నెత్తుటి పువ్వు - 29 - అచ్చంగా తెలుగు

నెత్తుటి పువ్వు - 29

మహీధర శేషారత్నం  


(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. ఒకరోజు లక్ష్మి రాజును సరోజ గురించి నిలదీస్తుంది. ఆమెను ఏమార్చి, సరోజ ఇంటికి వెళ్తుంటాడు రాజు.  కడుపుతో  ఉంటుంది సరోజ ) 

“లేదక్కా! అంతా తెలంగాణాలో ఉంటారు. నా పెనిమిటి మొన్ననే దుబాయ్ వెళ్ళాడు. ఐదారు నెలలలో వస్తాడు. అందుకే ఈడనే ఉండా!” అంది.

“సరే! సరే! ఈ మాత్రలు వేసుకో. వికారం, వాంతులు తగ్గుతాయి. ఒక్క బొప్పాయి, అనాసతప్ప అన్నీ తినచ్చు. చద్దివి తనకు, ఎగ్ తింటావా?” అడిగింది.

తింటానన్నట్టు తలూపింది సరోజ.

“సరే! అయితే రోజుకో బాయిల్డ్ ఎగ్, పొద్దున్నా సాయంత్రం గ్లాసు పాలు తాగు. ఇదుగో బలం మాత్రలు” అంటూ ఐరన్ మాత్ర లిచ్చింది.

మోషన్ నల్లగా కాని, ఆకుపచ్చగా కాని అవుతుంది భయపడి మానెయ్యబాక. నెల తరువాత రా! అంది 

సరోజ మెల్లిగా నడుచుకుంటూ ఇంటి దారి పట్టింది. మధ్యలో ఆంధ్రా బ్యాంకు కనపడింది. 

బ్యాంకుల్లో లోన్ లు ఇస్తారని అంది. తనకి ఏదైనా అప్పు ఇస్తారేమోనని లోపలికి వెళ్ళింది. 

మేడమ్! నాకు లోను కావాలి అంది ఒక కౌంటర్ దగ్గర. 

“ఎవరు నువ్వు ఏ గ్రూపు? ఏ ఊరు?” అందావిడ. 

నేనిక్కడే ఉంటా, ఈ ఊరేనండి. అంది మెల్లిగా 

“ఏగ్రూపు? నీ పాస్ బుక్ ఏది?” 

“పాస్ బుక్ ఏంటండి? నా దగ్గరలేదు.” 

ఆ అమ్మాయిని చూస్తే ఏం తెలిసిన దానిలా లేదు. కాస్త రష్ తక్కువగా ఉండటంతో వివరాలు రాబట్టింది.ఇదివరకు తీసుకున్నానా? డ్వాక్రాగ్రూపా! ఏ గ్రూపో చెప్పి పాస్ బుక్ చూపిస్తే లోను ఇస్తాను. అదీ నీ ఒక్క దానికే కాదు. మీ గ్రూపు వాళ్ళందరికి తెలుసుకుని తరవాతరా! చెప్పి పంపేసిందావిడ సరోజకి ఏమీ అర్ధం కాలేదు.

ఒక్కటి మాత్రమే అర్థం అయింది. తనకి అప్పు ఇవ్వరు. నాగరాజుకి ఈ విషయం అప్పుడే చెప్పకూడదు అనుకుంది.

కాని తాను ఎక్కువ కష్టపడకుండా సంపాదించుకోవాలి ఎలా? కాళ్ళీడ్చుకుంటూ గది చేరింది.

******

అప్పుడే నాగరాజు వచ్చి ఇరవై రోజులయింది. ఎందుకబ్బా! అనుకుంది. తలుచుకున్నట్టే వచ్చాడు.

“ఏమిటమ్మాయి గారూ ఎలా ఉన్నారు?” అన్నాడు హాస్యంగా. నాగరాజు ఆరోజు ఎప్పుడూ లేనంత హుషారుగా ఉన్నాడు.

ఇలా మూడ్ బాగున్నప్పుడే చెప్పెయ్యాలి అనుకుంది. అబ్బాయిగారు తండ్రి కాబోతున్నారు” అందితనూ హాస్యంగా..

“ఎప్పుడో అయ్యాను, అప్పుడే బుజ్జిగాడికి మూడేళ్ళు నిండాయి” అన్నాడు అతని ధోరణిలో అతను. 

సరోజ ఉత్సాహం చచ్చిపోయినట్లయింది. లేని నవ్వు తెచ్చుకుని సరే! అయితే నేనే తల్లి కాబోతున్నాను అంది.

నాగరాజు ఉలిక్కిపడ్డాడు. భయపడ్డాడు. కాని నిమిషంలో తనని తాను సంబాళించుకున్నాడు. గుడ్ న్యూస్ అంటూ సరోజని దగ్గరకు తీసుకున్నాడు. అయినా సరోజ విషయం పసిగట్టేసింది.

నిన్ను ఇబ్బంది పెట్టబోములే నేనూ, నా బిడ్డా. నాకు ఏదైనా పని చూపించు. అంది నెమ్మదిగా “అబ్బో! అమ్మాయి గారికి హోదా పెరిగేసరికి ధైర్యమెక్కువయిందే! అన్నాడు హాస్యంగా.

“సరే! ఆలోచిస్తాను, అనుకోకుండా చెప్పేసరికి కొంచెం కంగారు పడ్డాను కాని. నా బిడ్డకాదు, మన బిడ్డ అను నేను అంత దుర్మార్గుణి కానులే!” అన్నాడు తనే మళ్ళీ ఆసరోజ ఆమాటతో కొంచెం సంతృప్తిపడి అతని భుజంమీద తలవాల్చింది.

*****

ఆ సాయంత్రం స్నానం చేసి చిన్నగా రాములమ్మ దగ్గరకి వచ్చింది. రాములమ్మ తన పని హడావుడిలో ఉండి సరోజని గమనించలేదు. కొంచెం తీరిక చిక్కాక టీ ఇస్తూ “ఏంటిలా వచ్చావు?” అంది.

“నాకు డబ్బు కావాలి” అంది సరోజ. రాములమ్మకేం అర్ధం కాలేదు.

“రాజు బాబు నడిగి తీసుకో. షాపులో మానేసావంటగా, అలా బెదిరితే ఎక్కడా పనిచేయలేం” అంది అనునయంగా.

“అదికా దక్కా! నాకు బ్యాంకు లోను కావాలి. ఏదో డ్వాక్రా గ్రూపులుంటాయిగా. నీకు తెలుసా!” అంది “తెలుసు కాని మా గ్రూపులో ఖాళీల్లేవు. అది మున్సిపల్ ఆఫీసు ద్వారా జరగాలి. లీడర్లుంటారు... అయన్నీ నాకు సరిగా తెలీవు కాని మా లీడరమ్మ నడుగుతా.

“అయినా ఇంత హఠాత్తుగా అలా అడుగుతున్నా వేమిటి?” అంది అనుమానంగా. 

“అది కాదక్కా! రాజు బాబు మాత్రం ఎన్నాళ్ళు పెట్టగలడు. నా దారేదో నే చూసుకోవాలి గదా!” అంది. 

అది నిజమేలే! నేనూ కనుక్కుంటాలే అంది.

“సరోజ కాళ్ళీడ్చుకుంటూ గదికి చేరింది. కొద్దిగా భయమేసింది. తనను అందరూ వదిలేస్తారా!” అనుకుంది. కలత నిద్రలో ఏవేవో పీడకలలు.

లేచి మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకుంది. రాజు భయపడ్డట్టు కనిపించాడు. కాని సంతోషించినట్టు కనపడలే సరే నా జీవితంలో ఇది ఒక ముఖ్యమైన విషయం అనుకుంది. అనుకోకుండా పార్వతి గుర్తుకొచ్చింది. ఏం మాయదారి దేవుడో! అన్నీ ఉండి అమ్మ కావాలని తపించిపోతున్న వదినకి ఇవ్వలే. నాకు ఇచ్చాడు. అయినా సరే! నేను నాది అనుబంధం నిలబెట్టుకోవాలని. నాదైన జీవితం కావాలి గట్టిగా అనుకుంటూ కళ్ళు మూసుకు పడుక్కుంది.

*****

మూడో నెల నిండాక జి.జ. హెచ్.కి చెకప్ కి వెళ్ళింది. అనుకోకుండా పార్వతీ, శంకరం కనపడ్డారు. “ఏమిటిలా వచ్చావు?” అన్నారు ఇద్దరూ ఒకేసారి సరోజ భయపడింది.

“ఏం లేదు వదినా! కొద్దిగా నీరసంగా ఉంటే బలం బిళ్ళలు కోసమొచ్చాను”

“సరే! తీసుకో! ఇంతదాకా వచ్చావుగా, మా ఇంటికిరా! కాసేపు కూర్చొని పోదువుగాని” అంది. సరోజ సంకటంలో పడింది. సరే ఇవేళ కాకపోతే రేపైనా తెలియకపోతుందా! అనుకుంది.

పార్వతి టీ పెట్టుకొస్తానుండు అంటూ లోపలికి వెళ్ళింది.

“ఏంటమ్మా! ఎలా ఉన్నావు? ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా? అన్నాడు మామూలుగా ఇదే సమయమని సరోజ డ్వాక్రా గ్రూపుల సంగతి కదలేసింది.

“నాకు తెలిసి రేవతిలోని ఒక యానిమేటర్ ఒకావిడ ఉంది. రేపు నాకు నైట్ డ్యూటీ. పొద్దుట పది గంటల కొచ్చాయ్. నే తీసికెడతా” అన్నాడు.

అమ్మయ్య! అనుకుని టీ తాగి బయల్దేరింది. పార్వతికి కొద్దిగా అనుమానం వచ్చింది. అయినా ఏం తేలకుండా సరోజ లావయింది కదండీ కొద్దిగా అంది. “తిని కూర్చుంటే లావవక ఏమవుతారు” తేలికగా అన్నాడు శంకరం.

(సశేషం)

*****

 

No comments:

Post a Comment

Pages