బహుముఖ ప్రజ్ఞాశాలి-శ్రీమతి భానుమతి రామకృష్ణ - అచ్చంగా తెలుగు

బహుముఖ ప్రజ్ఞాశాలి-శ్రీమతి భానుమతి రామకృష్ణ

Share This

బహుముఖ ప్రజ్ఞాశాలి-శ్రీమతి భానుమతి రామకృష్ణ

డా. పోడూరి శ్రీనివాస్ రావు 




భానుమతి పేరు వినగానే స్వాతిశయం, స్వాభిమానం,  చక్కటి అభినయం, అంతకన్నా గొప్ప గానం, మనసుకు హత్తుకునే   రచనా వ్యాసంగం, అన్నిటికీమించి ప్రతిష్టాత్మక భరణీ సంస్థ నిర్వహణ .......... ఇలా ఒకటేమిటి ...  బహుముఖ ప్రజ్ఞాశాలి మన మనోఫలకం ముందు ప్రత్యక్షమౌతుంది. కథానాయికగా, అద్భుతగాయనిగా, సంగీతదర్శకురాలిగా, సినీ నిర్మాతగా, దర్శకురాలిగా, స్టూడియో  అధినేతగా, రచయిత్రిగా .....అన్నింటికీ మించి విలక్షణమైన వ్యక్తిత్వంతో చలనచిత్రసీమలో మహారాజ్ఞిగా... ఓ వెలుగు వెలిగిన భానుమతి లలితకళలకు మెరుగులు దిద్దిన ధీమంతురాలు.   ఆమెకు జ్యోతిషం, చిత్రలేఖనం కూడా వచ్చు.   మద్రాస్ ప్రభుత్వసంగీతకళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసారు భానుమతి.  తిరువయ్యూర్ లో జరిగిన త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలలో పాల్గొని భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి తో కలిసి, గళం కలిపి   “ఎందరో మహానుభావులు” కీర్తనను ఆలపించిన సంగీతసరస్వతి.

కేవలం పద్నాలుగు నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలలోపు ఎంతోమంది సాధించలేని విజయాలను   భానుమతి స్వంతం చేసుకోగలిగింది. పద్నాలుగు సంవత్సరాల వయసు లోనే, ఆమె మొట్టమొదటి సినిమా “వరవిక్రయం” లో నటించింది. పద్దెనిమిదేళ్ళ వయసులో, ఆరోజుల్లోనే, రామకృష్ణారావును ప్రేమించి, వివాహం చేసుకుంది. పంతొమ్మిది సంవత్సరాలకు కొడుకు భరణికుమార్ కు జన్మనిచ్చింది. అపుడే రచయిత్రిగా అవతారమెత్తింది.  ఇరవై ఒక్క సంవత్సరాలకే సొంత సినిమా నిర్మించింది. ఇరవై అయిదు సంవత్సరాలకే స్వంత స్టూడియో నిర్మించింది. ఇరవై ఎనిమిది సంవత్సరాలకు “చండీరాణి” చిత్రానికి దర్శకత్వం వహించింది. ఇలా భానుమతి జీవితప్రస్థానం లో అనేక విశేషాలు .... ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలియచెప్పడానికి.  

భానుమతి సెప్టెంబర్ 7 వ తేదీ 1925 న , ప్రకాశం జిల్లాలోని, మద్దిపాడు మండలం, దొడ్డవరం గ్రామంలో జన్మించింది.తండ్రి శ్రీ బొమ్మరాజు  వెంకటసుబ్బయ్య, తల్లి సరస్వతమ్మ. రెవిన్యూ ఇనస్పెక్టర్ గా పనిచేసే శ్రీ   వెంకటసుబ్బయ్య మంచి సంగీత విద్వాంసుడు.  తండ్రే భానుమతికి తొలిగురువు.  తల్లికూడా సంగీతం నేర్చుకుంది. భానుమతి ఏకసంతాగ్రాహి. భగవంతుడు ఆమెకు ఒకసారి వింటే వెంటనే పాడగలిగే యోగం ప్రసాదించాడు. 

 తల్లి ఇరుగుపొరుగు పిల్లలకు సంగీతం నేర్పుతుంటే, ప్రక్కన కూర్చుని వారితో కలిసిపాడేది భానుమతి. ఇంట్లో గ్రామఫోన్ రికార్డులుఉండేవి. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, హీరాబాయ్ బదోడ్కర్, నారాయణరావు వ్యాస్, బాలగంధర్వ, రోషనారా బేగం వంటి నిష్ణాతులు పాడిన పాటలువింటూ, యధాతధంగా పాడేస్తూవుండేది. సినిమారంగం మీద సదభిప్రాయం లేని కారణంగా ఆ రంగంలో ప్రవేశించడానికి ఎటువంటి ఆసక్తి చూపించలేదు.  డా.గోవిందరాజుల సుబ్బారావు భానుమతి తండ్రికి సన్నిహిత మిత్రుడు. తొలుత సారథి ప్రొడక్షన్స్ వారి ‘మాలపిల్ల’ చిత్రంలో 1938 లో హీరొయిన్ చెల్లెలి పాత్రకు భానుమతిని తీసుకోవడానికి వోప్పించేందుకు ప్రయత్నించారు. భానుమతి తండ్రిగారికి కూడా ఆమె సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. కానీ ఆమెచేత పాటలు పాడించి, రికార్డులుగా ఇవ్వాలనే ఆలోచనలో వున్నారు. అందుకని ఒకసారి మద్రాస్ కు  వెళుతూ భానుమతిని వెంట తీసుకెళ్ళారు. అక్కడ గూడవల్లి రామబ్రహ్మం గారిని కలవడం జరిగింది. అచట టంగుటూరి సూర్యకుమారిని చూసి తనుకూడా సినిమాల్లో నటించేందుకు భానుమతి సుముఖత చూపింది. 

అప్పట్లో రేలంగి వెంకట్రామయ్య ప్రొడక్షన్ మేనేజర్ గాను,సహాయ నటీనటులను సమీకరించి  నిర్మాణ సంస్థలకు అందజేసే వ్యాపకం లో వుండేవారు. ఆయనవెంట తండ్రితో కలిసి  కాకినాడ వెళ్లి భానుమతి చిత్తజల్లు పుల్లయ్యను కలిసారు.అది 1939 వ సంవత్సరం. అప్పుడే ‘వరవిక్రయం’ సినిమా నిర్మాణం కాబోతోంది.  భానుమతిని అందులో “కాళింది” పాత్రకు ఎంపిక చేసారు. అదే భానుమతికి తొలిచిత్రం. అందులో ఆమె “పలుకవేమి నా దైవమా పరులు నమ్మేది న్యాయమా రామా”  అనే త్యాగరాయ కృతిని ఆలపించింది. సినిమాల్లో త్యాగరాయ కృతిని ఆలపించిన తొలి గాయని భానుమతే. అదే సినిమాలో “ స్వాతంత్రమే లేదా ఈ స్త్రీజాతిలోనా”, “జాతికి నీసూత్రంబే సంపత్కరమౌ సాధనము” అనే మరో రెండు పాటలు కూడా పాడింది.  అపుడు భానుమతికి నెలకు 150 రూపాయల జీతం ఇచ్చేవారు. సినిమా శతదినోత్సవం చేసుకుంది. ఆ తర్వాత భవభూతి కావ్యము ను ‘మాలతీమాధవం’ పేరుతో 1940 లో సినిమాగా నిర్మించారు. అందులో భానుమతిది మాలతీ పాత్ర.  భానుమతి పారితోషికం 1500 రూపాయలు. కానీ ఆ చిత్రం ఫ్లాపయ్యింది. 

 భానుమతి కలకత్తాలోసినిమా షూటింగుల్లో ఉంటున్నప్పుడు శ్రీ విశ్వనాధ కవిరాజు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణ, శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి లతో పరిచయం ఏర్పడి, వారివద్ద పద్యాలు ఎలా వ్రాయాలో నేర్చుకుంది.

కవిరాజు భానుమతికి కథలు ఎలా వ్రాయాలో నేర్పారు.  అప్పుడే  ఆయన భానుమతిచేత “మరచెంబు” అనే కథ వ్రాయించారు.  ఆ కథ ‘చిత్రగుప్త’ అనే పక్షపత్రికలో అచ్చయ్యింది. అప్పుడు భానుమతికి పద్నాలుగేళ్ళు.  ఆ తర్వాత భానుమతి పి. పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన ‘ధర్మపత్ని’లో నటించింది, 1941 లో. ‘భక్తిమాల’ చిత్రంలో నటిస్తుండగా అందులో నృత్య సన్నివేశాలు ఉండడంతో వెంపటి సత్యం చేత భానుమతికి నృత్యశిక్షణ ఇప్పించారు. ఆ చిత్ర నిర్మాణం పూర్తయ్యాక భానుమతి ఒంగోలు కు వచ్చేసింది.భానుమతి తండ్రి, కొల్హాపూర్ నుంచి ఒక మరాఠీ విద్వాంసుడిని పిలిపించి సంవత్సరంపాటు భానుమతికి హిందుస్తానీ సంగీతంలో శిక్షణ ఇప్పించారు.  ఆ తర్వాత ఆమె వీణ, సితార్ వాద్యాలను వాయించడం నేర్చుకుంది. 

ఫేమస్ సినీ అండ్ స్టార్ కంబైన్స్ వారు మద్రాస్ వేల్ స్టూడియో లో హెచ్.వి.బాబు దర్శకత్వంలో 1943 లో “కృష్ణప్రేమ”  చిత్రం నిర్మించారు. అందులో శాంతకుమారి రాధగా నటించగా భానుమతి చంద్రావతిగా నటించారు.   భానుమతికిఅది ఐదవ చిత్రం.ఆ చిత్రానికి పి. ఎస్. రామకృష్ణారావు సహాయదర్శకుడు. అతడిని చూడగానే ప్రేమలో  పడిపోయింది భానుమతి. దానికితోడు ఆచిత్రం షూటింగ్ లో జరిగినకొన్ని సంఘటనలు ఆప్రేమను  మరింత బలపరచాయి. కానీ భానుమతి తండ్రి ఆమె రామకృష్ణను పెళ్లి  ఆడడానికి అంగీకరించలేదు. తరువాత పరిస్థితులు సానుకూలంగా మారడంతో,  8 ఆగస్ట్ 1943 న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అలా ‘కృష్ణప్రేమ’ చిత్రం భానుమతిని వివాహబంధం లోకి లాగింది. గృహిణిగా జీవితాన్ని గడపాలని భర్తతో కలిసి అత్తగారి ఊరు పుంగనూరు వెళ్ళే ప్రయత్నం చేసింది భానుమతి. కానీ, సినిమా ప్రపంచంలో మహరాణిలా ఏలాలని రాసిపెట్టి వుంటే, పుంగనూరు ప్రయాణం ఎలా వీలవుతుంది?

సేనియర్ నటుడు ముదిగొండ లింగమూర్తి భానుమతిని వాహినీ అధిపతి బి.యెన్.రెడ్డికి పరిచయం చేసారు. అప్పట్లో బి.యెన్.రెడ్డి నాగయ్య హీరోగా, జయమ్మ హీరోయిన్ గా ‘స్వర్గసీమ’ చిత్రాన్ని నిర్మించే ఉద్దేశంలో వున్నారు. భానుమతిని అందులో వ్యాంప్ పాత్ర కోసం ఎంపిక చేసారు. 1942 – 43 లో రెండవ ప్రపంచయుద్ధం తారాస్థాయిని చేరుకోవడంతో అందరూ వాహినీ సంస్థను ఖాళీచేసి తాడిపత్రి వెళ్ళిపోయారు.

 యుద్ధం హడావుడి తగ్గుముఖం పట్టాక, ‘స్వర్గసీమ’ నిర్మాణం ఊపందుకుంది. లింగమూర్తి నిర్మాణ వ్యవహారాలను చూసుకున్నారు. 10 జనవరి 1946 న  విడుదలైన ‘స్వర్గసీమ’ సినిమా అఖండవిజయం సాధించి, అనూహ్యమైన ధనార్జన చేసింది.భానుమతి లాంటి నటిని  చూడాలంటే, స్వర్గసీమ చిత్రాన్ని చూడాలని అందరూ చెప్పుకున్నారు. ఆమె పాత్ర తీరు మూడు దశల్లో వుంటుంది. మొదట భాగవతులబృందంలో అమాయకమైన నటి. తరువాత ఆమె కట్టు బొట్టు తీరు అన్నీ మారతాయి. వ్యాంప్ లా అయ్యేందుకు, సుబ్బులు సుజాతలా మారుతుంది. చివరలో  పశ్చాత్తాపం. బ్లడ్ అండ్ సాండ్ అనే ఆంగ్లచిత్రంలోని హమ్మింగ్ తీసుకుని “ఒహోహో పావురమా” పాటకు జీవంపోస్తే,ఆ పాటకు భానుమతి అభినయం ఈనాటికీ నిత్యనూతనంగా అనిపిస్తుంది. 1945 లో స్వర్గసీమ చిత్రంనాటికి భానుమతి నాట్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. స్వర్గసీమ చిత్రం తెలుగులోనే కాదు....తమిళంలోనూ వందరోజులు ఆడింది.

            బి.యెన్. రెడ్డి ‘వందేమాతరం’ సినిమా షూటింగ్ కోసం హంపీ వెళ్ళినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి ప్రేమకథ ఏదైనా తీయాలని 1939 లోనే అనుకున్నారు. ఆలోచన రావడంతడవుగా, దేవులపల్లి కృష్ణశాస్త్రి ని కాకినాడనుంచి  పిలిపించి ‘మల్లీశ్వరి’ సినిమాను ఒక కళాఖండం గా రూపుదిద్దించేందుకు ప్రణాళిక రచించి మాటలు, పాటలు రాయించారు దర్శకుడు బి.ఎన్.రెడ్డి. పాటల రికార్డింగ్ కి ఆరు నెలలు పట్టింది. భానుమతితో వేగటం అప్పటికే కష్టమైపోయింది. అందుకని రేవతి అనే అమ్మాయిని మల్లీశ్వరి పాత్రకోసం పరీక్షించారు. కానీ భానుమతిస్థాయి ఆ అమ్మాయికి లేదనిపించి భానుమతినే ఆ పాత్రకు తీసుకున్నారు. అందులో ఉషాపరిణయం యక్షగానం ఒక గొప్ప నాట్యశిల్పం.  దానికోసం పసుమర్తి కృష్ణమూర్తి రెండు నెలలకు పైగా రిహార్సల్స్ చేయించారు. ఆ చిత్రం 20-12-1951  న విడుదలైంది. విజయవాడలో వందరోజులు ఆడినా అందరూ గొప్ప క్లాసిక్ అన్నరేకాని కమర్షియల్  సినిమా అనలేదు. ఆర్ధిక విజయాన్ని అందుకోలేకపోయింది. జయదేవుని అష్టపది ‘ధీరసమీరే యమునాతీరే’ ట్యూన్ ఆధారంగా ‘మనసున మల్లెల మాలలూగెనే’ అనే పాట రూపు దిద్దుకుంది. ఈ చిత్ర నిర్మాణ సమయంలో బెంగాలీ దర్శకుడు దేవకీబోస్ మద్రాస్ వచ్చి మల్లీశ్వరి సెట్ లో బి.ఎన్.ను కలిసారు. అపుడు బోస్ కు భానుమతిని పరిచయం చేయడం జరిగింది.ఆమె చేత బోస్ రవీంద్రుని ‘గీతాంజలి’లోని కొన్ని పద్యాలూ పాడించుకున్నారు.  భానుమతి ఎన్టీరామారావు తో చండీరాణి, చింతామణి, సారంగధర, వివాహబంధం, తోడు-నీడ, బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం, తాతమ్మ కల వంటి చిత్రాలలో నటించింది.

 ముందుగా అనుకున్నప్రకారం విజయా వారి ‘మిస్సమ్మ’ సినిమాలో మిస్సమ్మ టైటిల్ పాత్ర భానుమతిదే. నాలుగు రీళ్ల సినిమా పూర్తయ్యాక ఒకరోజు, వరలక్ష్మీవ్రతం నాడు పూజాకార్యక్రమాలు పూర్తిచేసుకుని షూటింగ్ కి భానుమతి కాస్త ఆలస్యంగా వెళ్ళింది.  నిర్మాత చక్రపాణి కి కోపం వచ్చింది. ఆలస్యమైనందుకు క్షమాపణ చెప్పమన్నారు.  ముందురోజు సాయంత్రం షూటింగ్ ప్యాకప్ చెప్పేటప్పుడు మరునాడు ఆలస్యంగా వస్తానని ప్రొడక్షన్ సిబ్బందికి నోట్ రాసి చక్రపాణికి ఇవ్వమని చెప్పానని భానుమతి వాదించింది. అందుచేత క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయింది.  ఆ సంఘటనకు ఎంతో కోపం తెచ్చుకున్న చక్రపాణి, అంతవరకు తీసిన నాలుగు రీళ్ళను కాల్చివేసి భానుమతి స్థానం లో సావిత్రిని తీసుకొని సినిమా పూర్తిచేసారు. ఒకవిధంగా మిస్సమ్మ సినిమా సావిత్రి చిత్రసీమలో నిలదొక్కుకోవడానికి దోహదపడింది.భానుమతి 1954 లో  ‘చక్రపాణి’ అనే చిత్రం నిర్మించింది. విజయా నిర్మాత చక్రపాణి మీద కక్ష సాధింపుకే భానుమతి సినిమాకు ఆయనపేరు పెట్టిందని సినీ పండితులు గుసగుసలాడుకున్నారు.  ఆ సినిమాకి భానుమతి తొలిసారి సంగీతదర్శకత్వం వహించింది. 

 వినోదా వారి ‘దేవదాసు’ సినిమాలో పార్వతి పాత్రకు నిర్మాత డి.ఎల్.నారాయణ మొదట భానుమతికి ఆఫర్ ఇచ్చారు. కానీ, భానుమతి ఆ ఆఫర్ ను తిరస్కరించింది. ఎందుకంటే ‘దేవదాసు’ చిత్రనిర్మాత డి.ఎల్.నారాయణ గతంలో భరణి స్టూడియో లో మేనేజర్ గా పనిచేసారు.  “నా దగ్గర పనిచేసినవాడు తీసే సినిమాలో నేను నటించాదమా... అది  నాకే అవమానం” అంటూ తిరస్కరించింది. తరువాత ఒకరకమైన ఫాల్స్ ప్రెస్టేజ్ తో డి. ఎల్. నారాయణ నిర్మించిన “కన్యాశుల్కం” చిత్రం లో మధురవాణి పాత్రను కూడా వదులుకుంది. పొగరుమోతుతనంతో వ్యవహరించే భానుమతి వ్యవహారశైలి ఎక్కువమంది నిర్మాతలకు నచ్చలేదు.  “పాత్రలు నా దగ్గరకు వచ్చాయి గాని నేను పాత్రలవద్దకు వెళ్ళలేదు.” అని ఆమె గర్వంగా  చెప్పుకునేది.  ‘హరిశ్చంద్ర’ సినిమాలో చంద్రమతి పాత్ర చెయ్యమంటే చెయ్యనంది.

            భానుమతిది విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం. ఆమెకు గర్వమని, అహంభావమని దూరంగా చూసినవాళ్ళు  అనుకుంటారు.  అది కేవలం తన ఆత్మవిశ్వాసం అని భానుమతి చెప్పుకున్నారు. మగ ఆధిక్యం ప్రదర్శించే ఈ చిత్రసీమలో అలా పొగరు, వగరు గానే వుండాలని ఆమె చెబుతూండేవారు.  1966 లో వచ్చిన  “పల్నాటియుద్ధం”లో భానుమతి నాయకురాలు నాగమ్మ పాత్రలో కన్నాంబనే మరిపించింది. లైలామజ్ఞు చిత్రంలో భగ్నప్రేమికురాలిగా, బాటసారిలో మాధవి పాత్రలో జీవించింది. విప్రనారాయణ చిత్రంలో పరమభక్తుడైన విప్రనారాయణుని భ్రష్టుపట్టించే పాత్రలో భానుమతి మంచి మార్కులు తెచ్చుకుంది.

 అనురాగం, అంతస్తులు, పుణ్యవతి వంటి సినిమాల్లో సెంటిమెంట్ నిండిన పాత్రల్లో రాణించింది.“అంతా మన మంచికే”  సినిమాలో అన్నీతానై నిలిచి సినిమాను గొప్ప హిట్ చేసింది. అప్పటినుండి భానుమతి ధోరణి మారిపోయింది. మల్లీశ్వరి పాత్రలోని ముగ్దత్వం మరుగున పడిపోయింది. మగరాయుడిలా పాత్ర పోషణ చెయ్యడం ప్రారంభించింది.  విచిత్రవివాహం , అమ్మాయిపెళ్ళి, మంగమ్మగారి మనవడు, బామ్మ మాట బంగారు బాట చిత్రాల్లో ఈ ధోరణి బాగా కనిపిస్తుంది. తమిళంలో కూడా భానుమతి చాలా సినిమాల్లో నటించింది. “మాన్ మగన్ తెవి” వంటి చిత్రాల్లో కొన్ని హస్యపాత్రలు కూడా పోషించింది.  భానుమతి విప్రనారాయణ, బాటసారి, వివాహబంధం   వంటి సినిమాల్లో సంగీతం చేసానని చెప్పుకుంది.

                ఆమె మంచి రచయిత్రి. ఆమె రచించిన “అత్తగారి కథలు” కథాసంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ‘నాలో నేను’ పేరుతో భానుమతి ఆత్మకథ రాసుకుంది.  లలితకళా అకాడమీ కి భానుమతి ఐదేళ్ళు సభ్యురాలిగా వుంది. తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా వ్యవహరించింది. మద్రాస్ సాలిగ్రాం లో తనపేరిట ఒక పాటశాలను నెలకొల్పింది. ‘చండీరాణి’ సినిమాను మూడు భాషల్లో నిర్మించి,  అందులో ద్విపాత్రాభినయం చేసి, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహించిన వ్యక్తిగా భానుమతిపేరు రికార్డులకెక్కింది.

1966 లో ఆమెకు భారతప్రభుత్వం “పద్మశ్రీ” అవార్డ్ ను బహూకరించింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “రఘుపతి వెంకయ్య అవార్డు” తో సత్కరించింది.  ‘అన్నై’, ‘అంతస్తులు’, ‘పల్నాటియుద్ధం’ సినిమాలలో ఆమె నటనకు ప్రాంతీయ చిత్రాల కేటగిరి లో జాతీయబహుమతులుఅందుకుంది.   అన్నాదురై ఆమెను ‘నడిప్పుకుం ఇళక్కనం’ (నటనకు వ్యాకరణం) అనే బిరుదును ప్రదానం చేసారు.  1984  లో తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదుతో భానుమతిని సత్కరించింది. ఆంద్ర విశ్వవిద్యాలయం  గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.  2013 లో తంతి తపాలా శాఖ భానుమతి స్మారక స్టాంప్ ను విడుదల చేసింది. యాభై సంవత్సరాలక్రితం కొలంబియా రికార్డింగ్ కంపనీ వాళ్ళు భానుమతి పాటల ఆల్బం విడుదల చేస్తూ రికార్డు స్లీవ్ మీద ముద్రించిన పరిచయవాక్యాలను చదివితే భానుమతి ప్రజ్ఞ విదితమౌతుంది. 

 ఆ రికార్డు కవర్ మీద  “స్వర వాహిని, స్వరమోహిని, స్వరారోహ స్వరవర్నిని, చలనచిత్ర ధరణి నేలు భరణి రాణి భానుమతికి, సంగీతపు సామ్రాజ్ఞికి సాటి లేరు...లేరు...లేరు.   సప్తస్వరసాగరాల గుప్తమ్మగు అమృతమ్ము చిలికి చిలికి వెలికితీసి నిలుపుకున్నదా గళమ్ము....  ఆ మంగళ గళమున చిరుపొగరు,  వగరు రంగరించి సరిగమపదనిసలు ఆమె స్వరసుధలకు సంతరించె”  అంటూ ముద్రించారు. ఇంతకన్నా గొప్ప పొగడ్త మరేం కావాలి.  భానుమతికి ఒకే కుమారుడు....డాక్టర్ భరణి.

 భానుమతి 2005 డిసెంబర్ 24 న మద్రాస్ లో స్వర్గస్తులయ్యారు. 

(మిత్రుడు శ్రీ షణ్ముఖ కు కృతజ్ఞతలతో )

 *** 


No comments:

Post a Comment

Pages