శివం -67 - అచ్చంగా తెలుగు
                                                  శివం -67
                                                                                         రాజ కార్తీక్  


(హర సిద్దు గాఢమైన నిద్ర లోకి జారుకున్నాడు...లేచి చూసే సరికి కుంభన్న కనపడలేదు...బొజ్జ లింగం, తను, తప్ప ఎవరూ లేరు)
హర సిద్దు కి ఏమీ అర్థం కావట్లేదు...
"కుంభన్న కుంభన్న" అనుకుంటూ ఎనిమిది దిక్కుల వైపుకు కేకలు వేసాడు.
దూరంగా ఒక ఊరు మాత్రం కనబడుతుంది.

కుంభన్న కనపడకపోయేసరికి హర సిద్దు గొంతు గద్గదమయ్యింది. తన పిలుపు లోనే మనిషి ఏడుస్తున్న విధంగా స్వరం మారింది. కుంభన్న తనని వదిలేసి వెళ్ళాడా అని అనిపించింది.
"ఎందుకులే అలా అనుకోవటం, పొరపాటున అతనికి ఏమైనా ప్రమాదం జరిగిందా" అని ఆలోచనలో పడి చుట్టుపక్కల చాలా సమయం తిరిగి చూశాడు.

ఏమీ తెలియక పోయినా కుంభన్న మాటలు విని తాను ఇంత దూరం వచ్చాడు.

మళ్లీ కుంభన్న మాటలు విని తను మోసపోయాడా?

అలా మోసం చేశాడు అనుకుంటే తన దగ్గర ఉండి ఏ విలువైన వస్తువులు కానీ కుంభన్న తీసుకోలేదు ఏనాడు తన దగ్గర డబ్బు తీసుకోలేదు అనుకున్నాడు హర సిద్ధుడు.

ఒకవేళ తనకు వ్యతిరేకమైన వారు కుంభన్న చేత ఇలా బురిడీ కొట్టించే ఉద్దేశంతో, తనను ఒక వెర్రివడిని చేశారా?

హర సిద్ధుని మనసు మాత్రం అతను చాలా మంచి వాడు, అలా చేసే వాడు కాదు అని చెబుతోంది.

"కుంభన్న కుంభన్న "అనుకుంటూ జీరబోయిన గొంతుతో దీనంగా అరుస్తున్నా డు హర సిద్ధుడు.

హర సిద్దుని మనసులో దుఃఖం పెల్లుబికుతోంది.

కుంభన్న తనతో "నిన్ను ప్రపంచం మొత్తం పొగడాలి, ధనం ఇస్తా అని చెప్పు, నీ అంత మంచి వాడు లేడు, ఒక మంచి అవకాశం ఇస్తాను", అనే మాటలు గుర్తు చేసుకొని తన అసమర్థతను తిట్టుకుంటూ బాధపడుతున్నాడు హర సిద్ధుడు.

అటు ఇటు తన ఎంత దూరం నడవగలడో అటు తిరిగి అటు పొలం గట్లలో పనిచేస్తున్న వారిని వివరాలు అడిగి కనపడ్డాడా? అని అడిగి తను అటువైపు రాలేదు నిర్ధారించుకొని, చుట్టుపక్కల ప్రాంతాల్లో కుంభన్న లాంటివాడు ,అలాంటి పోలికలు కలిగిన వ్యక్తులు ఎవరూ రాలేదా నిర్ధారించుకున్నాడు.
బాటకు ఒకవైపుగా బొజ్జ లింగం ఎద్దుల బండి బండ్ల మీద ఉంది.

హర సిద్ధుడు తన రాజ్యం దాటి అవతల రెండు మూడు రాజ్యాల దగ్గరికి వచ్చేశాడు.
ఇక కుంభన్న కనపడలేదు. తను చేసిన ప్రయత్నాలు మొత్తం విఫలమయ్యాయి.

ఎవరినీ ఏమీ అనలేని హర సిద్ధుడు, తనని తాను తిట్టుకోవడం, మొదలుపెట్టాడు.

ఎవరో తెలియని వారు వచ్చి ఏదో ఆప్యాయంగా మాట్లాడి, తనతో హాస్యభరితంగా చలోక్తులు విసురుతూ తన మీద తనకు మంచి మాటలు చెప్తూ... తను ఇలా వెర్రివాడిని చేశారు అందుకే కదా ప్రపంచం నన్ను తిట్టేది నా వంటి తెలివి లౌక్యం లేని వాడు జీవితంలో ఎలా బతుకుతాడు, ఇటువంటి మోసమే కదా తన మీద తన గురువు గారికి కూడా చేసింది అయినా జీవితంలో పాఠం నేర్చుకో పోతే ఎట్లా, గుడ్డి నమ్మకంలో కళ్ళుండి గుడ్డి వాడనయ్యాను. లౌకిక జ్ఞానం లేని నాలాంటి మూర్ఖులకు పడవలసిన శిక్ష పడింది. అయినా నా బుద్ధి మారదు తనకి కొంచెం ఇక ఐహిక తెలివి ఇవ్వమని నన్ను వేడుకున్నాడు. తన దురదృష్టాన్ని తాను మరోసారి తిట్టుకుంటూ తన పాదరక్షలతో తనే కొట్టుకోవాలా నిర్ధారించుకొని, ఏదో మూల కుంభన్న మంచివాడు నమ్మడం వల్ల చివరిగా కనపడుతున్న ఆ ఊరిలో వివరాలు అడుగుదామని నిశ్చయించుకున్నాడు.

మా ఊరి వైపు వెళ్తున్న హర సిద్దునికి మార్గమధ్యంలో ఆలోచన దొంతరలు కమ్ముతున్నాయి.

తమ ఎద్దుల బండి మీద ఉదయాన్నే బయలుదేరినప్పుడు తనకు తెలిసిన కొంతమందికి ఆ బొజ్జశివలింగం తీసుకెళ్తూ ఎదురయ్యాడు. వారు అదేమిటని అడిగితే ఏం చెప్పాలి, కుంభన్న మాటలు నమ్మి తనకి వచ్చిన వేరే పని కూడా వదులుకొని ఇది చేశాడు. ఇప్పుడు తన జీవన భృతి ఎలా? తనకు ఎప్పుడు వ్యాపారస్తుల మనస్తత్వం వస్తోంది. అయినా ఏం చేస్తాంలే, కొన్ని జీవితాలు మోసపోవడానికి, ఓడిపోవడానికి   అవమాన పడటానికి పనికి వస్తాయి, అందులో మొట్ట మొదటి వాడిని నేనే...

ఆ వూరిలో దగ్గరికి వెళ్తుండగా కనబడిన నా ఆలయ గోపురానికి ఆర్ధ్రంగా నమస్కారం చేసుకున్నాడు సిద్ధుడు.

ఎదురుగా వస్తున్నారు ఒక గుంపు. చిన్న చిన్నగా హర సిద్ధుడు వారిని సమీపిస్తున్నా డు... అక్కడ కదులుతున్న గుంపు కూడా అతని వైపు వేగంగా సమీపిస్తున్నా రు. హర సిద్దుడు మాత్రం తన వైపు ఎందుకు వస్తున్నారు... కొంపదీసి తనొక గూఢచారి అనుకుని దండించడానికి వస్తున్నారా.. ఇంకా జీవితంలో ఆ ఒక్క సన్మానము జరగలేదు, అపరిచితుడు నమ్మినందుకు జరగాల్సిన శాస్త్రి జరగబోతుంది లే, అనుకుని మౌనంగా ఉన్నాడు.

ఆ గుంపులో ఒక పెద్దమనిషి హర సిద్దు దగ్గరికి వచ్చాడు.

వెను వెంటనే పక్కన ఒక మనిషి వచ్చి "కుంభన్న వివరాలు అడిగింది ఇతనే నన్ను, అచ్చు మన గుడిలో ఉండే శివలింగం అలాగే ఒక లింగం తీసుకు వచ్చాడు," అని వేలుపెట్టి చూపించాడు.

ఆ పెద్దమనిషి పూర్తి వినయ విధేయలతో తన భుజం మీద కండువా నడుముకి కట్టుకుని,
"అదిగో, ఆ కనపడుతున్న ఆలయానికి ధర్మకర్త నేను. నా పేరు ధర్మయ్య. బాబు! నువ్వు  తెచ్చిన బొజ్జ శివలింగం ఏదని అడిగాడు.
హర సిద్దుకి ఏమీ అర్థం కాలేదు..
"ఇక్కడకి కుంభన్న వచ్చాడా" అని యాంత్రికంగా అడిగాడు.

ధర్మయ్య "బాబు ఆ కుంభయ్యా అంటే ఎవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరుడు" అంటూ ఆనందంగా చెబుతున్నాడు.

వెనక గుంపు అంతా హరహర మహాదేవ్ అని నన్ను స్మరిస్తున్నారు బిగ్గరగా..

హర సిద్ధుడు కొయ్యబారి పోయాడు. అతని కళ్ల వెంట నీళ్లు..

ధర్మయ్య ఆనందబాష్పాలతో "ఏం పేరు నీది?" అని అడిగాడు.

కాసేపాగి తేరుకున్న హర సిద్ధుడు
తన పేరు "హర సిద్ధుడు" అని చెప్పాడు.

"హర సిద్దు, హర సిద్దు, హర సిద్దు" అన్న నినాదంతో ధ్వనించింది ఆ ప్రాంతం ...

గుంపు "హరహర మహాదేవ్" అంది.

హరసిద్ధుడి నోటి వెంట మాటరాలేదు.

ఎప్పుడూ తెలియని ఒక ఆనంద పారవశ్యంలో తనతో ఉంది నేను అనుకుని పులకించి పోతున్నాడు.

అవును కుంభన్న నేనే...

అంతా నా లీలలో భాగమే...
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages