ఆత్మానుభవం - అచ్చంగా తెలుగు

 ఆత్మానుభవం 

వి.శ్రీనివాస మూర్తి 

(MyBigBreak.in సంస్థ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో రెండొవ బహుమతి పొందిన కథ )


 బ్రహ్మ మొక్కటే ,పరబ్రహ్మ మొక్కటే .. అన్నమయ్య పాట ఫోన్ లో వస్తోంది . ఆ పాట వింటూ పార్వతమ్మ వంటింట్లో పని చేసుకొంటోంది . అందరికి శ్రీహరే అంతరాత్మ ..ఇందులో జంతు కుల మంతా ఒక్కటే..పాట చెవులకు ఇంపుగా వుంది , తాను మంచి పాట వింటూ మంచి పని చేస్తున్నాని మనసు కి అనిపిస్తోంది . ఏమండీ , పాట  ఎంత బాగుంది , మీరు కుడా వినవచ్చు కదా , ఆ పాడు పేపర్ కాక పోతే .  పుణ్యం , పురుషార్థం కూడాను .భర్త సుబ్బారావు ని ఉద్దేశించి అనింది.  ఆయన పూర్తిగా పేపర్ చదవడం లో లీన మయ్యాడు. మొదటి అక్షరం నించి ఆఖరి అక్షరం వరకు పేపర్ చదవడం ఆయనకు దినచర్య లో ముఖ్య భాగం . నిజమే బాగానే వుంది వింటుంటే .. పుణ్యం సంగతి అంటావా , భార్య పుణ్యంలో సగ భాగం భర్తకి కుడా చెందుతుందని ఎక్కడో చదివాను. ఇక పోతే , నీవు వింటున్నావు రోజు .. ఆ పాట లో భావన నీకు ఎంత  లోతుగా అర్ధం అయ్యింది ?? ఎంత అనుభవం లోకి వచ్చింది ?? ఎంత నీ నిజ జీవితంలో పాటించ గలుగుతున్నావు ?? అలా జరిగితేనే కదా ఫలితం అని అన్నాడు సుబ్బారావు భార్యతో. కోపంగా చివ్వున లేచింది పార్వతమ్మ . నేను మీకు మంచి చెబితే నా మీదకే దాడి చేస్తారా ?? నాకు బాగానే అర్ధం అయింది. బాగానే పాటిస్తున్నా అని వాదించింది కానీ ఎక్కడో భర్త చెప్పింది నిజమే నేమో అని ఆలోచన వచ్చినా అహం అడ్డొచ్చింది . ఆ ఆలోచన పక్కకు తోసేసింది .  ఇంక భార్యని మంచి చేసుకోడానికి , సరే ఓ కప్పు వేడి వేడి కాఫీ కొట్టు . బుర్ర వేడెక్కింది . అందులో నీ చేతి కాఫీ అమృతం అనుకో . నీలాగా కాఫీ చేసీ వాళ్ళు నాకైతే తగల లేదు.  పార్వతమ్మ లోపల ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ , ఈ మాటలకు ఏమి తక్కువ లేదు అంటూ కాఫీ పెట్టి భర్తకు అందించి మరల పాట వింటూ పనుల్లో నిమగ్న మయింది.

ఇంతలో మనవరాలు స్నిగ్ధ బెడ్ రూమ్ లోంచి బయటకు వచ్చింది. ఒళ్ళు  విరుచు కొంటూ . సోఫా లో మళ్ళా పడుకొంది . ఇంక మత్తు వదలలా . పని ఆపేసి , మనవరాలిని గారాబం చెయ్య సాగింది. సరే ఇంకా కాసేపు పడుకొంటావా ?? లేక పోతే పళ్ళు తోము కొని రావే. ఇడ్లీలు తిందు గాని . రాత్రి ఎప్పుడో తిన్నావు . సరే నానమ్మ అని స్నిగ్ధ లేచి వాష్ బేసిన్ లో పళ్ళు తోముకొని మొహం కడుక్కొని వచ్చి ఐపాడ్లో ఏదో వీడియో చూస్తూ , సోఫా లో కూచుంది . పార్వతమ్మ ఒక ప్లేట్ లో వేడి వేడి ఇడ్లీలు నెయ్యి వేసి పట్టుకొచ్చి తినిపించ సాగింది .ఆ పిల్ల రెండు తినగానే ఇక చాలు నానమ్మ , నా పొట్ట నిండి పోయింది . అప్పుడేనా , ఇంకా ఒకటి అయినా తిను. నీకు శక్తి చాలదు . ఎదిగే పిల్లవు.  అని బలవంతం చేయబోయింది. దానిని స్వంతం గా , తనకి ఆకలి అయినంత వరకు తిననియ్యవే , సుబ్బా రావు కామెంట్. మీరు ఊరుకోండి. అన్నిట్లో జోక్యం చేసుకోకండి . అని మనవరాలు చేత ఇంకా తినిపించాలి అని ప్రయత్నం చేస్తోంది. సడన్ గా తలుపు తోసుకొని పని మనిషి సీతమ్మ కొడుకు లోపలికి వచ్చి , ఇడ్లీలు తింటున్న స్నిగ్ధ వైపు చూస్తున్నాడు. వాడికి దాదాపు స్నిగ్ధ వయసు. వాడికి ఆకలి వేస్తోంది . తనకు తినాలనిపిస్తోంది . ఎవరైనా ఏదైనా పెడితే తినాలని అనిపిస్తోంది. పార్వతమ్మ విసుగ్గా , ఒరేయి, అలా లోపలకు రాకూడదు .  ఒసే సీతా  , నీ కొడుకుని బయటకు తీసుకెళ్ళు . సరే నమ్మ అంటూ సీత కొడుకుని బయటకు తీసుకెళ్లి ఆడుకొమ్మని చెప్పింది.  ఎవరో ఇచ్చిన ఉప్మా టిఫిన్ డబ్బాలో ఉంటే మూత తీసి వాడికి ఇచ్చింది తినమని . స్నిగ్ధ ఇంక తిననని మొండి కేసింది.  అందరు తిన్న తర్వాత , సీతను పిలిచి , ఒక ప్లేట్ లో మూడు ఇడ్లీలు  , కొంచం చట్నీ వేసి ఇచ్చి , పిల్లవాడికి పెట్టు అని ఇచ్చింది. సరే అని సీత ఆ ఇడ్లీలు పిల్లవాడికి ఇచ్చి తాను గుడ్డలు ఉతక డంలో నిమగ్నమయ్యింది. రోజు టిఫిన్ పెడతాను అని తానేమి ఒప్పు కోక పోయినా ఏదో ఒకటి రోజు సీతకు , కొడుకుకు పెడుతుంది. తాను చాల మంది తో పోల్చుకొంటే మంచి మనసు కలదానిని అని గర్వ పడుతూ , ఇంకేదో పనిలో పడి పోయింది.

***** 

రాత్రి పని అంత అయిపోయాక పడుకొని రోజంతా జరిగినవి , రేపు చేయవలసినినవి నెమరు వేసుకోవడం అలవాటు పార్వతమ్మకు.. ఆ రాత్రి కుడా అలాగే ఆలోచిస్తూ ఉంటే , పొద్దున్న తనకు భర్తకు మధ్య అన్నమయ్య పాట గురించి జరిగిన చర్చ , ఆ పాటలో అందరిలో   వున్నది శ్రీ హరి అంతరాత్మ అనే అర్ధం , తాను తన మనవరాలి ఆకలి  గురించి ఫీల్ అయినట్లు పని మనిషి కొడుకు  విషయంలో ఫీల్ అవలేక పోవడం , పైగా చిన్న పిల్ల వాడిని విసుగ్గా  బయటకి వెళ్ళమనడం మెదడులో ఆలోచనలు తలెత్తాయి . తాను సరిగా ప్రవర్తించ లేదేమో , తాను ఆ పాట విని ఆనందించానే కానీ , అంత  లోతైన సందేశం గ్రహించి అనుభవం లోకి తెచ్చు కోలేదేమో , ఇలా అని అంతరాత్మ చెబుతోంది. కానీ మనసు మాత్రం వేదాలు , ఉపనిషత్తులు  అలా చెబుతాయి కానీ , దైనిక జీవితంలో పాటించడం  ఒక్కో సారి సమస్య సృష్టించ వచ్చు అని , తాను చాలా మందితో పోల్చుకొంటె  చాలా మానవీయ దృష్టి తో ప్రవర్తిస్తాను అని , మరి అతిగా పాటిస్తే  మనుషులు నెత్తికి ఎక్కుతారు అని మనసు తన ప్రవర్తనని సమర్ధించింది . పైగా , ఎంత సాధన చేసినా  అందరిలో వున్న ఆత్మ ఒకటే అనే అనుభవం రావడం చాలా జన్మల తర్వాత కానీ జగదు అని ఎక్కడో చదివినట్లు మరొక సమర్ధన. కానీ  మనసే నెగ్గింది . ఆ ఆలోచన పక్కకు తోసేసి  నిద్రకు ఉపక్రిమించ బోతే భర్త సుబ్బా రావు " త్వరగా పాడుకోవే , ఏమి ఆలోచిస్తున్నావు . రేపు 11 కి మనకు తిరుపతి ట్రైన్ . అన్ని సద్దడం అయింది కదా " ఏమీ లేదండి , నాకు అలవాటే కదా , రోజంతా జరిగినవి నెమరు వేసుకోవడం . రేపటికి అంత సిద్ధం . " మీరు కుడా పడుకోండి. అని తాను కుడా కళ్ళు మూసుకొంది .

**** 

త్వరగా తెమలవే , ట్రైన్ కి టైం అవుతోంది , ఒకో సారి ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ముందుగా వెళ్లి ఉండడం మంచిదే కదా . సుబ్బారావు కేక . మీరు మరీను .. రెండు గంటలు ముందే ఉండాలి అంటారు. మగవాళ్ళు , ఈజీ గా తయారు అయి కూర్చుంటారు. మా ఆడవాళ్ళకి పనులు అన్నీ తెమలాలి. బోల్డు టైం వుంది . తొందర పెట్టకండి అని భర్తకి చెప్పి ,ఆ కాస్త టైం లోనే మనవరాలికి జడ వేసి , టిఫిన్ పెట్టుకొని , దేవుడు పూజ పూర్తి చేసుకొని రెడీ అవుతోంది . ఈ రోజు మాత్రం పని పిల్ల కొడుకుని లోపలకి పిలిచి ఒక ప్లేట్ లో వేడి వేడి పొంగలి , చట్నీ వేసి ఇచ్చి , తినరా ఎప్పుడు తిన్నావో  రాత్రి అని చెప్పి తన పనిలో నిమగ్నము అయ్యింది. ప్రయాణం హడావిడి లో సుబ్బారావు గమనించ లేదు. పని మనిషి మాత్రం , మనసులో , పార్వతమ్మ గారు మనసున్న మనిషి అని అనుకొంటూ , లోపల ఆనంద పడుతూ అంట్లు తోమడంలో బిజీ అయిపొయింది. ఆ పిల్లకి ఏమీ అర్ధం కాలేదు. హాయిగా వేడి వేడి పొంగలి తినడంలో మునిగి పోయింది.

సామాన్లు ఆటోలో పెట్టి  దంపతులు,  కొడుకు కోడలు మనుమరాలుకి  చెప్పేసి  స్టేషన్ కి బయలు దేరారు . మనమరాలుని దగ్గరకు తీసుకొని " రెండు రోజుల్లో వచ్చేస్తాము . బెంగ పెట్టుకోకు. హాయిగా అమ్మ నాన్న చెప్పినట్లు విని బాగా తిని ఆడుకో " అని ముద్దు పెట్టుకొని ఆటోలో కూచో గానే ఆటో బయలు దేరింది . సీత కొడుకు బయటకు వచ్చి నానమ్మ , మనవరాలి మధ్య జరిగింది అంతా చూసాడు ఆసక్తి కరంగా . పార్వతమ్మ చూసి కుడా ఏమీ ఫీల్ కాలేదు . 

ఆటోలో వెళ్ళుతున్నంత  సేపు మనవరాలిని విడిచి పెట్టి పోతున్నాననే అనే ఆలోచనే పదే పదే మనసులో .  స్టేషన్ రావడం , దిగడం , సామాన్లు దించుకొని , ఆటో వాడికి డబ్బులు ఇచ్చేసి  చెరొక బాగ్ తీసుకొని స్టేషన్ లోకి వెళ్లి బ్రిడ్జి ఎక్కి , 10 నంబర్ ప్లాట్ ఫారం కి చేరుకొని అప్పుడే అక్కడ నిలిచి వున్న ట్రైన్ లో తమ బోగీ వెతుక్కొని , తమ సీట్లు చూసుకొని , సామాన్లు సీట్ కిందపెట్టి తమ సీట్లలో కూచొని అబ్బా , టైంకి చేరాము , ఇంకా ఒక అర గంట టైం వుంది బయలు దేరడానికి అనుకొంటూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు భార్య భర్తలు.  ట్రైన్ కాసేపటికి బయలు దేరింది . వేగం పుంజు కొంది. వీళ్ళు కూర్చునా సీట్ లో మూడో సీట్లో ఒక పాతికేళ్ల అమ్మాయి వచ్చి కూచుంది . ఎక్కడికి అమ్మాయి వెళ్తున్నావు , అని పార్వతమ్మ పలకరించింది. అంటీ , నేను కడప వరకు వెళ్తున్నాను . మీరు ఎక్కడికి అని చాలా చక్కగా మాటలాడింది . సుబ్బరా రావు ఎదో మాగజిన్ చదవడంలో నిమగ్నం అయ్యాడు. పార్వతమ్మ ఆ అమ్మాయితో ఏవో మాటలు పెట్టుకొంది. జనము బాగానే ఎక్కేసారు ట్రైన్ బోగీలో  . చాలా మంది నిలబడి వున్నారు . ఎందుకో ఆ రోజు ట్రైన్ బాగా రద్దీ గా వుంది . సడెన్ గా పార్వతమ్మ నిలుచున్న వాళ్ళని గమనించ సాగింది. అందరు ఆమె దృష్టి ని ఆకర్షించ లేదు . ఒక ఆమె మాత్రం ఒక నాలుగేల్ల  పాపను ఎత్తుకొని నిలబడి వుంది. కొంచెం పేద వాళ్ళ లాగ వున్నారు. మొహం జిడ్డు కారుతోంది  . జుట్టు చింపిరి గా వుంది. ముక్కు కారుతోంది . కానీ మొహం చాలా అందంగా వుంది . పాప అమాయకంగా , ముచ్చటగా వుంది . కాలికి చెప్పులు కుడా లేవు.  వాళ్ళ అమ్మ ఇచ్చిన బిస్కట్  తింటూ వుండింది. పార్వతమ్మ మనసులో తన మనవరాలు గుర్తుకి వచ్చింది . ఈ పాప ముద్దు గా వుంది అని ఎక్కడో ఫీలింగ్ వచ్చింది . కానీ మనసు మాత్రం , అలా ఎవరంటే వారితో , బొత్తిగా తెలియని వాళ్లతో అదీ , కొంచం పేద వాళ్ళగా కనిపించే వాళ్లతో కొంచం దూరం పాటించాలి అని చెబుతోంది. చనువు తీసుకొంటే రక రకాల సమస్యలు వస్తాయి అని మనసు చెబుతోంది. అంతరాత్మ కి మనసుకి మరలా సంఘర్షణ . చివరకి ఈ సారి కుడా మనసే గెలిచింది . ఆ పాప నించి దృష్టి మరలించి , తన మనవరాలు ఏమి చేస్తోందో , సరిగా తింటోందో లేదో , మరలా ఎప్పుడు తాను ఇంటికి వెళ్లి మనవరాలిని దగ్గరకు తీసుకోవచ్చు అని ఆలోచిస్తూ  వుండింది. 

ఇంతలో వాళ్ళ సీట్లో వున్న అమ్మాయి ఏ మాత్రం సంకోచం లేకుండా ఆ తల్లి చంకలో వున్న పాపను తన చేతితో తీసుకొని ఒళ్ళో కూచోబెట్టుకొని , తన దగ్గర వున్న రుమాలుతో ముక్కు ,మొహం తుడిచి , పాప నీ పేరు ఏమిటి అని అడుగుతూ , తన బాగ్ లోంచి లంచ్ డబ్బా తీసి దాంట్లో వున్న పులిహోర అన్నం స్పూన్తో తినిపిస్తూ , గోముగా చిన్న చిన్న ముద్దలు తినిపిస్తూ , బుగ్గ మీద ముద్దులు పెడుతూ తన్మయత్నం చెందుతూ , సొంత బిడ్డకి తినిపిస్తూ ముద్దు చేస్తున్న అనుభూతి పొందుతోంది. ఆ పిల్ల తల్లి ఏమి అభ్యంతరం పెట్ట లేదు.  మహదానందంగా అంతరాత్మలో అనిభవిస్తున్నట్లు అనిపించింది పార్వతమ్మకు. ఈ అమ్మాయి , తనకంటే చిన్నది , పెద్దగా ఆధ్యాత్మిక విషయాలు కుడా తెలిసే అవకాశం లేదు. ఇంత సులభంగా ఆ అన్నమయ్య పాట లోని శ్రీ హరీ అందరి అంతరాత్మ అనే భావం అనుభవం ఎలా పొందగలిగింది .తన మనసు ఎందుకు , ఆ చిన్న పిల్ల పరాయి పిల్ల  అని, పేద వాళ్ళు అని , శుభ్రం గా లేదు అని , కొత్త వాళ్లకి చనువు ఇస్తే , నెత్తికి ఎక్కుతారని చేబుతోంది . ఆ అమ్మాయి మనసులో , అదే పిల్లని చూసి నప్పుడు , పూర్తిగా వేరు  ఆలోచన , అనుభవం కలిగాయి .ఎందు వల్ల అని ఆలోచనలు మొత్తం ఆ అమ్మాయి మీదకి వెళ్లాయి. ఎక్కడో తాను కుడా ఆ అమ్మాయి లాగ చేయచ్చు కదా అనుకొంది మనసులో. దైర్యం చేసి చేతులు చాచి ఆ పాపను తన మనవరాలి లాగ ఒళ్ళో కి తీసుకొని , ముద్దాడాలని , మురిపం చెయ్యాలని అనిపించింది . దాదాపు చెయ్యి చాచ బొయ్యింది , నోరు కుడా సిద్ధం అయి , పాపని ఒక సారి నాకు ఇస్తావా అని అడగబోయింది. సడన్ గా మనసు మరలా బల పడింది . ఏవేవో భయాలు , అనుమానాలు ప్రవేశించాయి. కానీ అంతరాత్మ బలం మనసు బలం ముందు బలహీన పడినా పూర్తిగా లొంగ లేదు. చేయి చాపి ఆ పాప చేతులు పట్టుకొని తన చేతితో నొక్కుతూ చాలా కొద్ది సేపు అయినా ఎదో తెలియని అనుభూతి . తన మనవరాలుని మురిపం , ముద్దు చేసిన అనుభవం కలిగింది. కానీ ఆ అనుభూతి నిల్వ లేదు . మనసు నెగ్గింది. అంటీ , పాప ముద్దుగా వుంది కదా , కావాలంటే మీరు కుడా కాసేపు ఒళ్ళో కావాలంటే కూచో పెట్టుకోండి అని ఆ  అమ్మాయి అనింది. పైకి అవును , పాప ముద్దుగా వుంది , నా మనవరాలి లాగ .. అనింది . కానీ ఆ మాటలు నోటి నించి వచ్చినట్లు ఉన్నాయి .  అనుభవంతో కాదు. కానీ చాలా సేపు ఆ మనసు  , అంతరాత్మ సంఘర్షణ జరుగుతూనే వుంది . ఇంతలో , భోజనం చేసే టైం అయ్యింది . డబ్బా ఓపెన్ చేసి రెండు ప్లేట్ల లో తనకి, భర్తకి కి పెట్టి ఇచ్చి ఒక ప్లేట్ ఆ పక్క అమ్మాయికి కుడా ఇచ్చింది. ఆ అమ్మాయి , ఆంటీ , నా దగ్గర కూడా తినడానికి చాలా వున్నాయి , థాంక్స్ అని చెప్పి పాపకి పెట్టడం అయిపోయాక , పాపని పక్కన కూచో బెట్టుకొని , తను తినడం మొదలు పెట్టింది .కొంచం పక్కకు జరిగి ఆ పాప అమ్మను కుడా పక్కన కూచోమని , అక్కా నీవు కుడా తిను అని ఒక ప్లేట్ లో వేసి ఇచ్చింది.  పాప వరకు పరవాలేదు . పార్వతమ్మకి ఆ పాప వాళ్ళ అమ్మ పక్క కూర్చోవడం ససేమిర నచ్చ లేదు. కానీ బలవంతంగా బయటకు అనకుండా అయిష్టంగానే కూచింది . కాసేపటికి ఆ పిల్ల , తల్లి , వాళ్ళ ఊరు వచ్చిందని , దిగి పోయారు. దిగే ముందు పక్కన అమ్మాయి  , అక్కా పాపకి గౌన్ కొను అని కొంత మొత్తం చేతిలో పెట్టింది. ఆ పాప తల్లి కళ్ళలో చూడాలి ఆనందము . పార్వతమ్మకి ఆ అమ్మాయి చేసింది అంతుబట్ట  లేదు. తిరుపతి చేరే వరకు ఆ ఆలోచనలు , సంఘర్షణ తప్ప లేదు.

**** 

ట్రైన్ దిగి , తిరుపతి స్టేషన్ బయటకు వచ్చి , తాము ముందు గానే ఏర్పాటు చేసుకొన్నా టాక్సీ డ్రైవర్ ని కాంటాక్ట్ చేసి వాడు రాగానే సామాన్లు పెట్టుకొని తిరుమల కొండ మీదకి చేరుకొన్నారు. ఇప్పుడు మనసు నిండా , ఒక భక్తి భావం , ప్రశాంతత , తన ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకో పోతున్నాను అనే  ఆలోచన తో నిండి పోయింది . రూమ్   తీసుకొని  చెక్ ఇన్ అయ్యి ఆ రాత్రి కి భోజనం చేసి విశ్రాంతి తీసుకొన్నారు దంపతులు. పొద్దునే దర్శనం. పొద్దునే లేవాలి అని పెందరాలే పడుకొన్నారు .బాగా నిద్ర పట్టేసింది. 

**** 

అలారం మోగగానే ఇద్దరు లేచి , స్నానాలు చేసి , బట్టలు మార్చు కొని , ప్రశాంతం అయిన మనసు తో దర్శనానికి బయలు దేరారు. అప్పటికే కొండ అంతా సుప్రభాతంతో మారు మోగుతోంది. తిరుమల మీద   ఏ శక్తీ వుందో కానీ దానంతట అదే మనసలులో ఆలోచనలు తగ్గి ఒక ప్రశాంతత ,  దైవ శక్తీ కి పూర్తిగా లొంగి పోయాం అనే భావన, ఆలోచనలు అన్నీ ఆ స్వామి మీదే ఉండడం , ఇతరత్రా ఆలోచనలు రాక పోవడం ... పార్వతమ్మ కి ప్రతి ట్రిపుల్ లో అనుభవం. ఈ సారి మరీ  గాఢంగా అనుభవం లోకి వచ్చింది .

గుడి దగ్గరకి కార్ లో వెళ్లారు .  క్యూలో చేరి , అందరితో పాటు గోవిందా గోవిందా అంటూ  స్మరణ చేస్తూ తనకు తెలీకుండానే , ముందుకు సాగిపోతోంది పార్వతమ్మ . స్వామి దర్శనం దగ్గర పడిన కొద్దీ చాలా ఆనందం గా . ఎవరో ఆప్తుణ్ణి కలవడానికి వెళ్తున్నట్లు ,  తనకు మనసులో వున్న అనుమానాలు అడగాలని , సమాధానం దొరుకుతుందాని , తన   జీవితం ,కుటుంబ సభ్యుల జీవితం ఆనందంగా గడవాలని కోరుకోవాలని ,మనసులో ఆలోచనలు.  అంతరాత్మ లో ప్రశాంత భావం . అను కొంటూ వుండగానే కొద్దీ దూరం లోనే తన ఇష్ట దైవం రూపం కనిపించం . గోవిందా గోవిందా , నోట్లో స్మరణ , మనసులో , శూన్యం , ఎక్కడో , పరమానందం .. అదీ పార్వతమ్మ స్థితి . వాలంటీర్లు నడవండి నడవండి అని చెబుతున్నారు. తెలీకుండానే దంపతులు బయటకు వచ్చేసారు.  దర్శనం అయినప్పుడు మనసులో ఏమి కోరుకుందో , ఏమి ఆలోచనలు వచ్చాయో కూడా ఆమెకు తెలియదు. కానీ వర్ణనాతీతం అయినా ఆనందం అనుభవం లోకి మాత్రం వచ్చింది. కాసేపు కూచొని , ప్రసాదం తీసుకొని బయటకు వచ్చి , లడ్డు కౌంటర్లు దగ్గర ప్రసాదాలు తీసుకొని నడుచుకొంటూ , షాప్ లు దగ్గరకు వచ్చారు. కోడలుకు కొడుకుకి ,తెలిసిన వాళ్ళ కోసరం చిన్న చిన్న బహుమతులు కొనింది. మనవరాలికి ఒక బొమ్మ కొనింది. అది కొనే సమయంలో , పని మనిషి కూతరు , దాని ముద్దు మొహం గుర్తుకు వచ్చింది. తాను వేడి వేడి టిఫిన్ పెడితేనే ఎంత ఆనంద పడింది . మరి తను ఒక బొమ్మ కొని ఇస్తే ఎలా ఉటుంది అని ఆలోచన మెరిసింది.  ఎందుకో , మొట్ట మొదటి సారి , తాను ఏదైనా ఆహారం ఇచ్చినప్పుడు , తన మనవరాలి కంటే ఆ పాప మోహంలో ఎక్కువ ఆనందం చూసినట్లు  ఇప్పుడు అనిపిస్తోంది . 

హోటల్లో భోజనం చేసి , కార్లో తిరుపతికి తిరుగు ప్రయాణం చేయడం, స్టేషన్ లో బోగీ లో కూచోవడం , అసంకల్పితంగా జరిగి పొయ్యాయి. 

****

ట్రైన్ లో ప్రయాణం చేస్తున ఆమె మనసులో , అందరికి శ్రీహరే అంతరాత్మ అనే దాని మీదే ఆలోచన లోతుగా జరుగుతూనే వుంది. తాను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాలూ , వినిన ప్రవచనాలు , ఇదే వియయాన్ని , ఎలా చెప్పాయి , తానూ , వినడం జరిగింది కానీ , లోతుగా ఆలోచించింది లేదు. అందు వల్లే దాన్ని ఏదో సాకుతో పక్కకి నెట్టేసి , సమర్ధించుకొని , తాను , తన వాళ్ళు ,పరాయి వాళ్ళు అనే భావన తోనే జీవితం సాగిస్తూ వచ్చింది.  నిన్న ట్రైన్ లో ఆ పాపను సంకోచం లేకుండా దగ్గరికి తీసి ముద్దు చేసిన ఆ అమ్మాయిని చూసినప్పటి నించి , తనకు ఎందుకు సాధ్య పడలేదు  ఆ అనుభవం అనేది కలత పెడుతూ వుండింది. ఆలోచించగా ఆలోచించగా , నిజమే కదా మనము అనుకొంటున్న శరీరం , మనసు మనము కాదు. వీటిని ప్రకాశం చేసే అంతరాత్మ ఒకటి మన నిజ స్వరూపం , కానీ మనము అజ్ఞానం తో , అంతరాత్మ నేనే అనే భావం మరిచి పోయి , తన మన అనే బేధం తీసుకొచ్చాము . ఇలా ఆలోచనల పొరలు పొరలుగా వస్తూనే వున్నాయి. తన మనసు  ఆ భేధం  సమర్దించు కొంటూ వచ్చింది.  ఈ సారి మాత్రం అలా అనిపించినప్పుడు , సమర్దించు కొనే ప్రయత్నం మనసు చేస్తుంటే , అంతరాత్మ మృదువు గానే , మనసా , కాస్త నీ వాగుడు ఆపుతావా అని ప్రశ్నించి  చెప్పేది మనసు వినేలా చేసుకోగలిగింది. చాలా సంవత్సారాల తర్వాత తాత్కాలికంగా అయినా , అంతరాత్మ మనసు మీద గెలిచింది.  మనసు చాలా ప్రశాంతంగా వుంది. అందువల్ల లోపల అమితానందంగా వుంది . అలాంటి ఆనందం ఇక ముందు తాను పొందలేదు. ఎదురు సీట్లలో వాళ్ళని , పక్క సీట్లలో వాళ్ళని ఏ బేషజాలు లేకుండా పలకరించింది , వాళ్లతో ఆహరం పంచుకొంది , వాళ్ళు పెట్టినవి , సంకోచం లేకుండా తీసుకోగలిగింది ... సుబ్బారావు అంత గమనిస్తూనే వున్నాడు. ఆమెని వివరాలు అడిగి ఆమె అనుభవానికి భంగం కుడా ఆయన తల పెట్ట లేదు. 

**** 

సికింద్రాబాద్ లో ట్రైన్ దిగి ఇంటికి వెళ్లారు . మొహం కడుక్కొని , కోడలు ఇచ్చిన కాఫీ తాగి , స్నానము చేసి వచ్చి , తన పూజ కార్యక్రం అయినా తర్వాత , మనవరాలిని ముద్దు చేస్తూ తాను తెచ్చిన ఆట బొమ్మ ఇచ్చింది . థ్యాంక్ యు నానమ్మ అంటూ ఆ బొమ్మ తో ఆడుకోవడం మొదలు పెట్టింది. ఇంతలో పని మనిషి సీత బయట చిమ్మడం  ధ్వనులు విన బడుతున్నాయి.  సీత కొడుక తలుపు తీసుకొని లోపలి తొంగి చూసాడు  తన మనవరాలు బొమ్మ తో ఆడుకోవడం. లోపల ఏమి జరుగుతోందో ఆమెకి తెలియదు. గబుక్కున తలుపు దగ్గరికి వెళ్లి ఆ పిల్లవాడి  చేతిలో తను కొన్న బొమ్మ ఇచ్చి ఆడుకోారా అని ఇచ్చింది. , ఆ పిల్లవాడి మొహం లో ఆనందం చూసి తాను ఎదో గొప్ప పని చేశాను అనే భావన కాకుండా, తాను బొమ్మ ఇస్తే మనవరాలు ఆడుకొంటే చూసి తనలో కలిగే ఆనందమే ఇప్పుడు ఆ పిల్లవాడు ఆడు కొంటుంటే తనకు అనుభవం అయ్యింది. ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని , హత్తుకొని , బుగ్గ మీద ముద్దులు కురిపిస్తూ , తన్మయత్వం చెందింది .చింపిరి జుట్టు , జిడ్డు మొహం అనుభవంలో రాలేదు. అన్నమయ్య భావం అనుభవం అయింది. సుబ్బారావు మూసి మూసి నవ్వులు నవ్వుకొన్నాడు. 

****


No comments:

Post a Comment

Pages