తప్పెవరిది..? - అచ్చంగా తెలుగు

 తప్పెవరిది..?  

 సుజాత తిమ్మన.  

అతి కష్టం మీద ఫ్లైట్ పట్టుకుని స్పెయిన్ నుంచి వచ్చాడు జీవన్. ఎయిర్ పోర్ట్  లో స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. అంతా నార్మల్ గానే ఉంది ‘హమ్మయ్య అనుకున్నాడు’.

 ఇంటికి  వచ్చి  పన్నెండు రోజులవుతుంది. ఎక్కడ చూసినా కరోనా..కర్కశమైన కరోనా..దేశాలన్నిటినీ గడగడలాడించేస్తుంది రాక్షసి! ‘స్పెయిన్ లో ఎన్ని కేసులు చూసాడు తను అనుకున్నాడు జీవన్.

జీవన్ గుండె చెరువైపోతోంది..దాని స్థానంలో భయం కూడా చోటుచేసుకుంది.

సంజనకు, మూర్తికి  నిశ్చింతగా అనిపిస్తుంది. ఒక్కగానకొక్క కొడుకు జీవన్. ఫోటోగ్రఫీ అంటే ఉన్న మక్కువతో ఆ రంగంలోనే రాణిస్తానని అక్కడ కోర్సులు చేయటానికి వెళ్ళాడు సంవత్సరం క్రితం. అంతా బాగానే ఉంది ఇంకో ఆరునెలలలో కోర్స్ అయిపోతుంది అనుకునేంతలో...ఈ ఉపద్రవం!

“ఫరవాలేదులే నాన్నా..! నీవు క్షేమంగా వచ్చావు అంతే చాలు” అంది  సంజన కొడుకుని చూసి మురిసిపోతూ.

ఓ రోజు ఇద్దరు వ్యక్తులు వచ్చి “స్పెయిన్ నుంచి వచ్చిన జీవన్ అనే అతను ఉన్నాడా ..” అని అడిగారు. అతను ప్రయాణించే ఫ్లయిట్ లో కరోనా పాజిటివ్ వ్యక్తులు ఇద్దరు ఉన్నారని..అందుకే అతన్ని పరీక్ష చేయాలని అన్నారు. జీవన్ తండ్రి మూర్తి “బాబు లేడు మా ఊరు వెళ్ళాడు” అని  అబద్దం చెప్పి పంపేశాడు.వాళ్ళు  కొడుకుని ఎక్కడ క్వారెంటైన్ కు తీసుకుపోతారో అని ఆయన భయం. కరోనా చేసే విధ్వంసం టీవీలో చూస్తున్నా మనదగ్గరకు రాలేదుకదా అన్న నిర్లక్ష్యం.

***

సంజనకు బాగా నీరసంగా ..తల బరువుగాఉంది పొడి దగ్గు వస్తూ ఉంది. పని ఎక్కువ అవటం మూలంగా అనుకుని జ్వరం టాబ్లెట్ వేసుకుని పడుకుంది. అయితే రెండో రోజూ, మూడో రోజూ  మరీ ఎక్కువై పోతోంది..ఎందుకయినా మంచిదని ఫామిలీ  డాక్టర్ కు కాల్ చేస్తే..వెంటనే హాస్పిటల్ కు తీసుకుని రమ్మన్నారు . ఆమెకు టెస్టులు చేసి కరోనా  పాజిటివ్ అని నిర్ధారణ చేశారు అయినా “కంగారు పడవద్దు..ఇంకా మొదటి దశలోనే ఉంది..ట్రీట్మెంట్ తో బాగయిపోతుంది” అని ధైర్యం చెప్పారు డాక్టర్ గారు.

 కుప్పకూలినట్టు అయిపోయాడు భార్యని చూసి మూర్తి.  అమ్మలేని ఇల్లు వెలితిగా అనిపించసాగింది జీవన్ కి.

రెండురోజులు గడిచాయి..ఇప్పుడు మూర్తి కూడా జ్వరంతో మూలుగుతూ ఉన్నాడు.జీవన్ కి  విపరీతమయిన భయం ఆవహించింది తండ్రికి కూడా కరోనా సోకిందేమో అని.

అప్పుడు అనిపించింది..’ఎయిర్ పోర్ట్ నుంచి తను ముందుగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన క్వారెంటైన్కి వెళ్ళి ఉండవలసింది. నేరుగా ఇంటికి రావటం మూలంగానే అమ్మకి కరోనా సోకి హాస్పిటల్ పాలయ్యింది.ఇప్పుడు  నాన్నకి కూడా అనుమానంగా అనిపిస్తుంది. నాలో కూడా ఉండవచ్చు ఆ వైరస్..కానీ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్ల మీద వెంటనే కరోనా ప్రభావం చూపుతుందట. నాదే తప్పు..నాదే తప్పు..’ అని విలపించసాగాడు జీవన్. 

***

No comments:

Post a Comment

Pages