గురువంటే... - అచ్చంగా తెలుగు

గురువంటే...

-మీనాక్షి  శ్రీనివాస్  


గంట గణ గణ మోగగానే బిలబిల్లాడుతూ గంప కింద కోడి పిల్లల్లా అన్ని తరగతులనుండీ బయటకు పరిగెత్తారు. అదొక పెద్ద స్కూల్, అన్ని స్కూల్స్ లాగే అంతర్జాతీయ ప్రమాణాలు, ఇ-స్కూలు వగైరా వగైరా బిరుదులతో అలరారుతున్న, నగరంలోనే అతి పెద్ద స్కూల్ .. పేరు పెద్దదే కానీ ఆవరణ చిన్నదే. కాకపోతే చాలా ప్రయివేట్ పాఠశాలలకన్నా కొంత నయం. 

రామనాథం మాష్టారు అక్కడున్న చెట్టు కింద నిలబడి పిల్లలను నిశితంగా గమనిస్తున్నారు ..  పావుగంట విరామానికే ఆ పిల్లల ముఖంలో స్వేచ్ఛ దొరికిన ఆనందం.  అంతలోకే ఆయన దృష్టి ఓ పిల్లాడి మీద పడింది .. పదో క్లాస్ కుర్రాడు కాబోలు అప్పుడప్పుడే వెల్లివిరుస్తున్న వయసు చిహ్నాలతో మంచి స్టైలిష్ గా కొట్టొచ్చినట్ట్లు కనిపిస్తున్న నిర్లక్ష్యంతో తన ముందు నుంచి వెడుతున్న ఓ అమ్మాయిని ఏదో కామెంట్ చేస్తూ ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు, ఆ పిల్ల బెదిరిపోతూ, కళ్ళనీళ్ళతో తల అడ్డంగా ఊపుతోంది, వాడు చేతులు తిప్పుతూ ఏదో చెబుతున్నాడు .. ప్చ్ కాల మహిమ, ఈ వయసులోనే, ఇంతమంది మధ్యే వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే! .. ఎవర్నో పిలుస్తున్నట్టు, తన ఉనికిని తెలియచేస్తూ రామనాథం వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.

ఆ పిల్లాడు అప్పటికి చెబుతున్నది ఆపేసి ఆ పిల్లకి ఏదో హెచ్చరిక చేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

ఆ అమ్మాయి కళ్ళు తుడుచుకుంటూ భయం భయంగా ఓ సారి మాష్టారికేసి చూసి వెళ్ళిపోయింది, వాడు ఓ పక్కగా నిలబడి గమనిస్తున్నాడు మాష్టారికి ఏమైనా చెబుతుందేమో అన్నట్టు.   సాలోచనగా తల పంకిస్తూ .. కాసేపు అక్కడే నిలబడ్డారు మాష్టారు. రామనాథం నిరుడే జిల్లాపరిషత్ పాఠశాల ప్రధానోధ్యాపకుడిగా పదవీ విరమణ చేసారు, ఆయన పని చేసిన అన్ని పాఠశాలల ఉత్తీర్ణతా , సుమారుగా నూటికి నూరు శాతం.  పిల్లలంతా మంచి క్రమశిక్షణ తోటీ, వ్యక్తిత్వంతోటీ మంచి మంచి చదువులు చదివి, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు .. అలా అని ఆయనంటే అందరికీ ప్రేమాభిమానాలు, గౌరవమే కానీ భయం, ద్వేషం ఉండేవి కావు, వాళ్ళతో ఆయన తీరు అలా ఉండేది .

ఆయన గురించి విని ఉన్న ఈ ' సువిద్యా ' పాఠశాల యాజమాన్యం ఆయనను  బ్రతిమలాడి అక్కడ గణితం బోధించడంతో పాటు .. సూపర్వైజర్ గా నియమించారు ఈ ఏడే .. అంటే కొత్త విద్యా సంవత్సరంలో.

మళ్ళీ గంట మోగి అంతా బిలబిల్లాడుతూ తరగతులకు వెళ్ళిపోయారు .. ఆయన ఆ అబ్బాయి వివరాలు తోటి ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్నారు. వాడి పేరు అభిరాం .. పదో తరగతి .. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు, తల్లి హై సొసైటీ లో, హై కల్చర్ పార్టీలు, మీటింగ్స్ లో బిజీ గా ఉండే స్త్రీ. ఆమెకు ఇల్లు పట్టదు, పిల్లలూ పట్టరు .. ఇంటినీ, పిల్లలనీ ఆయాల మీదా, పని వాళ్ళ మీదా వదిలేసి ఆమె బిజీలో ఆమె ఉంటుంది. పిల్లలు దారి తప్పారు, ముఖ్యంగా కొడుకు, ఎవరైనా ఏమైనా అంటే తండ్రి పదవినీ, అధికారాన్నీ చూపి భయపెట్టేంత మొనగాడయ్యాడు, అభిరాం ఆ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు,చెల్లెలు అభిజ్ఞ ఎనిమిదో తరగతి అదే స్కూల్లో.  .. చదువు బాగానే చదువుతాడు, అలాగే అల్లరి వేషాలూ కూడా బాగానే వేస్తాడు.   

ఎనిమిదో తరగతి చదువుతున్నఆ అమ్మాయి .. ఓ బ్యాంక్ ఆఫీసర్ గారి కూతురు, పేరు అనన్య. చాలా మంచి పిల్ల, తన చదువేదో తన లోకం ఏదో .. అంతే, ఎక్కువగా ఎవరితోనూ కలవదు .. ఇంటా బయటా ఒంటరే .. తల్లితండ్రులిద్దరూ బ్యాంక్ ఆఫీసర్స్ .. వాళ్ళ లోకం అదే. కూతురిని మంచి స్కూల్లో వేసాం, అన్నీ అమరుస్తున్నాం .. అంతే ..అందుకే ఆ అమ్మాయి ఒంటరితనాన్ని అనుభవిస్తోంది, అదే అలవాటయిపోయింది కూడా .. పది మందిలో ఉన్నా ఒంటరే.

పై వివరాలన్నీ చెప్పిన ఆ సహాధ్యాయుడు .." మాష్టారూ!మీరు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారో అర్థం అయింది, వాడు మళ్ళీ ఆ అమ్మాయిని ఏడిపించి ఉంటాడు .. ఇది మామూలే, వాడిని ఎవరూ ఏమీ అనరు, ఏ చర్యా తీసుకోరు అందుకే వాడలా తయారయ్యాడు, మీరు కొత్తగా వచ్చారు .. ఇవన్నీ తెలియవు, మీ గురించి నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా .. మీరు ఏం పట్టించుకోకుండా చూసీ, చూడనట్లు ఉండండి .. బురద మీద రాయి వేస్తే చిందేది మన మీదే, అది బురద అయితే కడిగేసుకోవచ్చు, కానీ ఇక్కడ అధికారం .. దాని జోలికెడితే నష్టపోయేది మనమే! అర్థం అయిందనుకుంటాను .. " వెళ్ళిపోయాడాయన.

***

నాలుగు రోజులు గడచిపోయాయి, రామనాథం మాష్టారు స్కూల్ లో ఉన్నంత సేపు అభిరాంని నీడలా వాడికి తను అనుసరిస్తున్నట్లు డౌట్ రాకుండా తిరుగుతున్నారు.  దానితో వాడికి ఎవరినీ ఏడిపించే అవకాశం చిక్కలేదు. నాలుగు రోజుల తరువాత జరిగిందో సంఘటన, అభిరాం చెల్లెలు అభిజ్ఞ వెంట పడడం మొదలుపెట్టాడు ఆ ఊరి ఎం.ఎల్.ఏ కొడుకు మణికంఠ. వాడు అవడానికి ఎం.ఎల్.ఏ కొడుకే అయినా ఏ రోజూ అల్లరి చిల్లర వేషాలు వేయలేదు, అందరితో స్నేహంగా ఉంటూ, చదువులో, ఆటలలో అన్నింటా మేటిగా ఉంటూ టీచర్స్ అందరికీ ప్రీతిపాత్రుడు. అలాంటి వాడు ఉన్నట్లుండి ఇలాంటి వేషాలు ఎందుకు వేస్తున్నాడో అర్థం కాలేదు, ఒకళ్ళిద్దరు పిలిచి మంచిగా చెప్పి చూసారు, మారుమాటడకుండా తలవంచుకుని వెళ్ళిపోయాడు కానీ అభిజ్ఞని టార్గెట్ చేయడం మానలేదు .. 

ఓ రోజు అందరి ఎదుటా అభిజ్ఞను 'డేటింగ్ కు ' వస్తావా! అని అడగడం, అభిజ్ఞ వాడిని  కొట్టడం .. ఆ విషయం తెలిసి అభిరాం వాడితో కలబడి ఇద్దరూ కొట్టుకోవడం జరిగింది. రామనాథంగారే వాళ్ళని విడదీసి ఇద్దరికీ సర్దిచెప్పి పంపేసారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మతి పోయింది, ఇన్నాళ్ళూ అభిరాం ఒక్కడితోటే తలనెప్పి, ఇప్పుడు వీడు కూడా తయారయ్యాడు, పోనీ ఏమైనా అందామంటే ఇద్దరూ ప్రముఖుల కొడుకులు, ఏం చేయాలి .. ఇది ఇలాగే కొనసాగితే స్కూల్ పేరుప్రతిష్టలు దెబ్బతింటాయి ..ఇలా సాగిపోతున్నాయి ఆయన ఆలోచనలు.

సిబ్బంది అందరినీ సమావేశపరిచి .. ఏం చెయ్యాలీ అంటూ మాట్లాడేడు.

' సర్ .. మీరెంత సేపు .. స్కూల్ పరపతి గురించే ఆలోచిస్తున్నారే కానీ పాపం అన్నెం పున్నెం తెలియని ఆ అమాయకపు ఆడపిల్లల గురించి ఆలోచించరేం, వాళ్ళు పడే యాతన, ఓర్చుకోలేక, ఎవరికీ .. అఖరికి కన్న వాళ్ళకి కూడా చెప్పుకోలేక వాళ్ళు పడుతున్న బాధ మీకు అర్థం కావడం లేదా!' ఆవేశంగా అడిగాడు రామనాథం.

"మాష్టారూ .. నిజమే! కానీ అక్కడున్నది ఇద్దరి ప్రముఖుల కొడుకులు, వీళ్ళ మీద క్రమశిక్షణా చర్య తీసుకుంటే వాళ్ళు జోక్యం చేసుకుంటారు .. అల్లరల్లరి అవుతుంది .. " మొత్తుకున్నాడాయన.

" దీనికి పరిష్కారం నా దగ్గర ఉంది, ఓ నాలుగు రోజులాగండి .. అన్నీ సర్దుకుంటాయి .." అభయం ఇచ్చాడు రామనాథం.

"ఎలా! " అయోమయంగా అడిగాడాయన, మిగతా మాష్టర్లంతా ఆసక్తిగా చూసారు.

" వేచి చూడండి .. ఇక మేం వెళ్ళమా! " అంటూ లేచాడాయన.

" అమ్మయ్య!" అనుకుంటూ నిట్టూర్చారంతా, ఆయన సామర్థ్యం  అందరికీ తెలుసున్నదే కనుక. అంతా నిశ్చింతగా స్థిమితపడ్డారు.  

                                                                                      ***

స్కూల్లో ఉన్నంత సేపూ తన చుట్టుపక్కలే రామనాథం మాష్టారు ఉండడంతో ఆ రోజు స్కూల్ అయిపోయాకా అనన్య సైకిల్ మీద ఇంటికి వెడుతుంటే స్నేహితులతో దారి కాసి నానా అల్లరీ చేసాడట, ఏమిటీ ఆ రామనాథం మాష్టారిని నా మీద నిఘా పెట్టావా? ఇప్పుడెవడు అడ్డం వస్తాడో చూస్తా అంటూ ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ అమ్మాయి చున్నీ లాగి, బేగ్ లాగి స్నేహితులతో కలిసి శ్రుతిమించి, అసభ్యంగా ప్రవర్తించి ఆమెను బాగా ఏడిపించాడట, ఆ అవమానాన్ని, బాధనీ భరించలేని అనన్య ఇంట్లో ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టి చెయ్యి కోసుకుని పడి ఉంటే, రోజూ ఆ సమయంలో వచ్చి తన పని చేసుకుని ఆ పిల్లకి తినడానికి ఏదో ఒకటి చేసిపెట్టే పనమ్మాయి సూర్య చూసి .. పక్కింటి  వాళ్ళ సాయంతో ఆసుపత్రిలో చేర్చి, అప్పుడు తల్లి తండ్రులకి ఫోన్ చేస్తే పరిగెట్టుకుంటూ వచ్చారు.

మర్నాడు విషయం తెల్సిన స్కూల్ వాళ్ళు పరిగెట్టుకుంటూ ఆసుపత్రికి వెడితే,రామనాథం మాష్టారు ముందు అభిరాం దగ్గరికి వెళ్ళి క్లాస్ అందరిముందూ అభిరాం చెంప పేలగొట్టీ, వాడి చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుంటూ తన బండి మీద కూచోబెట్టి .. ఆస్పత్రికి తీసికెళ్ళారు .. ఆయన కోపం చూసి బిక్కచచ్చిపోయిన అభిరాం నోరు పెగల్లేదు, ప్రతిఘటించలేదు. 

" చూడు .. నువ్వు చేసిన నిర్వాకానికి తట్టుకోలేక ఆ పిల్ల ఏం చేసిందో, ఇప్పుడు తనకేదైనా జరిగితే తిరిగి నువ్వు ప్రాణం పొయ్యగలవా! అయినా ఈ పరిస్థితుల్లో నీ చెల్లెలుంటే నువ్వు తట్టుకోగలవా! .. చదువు సంస్కారాన్ని , తెలివిని కలిగించాలి .. ఇప్పుడు నీకు వ్యతిరేకంగా నేనే సాక్ష్యం ఇస్తాను, మీ నాన్న కాదు, మీ తాత వచ్చినా నీకు శిక్ష పడకుండా తప్పించుకోలేవు, నీకో విషయం తెలుసా నీ అంతట నువ్వు మారాలనీ, నీ తప్పు నువ్వు తెలుసుకోవాలనీ నేనే మణికంఠతో మీ చెల్లితో అలా ప్రవర్తించమని చెప్పాను, అది కూడా మణికంఠ వాళ్ళ నాన్న అనుమతితో, నీ ఎదురుగా నీ చెల్లి అవమాన పడి బాధ పడితేనన్నా నీకు కనువిప్పు కలుగుతుందేమో, బాగుపడతావేమో అని .. అసలు తప్పు మీది కాదు .. పిల్లల్ని కనడం, తిండీ,బట్టా .. అక్కరలేనన్ని సౌకర్యాలు ఇవ్వడంతో బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్న మీ తల్లితండ్రులది .. కూచో ! .. అనన్య కళ్ళు తెరిచి బ్రతికి బట్టకడితే తనకు క్షమాపణ చెప్పి నువ్వు ఇంటికెడతావు, లేదంటే ఇటునుంచి ఇటే పోలీస్ స్టేషన్ కే .. అంతవరకూ నేనూ ఇక్కడే ఉంటాను .. " కాలరుద్రుడే అయ్యాడు రామనాథం.

ఏడుస్తున్న అనన్య తల్లి తండ్రులనీ వదిలిపెట్టలేదు ' బంగారంలాంటి పిల్ల, మనసులో ఎంత ఆవేదన గూడుకట్టుకోకపోతే ఇలాంటి పని చేస్తుంది, ఏ రోజైనా కనీసం పది నిముషాలైనా ఆ పిల్లతో గడిపారా! సంపాదన అవసరమే కానీ అదే జీవితం కాకూడదు .. అయినా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా మీలానే ఉంటున్నారా! పిల్లలతో .. కుటుంబంతో కలిసి గడపరా! " చెరిగి పడేసాడు.

మణికంఠ ద్వారా విషయం తెలిసిన వాళ్ళ నాన్న ఎం.ఎల్.ఏ కాశీవిశ్వనాథం కూడా కొడుకుతో కలిసి వచ్చేడు .. విషయం తెలిసి కొడుకు కోసం పరిగెత్తుకుంటూ వచ్చిన అభిరాం తల్లితండ్రులను కడిగి పడేసాడు రామనాథం.

ఏనాడైనా పిల్లలు ఎలా పెరుగుతున్నారో, ప్రవర్తిస్తున్నారో చూసారా! మన ఇంట్లో తోట చక్కగా పెరగాలంటే కలుపు ఏరిపారేస్తాం, అలాంటిది మన కన్న పిల్లలే కలుపులా తయారవుతుంటే అది మొగ్గగా ఉన్నప్పుడే పెరికి పారేయాలి, వాళ్ళను మంచి తోటలా శ్రద్ధగా పెంచాల్సిన బాధ్యత మనదే, మీరో పోలీస్ ఆఫీసర్, అను నిత్యం ఎన్నో నేరాలూ, ఘోరాలూ చూస్తూ, వింటూ వాటి మధ్య తిరిగే మీకు ఆ అవసరం అర్థం కాలేదా! ఏమ్మా! ఆయనంటే క్షణం తీరిక లేకుండా ఉండే ఉద్యోగబాధ్యతలు, మరి తల్లిగా మీ పిల్లలను పట్టించుకోవలసిన అవసరం, బాధ్యతా మీకు లేవా! ఇదే పరిస్థితి మీ అభిజ్ఞకు వస్తే మీరెంత బాధపడతారు .. మరి ఆ విషయం కొడుక్కు అర్థం అయ్యేలా చెప్పి వాడిని తీర్చి దిద్దాల్సిన అవసరం లేదా! మీరు చెయ్యని పని నేను చెసి వాడికి మంచీ చెడూ అర్థం అయ్యేలా చెయ్యాలనుకున్నాను, దానికి ఇదిగో నా శిష్యుడు, మీ ఎం. ఎల్.ఏ అయిన విశ్వనాథ్ అనుమతితో ఆయన కొడుకు మణికంఠ సహాయంతో మీ వాడిని మార్చాలి అనుకున్నా, ఇంతలోనే ఇలా! " అంటూ బాధగా కూర్చుండిపోయిన ఆయనను చూస్తున్న వాళ్ళకు తమ తమ తప్పులూ, బాధ్యతలూ కూడా తెలిసొచ్చాయి.

సుమారు రెండు రోజులు మృత్యువుతో పోరాడి గెలిచిన అనన్య దగ్గరకు ముందుగా పరిగెట్టిన అభిరాం లోని మార్పు అందరికీ అర్థమైపోయింది . గురువంటే కేవలం పాఠాలు మాత్రం చెబితే చాలదు , వ్యక్తిత్వం తీర్చి దిద్ది జీవితపాఠాలు నేర్పాలి.                                                                                                   

****

No comments:

Post a Comment

Pages