అటక మీది మర్మం - 34 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం - 34

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) - 34
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
 


(తండ్రి కోరికపై కనిపించకుండా పోయిన ఫిప్ సాహిత్యాన్ని వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకొన్న నాన్సీ ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని గమనించి, తన స్నేహితురాళ్ళ సహాయంతో అతణ్ణి పట్టుకోవటానికి విఫలయత్నం చేస్తుంది. తరువాత అటక మీదకు రహస్య మార్గం ఉందేమోనని వెతుకుతున్న ఆమెతో, కనిపించిన అస్తిపంజరం తమకేదో సైగ జేస్తున్నట్లు బెస్ చెబుతుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన నాన్సీకి కొన్ని ఉత్తరాలతో పాటు పాటలు దొరుకుతాయి. తన స్నేహితురాళ్ళతో జెన్నర్ ఆఫీసుకి వెళ్ళిన ఆమెకు డైట్ అన్న వ్యక్తి, బెన్ బాంక్స్ పేరుతో చలామణీ అవుతున్నట్లు గ్రహిస్తుంది. ఫిప్ వ్రాసిన పాత ఉత్తరాలను బట్టి ఆమె అటక మీద బీరువా వెనుక ఉన్న రహస్య గదిని కనుక్కొంటుంది. ఆ చీకటి గదిలో కనిపించిన పియానో మీటలన్నీ అదేపనిగా నొక్కిన నాన్సీ పియానోలోంచి ఒక రహస్యపు అర తెరుచుకోవటం, దానిలో రిగ్గిన్ అన్న వ్యక్తి పారవేసుకొన్న కార్డు కనిపించాయి. భోజనాలయ్యాక, ముసలాయన తాను క్రింద ఆగంతకుడి కోసం మాటు వేస్తానని, ఆ అమ్మాయిని అటక మీద విషయం చూడమని, ఆగంతకుడు కనిపిస్తే తాను గుడ్లగూబలా అరిచి సంకేతమిస్తానని చెబుతాడు. పాపను నిద్రపుచ్చాక, నాన్సీ అటక మీద చీకటి గదిలో పియానో బటన్లను అదేపనిగా నొక్కగా, ఆమె ముందుకు పళ్ళెంలాంటిది వచ్చి, దానిలో ఎన్నో పాటలు ఉన్న కాగితాల చుట్టలు దొరుకుతాయి. వాటిని కనుగొన్న ఆనందంలో ఉన్న ఆమెను, ఇన్నాళ్ళూ ఆగంతకుడిలా తిరిగిన బుషీట్రాట్ వెనుకనుంచి పట్టుకొని, ఆమె చేతిలోని పాటల కట్టను లాక్కుంటాడు. ఆమె కాళ్ళూ చేతులను కట్టేసి, తన జేబులోంచి బ్లాక్ విడో సాలీడుని బయటకు తీసి పియానోపై వదులుతాడు. తరువాత ఆ గదికి, అటకకు మధ్య ఉన్న తలుపును మూసి, అడ్డ గడియను పెట్టి, గదిలో వెలిగే కొవ్వొత్తిని ఆర్పేసి, అతను సొరంగం ద్వారా బయటకు వెళ్ళిపోతాడు. బ్లాక్ విడో బారిన పడకూడదని కొట్టుకొనే నాన్సీని ఆమె మిత్రుడు నెడ్ వచ్చి రక్షిస్తాడు. ఫిప్ గురించి విన్న ఆమె స్నేహితులు వెంటనే కంగారుగా అటక దిగి, తోట వైపు పరుగుతీస్తారు. కొద్దిసేపటికి కోలుకొన్న ఫిప్ మౌనంగా రెండవ అంతస్తుకి వెళ్ళిపోతాడు.  అదే సమయానికి అక్కడకు వచ్చిన తన తండ్రి కారులో బుషీట్రాట్ చిరునామా తెలుసుకొందుకు డైట్ యింటికి బయల్దేరుతుంది.  తన కూతురికి ప్రాణాపాయాన్ని విన్న డ్రూ ఆమెను చిన్నగా మందలిస్తాడు.  తరువాత. . ) 
@@@@@@@@@@

"లేచిన వేళ బాగుంది కనుక సమయానికి మేమొచ్చి ఆదుకొన్నాం" నెడ్ ఆమెను చూస్తూ అన్నాడు.  "రాత్రి పనుండి రివర్ హైట్స్ కి వచ్చాను.  పని పూర్తయ్యాక ఎందుకో నిన్ను చూడాలనిపించింది.  ఎంత రాత్రయినా సరే, నిన్ను కలిసి మాట్లాడాలనిపించి మీ యింటికెళ్ళాను.  మిసెస్ గ్రూ నువ్వు కొంతకాలంగా ప్లెజెంట్ హెడ్జెస్ లో ఉంటున్నావని చెప్పింది.  మార్చ్ యింటికి దారి చెబుతారని బెస్, జార్జ్ ల యింటికెళ్ళాను.  వాళ్ళు దారి చూపిస్తామని చెప్పి నాతో వచ్చారు."

నాన్సీలో చురుకుదనం, చాతుర్యం అంటే నెడ్ కి యిష్టం.  అందరు యువకుల్లాగే తానభిమానించే నాన్సీ తనతో ప్రేమగా మాట్లాడాలని కోరుకొంటాడు.  ఏకాంతం దొరికినప్పుడు తన అభిమానాన్ని మాటల్లో వ్యక్తపరుస్తూంటాడు.  కానీ అతని అభిమానాన్ని ఆమె చాలా తేలికగా తీసుకొన్నట్లు ప్రవర్తిస్తుంది.  ఆమె ప్రవర్తన అతన్ని కొద్దిగా నిరాశపరిచినా, తన పట్ల అతని అభిమానం తగ్గదు.

వాళ్ళు మాటల్లో ఉండగానే డ్రూ కారు రివర్ హైట్స్ ప్రాంతానికి చేరుకొంది.  బెస్ యింటికి వెళ్ళిపోతానని కోరటంతో డ్రూ జార్జ్, బెస్ లను వాళ్ళ యిళ్ళ దగ్గర దిగవిడిచాడు.

"నీకు, మీ నాన్నకి అవసరమనుకొంటే మీ తోడుగా నేనూ వస్తాను" నెడ్ చెప్పాడు.

"వద్దు. ఉండిపో!" నాన్సీ చెప్పింది.

"ఉండనీ!  తెల్లవారేలోగా మనకు తోడుగా మరొక మనిషి ఉంటే మంచిదనిపిస్తోంది" డ్రూ చెప్పాడు.    "అది కూడా కండపుష్టి ఉన్న మనిషి."

డ్రూ కారులో వాళ్ళు డైట్ యింటికి చేరుకొనే సమయానికి ఆ ప్రాంతం యింకా చీకట్లోనే ఉంది. ఐనప్పటికీ అతను డైట్ వీధితలుపుని కొట్టాడు.  చివరికి డైట్ తలుపు తీసి వారిని లోనికి రానిచ్చాడు.

"అర్ధరాత్రి వచ్చి యిలా తలుపు కొట్టడంలో అర్ధమేమిటి?" కోపంతో వారిపై విరుచుకొని పడ్డాడతను.

న్యాయవాది అనవసరంగా వాదించదలుచుకోలేదు.  తాను రిగ్గిన్ ట్రాట్ మీద కేసు వేయబోతున్నానని, అందుకే అతని చిరునామా కావాలని అడిగాడు.

"వాడెవడో కూడా నాకు తెలియదు" లారెన్స్ డైట్ బుకాయించాడు.  "అర్ధరాత్రి నన్ను నిద్ర లేపి, యిలాంటి చెత్త ప్రశ్న వేయటంలో నీ ఉద్దేశమేంటి?"

"అతను మీకు బుషీట్రాట్ గా తెలిసి ఉండవచ్చు" డ్రూ చెప్పాడు.  "అతను తన పాత యజమాని బుకర్ నుంచి పట్టు తయారీ ప్రక్రియను కాజేసినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.  అదే ప్రక్రియను మీరు మీ ఫాక్టరీలో వాడుతున్నారు."

"నాన్సెన్స్!"

"ఇందులో అబద్ధమేమీ లేదు" డ్రూ విషయాన్ని బయటపెట్టాడు.  "నా కూతురు మీ ప్రయోగశాలనుంచి వేర్వేరు రకాల మిశ్రమాల నమూనాలను సేకరించింది.  వాటిని పరీక్షించగా బుకర్ మిశ్రమాలతో అవి సరిపోలినట్లు ఋజువయ్యింది."

"ఈ రాత్రి మీ ఉద్యోగి ట్రాట్ నన్ను కట్టి పడేసి విషపూరితమైన బ్లాక్ విడో సాలీడుతో కరిపించి, చంపటానికి ప్రయత్నించాడు" నాన్సీ బిగ్గరగా చెప్పింది.

ఈ సమాచారం విని అతను నిర్ఘాంతపోయాడు.

"దాని గురించి నాకేమీ తెలియదు" అతను నొక్కిచెప్పాడు.  "మా ఫాక్టరీలో విషపూరితమైన సాలీళ్ళు ఉన్న మాట నిజమే! కానీ. . . "

"బుషీట్రాట్ మీద వేరే ఆరోపణలు కూడా ఉన్నాయి.  మీరు అతని చిరునామా యిస్తారా?"

న్యాయవాది మాటలకు డైట్ భయంతో వణికిపోయాడు.  "తప్పకుండా యిస్తాను.  బుద్ధిపూర్వకంగా నేను బుకర్ పట్టు తయారీ ప్రక్రియను ఉపయోగించటం లేదని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను.  అంతేగాక ట్రాట్ మీ అమ్మాయిని యిబ్బంది పెట్టాలని చూస్తున్నట్లుగా కూడా నేను అనుమానించలేదు.  ఆమెకెలాంటి అపాయం జరగనందుకు సంతోషంగా ఉంది."

లారెన్స్ డైట్ వేగంగా బల్లదగ్గరకెళ్ళి ఒక కాగితంపై ట్రాట్ యింటి చిరునామాను వ్రాసి యిచ్చాడు.

"నిజం చెప్పాలంటే నాన్సీ డ్రూ మా ఫాక్టరీలోని ఫార్ములాను దొంగిలించటానికి వచ్చిందేమోనని ఒకసారి అనుమానించాను "  డైట్ వారికి చెప్పాడు.  "ఈ మధ్యనే మేము ఈ కొత్త పట్టు తయారీ ప్రక్రియను బోల్డు డబ్బులెట్టి ట్రాట్ దగ్గరే కొన్నాం."

డైట్ భారంగా నిట్టూర్చి కొద్ది సెకండ్లపాటు మాట్లాడలేకపోయాడు.

"తమ చుట్టూ విషపు సాలీళ్ళు ఉన్నాయని తెలిస్తే ఫాక్టరీ కార్మికులంతా మా దగ్గర పని మానేసి వెళ్ళిపోతారేమోనన్న భయంతో ఈ పట్టు తయారీ ప్రక్రియను రహస్యంగా ఉంచానే తప్ప మరే కారణం లేదు" చివరగా అసలు విషయాన్ని బయటపెట్టాడు.

"మీరింత భద్రంగా, రహస్యంగా కాపాడుకొస్తున్న ఈ ప్రక్రియ నా క్లయింట్ మిస్టర్ బుకర్ కి చెందినది" కర్సన్ డ్రూ బదులిచ్చాడు.  "కాకపోతే ఉన్న తేడా అల్లా మీరు విషపు సాలీళ్ళను వాడితే, అక్కడ ప్రమాదకరం కాని సాలీళ్ళను వాడుతారు.  ఈ రాత్రి జరిగినదాన్ని బట్టి చూస్తే, అతనికి ప్రాణాంతకమైన విషయాల వైపు మొగ్గు చూపే ఉన్మాదం ఉన్నట్లు తీర్మానించవచ్చు."

డైట్ న్యాయవాదిని అపనమ్మకంతో చూశాడు.  "మీరనేదేమిటి?  బుషీట్రాట్ తన ఆధీనంలో లేని, స్వంతం కాని ప్రక్రియను నాకు అమ్మాడంటారా?"

"ఖచ్చితంగా!"

"అయితే నేను మోసపోయానన్నమాట!" డైట్ పట్టలేని కోపంతో అరిచాడు.  "వెంటనే పోలీసులకు ఫోను చేసి అతన్ని జైల్లో పెట్టిస్తాను."

పది నిమిషాల్లో పోలీసుల గస్తీ వాహనం ట్రాట్ యింటి వైపు దూసుకుపోయింది. న్యాయవాది కారులో డ్రూ, నాన్సీ, నెడ్ పోలీసు వాహనాన్ని అనుసరించారు.  వాళ్ళు ముగ్గురూ ట్రాట్ యింటికి చేరుకొనే సమయానికి యిద్దరు పోలీసులు అతన్ని బంధించి తీసుకెడుతున్నారు.  నాన్సీని చూడగానే అతని మొఖం తెల్లగా పాలిపోయింది.

"నువ్వా?" ఉన్మాదంతో గట్టిగా అరిచాడు.  నాన్సీ వయసుని బట్టి చాలా తక్కువగా అంచనా వేశాడు గానీ ఆమె తననిలా పట్టిస్తుందని ఊహించలేదతను.  "ఎలా? ఎక్కడినుంచి వచ్చావు?"

"ఆ మనిషి యితనేనా/" వాళ్ళలో ఒక పోలీసు అధికారి నాన్సీని అడిగాడు.  నేరస్తుణ్ణి పట్టుకొనే ముందు పోలీసులు ముందుగా అతనో, కాదో నిర్ధారించుకోవాలి కదా!

"ఇతనే!" బదులిచ్చిందామె. "నాకు తెలిసి యితని అసలు పేరు రిగ్గిన్ ట్రాట్."

(చివరి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages