మానసవీణ -18 - అచ్చంగా తెలుగు

 మానసవీణ -18

- టేకుమళ్ళ వెంకటప్పయ్య


రాజేష్ మిత్రబృందం సాయంత్రం కాలేజీ వదిలాక దగ్గరలో ఉన్న పార్కులో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.

"ఇప్పటిదాకా మనకు భగవంతుడి దయ వలన సిగరెట్లకు, తాగుడుకు, తిండికి దివ్యంగా జరిగిపోయింది. వాడి జీవితంలో మానస రాక వల్ల రాజేష్ యిలా మారిన మనిషి అవడంతో మనకు తిప్పలొచ్చాయి" రాజేష్ ముఖ్య అనుచరుడు సురేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.

"రాజేష్ దాని అందం చూసి వలలో పడ్డట్టున్నాడు"  అన్నాడు  ఒకడు

"దానికి ఆ అందమే లేకుండా చేస్తే సరి"  అన్నాడు ఇంకొకడు.

"నిజం - మనం ఆ మానస రాక్షసి పీడ వదిలించేస్తే మళ్ళీ మన రాజేష్ మామూలుగా మారి మనలో కలిసిపోతాడు" అన్నాడు నరేష్.

"ఫ్రెండ్స్ - మనం రేపు అమలు చేయబోతున్న “ఆపరేషన్-మానస”  కార్యక్రమం ఎట్టిపరిస్తితులలో రాజేష్ కు తెలియడానికి వీల్లేదు" అన్నాడు కృష్ణారావు.

"మాకు ఇదే పనిరా వెళ్ళి వాడి చెవిలో ఊదడమే! బోడి సందేహాలు నువ్వూ! సర్లే! వెధవసోది ఆపి  మన ప్లాన్ ఎక్కడ ఎలా అమలు చెయ్యాలి అన్నదఘోరించండి" ఇంకొకడు అసహనంగా అన్నాడు

"మానస ఒక పిచ్చావిడను చూడ్డానికి రేపు ఆదివారం సాయంత్రం ఊరి చివర ఉన్న పాడుబడిన గుడికి వస్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ తప్ప ఎవరూ ఉండరు. నేను గొడవల గోవిందుగాడు అక్కడకు బైక్ మీద వెళ్తాం.  ప్రక్కనే ఉన్న తుప్పల్లో దాక్కుని, ముఖానికి మాస్కులు వేసుకుని సమయం చూసి మానస మొహంపై ఆసిడ్ పోసి బైక్ మీద ఉడాయిస్తాం. ఎవరో తెలుసుకునే లోపు పరారవుతాం" అన్నాడు సురేష్.

అందరూ ఆ ఐడియా బాగుందని మెచ్చుకున్నారు. అందరూ త్వరలో రాబోతున్న సంతోష సమయాన్ని తలుచుకుంటూ మందుకొట్టి ఎంజాయ్ చేశారు.

* * *

మనసు ఉడికిపోతోంది. అనిరుధ్ ని ఎలా దెబ్బకొట్టాలి. తీవ్రమైన ఆలోచనలతో తలమునకలవుతున్నాడు రాజేష్. ఎలా చెయ్యాలో ఆలోచన ఒక కొలిక్కి రావడంలేదు. మళ్ళీ మెల్లి మెల్లిగా మునుపటి రాజేష్ మేలుకుంటున్నాడు. చాలా రోజుల తర్వాత బీరువాలో ఉన్న మందు బాటిల్ ఓపన్ చేశాడు. సిగరెట్ తాగుతూ ఆలోచిస్తే అర్ధరాత్రి ఒంటిగంటకు ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది.  ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. అంతే!  మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.

* * *

ఏదో పుస్తకం చదువుతున్న మానసకు ఉన్నట్టుండి అనిరుధ్ గుర్తుకు వచ్చాడు. నిన్న ఏదో కవర్ తెచ్చాడు. వెళ్ళిపోవాలన్న కంగారులో అడగనే లేదు. అనుకుంటూ రింగ్ చేసింది.

"అనిరుధ్! ఎక్కడ?"

"ఇంట్లోనే ఎందుకు?" తను మానసకు దూరమైపోయానన్న భావన మనసులో మెదిలింది.

"ఒక్కసారి మాట్లాడాలి నీతో. ఈ రోజు నేను శ్రావణిగారిని చూడడానికి ఆ పాడుబడ్డ గుడికి వెళ్తున్నాను. అందరూ బిజీ.  కారు లేదు. నువ్వు బైక్ మీద డ్రాప్ చెయ్యాలి"

"సరే! బయలుదేరే గంటముందు ఫోన్ చెయ్యి"

"ఒక్క నిముషం అనిరుధ్! నిన్న ఎందుకొచ్చావో చెప్పలేదు అక్కడికి. ఏమైనా ముఖ్యమైన విశేషమా? నేను హడావుడిలో మర్చిపోయాను"

ఒక్క నిముషం నిశ్శబ్దం. రిప్లై రాకపోయే సరికి "హలో… హలో…" అంది

"హా.. రేపు చెబుతాను" నిర్లిప్తతో జవాబిచ్చాడు.

"సరే! బై"  అంది మానస విషయం ఏమిటో అనుకుంటూ...

* * *

శ్రావణి గుడి బయట ఉన్న ఒక అరుగుపై మానస కోసం పిచ్చి చూపులు చూస్తూ ఎదురు చూస్తోంది. వారి మధ్య పానకంలో పుడకలా ఎందుకని శ్రావణిని తీసుకొచ్చిన సరిత గుడిలోకి వెళ్ళి మండపంలో కూర్చొంది. మానస, అనిరుధ్ బైక్లో దిగారు. మానస శ్రావణి కూర్చున్న అరుగు సమీపిస్తూ.. కొంచెం దూరంలో ఉన్న బైక్ను చూసి ఎవరిదై ఉంటుందని ఆలోచిస్తుండగా, అనిరుధ్ "నేను పావుగంట తర్వాత వస్తాను మానసా!" అనేసి కొంచెం దూరంగా ఉన్న టీకొట్టు దగ్గర నిలబడ్డాడు. తన విషయం మానసకు ఎలా చెప్పాలో ఆలోచించుకుంటున్నాడు. టెన్షన్ మొదలైంది. కవర్ ఇచ్చి ఏమి చెప్పాలా అని అనుకుంటున్నాడు.

"వీడెవడ్రా బాబూ! మానసతో పాటు వచ్చాడు" అని తుప్పల్లో  దాక్కున్న సురేష్ అన్నాడు.

"వాడు దూరంగా వెళ్ళాడులే! నువ్వు ఫీల్ అవకు" గోవిందు ధైర్యం చెప్పాడు.

"ఇదేదో పెద్ద పతివ్రతని! దీన్ని నమ్ముకుని రాజేష్ ఉంటే ఇదేమో ఎవడెవడితోనో తిరుగుతోంది"

"మనకెందుకురా! మన పని కానిచ్చుకుని మనం వెళ్దాం."

మానస మొహం వీరు దాక్కున్న తుప్పల వైపుకు ఉన్న సమయంచూసి. కార్యక్రమం అమలు చెయ్యాలని సంసిద్ధులయ్యారు.

"రెడీ సురేష్...బీ అలర్ట్. మనం మాస్కులు వేసుకుని రెడీ అవాలి" గోవింద్ అన్నాడు. యిద్దరూ రెడీ అయ్యారు. తుప్పల్లో ప్రక్కనే ఏదో సన్నగా ఎవరో పంపుతో గాలి కొట్టినట్టు సవ్వడి వినిపిస్తోంది అప్పుడప్పుడూ.

"బాటిల్ ఓపన్ చెయ్యి. జాగ్రత్త చిందకుండ పట్టుకో" గోవింద్ అన్నాడు. ఆకులు గలగల చప్పుడు. నేలపై ఎండు కొమ్మలు విరుగుతున్నాయి.

"దూకుదామా ముందుకు" అంటూనే అంతలోనే పెద్దగా “అమ్మా!” అని కేకవేసి క్రింద పడిపోయాడు సురేష్. ఒక్క క్షణం ఏమి జరిగిందో అర్ధం కాలేదు గోవిందుకు.  క్రిందకు చూశాడు. అంతే!  వెన్నెముకలో ఛలి మొదలైంది. ఒక నల్ల త్రాచు సురేష్ను కాటేసి గోవిందు వైపు వస్తోంది శరవేగంగా. దానికి తోడు ఆసిడ్  బాటిల్ మొత్తం మీద చింది కేకలు పెడుతున్నాడు.  నేలపై దొర్లుతున్నాడు. బాధకు అరుస్తూ… గోవిందు పెద్దగా కేకలేశాడు. "కాపాడండి".. అంటూ... ఈ కేకలకు మానస ఉలికిపడి చూసింది. నేలమీద ఎవరో మాస్కు వేసుకుని పడిఉన్నాడు. నొట్లోంచి తెల్లని నురుగులు వస్తున్నాయి. ఓళ్ళంతా బొబ్బలు. గోవిందుదిక్కు తోచక మానస ఉన్నవేపుకు పరుగులు పెట్టడంతో మాస్క్ ఊడిపోయింది అరుగుముందుకు వచ్చి వణికిపోతూ నిలబడ్డాడు.

"గోవిందూ!   అతనెవరు?  మీరిక్కడేం చేస్తున్నారు… ఏమైంది? "  అడిగింది ఆదుర్దాగా మానస.

ఇంతలో అనిరుధ్ వచ్చి అక్కడి పరిస్థితి అర్ధంచేసుకుని, మానస చెప్పినవిధంగా సురేష్ను బైక్ మీద ఎక్కించుకుని హాస్పిటల్కు వెళ్ళాడు. గోవిందు బిక్క ముఖం వేసుకుని నిలబడిపోయాడు. ఐదు నిముషాల అనంతరం మానసకు విషయం అర్ధమయింది. గోవిందుకూ మానస ఎంత మనసున్న మనిషో అర్ధమయింది. సురేష్ను దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చి ప్రాణాలకు భయంలేదని ఇంకో ఐదునిముషాలు ఆలస్యం అయితే సురేష్ ప్రాణాలు దక్కేవి కాదని, కాకపోతే ఆసిడ్ గాయాలు మానడానికి ఎక్కువ రోజులు పట్టొచ్చని డాక్టరు అన్నాడని ఫోన్ చేసి చెప్పాడు అనిరుధ్. మానసను మనస్ఫూర్తిగా క్షమించమని కోరాడు గోవిందు.  మళ్ళీ మానసకు తన మనసు తెలియజేసే బంగారం లాంటి ఛాన్సు మిస్సయినందుకు బాధపడ్డా.. ఒక నిండు ప్రాణాన్ని కాపాడ గలిగానని సంతోషపడ్డాడు అనిరుధ్ .

* * *

కాలేజీ అప్పుడే వదిలిపెట్టారు. మానస నింపాదిగా నడుచుకుంటూ ఆరోజు చెయ్యాల్సిన పనుల గురించి ఆలోచించుకుంటూ వస్తోంది. బయట దూరంగా అనిరుధ్ నిలబడి ఉన్నాడు చేతిలో కవరుతో. హలో! అని చేయి ఊపింది. అనిరుధ్ కూడా విష్ చేశాడు. ఇంతలో   సడన్గా ఒక ఆటో వచ్చి అనిరుధ్ ముందు ఆగింది. దానిలో నుండి ఒక 30 సంవత్సరాల స్త్రీ దిగి అనిరుధ్ కాళ్ళ మీద పడి ఏడుస్తోంది. అనిరుధ్ తెల్లబోయాడు.

"ఎవరమ్మా నీవు! ఏమైంది" అని ఆమెను లేవదీశాడు.

ఆవిడ పెద్దగా  ఏడుస్తూ తల కొట్టుకుంటూ " ఎవరో తెలీనట్టు నాటకం ఆడొద్దు. నాకన్యాయం చేస్తారా! నా కడుపులో ఉన్న బిడ్డకు ఏమి సమాధానం చెప్తారు?" అని ఏదేదో మాట్లాడుతోంది. అనిరుధ్ చేతిలో కవరు మళ్ళీ నలిగిపోతోంది. ఆమె ఎవరో తెలీదు. ఆమెకు తను అన్యాయం చేయడం ఏమిటో అర్ధం కాలేదు. ఇంతలో మానస, రాజేష్, కాలేజీ విద్యార్ధులు అందరూ అక్కడ పోగయ్యారు. రాజేష్ పెద్దగా "ఈ అనిరుధ్ అనే అబ్బాయి ఆ అమ్మాయిని నమ్మించి లోబరుచుకున్నాడు. కడుపుచేసి డబ్బులిచ్చి వదిలించుకోవాలని చూస్తున్నాడు" అని అన్నాడు. అనిరుధ్ ఒక్క క్షణం ఏమి జరిగిందో, ఏమి జరుగుతోందో అర్ధం కాక నిరుత్తరుడయ్యాడు. రాజేష్ కలుగజేసుకుంటూ "ఇలాంటి వాళ్ళను పోలీసులకు అప్పజెప్పాలి" అన్నాడు. అనిరుధ్కు తన కాళ్ళు భూమిలో దిగబడ్డట్టయింది.   స్పృహ తప్పింది. కవరు నేల మీద పడిపోయింది. జనం పోగవుతున్నారు.  (సశేషం)

No comments:

Post a Comment

Pages