మనసే మందిరం - అచ్చంగా తెలుగు
 మనసే మందిరం 
(మా జొన్నవాడ కథలు - 6)
- టేకుమళ్ళ వెంకటప్పయ్య



"కుండలయ్యా! కుండలూ... కుండలూ... కుండలూ... జొన్నాడ కుండలూ…"అని ఎడ్లబండి తోలుకుంటూ జొన్నవాడ చుట్టుపక్కల ఉన్న మినగల్లు, అన్నారెడ్డిపాళెం, పంచేడు, బుచ్చిరెడ్డి పాళెం అన్ని ఊళ్ళు తిరిగి తిరిగి అలసటగా సాయంత్రం 6 గంటలకు కొంపకు జేరి యింటిముందు బండి ఆపాడు కూర్మయ్య.  ఆరోజు శుక్రవారం కావడంతో దేవళానికిబొయ్యే జనం బాగా దండిగా ఉన్నారు. కార్లు, ఆటోలవాళ్ళు "ఏయ్…. ముసిలోడా! ఈ రోడ్డేమన్నా మీ జేజ నాయన గట్టిచ్చాడా! బండి అడ్డంగా బెట్టావు?.తీ..తీ.. పక్కన బెట్టు" అని అరుస్తున్నారు. "వీళ్ళదుంపల్దెగా! నా ఇంటికాడ నేను బండాపుకుంటే వీళ్ళకేం మాయరోగం వచ్చింది. నన్ను బండి దీమంటారు" అని విసుక్కుంటూ బండి పక్కగా పెట్టాడు. అసలే మూడు రోజుల్నుంచి నాలుగు కుండలు కూడా అమ్ముడుపోక నేనేడుస్తుంటే వీళ్ళ కాకిగోలేంది  మద్దెలో" అంటూ "మేయ్.. కోటమ్మా….రాయే….కాసిని మంచినీళ్ళన్నా బొయ్యవే నా మొహాన…..ముదనష్టపు దానా!" అని అరిచాడు. మంచినీళ్ళు, తుండుగుడ్డ ఇస్తూ "అన్నిటికీ తొందరే నీకు! వచ్చేదాకా ఆగబళ్ళా కాస్తా" అని బండి మీద చూసి "ఏందయ్యో! యవ్వారం జూస్తే ఈ దినంగూడా ఏమీ అమ్ముడు బొయినట్టు లేవే! అన్ని కుండలు అట్టానే ఉండ్లా! అంతా మన కర్మలేయ్యా! మనకు ఈ జన్మకు గంజినీళ్ళేలే గతి. మా నాయినిచ్చిన ఎకరాపొలం ఉంది గాబట్టి ఈ మాత్రమయినా.. సరేలే! ఎండన బడొచ్చావు. బండి సందులో దోలి ఇంట్లోకి రా! కాస్తా ఎంగిలి బడుదుగాని"  అని ముక్కు చీదుకుంటూ ఏడుపు మొహం పెట్టి లోనకు వెళ్ళింది .
"ఒసే! కోటమ్మా! ఏడుపొస్తా ఉందే! దీనెమ్మ కడుపుగాల! బతుకుమీదే రోత పుడతా ఉందే! జనాలు ఇంకా కుండలమ్మునుకునే పిచ్చోడివి నువ్వేనంటూ నా బండెనకాల జేరి నవ్వతా ఉండారనుకో!     మేయ్.. కోటీ…  రేపొక్క రోజు జూస్తా! అంతే! ఆనక… ఏదన్నా పొలం పన్లకు బోతా!  లేకపోతే మా నాయినిచ్చిన ఐదెకరాల  బీడు బూమన్నా దున్ని, సాగుజేసి తోటన్నా ఏసుకుందాం." అన్నాడు అన్నంతిని చేతులు తుడుచుకుంటూ. సర్లేయ్యా! బాదపడవాక! ఊరికే! మనకు ఆ శివయ్య ఎట్టారాస్తే అట్టాగే అవుద్ది. చెట్టంత కొడుకు లోహిత్‌ గాణ్ణి బాగా చదివిస్తే.. వాడేమో ఉద్యోగం పేరుజెప్పి  దేశం మీద బలాదూరు తిరుగుతున్నాడాయె!” అనంగానే చర్రున తోక తొక్కిన తాచులాగా లేచి "నువ్వూరుకోయె! అబశకునప్పచ్చి!  వాడు మనసంటోడు గాదు. బాగా సంపాదిస్తాడు చూడు. వాడిది గొప్ప జాతకమని దేవళం పూజారి, స్కూల్లో అయ్యోర్లు అంతా జెప్పలా! చూద్దాం. కాలం గలిసిరావాలంతే! వాడికేదో ఒక మంచి ఉద్యోగం దొరకాలని రోజూ కామాచ్చమ్మకు మొక్కుతూనే ఉన్నా!" "హబ్బో నీ కోడుకునేమన్నా అంటే మాత్రం పొడుచుకొస్తుంది నీకు! మహరాజాయె వాడు! ఫోన్‌జేసినప్పుడల్లా వందలొందలు బ్యాంకులో గట్టండి వాడి పేరుమీద. నౌకరీ వచ్చాక నీ నెత్తిన.. నా నెత్తిన.. పెద్ద కిరీటం బెట్టి చక్కా నూక్కోంబోతాడు ఏదో ఒకరోజు. అప్పుడు బోరుమని ఏడవాల మనం! అయ్యో ఉన్నదంతా ఊడ్చిపెట్టామే అని. ఇట్టంటావంటావేమోగానీ… అల్లుడు నా తమ్ముడు గాబట్టి పైసా కట్నం లేకుండా జేసుకున్నాడు దాన్ని. పువ్వుల్లో బెట్టి చూసుకుంటున్నాడు నా కూతుర్ని.  దానదృష్టం పెళ్ళయింతర్వాత అల్లుడి యాపారం మూడు పూలారుకాయలయింది. అదే మనకు సహాయం జేస్తా ఉంది. హవ్వ!  చెప్పుకుంటే సిగ్గుచేటు" అనింది.  "తూ! నీబండబడ! గబ్బునోర్దానా! నీనోట్లో నోరుబెట్టాను చూడు. అదీ నా తప్పు. నాచెప్పుతో నేనే గొట్టుకోవాల" అని తుండుగుడ్డ గట్టిగా విదిలిస్తూ బయటికి వెళ్ళాడు.
*  *  *
నీల్‌లోహిత్ కు క్రొత్త ప్రదేశాలు చూడడమంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నార్తిండియా చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఏదో ఒక ఉద్యోగంలో ఇరుక్కుంటే తిరగడం కష్టమని  ఎమ్మెస్సీ  అయిన వెంటనే స్వేచ్ఛావిహంగంలా విహరిస్తున్నాడు. రాజస్తాన్ పర్యటనలో భాగంగా జైపూరు నుండి జైసల్మేర్ వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటల సమయం.  బస్టాండ్ ఎదురుగా ఉన్న హోటెల్‌లో టీ తాగి కూర్చున్నాడు.  ఎదురుగా షేర్ ఆటోలల్లో జనం  ఎగబడి ఎక్కడం చూసి ప్రక్కనతన్ని అడిగాడు ఎక్కడికి వెళ్తున్నారని. “ప్రక్కనే ఒక పల్లెటూరుంది. దాన్ని ఉదైరం సర్ అంటార్లే!  అక్కడికి వాళ్ళే వీళ్ళంతా…. ఇక్కడ టవున్లల్లో ఖర్చులు ఎక్కువకదా! అందుకని సాయంత్రానికి ఎవరి పల్లెలకు వాళ్ళు చేరుకుంటారు. ఫుడ్ చాలా చీప్ అక్కడ. పేరుకు చిన్నూరేగానీ అన్నీ దొరుకుతాయక్కడ! మళ్ళీ పొద్దున్నే పన్లకు తిరిగొస్తారు"   అప్పుడు గుర్తొచ్చింది లోహిత్‌కు తన జేబులో వంద రూపాయలు మాత్రమే ఉన్న విషయం.  నాయన్ను డబ్బులింక పంపమని అడక్కుండా టూరులోనే ఏదో ఒక పనిచేసి డబ్బులు సంపాదించాలనుకున్న విషయం గుర్తొచ్చి నవ్వొచ్చింది. అనుకున్నంత సులభమేమీ కాదు డబ్బు సంపాదించడం అనుకుని  షేర్ఆటో ఎక్కాడు. ఉదైరంసర్ చేరే సరికి సాయంత్రం ఐదున్నరయింది. రోడ్డు వెంబడే నడుస్తూ ఆలోచిస్తున్నాడు. రాత్రికి ఎక్కడ తలదాచుకోవాలా అని.  జైసల్మేర్లో ఉండిపొయినా రైల్వే స్తేషన్లో పడుకునే వాడిని. అనవసరం వాళ్ళ మాటలు విని వచ్చా! అని ఆలోచిస్తూ నడుస్తున్నాడు. 
*  *  *
ఆరోజు కూడా కుండలు కుండలని గొంతుపొయ్యేట్టు అరచి అరచి శోష వస్తోంది తప్ప ఎవరూ కొనడంలేదు. కూర్మయ్యకు చిరాకు ఎక్కువైంది. రెండు గంటలకు పాత మినగల్లులో బండి ఆపి కోటమ్మ కట్టిచ్చిన చద్దెన్నం మూట విప్పి తిని కాసేపు అలాగే నిద్రపోయాడు. "యోవ్! కుండలాయనోవ్! అన్నీ కుండలేనా కూజాల్లేవా నీకాడ!" అని ఎవరో బండి పక్కన నిలబడి అరుస్తుంటే సాయంత్రం నాలుగ్గంటలకు మెలకువ వచ్చింది. లేవని చెప్పి పంపించేశాక బాగా యోచన చేశాడు. ఇన్నాళ్ళనుండి సంపాదించిందీ….సాధించిందీ…. ఏమీ లేదు. రేపట్నుంచీ వేరే పనేదైనా చెయ్యాలి. అని గట్టిగా నిర్ణయించుకుని బండిని తోలుకుంటూ జొన్నవాడ చేరాడు. సమయం ఆరుగంటలు కావొస్తూంది. బండి పక్కగా పెట్టి క్రిందకు దిగాడు. "ఓరి నీ అసాధ్యంగూల! యివాళగూడా ఒక్క కుండ గూడా అమ్మకపోతే బువ్వేం తింటామయ్యా! అప్పులోళ్ళు ఇంటిచుట్టూతా తిరగతాఉన్నారు. థర రవంత తగ్గిచ్చన్నా అమ్మబళ్ళా!" అనే సరికి వళ్ళు మండిపోయింది. దొడ్లోకి వెళ్ళి ఒక పెద్ద దుడ్డుకర్ర తెచ్చి బండి పైకెక్కి థూ! దీనెమ్మ బాడుగోలు యాపారమూ.. అంటూ  కుండలన్నీ పగలగొట్టడం మొదలుపెట్టాడు.  చిల్లపెంకులు నాలుగు దిక్కులకూ ఎగురుతున్నాయి. రోడ్డు మీద నడిచే వాళ్ళకు తగిలి ఆశ్చర్యపోయి చూస్తున్నారు. కోటమ్మ పెద్దగా ఏడుస్తూ "నీకు పిచ్చిపట్టిందేందయ్యా! దిగు! దిగు! ఊపిరుంటే ఉప్పుగల్లమ్ముకుని బతుకుదాం.  అప్పులోళ్ళు తిరగతా ఉన్నారని కోపంకొద్దీ అన్నా. ఏమన్నులే ఇంక దిగు!" అని కూర్మయ్య కాళ్ళు పట్టుకుని బతిమాలుతోంది. కొంతసేపటికి  కోపందగ్గి క్రిందికి దిగిన కూర్మయ్య కర్ర వీధిలోకి విసిరేసి పెద్దగా ఏడుస్తూ వీధిలో నేలమీద మట్టిలో బండికానుకుని చతికిలబడిపోయాడు. వినోదం చూస్తున్న  జనం ఎవరిపాటికి వాళ్ళు సర్దుకున్న తర్వాత, దూరం నుంచి గమనిస్తున్న ఒక సాధువు మెల్లిగా కూర్మయ్య దగ్గరకు వచ్చి ఎదురుగా  మట్టిలో కూర్చుని "కూర్మయ్యా! బాధ పడకు!  కష్టాలు శాశ్వతం కావు! నీ కొడుకు ప్రయోజకుడై తిరిగొస్తాడు" అంటూ చేతిని పట్టుకున్నాడు. అంతే! ఏదో తెలీని విద్యుచ్ఛక్తేదో వంట్లోకి ఎక్కినట్టయి ఉలిక్కిపడి ఆయన చెయ్యి విదిలించుకున్నాడు. సాధువు నవ్వుతూ “భయపడబాక!  ఈ మాత్రానికే! ఏంగాదులే... నన్ను నమ్ము! త్వరలోనే నీకు మంచి జరుగుతుంది!" అని చెప్పి ఓదార్చి లేచాడు. ఇంతలో కోటమ్మ వచ్చి "కాస్తా మజ్జిగన్నా తాగయ్యా! ఏందయ్యా… నీ పిచ్చావేశం చెప్పు…కుండలన్నీ పగలనూకితివి…. ఎట్టా చెప్పు?" అని గ్లాసందించింది. ఏమో కోటీ! నేనేనా చేసిందని నాకే ఆశ్చర్యంగా ఉంది. సరేలే! కుండలమ్మడం మానుకుందామంతే!  మొన్న రేబాలలో ఒక చిలక జ్యోస్యం వాడు త్వరలో మంచి జరుగుతుందని చెప్పాడు.  ఇప్పుడు ఈ సాధువు కూడా ఇట్టాగే చెప్పాడు" అనగానే "ఏ సాధువయ్యా!  ఏడ చెప్పు? కలగానీ కంటుండావా ఏంది?" అని అడగ్గానే ఈనే… చూడు… అంటూ యిటూ తలతిప్పి చూసేసరికి చుట్టూ కనుచూపు మేరలో  ఎవరూ  కనపడలేదు. ఎవరింటికో బిక్షకు బొయ్యుంటాడు లేయే! మళ్ళీ అగపడ్డా ఏంది? అని అనుకుని మజ్జిగ తాగి లోపలికి వెళ్ళాడు
*  *  *
సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకుంటున్నాడు. మెల్లమెల్లగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. సమయం ఆరుగంటలవుతోంది. లోహిత్‌ ఏదో ఆలోచిస్తూ నడుస్తుండగా టప్ మని ఒక కుండపెంకు వచ్చి కుడిబుగ్గను బలంగా తాకి క్రింద పడింది. బుగ్గ చీరుకుని పోయి నెత్తురు వస్తోంది. చొక్కా అంతా రక్త మయమయింది. ఎవరు విసిరారు? అని పిచ్చి కోపంతో తలెత్తి చిల్లపెంకు వచ్చిన దిశగా చూశాడు.   పక్కన ఏదో చిన్న కార్ఖానా లాగుంది.  పై నుంచి పొగ వస్తోంది. బుగ్గను కర్చీఫ్‌తో అదిమిపట్టి  కోపంగా లోనకు ప్రవేశించాడు. పెద్ద విశాలమైన చావడి. ఎవరూ లేరు.  ఎర్రటి చిల్లపెంకులు నేల మీదంతా పడున్నాయి. చిన్న ద్వారం గుండా లోనకు ప్రవేశించాడు. ఒక పెద్ద హాల్లో ఎవరో ఒక అందమైన అమ్మాయి కంప్యూటర్ ముందు వుంది. ఇంతలో ఒక పెద్దాయన లోనకు వచ్చి "ఎవరు నువ్వు? లోనకు ఎందుకొచ్చావ్? ఆ రక్తమేంటి?" అని తెలీని భాషలో ప్రశ్నల వర్షం కురిపించాడు. సైగల ద్వారా అర్ధంజేసుకున్న లోహిత్ కుండపెంకు సంగతి హిందీ లో చెప్పాడు. ఆయన వెంటనే "కూర్చో! అని.. అమ్మా! అంబికా! అరమరలో టింక్చరు సీసా అందుకో! అని లోహిత్‌కు ప్రధమ చికిత్స చేశాడు. "నాన్నా! నువ్వు వెళ్ళు. అవతల అమ్మకు బి.పి., సుగర్ ఎక్కువైంది. డాక్టరు దగ్గర ఉంది. హాస్పిటలుకు వెళ్ళి డాక్టరుతో మాట్లాడి మందులూ అవీ తీసిచ్చిరా! " అనింది. ఆయన లోహిత్ వైపు చూడగానే "నేను సర్ది చెప్పి పంపిస్తా! నువ్వు త్వరగా వెళ్ళు" అని ఆ అమ్మాయి చేసిన సైగ ఎదురుగా ఉన్న అద్దంలో  గమనించాడు లోహిత్.
సర్! మీ పేరు అంది. పేరు,  చదువూ వివరాలు చెప్పాక,  ఎగాదిగా చూసి "మీరు ఏ ప్రాంతం వాళ్ళు సార్!" అని హిందీలో అడిగింది. "మాది ఆంధ్రా ప్రాంతం, నేను టూర్‌లో ఉన్నాను. రాజస్థాన్ చూడాలని వచ్చాను" "ఓ! గుడ్! నాకూ తెలుగు కొంచెం కొంచెం వచ్చు" అనేసరికి ఆశ్చర్యంగా చూశాడు. "ఎస్. నేను లాస్ట్ యియర్ హైదరాబాద్లో ఐఎస్‌బీలో కోర్సు చేశాను" అని స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడే సరికి మరింత ఆశ్చర్యంగా చూశాడు. "ఇది ఏమి ఫాక్టరీ?" అనేసరికి "రండి చూపిస్తాను" అని లోనకు తీసుకెళ్ళి టెర్రాకోట బంకమట్టితో రకరకాల వస్తువులు ఎలా చేస్తారో చెప్పింది. "మమ్మల్ని కుమ్మరి వాళ్ళంటారు. మా నాయన కూడా కుండలే చేస్తాడు. ఎవరూ కొనడంలేదు.  ఇంకా ఈ ఎర్రమట్టి వస్తువులు కొనే పిచ్చి జనం ఉన్నారా?  మీ ప్రక్క" అని అడిగేసరికి అంబిక నవ్వి  “మమ్మల్ను ప్రజాపతులని పిలుస్తారు ఇక్కడ.  సరే! ఇంతకీ ఈ  వాటర్ బాటిల్ ఎంత ధర అనుకుంటున్నావు?" అని అడిగింది. "బహుశ! ఏభై రూపాయల లోపు వుండొచ్చు" అన్నదానికి పెద్దగా నవ్వి "ఈమట్టిని టెర్రాకొట్ట బంక మట్టి అంటారు. దీని ధర  ఏడువందల రూపాయలు" అనేసరికి గుండెల మీద చేతులేసుకున్నాడు. ఈ మట్టి మొదట మహంజోదారో హరప్పా నాగరికత కాలం వాళ్ళు వాడారు. ఇండియాలో రెండు మూడు రాష్ట్రాల్లో మాత్రమే దొరుకుతుంది. అంటూ ఆ మట్టి హిస్టరీ, దాని విలువ చెప్పింది.
 అన్యమనస్కంగా లోహిత్  "నేను యింటినుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపొయ్యాయి. మా నాయన్ను ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టంలేదు. ఒక రెండు మూడు నెల్లు మీ ఫాక్టరీలో  పనిజెయ్యొచ్చా? నాకూ ఈ వృత్తిలో ప్రవేశం ఉంది. జీతం మీకు తోచినంత ఇవ్వండి " అంటుండగా వాళ్ళ నాన్న అప్పుడే వచ్చి "ఉద్యోగం కోసం… గాయం నాటకమాడావా?  బాబూ! సామాన్యుడివి కాదయ్యా నువ్వు!" అని పెద్దగా నవ్వాడు. అంబిక "నాన్నా! తప్పు" అని సైగ చేసింది. "సరేలే మొన్న బల్వంత్ సెలవులో వెళ్ళాడన్నావుగా! అక్కడ పెట్టు ఈ అబ్బాయిని" అనగానే వంగి నమస్కారం చేశాడు. "బుద్ధిమంతుడే!" అన్నట్టు అంబికకు సైగ చేశాడు నవ్వుతూ. "నేను ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు రూం వెదుక్కుంటాను మీకేమీ అభ్యంతరంలేకపోతే" అనే సరికి లోహిత్‌ను వాళ్ళ గెస్ట్‌హవుస్ కు తీసుకెళ్ళి దించాడు.  
*  *  *
“ఏందయ్యా! అదేపోత బొయినాడు నీ కొడుకు. జాబూ జవాబూలేదు. రోజూ అడగతున్నా పోస్టోణ్ణి."    “వస్తాళ్ళేయే పెద్దుజ్జోగం కోసం జూస్తుంటుంటాడు. ఎప్పుడో ఉన్నట్టుండి ఊడిపడి నీ నోట్లో మిఠాయి పెడ్తాడు" అని ముసిముసి నవ్వులు నవ్వాడు. "ఏడిచినట్టుంది సంబడం! అలూలేదు చూలూ లేదు అంటే కొడుకుపేరు సోమలింగమన్నాట్ట  వెనకటికొకడు అట్టాఉంది నీ యెవ్వారం" “సర్లే పెతిదినం ఉండే గోలేగదా!  రేపు నేను మన పొలానికి బొయ్యి ఎద్దులతో దున్ని వైనం జేస్తా! దూరంగా ఉన్న పొలంలో రఘునాధయ్య పంపు సెట్టు బెట్టాడు. వాడ్ని కాళ్ళో గడ్డాలో పటుకోని బతిమిలాడి నీళ్ళకు కాల్వ తీద్దాం. తృణమో పణమో యిద్దాం.  వాడు అవిసె చెట్లేసి ఆటికి తమలపాకులు పాకిచ్చాడు. మంచి ఆదాయమంట" అనగానే "ఏమో నీ ఇట్టమయ్యా! ఆ కామాచ్చమ్మను నమ్ముకోని జెయ్" అంటూ లేచింది.
*  *  *
లోహిత్ పంక్చుయాలిటీ, సిన్సియారిటీకి ఆశ్చర్యపోయింది అంబిక. వారం రోజుల్లో అక్కడి వ్యవహారాలన్నీ తెలుసుకొని క్రొత్త క్రొత్త వస్తువులు చేయడం వాటిని కిలన్ (బట్టీ)లొ కాల్పించడం అన్నీ దగ్గరుండి చేయిస్తున్నాడు. క్రొత్త రకం వస్తువులకు గిరాకీ ఎక్కువై ఆర్డర్లమీద ఆర్డర్లు వస్తున్నాయి.  ఒకరోజు "మేడం! నేను ఒక షిఫ్ట్ కాకుండా రెండు షిఫ్టులు పనిచెయ్యొచ్చా! నాకు అప్పుడు రెండు జీతాలు ఇస్తారా?" అని అడిగాడు. అంబిక పక్కున నవ్వి "ఉదయం 6 నుంచి 2 గంటలవరకు ఒక షిఫ్ట్ కదా! ఆ తరువాత 10 గంటలవరకూ ఇంకో షిఫ్ట్ ఉంది కదా! దాన్లొ సగం అంటే 6 గంటలవరకూ చేస్తే చాలు. ఓవర్‌టైము క్రింద డబుల్ వేజెస్ వస్తాయి. రేపటినుంచి అలా చెయ్యి చాలు. నీకు రెండు జీతాలు ఇస్తాంలే" అంది. నమస్కారం పెట్టి లోనకు వెళ్ళాడు. ఇదంతా చూస్తున్న ఆమె నాన్న "కుర్రాడు పైకొస్తాడు. పనిమంతుడు" అన్నాడు. 
"నాన్నా! నాలుగురోజులనుండి చూస్తున్నావా! ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయో!" అంది గర్వంగా. “నాకెందుకమ్మా అవన్నీ! నువ్వు చూసుకో! ఏదైనా అవసరం అయితే అడుగు చాలు" అన్నాడు నవ్వుతూ. అలాగే కానీ… తమ్ముడు నిషాంత్‌ను పనిలో పెట్టండి. నేను రేపు నాకు  పెళ్ళయ్యాక వాడే కదా అన్నీ చూసుకోవాలి" అనగానే.."ఇంటర్ అయింది వాడికి డిగ్రీ అయినా అవనీ" అన్నాడు. "అక్కర్లేదు ఏమి చదివినా ఇక్కడిపనే కదా చేసేది! వాణ్ణి రమ్మను. అన్నీ చెప్పాలి" అంది. "సరేలే వాడికి చెప్పి చూద్దాం" అంటూ బయటికి వెళ్ళాడు. నెల గడిచేసరికి అక్కడ వర్కర్లందరికి లోహిత్‌పై గురి కుదిరింది. అన్నీ అడిగి చేసేవారు. అందరూ చేతినిండా డబ్బూ..పనీ దొరికే సరికి  అంతా  సంతోషంగా ఉన్నారు.
ఒకరోజు ఉదయాన్నే 10 గంటలకు "ఒకసారి అర్జెంటుగా మా లోహిత్‌ను పిలుస్తారా! అని ఆందోళనగా ఎవరో ఫోన్ చేయడంతో లోపల ఉన్న లోహిత్‌ను పిలిపించింది. ఫోన్‌లో మాట్లాడిన తర్వాత లోహిత్ దిగాలుపడి కూర్చుండి పోయాడు. "ఏమైంది లోహిత్?" అనడిగిన అంబికకు "మా అమ్మకు జ్వరం వచ్చిందట పెద్దాసుపత్రిలో చేర్చారట. నన్ను కలవరిస్తున్నదట! వెంటనే రమ్మని మా నాయన ఫోను" అన్నాడు గుడ్ల నీళ్ళు కక్కుకుంటూ. "కంగారు పడకు లోహిత్! జ్వరమే కదా! తగ్గిపోతుంది.  వెంటనే బయల్దేరు! రైల్వేలో తెలిసిన వాళ్ళున్నారు. జైసల్మేరు నుంచి వెల్దుగాని మధ్యాహ్నం" అని ఓదార్చింది. వెంటనే 50 వేలు డబ్బులిచ్చి అన్ని ఏర్పాట్లు చేసింది.

*  *  *
నెల్లూరులో ట్రైను దిగి నేరుగా పెద్దాసుపత్రికి చేరుకున్నాడు. డాక్టరు ఏమీ ప్రమాదం లేదు  జ్వరం తగ్గిందని చెప్పగానే బెడ్ దగ్గరికెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చొని పెద్దగా ఏడ్చాడు. ఏడుపు విని ఉలిక్కిపడి లేచింది కోటమ్మ. "అయ్యా! వచ్చావా!" అంది.  అమ్మకు ధైర్యం చెప్పాడు. "అయ్యా! లోహితా… మేం ముసలోళ్ళం అయిపొయినాంరా! వదిలిపెట్టి ఎక్కడికి పోబాకరా నాయనా!” అని పెద్దగా ఏడ్చింది.. డిశ్చార్జి  అయ్యాక అంతా కారులో జొన్నవాడకు చేరుకున్నారు.  అంబిక అప్పుడప్పుడూ లోహిత్ అమ్మగారి ఆరోగ్య సమాచారాలు అడిగి తెలుసుకుంటోంది.
నాల్రోజుల అనంతరం కొమరయ్య "నాయనా…..లోహిత్…. అమ్మ కాడుంటావా? నేను అలా నెల్లూరు దాకా పోవాల్సిన పనుంది. నీకు తెలవంది ఏముంది? కుండలు అమ్మడం ముగిచ్చుకున్నా. ఈమద్దిన పొలంలో ఒక ఎకరాలో అవిసెచెట్లు నాటాము. కొంచెం పెద్దవయ్యాక తమలపాకుల మొక్కలు దానికి అల్లాలి. తర్వాత మిగతా పొలంలో గోగునారో, కూరగాయలో వెయ్యాలి.  వ్యవసాయ ఆఫీసు వాళ్ళు ఇవాళ రమ్మన్నారు" అన్నాడు.
"ఆగు నాయనా! నేనూ వస్తా! అమ్మకు తోడు అక్కుంది గదా! నెల్లూరులో ఎన్ని గంటలకు ఉండాల?" 
"టైమేముందిరా! సాయంత్రం లోపల బోతే చాలు"
"అయితే మనం మొదట పొలానికి బొయ్యి అపాట్న బోదామయ్యా!"
"పొలానికెందుకు మద్దిన?"
"చెబ్తా! అక్కా! నాలుగైదు ప్లాస్టిక్ సంచులు బడెయ్యిట్టా!"
"ఏందో …చదువుకున్నోళ్ళ ఎవ్వారమంత సులభంగా  అరదమయి ఏడవదు"
పొలంలో అక్కడక్కడా గుంటలు త్రవ్వి మట్టితీసి సంచుల్లో నింపాడు. వాటిపైన స్టిక్కర్లు అంటించిన తర్వాత "పోదాంపా నాయనా!" అన్నాడు. నెల్లూరులో దిగంగానే “నాక్కొంచెం పనుంది. నువు వ్యవసాయాఫీసుకు బొయ్యి వివరాలు కనుక్కొనిరా! నేను బస్టాండ్లో ఉంటా! విత్తనాలు అవీ నాకు జెప్పకుండా కొనబాక!” అన్నాడు. "ఏందో యీడి తిక్కలెవ్వారం"  అనుకుంటూ వెళ్ళాడు.
*  *  *
నాల్రోజుల తర్వాత పోస్టులో ఒక కవరొచ్చింది. కొమరయ్య తెచ్చి "ఏందో  జాబొచ్చిందబయా! ఉద్యోగం గామాల చూడు" అన్నాడు.
"నాయనా ఇట్రా కొంచెం మట్లాడాల నీతో"
"ఏందిరా ఉద్దోగం వచ్చిందా  లేదా జెప్పు గబాల్న. మీ యమ్మకు జెప్పాల. పిచ్చిమాలోకం సంతోషపడతాది."
"కాదు… నువ్వు పొలంలో ఏమెయ్యాలనుకుంటున్నావు?"
"అదేరా! గోంగూర నారు… మళ్ళా అదేందది…..టమేటా కాయల ఇత్తనాలెయ్యాలని అనుకుంటున్నా"
"చెప్పేదిను! ఇప్పుడున్న అవిసెచెట్లమీద తమలపాకులు పాకించు. తర్వాత రెండు యెకరాల్లో పత్తికాయలెయ్యాల!"
"అయ్యెందుకురా! పండుతాయా పెడతాయా? చెప్పు అనవసరపు యాతన తప్పించి. ఇంతకీ ఆ జాబేందో చెప్పబళ్ళా?"
"ఇది మన పొలంలో ప్రత్తిపంట వెయ్యమని రాశారు. అది నల్లరేగడి నేలంట. ఇంకొక ఎకరా దేనికీ పనికిరాదు. అడుగున సుద్ద అంటే సున్నం ఉందట లోపల"
"అట్నా! మరైతే కర్చులెక్కువవుతుళ్ళా. … పత్తిత్తినాలు కొనాలంటే?"
"అవన్నీ నేను చూసుకుంటా! ఆ సుద్ద ఉన్న ఎకరాలో మనం ఒక కొట్ఠాం వెయ్యాల"
"ఎందుకో?"
"చెబ్తా అన్నీ" అని లేచెళ్ళిపొయ్యాడు.
*  *  *
లోహిత్ నాలుగు రోజులకు ప్రత్తి పంటకు సంబంధించిన వివరాలన్నీ సంపాయించి మొదలు పెట్టాడు. పొలంలో తక్కువ ఖర్చుతో ఒక పెద్ద వసారా లాగా వేయిచాడు. గాలి తగలకుండా నాలుగు ప్రక్కలా తాటాకులు కప్పించాడు. ప్రత్తికి నీళ్ళెక్కువ పల్లేదని చెప్పి 20 రోజులకొకసారి నీళ్ళు పెట్టాలని అన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఈలోపు నెల్లూరుకు బొయ్యి పార్సిలాఫీసులో ఎర్రమట్టి బస్తాలు నాలుగు తెచ్చాడు. 
"ఏడ్నుంచి దెప్పించావీ మట్టి"
"అవన్నీ తర్వాత మన కుమ్మరిశాల మొత్తం సామాగ్రి ఎడ్ల బండిలో పొలంలో ఉన్న కొట్ఠానికి చేరిపిచ్చు" 
"అట్నే!" అని తల కొట్టుకుంటూ చెప్పింది చేశాడు.
పొలంలో వసారా ప్రక్కన ఒక  చిన్న బట్టీ (కిలన్) ఏర్పాటు చేశాడు.
*  *  *
తండ్రి సహాయంతో ఆ టెర్రాకోట మట్టితో రకరకాల వస్తువులు తయారు చేసి నెల్లూరులో రాజస్తాన్ వస్తువులని చెప్పి తక్కువ రేటుకు  సప్లై చేశాడు అన్ని ఫాన్సీ షాపులకు, అంగళ్ళకు. వస్తువులు ఉత్తరభారతదేశంవి అవడం వల్ల అందరూ "ఆరోగ్యం… అంటూ ఎగబడి కొన్నారు. ఆ వస్తువులకు బొమ్మలకు విపరీతమైన డిమాండు ఏర్పడింది. కొమరయ్య బిత్తరపొయ్యి "అయ్యా! మనం మట్టి బిసుక్కునే వాళ్ళం అనుకున్నాం గానీ   దాన్లో ఇంత ఆదాయం ఉంటుందని తెలేలేదయ్యా!" అన్నాడు.
*  *  *
రెండు నెల్లయినా రాకపోయేసరికి అంబికకు దిగులు ఎక్కువయింది. తమ్ముడు చదువు మానేసి అన్నిట్లో సహాయకారంగా ఉన్నాడు. త్వరలో వస్తాననే మెసేజే  ఎప్పుడూ వస్తుండడంతో ఒక సారి లోహిత్‌కు ఫోను చేసింది.
"హలో చెప్పండి మేడంగారు"
"మేడం లేదు… మేళంలేదు… ఎప్పుడొస్తున్నావు?   నాకేమీ తోచడం లేదు. ఇంక నేనే వస్తా అక్కడికి!"
"ఇక్కడికి వస్తారా?" పెద్దగా నవ్వాడు. "ఎందుకు నవ్వు..మీరు వారం రోజుల్లో ఇక్కడ ఉండాలి అంతే!" ఫోను పెట్టేసింది.
*  *  *
రెండు నెల్ల తర్వాత ఉదైరంసర్ వెళ్ళిన లోహిత్‌ను చుట్టుముట్టి అందరూ ప్రశ్నల వర్షం కురిపించారు. పరిస్థితులు వివరించి తను సొంతవూరులోనే టెర్రాకోట వస్తువులు తయారు చెయ్యాలని ఉన్నదని చెప్పాడు. దానికి మట్టి సప్ప్లై చెయ్యడానికి వాళ్ళను ఒప్పించాడు. తాను ప్రక్కరోజు రాత్రి మళ్ళీ ఊరికి వెళ్తానని చెప్పడంతో అంబిక వాళ్ళ నాన్న ఆరోజు రాత్రి భోజనానికి వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. వాళ్ళ ఆహ్వానం మేరకు రాత్రి 8 గంటలకు వెళ్ళాడు. 
"మా అమ్మాయితో మాట్లాడుతూ ఉండు. నాకు చిన్న పని ఉంది గంటలో వచ్చి డిన్నర్‌లో కలుస్తా" అని అంబిక నాన్న బయటికి వెళ్ళాడు. ఇద్దరూ మేడమీద గదిలో సమావేశం అయ్యారు. ఇద్దరి మధ్యా మౌనం తాండవిస్తూ ఉంది. అంబిక మొహం పాలిపోయి ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంది. లోహిత్ తానే నిశ్శబ్దం ఛేదిస్తూ "ఏంటి మేడం అలా ఉన్నారు? ఆరోగ్యం బాగాలేదా?" అన్నాడు.
"మనసే బాగోలేదు. ఇక్కడ తమ్ముడు అన్నీ చూసుకుంటుంటూ అలవాటుపడ్డాడు. కాబట్టి..నేను"
"సో..మీరు.."
"పెళ్ళి చేసుకుందమనుకుంటున్నాను"
"గుడ్! మీ వంటి అందమైన తెలివైన అమ్మాయిని చేసుకోడానికి కోటీశ్వరులైన రాజస్థాన్ అబ్బాయిలు క్యూ కడతారు మేడం"
"అంటే  కోటీశ్వరులనే  చేసుకోవాలంటారా?"
"అఫ్‌కోర్సు..డబ్బున్న వాళ్ళు… డబ్బున్న వాళ్ళనే  కదా చేసుకుంటారు? అదే లాజిక్!"
" తొక్కలో లాజిక్!  పేదవాడిని చేసుకోకూడదా?"
"అలా అని కాదు.. అలా   సినిమాల్లో మాత్రమే సాధ్యం" అని నవ్వాడు.
"మీరు చేసుకుంటారా? నన్ను"
"అదేంటి బాబోయ్! తిప్పి తిప్పి నా మీద బడ్డారు"
"సీరియస్ గానే అడుగుతున్నాను....చెప్పండి!"
"మీరు చాలా గొప్పవారు. మాది చాలా చిన్న కుటుంబం. పైగా నేను మా వూర్లో వ్యవసాయం, ఈ టెర్రాకోట వస్తువుల ఫాక్టరీ పెట్టాలనుకుంటున్నాను"
"నేను మీ ఊరు వచ్చి ఉంటాను. మీ ఫాక్టరీ పన్లలో సహాయం చేస్తాను"
"మై గాడ్ నమ్మలేకపోతున్నాను. నిజమా?  కానీ… రాజకుమార్తెలు అడవుల్లో… ఉండగలరా?"
"సీతాదేవి ఉండలేదా?" అంటుండగా వాళ్ళ నాన్న వచ్చాడు.
"వాట్ ఎంగ్‌మాన్? కబుర్లు అయ్యాయా?  ఏమంటుంది అంబిక?  రామాయణం  గురించి మాట్లాడుకుంటున్నారా? " అనేసరికి ఏమి చెప్పాలో తెలీలేదు అయోమయంగా చూశాడు.
"అర్ధమయింది నువ్వేం చెప్పక్కర్లేదు. మా అమ్మాయి మాటే ఫైనల్ మా ఇంట్లో!  దాని ఇష్టమే మా ఇష్టం" అని పరోక్షంగా చెప్పాడు పెద్దగా నవ్వుతూ.
"సార్! అసలు.."అంటుండగా అంబిక మధ్యలో కట్ చేసి "అసలులేదు కొసా లేదు. డిన్నర్‌కు నడవండి ముందు" అని ముగించింది.
"నాన్నా! ఇక్కడ బట్టీ (కిలన్) కట్టిన ఇంజనీరును లోహిత్‌తో కలిసి వెళ్ళేట్టుగా చెన్నైకి ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చెయ్యండి" అంది.
*  *  *
రెండు నెలల్లో ఫాక్టరీ సిద్ధమయింది జొన్నవాడలో. ఫాక్టరీ ఓపనింగు తర్వాత కామాక్షమ్మ సన్నిధిలో సింపుల్‌గా వివాహం చేసుకున్నారు.  ఫాక్టరీ ఆంధ్రప్రదేశ్ లోనే గొప్పదిగా తీర్చి దిద్దింది. తర్వాత కొన్నాళ్ళకు రాజస్తాన్లో మంచి సంబంధం చూసి తమ్ముడికి దగ్గరుండి పెండ్లి జరిపించింది. 

*  *  *
నిషాంత్ భార్య రేష్మీ చురుకైనది కావడంతో ఫాక్టరీ వ్యవహారాలు అన్ని చక్కబెట్టడం ప్రారంభించింది. ఒకరోజు "ఏమండీ! మనం అంబికవాళ్ళ ఫాక్టరీకి రెడ్‌శ్యాండ్ ఎంతకు అమ్ముతున్నాం కిలో?" అంది. అవన్నీ నీకెందుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ పనులు చూడు చాలు" అన్నాడు. కోపం వచ్చి రేష్మీ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ”రేష్మీ! నీక్కొని విషయాలు చెప్పాలి. ఈ ఫాక్టరీ ఇంత ఉన్నత స్తితిలో ఉందంటే కారణం మా అక్క”. "అయితే మాత్రం... తనకు ఇప్పుడు పెళ్ళయింది. బయట కిలో రెండు వందలున్న రెడ్‌శ్యాండ్ అంత తక్కువ ధరకు అమ్మేస్తారా?" అని గద్దించింది. "పూర్తిగా విను మరి ఫాక్టరీ మాత్రమే నాపేరు మీద ఉంది. మైన్స్ మొత్తం అక్కపేరు మీద ఉన్నాయి. తనను కదిలించావనుకో మన ఫాక్టరీకి శ్యాండ్ సప్లై ఆగిపోతుంది. మనం బయట కొనుక్కోవాలి అర్ధమైందా?" అనగానే మరేం మాట్లాడకుండా పడుకుంది.

*  *  *
ప్రక్కరోజు శుక్రవారం ఉదయం పూజానంతరం "ఏమండీ! రేపు మీకు ఏమైనా ముఖ్యమైన పనులున్నాయా?" అన్న రేష్మీ ప్రశ్నకు నిషాంత్ ఒక్క నిముషం ఆలోచించి "ఏమీ లేవు ఎందుకు?" అన్నాడు. రేపు తెల్లవారుఝాము ఫ్లైట్‌కు మీకు నాకు చెన్నైకి బుక్ చెయ్యండి. అలాగే సండే నైట్ రెటర్న్‌” అనగానే "ఏమిటో చెన్నైలో అంత మునిగిపోయే పని?" అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "చెన్నైకి దగ్గర్లో మా అన్న వదిన ఉన్నారు. చూడాలని ఉంది" అనగానే ముగ్గురూ మొహాలు చూసుకున్నారు. పెద్దాయన కొంతసేపటికి "వెళ్ళండిరా! అంబికకు మూడో నెల వచ్చిందట.కోడలు పిల్ల సరదా పడుతోంది. రేపొక్క రోజు ఫాక్టరీ నేను మానేజ్ చేస్తాలే! వెళ్ళిరండి" అన్నాడు. ఫ్లెయిట్ దిగి కార్లో 10 గంటల సమయంలో జొన్నవాడ చేరుకున్నారు. లోహిత్ పేరు చెప్పగానే ఒకబ్బాయి యిల్లు చూపించి వెళ్ళాడు. ఆశ్చర్యపోయింది అక్కడి వాతావరణం చూసి రేష్మీ. అది రెండు గదులు చిన్న పెంకుటిల్లు. లోపల చిన్న హాలు. వెళ్ళేసరికి అంబిక కోటమ్మ కూర్చుని ఉన్నారు. వీరిద్దరినీ చూడగానే ఆశ్చర్యమైంది అంబికకు. గబ గబ పరుగున లేచి వచ్చి రేష్మీని కౌగలించుకుని వలవలా ఏడ్చింది.  “ఏంటే.. చిన్నపిల్లలాగా! ఊర్కో… చూద్దామని వచ్చాం” అనిసముదాయించాడు. రేష్మీ "వదినా! నువ్వు కానుపయ్యేవరకూ వచ్చి అక్కడ ఉండొచ్చుగదా!" అంది టిఫిన్లు అయ్యాక. “వద్దులే రేష్మీ! ఇక్కడ ఇబ్బందులు ఇక్కడున్నాయి అమ్మతో మొన్ననే మాట్లాడా.  డెలివరీ అప్పుడు ఎలాగూ తప్పదు" అంది. "వదినా! నువ్వు చాలా గ్రేట్. నన్ను పట్టుబట్టి మీ ఇంటికి కోడలిగా తెచ్చావు. అత్తగారింటికి భయపడుతూ వచ్చిన నాకు పుట్టిల్లు లాగే అనిపించింది. ఏమాత్రం కూడా కష్టం కలుగలేదు" అంటే అంబిక నవ్వుతూ "అదంతా నీ మంచితనం రేష్మీ!" అంది. "లేదక్కా! నువ్వు ఆ యింట్లో పెద్దగా పుట్టి చాలా మంచి పద్ధతులు పెట్టావు. మన టెర్రాకోట గనులన్నీ నీపేరున వున్నా..అందులో ఎంత వస్తోంది ఆదాయమని ఏరోజూ మమ్మల్ని అడగలేదు." అనగానే  మండిపడి "ఒరేయ్! నిషాంత్! యిలా రా  రా! దీనికా వివరాలు చెప్పొద్దన్నా గదా! ఎందుకు చెప్పావు?" అని గద్దించింది. "లేదక్కా! ఇదే నన్ను రెచ్చగొట్టింది" అన్నాడు. "చూడు రేష్మీ! ఇక్కడ నీది నాది అని ఏమీ ఉండవు. అన్నీ మనవి అన్న భావన కలిగి ఉండాలి. నీకొక్క సంగతి చెప్తా గుర్తుంచుకో  భారతీయ కుటుంబవ్యవస్థ చాలా గొప్పది. ఎన్నో బంధాలు అనుబంధాలు. అందరి మధ్య రక్త సంబంధంతో కూడిన ప్రేమ, అనురాగం, గౌరవం, మమకారం ఉండాలి తప్ప నీది నాది అని కాకుండా మనది అనే అందమైన ఆప్యాయతతో కూడిన భావన అందరికీ ఉండాలి. ఈ రోజు ఈ అనుబంధాలన్నింటిలో ఎన్నో పరిమితులు, వలయాలు, పొరలు, ఆత్మవంచనలు, స్వార్థాలు, మోసాలు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరికోసం ఒకరు అన్నట్టుగా కుటుంబ శ్రేయస్సు కోసమే కలిసి కష్టపడేవారు. ఎంత పెద్ద ఉమ్మడి కుటుంబమైనా అందరినీ ప్రేమగా చూసుకుంటూ బాధ్యతలను సమంగా పంచుకుని అందరినీ ఒక్కతాటిపై నడిపించేవారు. కాని నీటి ఆధునిక యుగంలో ఈ బంధాలు అనుబంధాలకు గల అర్థాలు మారిపోతున్నాయి. అందరూ 'ఎవరికి వారే యమునా తీరే' అన్నట్టుగా జీవిస్తున్నారు. డబ్బు సంపాదనపైనే అందరి దృష్టి. పెద్దవాళ్లైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపేస్తున్నారు. నువ్వు అర్ధం చేసుకో ధనం శాశ్వతం కాదు. పుట్టడం ఎలాగో, చావడం కూడా అలాగే.. ఇంత దానికి అపార్ధాలు, కుళ్లురాజకీయాలు, కుతంత్రాలు.. వీటివల్ల సాధించేది ఏమీ ఉండదు. నేను అన్నీ వదులుకుని ఎందుకొచ్చానంటావ్? అది ఒక్కటి ఆలోచించుకో చాలు… నీకే అన్నీ… అర్ధమౌతాయి." అంది. ఆరోజు రాత్రి అన్ని విషయాలు విడమరచి చెప్పింది. వెళ్ళేవరకూ అంబికను వదల్లేదు రేష్మీ. 
ఆదివారం సాయంత్రం వెళ్ళేటప్పుడు అందరికీ పాదనమస్కారాలు చేసింది రేష్మీ. కోటమ్మ వద్దకు వెళ్ళి  "అమ్మా! నేను అత్తగారింటికి వచ్చేముందు మా అమ్మ అంబిక ఉండగా నీకు ఆ యింట్లో ఎలాటి లోటూ రాదని హామీ యిస్తున్నా!" అని ఎందుకనిందో ఇప్పటికి పూర్తిగా అర్ధమయింది" అనింది. కోటమ్మ "మా అంబిక మనసు రాజ మందిరమమ్మా!" అని “కామాక్షమ్మను దర్శించుకొని వెళ్ళండి” అనింది.  కారు కదులుంటే రేష్మికి పుట్టెడు దు:ఖం ముంచుకొచ్చి నిషాంత్ వొడిలో సేదతీరింది.  
* * *

No comments:

Post a Comment

Pages