నీటి బిందువులు - అచ్చంగా తెలుగు

నీటి బిందువులు

Share This
నీటిబిందువులు 
వి.ఎన్.మంజుల


ఒక్కో నీటి చుక్కనీ దారపుపోగుతో 
ధారగ చేసి, మాలగ మార్చి, 
ధరణి అందెల మువ్వలుగ  పేర్చిన నీటిబిందువులు,

నేలను ముద్దాడి, ఆకలి డొక్కకి ఆశని రేపి..
సంద్రం చేరి, స్వాతి ముత్యమై ఒదిగి దాగింది...

తొంగి చూస్తున్న చిన్ని మొలకకి
 చేయందించి పైకి లేపి..,
చెరువు నిండిన నీటిబిందువులె 
రైతుని రాజుగ నిలిపి చూపించాయి...

అలసి ఒరిగిన ముసలి ప్రాణికి 
ఊపిరి ఊది  ఊతమిచ్చి.,
దప్పిక గొన్న పక్షి కూనలకు 
ఎగిరే రెక్కల బలమై నిలిచాయి...

మసక బారిన మనసును కడిగి, 
మనసున్న మనిషిగ‌ బ్రతుకు నేర్పి..
నుదిటిని తాకిన  నీటిబిందువు అరుణ తిలకమై 
ఆశల ఊహను రేపిచూపాయి...

కళ తప్పిన అడవితల్లి ఒడి నింపి, 
పచ్చని పావడా పరిచి చూపి..,
జలములేని ధర్మ కర్మము లేదను 
మాట రానీయక  దోసిట జలమై నిండినాయి...

పట్టలేని సంతోషాన చెక్కిలి తడిమే చెలియగానూ..
యెదలో తిరిగే సుడుల ఒరవిడికి 
చెంపన జారే చుక్కగానూ..
ఉపశమనం ఇచ్చినా..ఉపద్రవం తెచ్చినా ..
జీవి నిలవాలన్నా..కాయం వదలాలన్నా..,
ప్రాణానికి పర్యాయ పదమై.,
నిజానికి జలమే ప్రాణమై..
నిప్పుని ఆర్పే నీరై...
ప్రకృతి నిండిన చైతన్య బిందువై...
సృష్టిని నిలబెడుతూ.,
పరవశిస్తే పారుతూ, ఉద్యమిస్తే వరదవుతూ..
ప్రాణవాయువుని నిలిపే ఆధారం ఆ 
బిందువులే...

మబ్బులో నీరే....భూగర్భంలోనూ నీరే..
మనిషి మనుగడకు మూలం నీటిబిందువులే..

 ***

No comments:

Post a Comment

Pages