'మొట్ట మొదటి క్రిస్మస్ ట్రీ' కథ.. - అచ్చంగా తెలుగు

'మొట్ట మొదటి క్రిస్మస్ ట్రీ' కథ..

Share This
'మొట్ట మొదటి క్రిస్మస్ ట్రీ' కథ..
-సుజాత.పి.వి.ఎల్, సైనిక్ పురి, సికిందరాబాద్.
హాయ్ కిడ్స్! 
హ్యాపీ క్రిస్మస్!!..మీరంతా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25' న క్రిస్మస్ పండుగ   జరుపుకుంటున్నారు కదా!. ఇంకా ఇంట్లో క్రిస్మస్ ట్రీ ని ఎంతో అందంగా కలర్ ఫుల్ లైట్లతో అలకంరించే ఉంటారు. కానీ, అసలు "మొట్ట మొదటి క్రిస్మస్ ట్రీ" కథ గురించి తెలుసా?..అయితే, చదవండి..

అది డిసెంబర్ మాసం. మంచు విపరీతంగా కురుస్తోంది. చలిగాలులు వీస్తున్నాయి.
 ఒక పేద కుటుంబంలో పదేళ్ళ అన్నయ్య వాలెంటైన్, ఆరేళ్ళ చెల్లెలు మేరీ తమ నాన్నతో కలిసి చిన్న పాకలో నివసిస్తున్నారు. ఆ పిల్లలకి చలికన్నా ఆకలి బాధ ఎక్కువగా ఉంది. చీకటి పడింది. నాన్న పని నుండి ఎప్పుడు వస్తాడో, తినడానికి ఏం తెస్తాడో అని ఎదురుచూస్తూ కూర్చున్నారు..తల్లి లేని ఆ పిల్లలిద్దరు. 
అంతలో నాన్న రానే వచ్చాడు. నాన్న చేతిలో ఓ రొట్టె.
హమ్మయ్య! ఈ రాత్రికి కాస్త తినడానికి తిండి దొరికింది..అనుకున్నారు పాపం ఆ పిల్లలిద్దరూ. ఎందుకంటే..వాళ్ళు తిండి తిని మూడు రోజులైంది. చలికాలంలో అక్కడి పేదవారి పరిస్థితి అంతే!
నాన్న లాంతరు వెలిగించి పళ్ళెంలో రొట్టె పెట్టి పిల్లల్ని పిలిచాడు.
పిల్లలిద్దరూ వచ్చి నిలుచున్నారు. 'ఓ..జీసెస్! నీ దయ వల్ల మాకు రొట్టె దొరికింది. మాలాగే ఈ లోకంలో ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కడుపు నింపు తండ్రీ!'..అంటూ ప్రార్థించాడు నాన్న.
"ఆమెన్" అన్నారు పిల్లలు. రొట్టెను తుంచుకొని తినబోతుండగా తలుపు చప్పుడైంది.
"దయచేసి తలుపు తీయండి..బయట చలికి గడ్డ కట్టుకు పోతున్నాను.అనే గొంతు వినిపించింది. వెంటనే పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీశారు. బయట ఓ ఆరున్నరేళ్ళ పిల్లాడు గజగజ వణికిపోతూ నిలుచుని ఉన్నాడు. "అయ్యయ్యో..త్వరగా లోపలికొచ్చేయ్..అని పిలిచి..మంచుతో తడిసిన దుస్తుల్ని మార్చుకొన మని పొడి దుస్తులు ఇచ్చి..లాంతరు దగ్గర కూర్చోబెట్టి..పళ్ళెంలో ఉన్నలో ఉన్న ఆ రొట్టె తినిపించి..వాళ్ళింట్లో ఉన్న ఒకే ఒక మంచం మీద  ఆ పిల్లాడిని పడుకోబెట్టి  రగ్గు కప్పి, వాళ్ళ ముగ్గురూ కటిక నేల మీద మునగదీసుకుని పడుకున్నారు. వారికి అప్పుడు ఆకలి బాధ లేదు. ఓ చిన్న పిల్లాడికి కడుపు నింపామన్న ఆనందం ఉంది. 
అర్థరాత్రి దాటింది.
ఎక్కడ్నుంచో చక్కటి పాట వినిపిస్తోంది. వాలెంటైన్, మేరీ కళ్ళు తెరిచి చూశారు. ఆశ్చర్యం! పాక పై కప్పులోంచి ఆకాశం కనిపిస్తోంది. నక్షత్రాలు మిలమిల మెరుస్తున్నాయి. రెక్కలున్న చిన్ని చిన్ని దేవ దూతలు తెల్లని వస్త్రాలతో గాల్లో ఎగురుతున్నారు. వాలెంటైన్, మేరీ కి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా కళ్ళప్పగించి చూస్తుండగానే.. అంతలో మంచంపై పడుకున్న ఆ బాలుడు లేచి కూర్చున్నాడు. రాత్రి తమ ఇంటికొచ్చినట్టుగా పేదవాడిగా లేడు. తలమీద ధగధగ మెరిసే బంగారు కిరీటం. ఒంటిపై విలువైన దుస్తులు!.
"నేను బాల జీసెస్ ని. నిన్న రాత్రి మీరు నా ఆకలి తీర్చారు.  పరలోకంలో ఉన్న తండ్రి మీకు సదా మేలు చేస్తాడు!'' అన్నాడు మృదువైన స్వరంతో. పాక బయటికి వచ్చి అక్కడున్న ఎండిన చెట్టు నుంచి ఒక కొమ్మను విరిచి మంచులో పాతాడు. తర్వాత బై బై.. చెబుతూ ఆకాశంలోకి దేవదూతలతో పాటు ఆనందంగా ఎగిరిపోయాడు. ఇదంతా కలా..నిజమా!..అనుకుని చూస్తుండగానే మంచులో నాటిన ఎండు కొమ్మ చిగురు వేసింది. కళ్ళ ముందే పచ్చని చెట్టుగా మారిపోయింది. ఆ చెట్టు నిండా బంగారు యాపిల్స్ కాచాయి. కొమ్మల నిండా విలువైన వివిధ రకాల వస్తువులు గుత్తులు గుత్తులుగా వేల్లాడాయి.
అదే 'మొట్ట మొదటి క్రిస్మస్ ట్రీ' !

****

No comments:

Post a Comment

Pages