)  రాశులలో ఉంటే ఆ దోషం వర్తించదు.

వచ్చే పాఠం లో ఏ లగ్నానికి ఏ దశ యోగిస్తుందో, ఏ  దశ ఎటువంటి ఫలితం ఇస్తుందో తెలుసుకుందాం.

***


No comments:

Post a Comment

Pages