నాకు నచ్చిన నా కథ - గులాబీకి ముళ్లుంటాయి - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కథ - గులాబీకి ముళ్లుంటాయి

Share This
నాకు నచ్చిన నా కథ 
         గులాబీకి ముళ్ళుంటాయి          
 యలమర్తి అనురాధ
 
      
మొదటిరోజు ఉద్యోగంలో చేరిందేమో పొద్దుట నుంచీ సాయంత్రం అయిదుగంటలదాకా 'సిరిమల్లె ' ఆఫీసు నుంచీ బయటపడగానే పంజరంలో చిలుకను వదిలినంత ఆనందమయింది. స్వేచ్చావాయువులు పీల్చడం అంటే ఆమెకు చిన్నప్పట్నుంచీ ఇష్టం. దానికి తగ్గట్టే తల్లిదండ్రులు పెట్టిన పేరు. డిగ్రీ అవగానే పల్లెటూరులో ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేని ఆమె ఉద్యోగం పేరిట పట్నం చేరింది. కానీ పల్లెటూరి స్వచ్చమైన  గాలి ఆస్వాదించిన ఆమె ఇక్కడ కాంక్రీట్ భవనంలో ఫ్యాన్ గాలికి ఉక్కిరిబిక్కిరవుతోంది.
      అందుకే ఊరికి దూరంగా కట్టిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో రూము తీసుకుంది. ఆఫీసుకి, హాస్టల్ కి మధ్య దూరం నాలుగు బస్ స్టాప్ లు. బస్ ఎక్కితే అయిదు నిమిషాలలో వెళ్ళిపోతుంది. అయినా ఆమె వెళ్ళదు, నడుచుకుంటూ వెళితే వ్యాయామం, చల్లటి గాలి హాయిగా ఉంటుందని అనుకుంటుంది. ఆమె ఆఫీసు కుడా ఊరి చివర ఉండటం యాధృచ్ఛికమే. రోడ్డుమీద బస్సులు తప్ప జనం ఉండరు. అలా పరిసరాలను గమనిస్తూ వెళుతున్న ఆమెను ఆకర్షించిందో గులాబి తోట. అబ్బ! ఎంత బాగున్నాయి పూలు. ఒకటా, రెండా అన్ని రంగుల గులాబీలు కళ్ళకు సంకెళ్ళు పడ్డాయి. కాళ్ళు గేటు వైపుకు కదిలాయి. అలా పూలను చూస్తూ ఏదో లోకాలలో తేలిపోతూ  నడుస్తున్న ఆమెకు ఎదురు పడ్డాడు రవిచంద్ర. అప్పుడు స్పృహలోకి వచ్చిన ఆమె తన తప్పు తెలుసుకొని తడబడుతూ 'సారీ అండీ మీ పర్మిషన్ లేకుండా మీ తోటలోకి వచ్చేసానూ అంది.  
     "ఫరవాలేదులెండి, వచ్చేసారుగా. ఇంక పర్మిషన్ ఎందుకు? పూలు తెంపుతారని నేనయితే ఎవర్నీ లోపలికి రానివ్వను. మీరయితే ఫరవాలేదు. మీరు చూడటమేగాని వాటిని కోసే సాహసం చెయ్యరని నాకు తెలుసు".
    ఎలా? నేను చెప్పలేదే మీకు పువ్వులు కొయ్యనని.
    "కొందరిని చూస్తే చెప్పెయ్యవచ్చు అది అంతే". అతని మాటలులానే అతను కూడా ఎంతో స్వచ్ఛంగా, మంచివాడిలా అనిపించాడు. "రండి! మా పర్ణశాలలోకి, మీ భవనాలలో ఉన్న వసతులు ఇక్కడ ఉండవు".
     "నాకు ఇలాంటి ఇల్లు అంటేనే ఇష్టం. ఈ తోట, ఈ ఇల్లు నాకు ఎంతో నచ్చాయి. అపురూపంగా కనిపిస్తున్నాయి. రోజూ నేను ఇక్కడ ఒక గంట ఉండి వెళ్ళవచ్చా?" ఆశగా అడిగింది ఆమె. "ఓ! ష్యూర్! నేనూ తోటమాలి తప్ప ఇక్కడ ఎవరూ ఉండరు.  మీ ఇష్టం వచ్చినంతసేపు ఉండి వెళ్ళండి" అన్నాడు అతను.  
       అలా ఓ గంటసేపు అతనితో కాలక్షేపం. అలా రోజులు గడుస్తున్నాయి. రోజూ ఆఫీసు నుంచి హాస్టల్ కి వెళ్ళాల్సిన కాళ్ళు తోటవైపుకి వెళ్ళిపోతున్నాయి. ఇదో అలవాటు అయిపోతుందని మనసుకు ఎంత సర్ది చెప్పుకుందామన్నా కుదరటంలేదు. ఇది ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో మనసులో భయం. దానిని మించిన ఆరాటం పూలను పరామర్శించాలని!  స్వచ్ఛమైన వాటి అందాలను, సుగంధ పరిమళాలను ఆస్వాదించాలని.
     "అంతేనా, మరేం లేదా?" మనసు రెట్టించింది. తృళ్ళిపడింది, కలవరపడింది. అన్నిటినీ మించి అతని వెన్న వంటి హృదయం. "అబ్బ! ఎంత తేలిగ్గా అనేసావ్ వెన్న వంటి హృదయం అని. పరిచయం అయి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు, పది సార్లు కూడా మాట్లాడలేదు" వ్యంగ్యంగా అంది అంతరాత్మ.
      "పోవే! నువ్వెప్పుడూ అంతే. నా మాట ఎప్పుడు
విన్నావని. గిన్నెలో అన్నం ఎంత వండుకున్నా ఉడికిందా లేదా అని చూసేది ఒక్క మెతుకే. అలాగే అతనితో వంద మాటలు మాట్లాడకపోయినా అతను మంచివాడని చెప్పగలను. "
     "ఎలా? ఎలా?" కుతూహలంగా.
      "ఆఫీసులో ప్రతి మగ పురుగు ఎలా నన్ను తాకాలా అని ఏదో వంకతో టచ్ చేసి శునకానందం పొందుతూ ఉంటారు. ఇతను మాత్రం ఎక్కడ తగులుతుందో అన్నట్లు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. అది చాలదా మంచివాడని చెప్పటానికి".
      "అది కూడా అనుమానించాల్సిన విషయమే".
      "అసలే నేను మగవాళ్ళను నమ్మను. ఎవరో ఒకరు నచ్చారు అంటే నువ్వొక దానివి అడ్డుపుల్లలు వేసి చంపుతావ్!"
      "సరే! నీకంత నామీద కోపంగా ఉంటే నేనెందుకు మాట్లాడటం, మూగదానిలా పడుంటాను" అలుగుతూ అంది అంతరాత్మ.
      "వద్దు! వద్దు! నేను అలర్ట్ గా ఉండకపోయినా ఫరవాలేదు. నువ్వు మాత్రం తప్పక ఇలాంటివి చెప్పాలి. అప్పుడే నేను జాగ్రత్తగా ఉంటాను. అతన్ని నేను ఇష్టపడుతున్నాను. అంతేకదా!  స్నేహమయిలా అనిపించాడు, అంతే"!
      "అంతేనా! నాకేం నమ్మకంలేదు. అది దాటి ప్రేమదాకా వెళ్ళిపోయినట్లనిపిస్తోంది. అందుకే నా జాగర్త!"  
      కాదు కాదని అంతరాత్మను మభ్యపెట్టింది కానీ తన మనసుకు తెలియదూ అది స్నేహమనే మెట్టు దాటి ముందుకు వచ్చేసిందని. నిర్మానుష్యమైన రోడ్డులో ఒకపక్కగా వాళ్ళిద్దరూ సంభాషించుకుంటున్నారు. చూసేవాళ్ళకు ఆమె ఒక్కతే వెళుతున్నట్లు అనిపిస్తుంది. కనిపించే నీడ, కనిపించని అంతరాత్మ. దానితో కబుర్లు ఆమెని వెన్నంటే ఉంటాయి. అందుకే ఆమె తానెప్పుడూ ఒంటరిదాన్నని అనుకోదు. అసలు అలా ఎంత మంది అనుకోగలరు? గేటు దగ్గరకు రావటంతో అంతరాత్మ మౌనముద్ర వేసింది. ఇక అప్పుడు మాట్లాడితే తిట్ల వర్షం కురుస్తుంది.

      "రండి! రండి! మీరు వచ్చే టైముకి నా కళ్ళు వద్దన్నా వినకుండా గేటువైపు చూడటం మాననంటున్నాయి. వాటికి చెప్పలేకపోతున్నాను, ఇప్పుడు చూడండి! అటు చూడమంటున్నా చూడటంలేదు విచిత్రంగా" సాదరంగా ఆహ్వానిస్తూ అన్నాడు.
      ముసిముసిగా నవ్వుకొంది ఆమె కన్నె వయసు. వద్దనుకున్నా ఆమె కళ్ళు వాలిపోయాయి. ఆ సిగ్గు కనిపించకూడదని పక్కకు తిరుగుతూ "ఆరంజి గులాబి మొగ్గతొడిగిందే!" అంది.
     "అవును, అవి మీ బుగ్గలలో పూస్తున్నాయని తెలియక."
     "మీరు గులాబీలు అందంగా ఉన్నాయని రోజూ పొగుడుతుంటే వినచ్చు, నేను మీరు అందంగా ఉంటారని అంటే తప్పా! సర్లెండి" చిన్నబుచ్చుకుంటున్నట్లు  ముఖం పెడుతూ అన్నాడు తెలివిగా.
     "అలా అని కాదు సరే! ఇంకేమయినా మాట్లాడండి".
     "ఈరోజు నామనసెందుకో ఆనందంగా ఉంది. ఇలాంటివి తప్ప ఇంకేమీ మాటలు రావు. మంచి పాట ఏదయినా పాడాలని, వినాలని మహా ఉబలాటంగా ఉంది".
    "మరింకేం పాడండి, నేను కూడా వింటాను" అంది.
     "రోజూ నా పాటలు వినీ వినీ పూలు విసుగెత్తిపోయాయి. ఈరోజు మిమ్మల్ని పాడమని అవి ఎలా తలలూపుతున్నాయో చూడండి".
    "అవి గాలికి ఊగుతున్నాయని తెలుసు. అయినా మనసు ఆ మాట ఒప్పుకోదే"! అతని మాటే కరెక్ట్ అంటుంది.
    "ప్రేమకుండే మహాశక్తి అది. అంతా మాయపొరలు క్రమ్మించేస్తూ మనుషులను, మనసులను ఆలోచనా హీనులను చేస్తుంది.  నిర్వీర్యులను చేసినా ఫరవాలేదు. అలా కాక విచక్షణ మరిచేట్లు చేసే ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
     "సరే! పాట పాడండి" అంది ఆమె మళ్ళీ.
      ఇంక ఎక్కువ బతిమాలించుకోకుండా సన్నగా హం చేస్తూ కూనిరాగం తీసినట్లే తీస్తూ అందమయిన లోకాలలోకి మూడు నిమిషాలు ఆమెను తీసుకెళ్ళాడు తన పాటతోటి.
      అతని గొంతులోని మాధుర్యం ఏ పేరుమోసిన గాయకులకి లేదేమో! పాట అయిపోయినా ఇంకా తన్మయత్వంలోనే ఉన్న ఆమెను ఈలోకంలోకి తీసుకురావటానికి గడ్డిపరకనాశ్రయించాడు. దానితో ఆమె తుళ్ళిపడి 'అప్పుడే అయిపోయిందా' అంది నిరుత్సాహంగా.
      "ఇదేమన్నా కాసెట్టా అరగంట, నలభై అయిదు నిముషాలు ఉండటానికి" అన్నాడు నవ్వుతూ.
      'సరే! ఇప్పుడు మీరు పాడాలి!'
      "లేదు...లేదు, మీ పాట పంచిన ఆనందంలో నేనసలు పాడలేను, రేపు నేను పాడతాను. ఈరోజు నన్ను వదిలెయ్యండి".
     "కాదంటే అవుననిలే!అవునంటే కాదనిలే!" అని ఆడవారి గురించి ఎప్పుడో చెప్పారుగా. ఏంచేస్తాం మీ మాటే వింటాం.
       అలా కబుర్లతో ఒక గంట నిముషంలా కరిగిపోయింది.
      "ఇక నేను వెళ్తాను" అంటూ లేచింది ఆమె.
      "అప్పుడే వెళ్ళిపోతారా!" అతనిలో దిగులు.
      "అసలు నేను ఆఫీసు వదలగానే సరాసరి హాస్టల్ కి వెళ్ళాల్సినదాన్ని. మీ తోట చూసాక ప్రతిరోజూ ఇక్కడ గంట కాలక్షేపం చేస్తున్నాను. ఇక అంతకంటే కుదరదు. సిద్ధాంతాలకు కట్టుబడ్డదాన్ని, ఉంటాను" అంది.  వెళ్ళాలని ఆమెకూ లేదు, బలవంతంగా బయటపడింది.
     
               **               **               **

     ఎవరో ఎవర్నో పొడుచుకున్నారు, వెంటనే బంద్. అప్పటికప్పుడు ఆఫీసులు, స్కూల్స్, కొట్లూ అన్నిటినీ అదే పనిగా బంద్ చేయిస్తున్నారు రౌడీమూక. సరిగ్గా ఒంటిగంట అయింది. ఈ టైములో ఎప్పుడూ 'రవిచంద్ర ' దగ్గరకు వెళ్ళలేదు. సరదాగా వెళ్ళి సర్ ప్రైజ్ చెయ్యాలి. ఆ కళ్ళలో కనిపించే వెలుగు చూడాలి. ఎండవేళ ఏమో ఎప్పుడూ కనిపించినంత అందంగా కనిపించలేదు తోట. అది కాకుండా ఏదో స్మశాన వైరాగ్యం, మొదటి సారిగా భయం వేసింది ఆమెకు.  
      "ఏమిటిలా?"మనసును ప్రశ్నించుకుంటూనే ముందుకు సాగింది.
       దూరంగా అతని కుటీరం కనిపిస్తోంది. అప్పుడే ఇరవై, ముప్ఫైమంది తుపాకులతో అతని గుమ్మం ముందునుంచీ కదిలి వెనుక వైపుకు వెళుతున్నారు. అందరూ పంచెకట్టి, బనీనుతో తోటమాలి డ్రస్ లోనే ఉన్నారు. "ఎవరు వీళ్ళు, వీళ్ళ చేతుల్లో తుపాకులు ఏమిటి?"
      "మనసులో గందరగోళం. వెనక్కి వెళ్ళిపోదాం" అని అంతరాత్మ, ఉండు...ఏమిటో చూద్దాం...మువ్వల శబ్దం అవకుండా పట్టాలు తీసి హ్యాండ్ బాగ్ లో వేసుకొంది. నెమ్మదిగా కుటీరాన్ని చేరింది. లోపలినుంచీ అతని గొంతుతో పాటు మరెవరిదో గొంతు కలుస్తోంది.
     "అహహ! అయితే నీ పంచెవన్నెల చిలక అప్పుడే నీ ప్రేమ పంజరంలో పడిపోయిందా?"
     "ఆ! నా పాతివ్రత్యం చూసి" అతనూ గట్టిగా నవ్వుతూ అంటున్నాడు.
     "ఇంత తొందరగానే!"
     "ఇంకా నయం.ఈ కేసే లేటు. మిగిలినవాళ్ళు కొన్ని నిముషాలు, గంటలూ అంతే. ఈ కేసు కాస్త ముదురు".
     "ఎలాగైతేనేం సాధించావ్! బాగా రేటు పలుకుతుంది. మనమూ బాగా ఎంజాయ్ చెయ్యవచ్చు."
    "ఆ! బంగారు పంటే! పేరుకు తగ్గట్టే 'సిరి". 
     అదంతా వింటున్న ఆమె గుండె గుభేలుమంది.  ఇంతసేపూ వీళ్ళు మాట్లాడుకున్నది తన గురించా?
     "బాచ్ ను ఎప్పుడు పంపిద్దాం?"
     "ఈ నెలాఖరులో లాగించేద్దాం".
     "ఎలా అయితేనేం రకరకాల పూలతో రకరకాల అమ్మాయిలను అట్రాక్ట్ చేసుకోవటంలో నీకు నువ్వే దిట్ట.      "ఒక్క తోటేనా, నా మాటలు, నా అందం....."
     "సరే! అన్నిటితో అని ఒప్పుకుంటున్నాను, ఇక నేను వెళ్ళి రానా?"
     "ఉండరా ఇది కేసులు లేని టైము. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఫిక్స్ చేసా! సో! నో ప్రాబ్లం"
      "ఒరేయ్! ఒకవేళ ఏదయినా పొరబాటు జరిగితే".
     "అమ్మవారి కేలెండర్ పైన బొట్టు అలారంలా పని చేస్తుంది. పొద పొదకో తుపాకీ ఖాళీగా కూర్చుంటోంది. వాటికి పని చెప్తాను. అంతకంటె ఏముంటుంది?"
      ఇక అక్కడ ఉండటం ఏమాత్రం మంచిది కాదని పరుగులాంటి నడకతో బయట పడింది. గేటు దాటే దాకా టెన్షన్. ఈలోపే తన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయేమోనని. నిజంగా అదృష్టమే. టీ తాగడానికి వెళ్ళిన గాంగ్ అంతా అయిదు నిముషాలలో అలర్ట్ అయిపోయి పొదల్లో జొరబడ్డారు.
    నరరూప రాక్షసులు. అమ్మాయిలంటే బొమ్మలా! కావాలంటే వాడుకోటం, అమ్మేయటం లేదా ఎదురు తిరిగితే చంపెయ్యటం. పిల్లలు బొమ్మలాట ఆడుకున్నట్లే. తట్టుకోలేని నిజం. జీర్ణించుకోలేని ఆహారంలా ఆమెలో ఇమడలేక పోతోంది. మనసంతా చేదుగా తయారైంది. తను ఇంతలా మోసపోయిందా? చెవులారా విన్నా కూడా అతనంత మోసగాడంటే నమ్మబుద్ధి  కావడంలేదు. అతన్ని ఎంతగా నమ్మింది? అదంతా నాటకమా? అతని వెనుక ముఠానా? అతను అమ్మాయిలనెత్తుకెళ్ళే గ్యాంగ్ లీడరా?  
      ఎంతలో ఎంత ప్రమాదం తప్పించుకుంది. నరకంలోంచి పారిపోయినట్లు ఊపిరి పీల్చుకుంది. వెంటనే మేడం పర్మిషన్ తో ఒకరికి ఫోన్ చేసి విషయం చెప్పింది. కాస్త భారం తీరినట్లయింది. అయినా తల పగిలిపోయే ఆలోచనల వేడికి ఆమెకు ఒళ్ళు తెలియని జ్వరం వచ్చింది. అలా మంచం మీదే మూడు రోజులు గడిచిపోయాయి. నాలుగోరోజు మనసు శిలలా మార్చుకుంది. గట్టి నిర్ణయం తీసుకుంది. పరామర్శించటానికి వచ్చిన మామయ్య రమేష్ చంద్ర తో గంటసేపు మాటలు, పథకం పకడ్బందీగా.

              **                **                **
      "హాయ్! సిరీ! ఏమయిపోయారు? నేనే మనసాగక హాస్టల్ కి వద్దామనుకున్నాను. కానీ వాళ్ళు మళ్ళీ మీ గురించి అనవసరంగా చెడుగా అనుకుంటారేమోనని సంశయం. బాగా చిక్కిపోయారు-సిక్ అయ్యారా?" 'మేకవన్నెపులీ అని మనసులో అనుకొని "ఎందుకు చెడ్డపేరు. మనమేం తప్పుచేయటంలేదుకదా! రావల్సింది".
ఇప్పుడు చెప్పావుగా మరోసారి వస్తాను" అలా అన్నాడేగానీ ఆ స్థలం వదిలి బయటికి వెళ్ళడు. బార్ అయినా బేబీ అయినా అన్నీ అందులోకే వచ్చి చేరతాయి. ఆ విషయం మూడోకంటికి కూడా తెలియదు. డేగచూపుల పోలీసులకు కూడా కాస్తయినా అనుమానం రాని ప్రదేశం. అంత పటిష్టంగా ప్లానింగ్ లేకపోతే అమ్మాయిలను ఎలా సరఫరా చేయగలరు జాతీయస్థాయిలో.  
     "మీరొక సాయం చెయ్యాలి".
     "ఏమిటది?"
      మా పల్లెనుంచీ యాత్రలకని బస్సు బయలుదేరింది. ఇంతలో ఏదో ట్రబుల్ బస్ కి. రేపు పొద్దున బయలుదేరి వెళ్ళిపోతారు. ఈ ఒక్క రాత్రికి మీ ఆశ్రయం".
      "సిరీ! నీకు తెలుసుగా! ఈ తోటంటే నాకు ప్రాణం. ఒక్క గులాబీ మీద ఎవరి చెయ్యి పడినా నేను సహించను. అందులో పల్లెటూరివాళ్ళు మొరటు. నాకిబ్బందిగా ఉంది. ఇలా ఎవరినీ నేను రానివ్వను".
     "ప్లీజ్!నాకోసం. హోటళ్ళు లేకకాదు, అందులో ఇమడలేరని. నేనుకూడా ఈరోజు వాళ్ళకోసం ఇక్కడే ఉంటాను. హాస్టల్ లో చెప్పి వచ్చాను. రేపు వాళ్ళకి సెండాఫ్ ఇచ్చి వెళ్ళిపోతాను"
    సరేననక తప్పలేదు అతనికి, కానీ మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. వద్దంటే బంగారుచిలుక కోపంతో పంజరం దాటి ఎగిరిపోతుందేమోనని భయం.
    చివరకు ఎలాగయితేనేం అతనితో 'సరే' అనిపించింది.
    వరుసగా అరవైమంది లోపలికి వచ్చారు. అందరూ దృఢమైనవారే. వారిలో డ్రైవర్, క్లీనర్ మాత్రం కాకీ డ్రస్ లో ఉన్నారు. మిగతా అందరూ తెల్ల డ్రస్సుల్లో ఉన్నారు. అలా వస్తున్న వాళ్ళను చూస్తూ "శాంతి సందేశంలా తెల్లగులాబీలు కదిలి వస్తున్నట్టున్నాయికదూ!" అంది ఆమె.
     అతనికి మాత్రం శవాలు మీద కప్పే తెల్లదుప్పట్లు గుర్తు వస్తున్నాయి.
    సిక్స్త్ సెన్స్ ఏదో చెబుతోంది. ఏదో తెలియని సస్పెన్స్ స్టోరీలాగా...అంతరంగం కలవరపడుతోంది. వెంటనే అక్కడ ఉన్న అమ్మవారి బొట్టు మీద చేతిని ప్రెస్ చేసాడు. ఏదో పని ఉన్నట్లు లోపలికి వెళ్ళి అలారం వల్ల ఏదో అపాయం రాబోతోందని తోటంతా వెళతాయి సిగ్నల్స్. తానా పని చేయటం ఆమె గమనించలేదనుకున్నాడు. కానీ అంతకుముందే కరెంట్ ఫెయిల్ చేయించిన విషయం అతనికి ఏంతెలుసు. అలారాలు మ్రోగాయనుకుని తాపీగా కూర్చున్నాడు.
     "ఏంటీ కబుర్లు?"
     "ఈరోజు మీకు కూడా మంచి ఫుడ్"
     "ఫుడ్ దేముందిలే,  బెడ్ గురించి ఆలోచించు"
      "బెడ్డా! వాళ్ళతోపాటే! వాళ్ళంతా బెడ్డింగ్ లు సరిచేసుకుంటున్నారు. దూరంగా ఉన్నా లీలగా కనిపిస్తున్న వాళ్ళను చూస్తూ ఎవరో ఒకరు నాకు సర్దకపోరు".
    "నాది నువ్వు తీసుకో" అన్నాడు అవకాశం వదులుకోకుండా.
     "అది పెళ్ళయ్యాక" అంది ఖచ్చితంగా.
     "పెళ్ళిదేముంది. మనసులు కలవాలి గానీ! నిజం చెప్పాలంటే నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను. చెబితే నువ్వు ఎలా ఫీల్ అవుతావోనని భయం"".
    "సరే! ఇప్పుడే చేసేసుకుందాం" అందామె.
    "ఇప్పుడా?"
    "అవును, మావాళ్ళంతా ఇక్కడే ఉన్నారుగా"
     ఖంగు తిన్నాడు. అది కప్పిపుచ్చుకుంటూ...వీడియోలు...దండలూ...ఫోటోలు...
     "అందరూ వాళ్ళలోనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళేది ఎక్స్ కర్షన్ కదా! దండలు ప్లాస్టిక్ వి బస్ లో దేవుడి దగ్గర ఉన్నాయి. అవి తెస్తాను" చివరగా ఫ్లాష్ లా తట్టిన ఆలోచన
    "నీకు మీవాళ్ళున్నారు సరే! మా వాళ్ళను పిలవద్దా?" అన్నాడతను.
     "నీకెవరూ లేరన్నావ్?" అమాయకంగా ముఖంపెట్టి అంది ఆమె, మూగవాడే అయ్యాడు అతను.
    ఇక అతనితో సంబంధం లేనట్లు బయటకు వెళ్ళి "మామయ్యా! మామయ్యా!" అంటూ గట్టిగా తప్పట్లు కొట్టి పిలిచింది.
     ఆ సిగ్నల్స్ కోసమే ఎదురుచూస్తున్న వాళ్ళు ఓ.కే. అన్నట్లు ఆకుపచ్చ తుండు వూపి, మూకుమ్మడిగా ఆమె చెంత చేరారు. అంతసేపు ఆమె కబుర్లలో పడ్డ అతనికి తన వెనుక ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు కూడా అంతా అయోమయంగా ఉంది. అందరితోపాటూ లోపలికి వచ్చింది సిరి. ఆమె చేతులు వెనక్కి మడిచి పెట్టుకుంది. వాళ్ళందరిలోకి పెద్ద ముందుకువచ్చి "సిరీ! తల్లీ! నీ వలపు సంకెళ్ళతో అతనిని బంధించు" అన్నాడు. వెనుక ఉన్న ఆమె చేతుల్లో పూలదండ ఉందనుకుంటున్నాడు అతను. కానీ ఆమె చేతిలో సంకెళ్ళు, రెప్పతెరిచేలోపు అతను ఆమెవేసిన సంకెళ్ళలో బందీ అయ్యాడు.
      "ఏమిటిది? ఏమిటీ మోసం?" అంటూ అరుస్తున్నాడు పిచ్చివాడిలా. వీడియోలు, ఫోటోగ్రాఫర్లు  తమ పని తాము చేసుకుంటున్నారు. వాళ్ళంతా ప్రెస్ వాళ్ళు. అప్పుడు తెల్లత్రాచులా బుసలు కొడుతూ అంది సిరి "తెలివి ఒక్కడి సొత్తు అనుకోకు. తాడిదన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడు. ఆడపిల్లలంటే అందమయిన గులాబీలవంటివారే, సున్నితమయిన వాళ్ళే, కానీ తమనుతాము రక్షించుకోవటానికి ఆయుధాలు అనే ముళ్ళుంటాయ్. వాటితో గుచ్చిగుచ్చి వదిలి పెడతారు. అమ్మాయిలను మాయమాటలతో నమ్మించి బదిలీ చేస్తావా? నువ్వెళ్ళి అండమాన్, నికోబార్ దీవుల్లో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవించు, ఒక్కసారి నిన్ను ఉరికంబం ఎక్కిస్తే బాగోదు," వెక్కిరింతగా ఆమె అనటంతో అతను రెచ్చిపోతూ "నీ అంతు చూస్తాను, చాపకింద నీరులా...నా తడాఖా నీకు తెలియదు, ఒక్క విజిల్ చాలు".
       "ఏదమ్మా!ఊదు బుగ్గలు నొప్పిపుట్టేదాకా ఊదు, ఒక్కడు రాడు, ఎందుకంటే వాళ్ళందరికీ కాళ్ళూ, చేతులూ కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి బస్ సీట్లకింద మా వాళ్ళెప్పుడో పడేశారు"
     తన రహస్య స్థావరం విషయాలు ఈమెకెలా తెలిసాయి?  అండర్ గ్రౌండ్లో ఉన్నవాళ్ళను వీళ్ళెలా పట్టుకున్నారు? అతని కళ్ళలో సంశయాన్ని గమనించిన సిరి మా అంకుల్ డి.ఎస్.పి. రమేష్ చంద్ర. నా అదృష్టం బాగుండి శనివారం ఒంటిగంటకు ఇక్కడికి వచ్చా. నీ గుట్టురట్టు అంతా విన్నాను. వెంటనే ఆయనకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పాను. మూడురోజుల్లో నీ గుట్టు, తోటగుట్టు చిన్నతీగ లాగితే డొంక కదిలినట్లు లాగారు. పోలీసులంటే తెలిసిందే కదా! అందులో వీళ్ళంతా స్పెషల్ స్క్వాడ్. యుద్ధప్రాతిపదిక మీద పనులు చేసారు.
      తలవంచుకోవలసి వచ్చింది అతనికి. ఈ అవమానాన్ని అతను భరించలేకపోతున్నాడు. ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోవటమా? జేబులో పిస్టల్ తీసి కనీసం ఆమెనన్నా చంపితే కానీ తన మనసు శాంతించదు. సంకెళ్ళు అడ్డు వస్తున్నాయి...అది గమనించిన సిరి అతని జేబులోని రివాల్వర్ ని తీసి డి.సి.పి. కి అందించింది.
   "మిస్టర్ పద! పద!" అని అతన్ని ఒక్కతోపు తోసాడు డ్రైవర్ డ్రస్సులో ఉన్న డి.సి.పి. చిద్విలాసంగా నవ్వుతూ.
      "సిరీ! నీలాంటి వారు ఊరికి ఒక్కరున్నా చాలు, మా పోలీసు డిపార్ట్ మెంట్ కు సంబంధించినదానివి కాకున్నా ధైర్యంగా, ప్రాణాలకు తెగించి మాతో సహకరించావు. నిన్ను నువ్వు కాపాడుకోవటమే కాకుండా ఎందరో ఆడపిల్లలను ఈ దుర్మార్గుడి బారినుండి రక్షించావు. నరకంలాంటి వ్యభిచార గృహాలలో పడకుండా కాపాడావు వారిని. వీళ్ళ ద్వారా బాంబేలోని అసలు ముఠాను పట్టుకుంటాం. నీకో పురస్కారం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేస్తాం. మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటే ముత్యాల తలంబ్రాలు కూడా పోయిస్తాం" అన్నారు.
   "పోండి అంకుల్" అంది సిరి సిగ్గుపడుతూ. అప్పుడే గడియారంలో ముల్లు పన్నెండు గంటలను సూచిస్తోంది, రేపటి ఉషోదయానికి నాందిలా..
  

****       
         

No comments:

Post a Comment

Pages