విధి విలాసం - అచ్చంగా తెలుగు

విధి విలాసం

Share This
 విధి విలాసం
(డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా..)
 -బట్టేపాటి జైదాస్.

         యాదృచ్చికంగా క్యాలండర్ వైపు చూసింది 'జ్వలిత'.ఆ రోజు డిసెంబర్ ఒకటి.తన పుట్టిన రోజు.తను రిటైర్ కాబోతున్న రోజు... అంతేనా...? ఊహు.. .'వరల్డ్ ఎయిడ్స్ డే' కూడా... అలా అనుకోగానే మరపురాని 'చేదు జ్ఞాపకం' రాముడు గుర్తొచ్చాడామెకు.జ్వలిత మనసంతా అదోలా అయిపోయింది.గత పది హేనేళ్లుగా ఏటా ఇంతే.ముప్పయ్యేళ్ళ తన సర్వీసులో ఎన్నెన్ని అనుభవాలు. తన సర్వీసు లోనే కాదు,జీవితంలోనూ మరచి పోలేని విషాదపు రోజులు కూడా ఒకే రోజుతో ముడిపడి ఉండడం  యాదృచ్చికమా..! లేక విధి విలాసమా..?! .ఈ 'మాయదారి మహమ్మారి కరోనా' వచ్చాక జనజీవనమే పూర్తిగా తలక్రిందులైపోయింది. ఎంతో సాధించాననుకొనే మానవుడు ఓ చిన్న క్రిమిని తట్టుకోలేక ఇన్ని విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిరావడం చూస్తుంటే నిజమేననిపిస్తోందామెకు.తన రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా జరుపకోలేని దుర్భర పరిస్థితులొచ్చాయి.ఇప్పటితో పోల్చుకుంటే నాటి పరిస్థితులే ఎంతో నయమనిపిస్తున్నాయి. ఆమె ఆలోచనల్ని భగ్నంచేస్తున్నట్టుగా  రివ్వుమంటూ దూసుకొచ్చి ఆమె కాళ్ళదగ్గర పడిందో న్యూస్ పేపర్.బాయ్ విసిరిన స్పీడ్ కి అది విడివడి పోయి దాని ఫ్రంట్ పేజీలోని హెడ్డింగ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.'హాత్రాస్ లో 19ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్.' ఆమె హృదయం కలుక్కుమంది.అయినా తనేమి చేయగలదు..? కరోనా లాంటి ఉపద్రవాలెన్ని వచ్చినా ఈ రాక్షస జాతికి లెక్కవుండటం లేదు.'నిర్భయ' వచ్చాక కూడా నిర్భయముగా తమపని తాము చేసుకుపోతూనే వున్నారు.ఈ విద్యా వ్యవస్థలోను, దాని ద్వారా సామాజిక,రాజకీయ వ్యవస్థలోనూ మార్పులురానిదే ఇవేవీ ఆగేలా లేవు.ఆగవుకూడా. అప్పటిదాకా తనో 'దహించుకుపోయే జ్యాల'లా జీవితకాలమంతా జ్వలిస్తూనే వుండాలేమో...! ఆలోచిస్తూ అప్రయత్నంగానే గతంలోకి జారుకుందామె.
 *     *     *
'పదేళ్ల బాలికపై  మృగాళ్ల పైశాచికత్వం'  స్థూడెంట్స్ కాలేజీన్యూస్ బోర్డు మీద రాసివున్న 'హెడ్ లైన్స్' చూడగానే లెక్చరర్ జ్వలిత భృకుటి ముడిపడింది."ఈ మగాళ్లకు మృగాలతో పోలికా...హు.."అంటూ నిట్టూర్చింది.హ్యాండ్ రైటింగ్ ను బట్టి అది 'రాముడు' రాసిందని అర్ధమయిందామెకి. "ఎంత అర్థం లేని  మాట!? అయినా 'టీనేజర్స్' కేం తెలుసు? అది రాసిన న్యూస్ ఎడిటర్లే దానిగురించి ఆలోచించనపుడు."అనుకుంటూ  నేరుగా క్లాస్ రూమ్ వైపు నడచిందామె.ఈ విషయంలో విద్యార్థులకు కాస్తయినా అవగాహన కల్పించాలనుకుందామె. అందుకేబోర్డు మీదరాసిన న్యూస్ లో తనకు నచ్చనివాక్యాన్ని ,అందుకు గల కారణాలను వివరంగా చెప్పసాగిందామె.
"డియర్ స్టూడెంట్స్..! ఈ ప్రకృతిలో ప్రతి జీవికి ఓ ప్రత్యేకత ఉంది. ఓ కట్టుబాటూ ఉంది. ఈ సృష్టిలోఏ జీవి కూడా ప్రకృతికి విరుద్ధంగా  ప్రవర్తించడం లేదు.ఒక్క మానవుడు తప్ప. మూగజీవాలు సైతం  ప్రకృతికి లోబడి  చక్కగా జీవనం కొనసాగిస్తున్నాయి.కానీ అన్నీ తెలిసిన మానవుడు మాత్రం నాగరికత పేరుతో ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తూ, తనను తానే నాశనం చేసుకుంటున్నాడు. ముఖ్యంగా 'శారీరక వాంఛ'ల విషయంలో జంతువులకున్నపాటి సాధారణ జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాడు. 'మనసులేని మృగాలు' సైతం సంతానోత్పత్తి కోసమే,  అదీ కొన్ని  సీజన్లలో మాత్రమే 'జత' కడతాయి. కానీ మనం మనసున్నదనుకొనే మానవుడికి మాత్రం సమయంలేదు. సందర్భం లేదు. వరుసా లేదు. వావీ లేదు. పెద్దా, చిన్నా పట్టింపు అసలే లేదు. అలాంటి  మానవుడిని.. సాటి మనుషులపైనే పైశాచికంగా దాడి  చేసే రాక్షస ప్రవృత్తి గలమానవుడిని... ఎంతో ఉన్నతమైన  జీవన పద్ధతులు గల మృగాలతో  పోల్చడం ఎంతన్యాయం?అందుకే రాక్షసప్రవృత్తిగల మానవులను దైవలఅక్షణాలుగల  ఆ నోరులేని జీవాలతో పోలుస్తూ 'మృగాళ్లు' అనడం,అలా రాయడం కూడా తప్పంటాను...ఏమంటారు?"  విషయం అర్థం కాగానే విద్యార్థులంతా ఒక్కసారిగా ముక్త కంఠంతో "నిజమే మేడం." అన్నారు.వెంటనే రాముడు లేచి   " సారీ మేడం..! ఇకముందు ఇలాంటివి రాయకుండా జాగ్రత్త పడతాం"అన్నాడు నొచ్చుకుంటున్నట్టుగా.  ఆ కాలేజీలో ఓ పార్ట్ టైంలెక్చరర్  జ్వలిత. ఆ  ఏరియాలో చుట్టుపక్కల గ్రామాలన్నిటికి అదొక్కటే కాలేజీ. బాగా వెనుకబడిన ప్రాంతాలు కావడంతో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమ పిల్లల్ని కాలేజీ కన్నా కూలి పనులకు పంపడానికే పేరెంట్స్ ఇష్టపడేవారు. అలాంటి చోట కూడా రాముడు,సంధ్య లాంటి 'బ్రిలియంట్ స్టూడెంట్స్' ఉండటం గుర్తించిన ఆమె 'లెక్చరర్స్  సరైన శ్రద్ధ చూపకపోవడం వల్లనే ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ, స్టూడెంట్స్ ఎందుకూ కొరగాకుండా పోతున్నారని భావించి 'ఆర్ట్స్ గ్రూపులో పాఠాలు చెప్పడం వరకే నా బాధ్యత' అన్నట్టు కాకుండా  వారి వ్యక్తిత్వాలను తీర్చి దిద్దాలనే  తపనతో పాఠాలకు ఎన్నో విషయాలను జోడించి ఇంట్రెస్ట్ కలిగేలాచెప్పసాగింది. వ్యక్తిత్వ వికాసపు తరగతులంటే ఏమిటో తెలియని రోజుల్లో నే వాటిని ప్రారంభించిందామె. ఎలాంటి విషయాన్నయినా తనకున్న నాలెడ్జ్ తో అందరూ ఆమోదించేలా, అందంగా చెప్పుడం వల్ల విద్యార్థులు  మంత్రముగ్దుల్లా వినేవారు. విద్యార్థులు 'గైడ్స్' పై ఆధారపడటం  ఇష్టం లేని ఆమె  అన్ని విషయాల్లోనూ    తానే ఒక  'గైడ్' లా మారి  స్టూడెంట్స్ తోనే కాక పేరెంట్స్ తో కూడా చక్కటి రిలేషన్స్ కలిగి ఉండేది.   
      ఆ రోజు డిసెంబర్ ఒకటి.అదే రోజును భావితరాలు ఎయిడ్స్ మహమ్మారి బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు 'వరల్డ్  ఎయిడ్స్ డే' గా ఇకపై ఏటా జరుపుకోవాలని ప్రకటించింది ప్రభుత్వం.అందులో భాగంగా కాలేజీలో ఏర్పాటుచేయబడే 'రెడ్ రిబ్బన్ క్లబ్' నిర్వహణ,స్థూడెంట్స్ కు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా జ్వలిత కే అప్పగించబడింది.ఇలాంటి విషయాల్లో 'ఈ తరం పిల్లలు ఏమీ ఎరుగని అమాయకుల'ని భావించడం లేదామె. అందుకే అందరికీ తెలిసిన సాధారణ విషయాలు కాకుండా వారికి కర్తవ్యబోధ చేసే  విషయాలు కొన్ని చెప్పాలనుకుంది. "డియర్ స్టూడెంట్స్..! ఈ సృష్టిలో మనిషి మనసును మించిన అద్భుతం మరొకటి లేదు. ఒక మనిషి మహాత్ముడిగా  మారాలన్నా, మానవత్వం లేని రాక్షసుడుగా మారాలన్నా, అందుకు మనిషి మనసే మూలం. అలాంటి మనసుతో ముడిపడి ఉన్న వ్యాధే హెచ్ ఐ వి, ఎయిడ్స్. కానీ దురదృష్టవశాత్తు దాన్నొక శారీరక  అంశంగా 'తప్పనిసరి చెడు' వల్ల కలిగే అనర్థంలా భావిస్తూ, నివారణ తప్ప మందు లేని దాని బారి నుండి కాపాడే 'ఏకైక రక్షణ కవచం' గా 'కండోమ్'ను చూపిస్తూ 'పని' కానిచ్చేయ మంటున్నారు. తప్ప'అలాంటి  నెగెటివ్  ఆలోచనలు' కంట్రోల్ చేసుకునేలా ప్రజల్లో మానసిక పరివర్తన తెచ్చేందుకు ప్రాముఖ్యతనివ్వడం లేదు. పైగా ఇతర మార్గాల ద్వారా ఎయిడ్స్ రాకుండా నిరోధించేందుక్కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదు. నేడు అందరూ 'తాత్కాలిక సుఖాలు, లక్ష్యాల' సాధనకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మనదేశంలో అక్రమాలు, అవినీతి కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. మరో 'బ్యాడ్ లక్' ఏంటంటే నేటి విద్యా విధానం కూడా 'జీవన విలువలు' తప్ప 'జీవిత విలువలు' పెంచలేనిదిగా తయారుకావడం. మనిషి జీవితంలో 'శారీరక వాంఛ అనేది ఓ అవసరం' కావచ్చు గాక! కానీ అదే జీవితం కాదు కదా! ప్రస్తుతానికి అది తీరనంత మాత్రాన మనకు కలిగే నష్టమేమీ లేదు. పైగా అది తీర్చుకోడానికి అడ్డదారులు తొక్కడం వల్లే తీవ్ర నష్టం కలుగుతోంది. దీన్ని గుర్తించి ప్రతి వ్యక్తి చంచల స్వభావాన్ని వీడి'ఇర్రెగ్యులర్'గా శారీరక వాంఛలు తీర్చుకోవడం' మానాలి. అందుకు ప్రతి వ్యక్తి తన మనసుకు తానే 'యజమాని' కావాలి. ఎందుకంటే మనసుకు బానిసైనవాడు శారీరక వాంఛలకూ బానిసవుతాడు కాబట్టి. ప్రతి మనిషి  యజమాని లా తన మనసును తానే శాసించుకో కలిగి స్థాయికి ఎదిగిన నాడు ఎవరూ అడ్డదారులు తొక్క రు. పైగా తమ విధులనుకూడా. సక్రమంగా నిర్వర్తిస్తారు. ఇందుకు విద్యార్థి దశలో 'యోగ' తప్ప మరో మార్గంలేదు. దాని ద్వారానే  ఎయిడ్స్ భూతాన్ని మనదేశం నుండి అన్ని రకాలుగా పారద్రోలగలం...." అంటూ కాసేపాగి తిరిగి చెప్పసాగిందామె. '.....ఆర్ట్స్ గ్రూపులలో చదువుకున్న మనం శాస్త్ర వేత్తలం కాలేముకదా...! అందుకే మన 'సోషల్ సైన్సెస్' పరిధిలోనే ఈ సమస్యకు నేనొక 'సొల్యూషన్'   కనుక్కున్నాను... వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు 'ఎయిడ్స్' ను 'ఎయిడ్స్' తోనే జయించాలి. ఇందుకు మనమంతా 'ఎయిడ్స్' ని తెచ్చుకోక తప్పదు...?!" అంటూ ఆగి అందరి వైపు ఓసారి చూసిందామె. అర్థం కానట్టు ఒకరి మొహాలొకరు చూసుకున్నారంతా. క్లాసులో సూది పడ్డా వినబడేంత నిశ్శబ్దం.ఆ 'నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ ఎయిడ్స్ గురించి చర్చిస్తున్నట్లు'గా సంధ్య లేచి "మనం లేని వాళ్లం కదా! ప్రపంచ బ్యాంకు నుంచి 'ఎయిడ్స్' తెచ్చుకోవాలా మేడం" అడిగింది. ఆమె ఎప్పుడో చెప్పిన 'ఆంధ్రదేశము-అప్పులు' అనే టాపిక్ గుర్తు చేసుకుంటూ. ఇంతలో రాముడు లేచి"ఏ వ్యాధి  కైనా ఆ వ్యాధి క్రిములే మందు. అని మీరె ప్పుడో అన్నట్టు  'ఎయిడ్స్' నివారణకు 'ఎయిడ్స్'నే తెచ్చుకోవాలామేడం?" అని కాసేపాగి "అయినా ఎయిడ్స్ వస్తే మనిషెలా బతుకుతాడు? 'ఎయిడ్స్' అంటే మరేదో ఉంది.  అదేంటో మీరే చెప్పండి మేడం" అన్నాడు.రాముడి సమయస్ఫూర్తి కి మెచ్చుకోకుండా ఉండలేక పోయిందామె. తన ఉద్దేశం లో 'ఎయిడ్స్' అంటే ఏంటో అది మందులా ఎలా పనిచేస్తుందో చెప్పసాగింది "నేను చెప్పిన 'AIDS' లో 'ఏ' అంటే 'అడోరేషన్' అంటే 'ఆరాధనా భావం' ఇది మీ కుటుంబంతో ఒకరి పట్ల మరొకరు కలిగి ఉండాల్సింది. 'ఐ'అంటే 'ఇంటిమసీ' అంటే  దగ్గరితనం,అన్యోన్యత. ఇది భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సింది. 'డి' అంటే 'డెవలప్ మెంట్' దీనికి 'అభివృద్ధి' అనే అర్థం  అర్థశాస్త్రంలో లో ఉంది కదా! ఇక 'ఎస్' అంటే 'సెక్యూరిటీ' 'రక్షణ' అని అర్థం. సో.. 'ఆడోరేషన్ అండ్ ఇంటిమసీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ డెవలప్స్ యువర్ సెక్యూరిటీ' అంటే మీ కుటుంబం పట్ల నీకు ఉండే అనురాగం, ఆప్యాయతలే మీ రక్షణ వ్యవస్థను పెంపొందిస్తాయన్నమాట.అలాగే  'నో అడోరేషన్ అండ్  ఇంటిమసీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ డెస్ట్రాయిస్ యువర్ సెక్యూరిటీ'  ఎప్పుడయితే మీ కుటుంబ జీవనంలో ఈ 'ఎయిడ్స్' లేక దారి తప్పుతారో అప్పుడే ఆ 'ఎయిడ్స్' వచ్చి మీ దేహంలోని రక్షణ వ్యవస్థను నాశనం చేస్తుంది. అందుకే మనమంతా నేను చెప్పిన 'ఎయిడ్స్' ను అలవర్చుకోవాలి" అంటూ ముగించింది. క్లాసంతా  చప్పట్లతో మార్మోగింది. ఆ తర్వాత ఎయిడ్స్ పట్ల వారి భవిష్యత్ దృక్పథాన్ని గురించి విద్యార్థులందరి చేత మాట్లాడించింది జ్వలిత. అఖర్న రాముడు మాట్లాడుతూ "నేను పెద్దయ్యాక తప్పకుండా ఎయిడ్స్ అంటించు కుంటానని విన్నవించుకుంటున్నాను" అన్నాడు. అంతే ఒక్కసారిగా క్లా సంతా గొల్లు మంది. "రాముడూ  వాట్ డు యు మీన్..?" వచ్చే నవ్వు నాపు కుంటూ అడిగింది జ్వలిత. "అదే..అదే మేడం మీరు చెప్పిన ఎయిడ్స్ అలవర్చుకుంటాను". అన్నాడు సర్దుకుంటూ. ఆ తర్వాత సంవత్సరం లోనే జ్వలిత కి 'రెగ్యులర్ లెక్చరర్ జాబ్' రావడంతో ఆ ఊరు వదిలి వచ్చేసింది. తరచూ లెటర్స్ రాస్తుండే రాముడు ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాననీ, ఆమె లేకపోవడం పోవడం చాలా లోటు గా ఉందనీ రాశాడు. ఆ తరువాత రాముడు గురించి పెద్దగా విషయాలేమీ తెలియలేదు.కానీచాలా కాలం తర్వాత ఊహించని విధంగా రాముడినుంచి ఓ లెటర్ వచ్చిందామెకు.అందులో 'ఆఖరి దశలో అదరించేవారు కరువై అల్లాడుతున్నాననీ, నాకు మీరే దిక్కని, నాకోసం ఒక్కసారి వచ్చిపోవాలని,రాకపోతే నా జీవితంలో 'ఆఖరి ఆనందపు ఘడియలు' కూడాకోల్పోతాననీ," రాశాడు. రాముడు ఎంతో దీనంగా రాసిన అది చూసి  వెంటనే బయలుదేరిందామె.
 *    *    *
పరిచయం ఉన్న ప్రాంతం కావడంతో నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లింది జ్వలిత. కానీ వాళ్ళు ఊరి చివర గా  ఓ గుడిసెలో ఉంటున్నట్టు తెలియడంతో మనసు కీడును శంకించింది. ఆలోచిస్తూనే  వాళ్లున్న చోటుకు కు చేరుకుందామె."అమ్మో...! చంపేస్తున్నాడు కాపాడండి. వీడికి దేం మాయ రోగంరా  దేవుడో...! అంటూ అరుస్తూ గుడిసె లో నుంచి బయటకి పరుగెత్తుకొచ్చింది రాముడి తల్లి. ఆమె వెనకే ఎముకల గూడులా శక్తి లేక కాళ్ళీడ్చుకుంటూ చేతిలో కర్రతో బయటకు వచ్చాడో వ్యక్తి. అతడు.. రాముడు.. గుర్తించేందుకు ఆనవాళ్లు కూడా లేనంతగా చిక్కి శల్యమై పోయిన రాముడు నిలబడే శక్తి కూడా లేక నిలువునా కూలబడి పడిపోయాడు. "నేనేం తప్పు చేయలేదు. నా జబ్బుకు మీరే  కారణం. మిమ్మల్ని చంపి నేను చస్తాను. అరుస్తున్నాడు వాడు. కానీ వాడి స్వరం ఎక్కడో చీకటి గుహలలో నుంచి వస్తున్నట్లుగా లీలా మాత్రంగా వినిపిస్తోంది. 'జీవచ్ఛవం' లా  ఉన్న వాడిని చూడగానే హృదయం ద్రవించి పోయింది జ్వలిత కి. ఒక్క అంగలో  వాడిని చేరి "రాముడు.. రాముడూ... నేనురా మీ  మేడం ను.ఏదీ ఒక్కసారి ఇటు చూడరా.. నేను వచ్చేశాను రా.." అంటూ వాడిని లేవదీసింది. నాగస్వరం విన్న పాములా వాడిలో చలనం అతి కష్టం మీద కళ్ళు తెరిచేడు. ఆమెను గుర్తుపట్టిన సూచనగా వాడి నిస్తేజమైన నిర్జీవపుగాజు కళ్ళ లో ఎక్కడో సుదూరాన ఓ సన్నని వెలుగురేఖ. కారు చీకటిలో కాంతి రేఖలా మిణుకు మిణుకు మంటూ. కానీ ఆ వెలుగును చెదరగొడుతూ కన్నీటి వరద. "వచ్చారా.. వచ్చారా..మేడం..  నాకు తెలుసు మీరు వస్తారని.." హీన స్వరంతో అన్నాడు. "రాముడూ...ఏమిట్రా ఇదంతా..? నీకు ఏమైందిరా?  ఆమె కంఠం జీరబోయింది.వాడు విరక్తిగా నవ్వి "ఆరోజు నేను ఎయిడ్స్ తెచ్చుకుంటానని  మీతో అన్న మాట  ఈరోజు అక్షరాలా నిజమైంది మేడం. ఎందుకు వచ్చిందో.. ఎలా వచ్చిందో.. నాకైతే తెలీదు. నా నరనరాన్నీ ఎయిడ్స్ రక్కసి ఆవహించి నన్ను నరకయాతనకు గురిచేస్తోంది. కానీ.. కానీ... మేడం నేనేపాపమూ  ఎరుగను.అయినా ఆ దేవుడునా కెందుకో ఈ శిక్ష విధించాడు.  ఈ నరకం పగవాళ్లకు కూడా వద్దనే వద్దు. మీరే కనుక ఇక్కడ ఉండి ఉంటే  నేనీలా అయ్యేవాడిని కాదు.నేనే తప్పు చేయకుండానే అన్యాయం బలై పోతున్నానని మా అమ్మానాన్నలకు, ఈ సమాజానికి మీరైనా చెప్పండి... పోనీ మీరన్నా నన్ను నమ్మండి. నాకదే చాలు. ఆనందంగా పోతాను. ఒక్క మాట చెప్పండి మేడం." ఎంతో కాలంగా అణచివున్నఅగ్నిపర్వతం బ్రద్దలై లావా పెల్లుబికినట్టుగా వాడిలో దుఖం కట్టలు తెంచుకుంది. వాడిని ఓదారచ్చడం ఆమె వల్ల కాలేదు. ఏమని ఓదార్చగలదు? వాడి ఆశలన్ని ఆవిరై హృదయం అగ్నిగుండంలా మండుతుంటే..! ఆమెకు కి దంతా  కలలా ఉంది."రాముడూ ఏంటిరా ఆ పిచ్చిమాటలు ?నీమీద నాకున్న అభిమానం' నమ్మకం ఎప్పటికి చేదిరిపోవురా ..!"అందామె అనునయంగా.అమెకూ దుఃఖం ఆగడం లేదు. "నిజమా మేడం నిజంగానా..!! చాలు మేడం నాజన్మకది చాలు." అంటూ ఆనందంతో వాడి గొంతు పూడుకుపోగా ఆలాగే ఆమె కాళ్ళముందు వాలిపోయాడు."మీరన్నా చెప్పండమ్మా..! ఇంట్లో పూటగడవక అవస్థపడుతుంటే కాలేజీలో చేరి చదువుకుంటానంటే ఎట్లాగమ్మా..? ఆ మాయదారి చదువులు మాలాంటోళ్లకు కూడుపెడతాయా? నాలుగు రాళ్లు సంపాయిస్తే కడుపునిండా కూడు తినొచ్చని  ఆ మహారాష్ట్రలో పనికి పంపిస్తే  అక్కడ చెడుతిరుగుళ్లు మరిగి ఆ మహమ్మారి రోగమొకటి తగిలించుకొచ్చిండు.అది చాలదన్నట్టు వాడిని అక్కడికి పంపడమే  మా తప్పు అంటూ తిండి తిప్పలు మాని ఆసుపత్రి కి కూడా రాకుండా రోజూ ఇలా మమ్మల్ని చావ బాదుతున్నాడు.మేమేం  పాపం చేశామని మిమ్మల్నిలా చంపుకు తింటున్నాడు" అంటూ హృదయవిదారకంగా రోదించ సాగింది రాముడి తల్లి. ఆమె మాటలతో  ఏదో అనుమానం వచ్చి వివరాలన్నీ అడిగింది జ్వలిత. ఎన్నో ఆశలతో ఇంటర్ పూర్తి చేసిన రాముడిని బలవంతంగా చదువు మాన్పించి మహారాష్ట్ర లో  ఓ ప్రాజెక్టు వర్కులో కాంట్రాక్ట్  పనిచేస్తున్నా లారీ యజమాని వద్ద పని లో పెట్టారు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న చాలా మంది యువకులు పనుల కోసం మహారాష్ట్ర వెళుతుండడం మామూలే. లారీ క్లినర్ గా పనిచేస్తున్న రాముడికి దురదృష్టవశాత్తు ఓ రోజు ఆక్సిడెంట్ కావడంతో దగ్గర్లో ఉన్న హాస్పిటల్లో చేర్పించారు. రక్తస్రావం ఎక్కవై చావుబ్రతుకుల్లో ఉన్న రాముడికి అందుబాటులో ఉన్న రక్తాన్నిఏ 'టెస్టు' చేయకుండానే ఎక్కించి, కోలుకున్నాక ఇంటికి తీసుకొ చ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న రాముడికి రక్తం ఎక్కించిన విషయం తెలియదు. లారీ యజమాని కూడా ఏమంటారోననే  భయంతో ఈ విషయాలేవి వారికి చెప్పలేదు. రాముడు మాత్రం తిరిగొచ్చినందుకు సంతోషపడి  డిగ్రీ లో చేరాడు. కానీ ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి వాడి ఆరోగ్యం క్షిణిస్తుండడంతో టౌన్ హాస్పిటల్ లో చేర్చి టెస్ట్ చేయించగా హెచ్.ఐ.వి పాజిటివ్ గా తేలింది. దాంతో సమాజానికి భయపడి అందరిలాగే వాడూతప్పు చేశాడు. హాస్పటల్ నుంచి పారిపోయి వచ్చేసాడు. కానీ ఆ విషయం ఎలాగో బయటకు పొక్కడంతో ఏమీ తెలీని ఊరిజనం అజ్ఞానంతో, అవగాహనా రాహిత్యంతో, మహారాష్ట్రలో రాముడు లారీ డ్రైవర్లతో కలిసి  చెడు తిరుగుళ్ళు తిరిగి ఎయిడ్స్ తెచ్చుకున్నాడని ప్రచారం చేసారు. దాంతో ఊరంతా వణికిపోయి వాళ్లను వేలివేసారు. ఇవన్నీ రాముడిలో అవమానాన్ని, ఆవేదన నీ రగిల్చాయి. దీని కంతటికీ కారణం తల్లిదండ్రులు తనను మహారాష్ట్ర పంపడమేనని భావించి వారిపైన, తనకే పాపం తెలియదని చెప్పినా విశ్వసించని సమాజంపైన 'కసి' పెంచుకున్నాడు. వాడిని ఆదరించి అక్కున చేర్చుకుని 'హార్టు' ఈ సమాజానికి లేకపోయినా వాడి ని అనునయించేందుకు 'హార్ట్'(H.A.A.R.T) అనేది ఒకటుందని తెలుసుకోలేకపోయాడు. ఉన్మాదిగా తయారయ్యాడు. వ్యాధి పూరితం రుధిరం  వాడి నర నరానా నాశనకారి లా మారి నర్తిస్తూ వాడి దేహాన్ని జ్వాలలా దహించివేస్తూ క్రుంగదీసి కృశింపజేస్తుంటే..., ఆవేశంతో కూడిన యువరక్తం ఆవేదనతో అగ్నికీలలా మండుతుంటే...తన శరీరాన్ని కాపాడుకోవాలని శతవిధాల ప్రయత్నించి ఓడిన మనసు తానీస్థితి రావడానికి కారణమైన తల్లిదండ్రుల మీద 'క్రోధం' పెంచుకొని దాడి చేయక మరేం చేస్తుంది? ఏ దుర్మార్గుడు తనకు ఎయిడ్స్ వచ్చిందని ఈ లోకం మీద కసితో కావాలనే రక్త దానం చేసి పోయాడో..? లేక ఏ అమాయకుడు తన దేహంలో మనుషుల్ని కబళించే మహమ్మారి జీవం పోసుకుంటుందని తెలియక బ్రతుకుతెరువు కోసమో, సమాజ సేవ కోసమో, రక్తదానం చేశాడో..? కానీ.. అన్నెం పున్నెం ఎరుగని అభాగ్యుడు, అభం శుభం తెలియని రాముడు నిర్దాక్షిణ్యంగా బలైపోతున్నాడు. బలిపశువుగా మారిన వాడి జీవితం యవ్వన దశలోనే మోడువారి పోతొంది. ఎంత ఘోరం జరిగిపోయింది? పాపం వాడి తల్లిదండ్రులకేం తెలుసు..?  విధి రుధిర రూపంలో వచ్చి తమ కుటుంబాన్ని జ్వాల లా దహించివేస్తోందని. జ్వలిత చెప్పాక కానీ తెలియ లేదు వాళ్ళకి. తన కొడుకు ఉత్తముడని తెలుసుకున్న ఆ తల్లి మనసు తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. "భగవంతుడా..! ఎందుకయ్యా.. మాకింత పెద్ద శిక్ష వేశావు? ఆ రోజే వాడిని తీసుకు పోయుంటే మాకీ  నరకం తప్పెది కదా!  రెండ్రోజులు ఏడ్చి ఊరుకునే వాళ్ళం కదా!  ఆ మాయదారి రోగం నా బిడ్డను పీల్చి పిప్పి చేస్తూ మా బ్రతుకుల్లో నిప్పులు పోస్తుందే..!! ఇక మా బ్రతుకులెందుకు..? ఒరేయ్ రాము మా బంగారు తండ్రి.. కన్నతల్లి నయ్యుండి నీ మనసును అర్థం చేసుకోలేకపోయానురా.. నిన్ను మా చేతులారా నాశనం చేసుకున్నామురా. నా పాపానికి శిక్ష లేదురా.. నన్ను క్షమించరా నాయనా.."అంటూ కుప్ప కూలిపోయింది. వెంటనే కర్తవ్యం గుర్తొచ్చిన జ్వలిత "రాముడూ..నువ్వు శ్రీరామచంద్రుడివిరా.. తల్లిదండ్రులకు  మాట విని మహారాష్ట్ర వెళ్లి నీ జీవితాన్ని బలి చేసుకున్నావు. నిన్నెవరూ అర్థం చేసుకో లేదంటే అది నీ తప్పు కాదురా.. ఈ సమాజానిది. ఎవరున్నా లేకున్నా, నీకు నేనున్నాను బాధపడకురా.లే..లేవరా.." అంటూ వాడిని లేవదీయ బోయింది. అంతే వాడి తల ఓ ప్రక్కకు వాలిపోయింది."రాముడూ..!"  అప్రయత్నంగా ఆమె వేసిన కేక ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. "వెళ్లిపోయావు రా..రాముడు తిరిగిరాని నీ చదువుల లోకానికి...నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో కుండానే ఈ కుళ్లు కుటిల సమాజానికి దూరంగా వెళ్లిపోయావురా.. పోనీలే అక్కడన్నా సుఖం గా ఉండరా.. అక్కడ నీ చదువుకేవరూ అడ్డు చెప్పరులేరా.. పనికి వెళ్లమని నిన్నెవరూ కష్టపెట్టరులేరా.. నీకు ఏ రోగాలూ, రొస్టులూ రావు లేరా.. అక్కడన్నా హాయిగా నీవు కోరుకున్నట్టు చదువుకొని బాగుపడరా.. పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్దవాడివి కారా.. ఇక మళ్ళీ  ఈ పాపిష్టి ప్రపంచపు ఛాయలకే రాకురా" అని ఆక్రోశిస్తూ  సర్వం మరచి బోరున విలపించిందామె.
   ***
                                                                                                       

No comments:

Post a Comment

Pages