చిన్నవాళ్ళు - అచ్చంగా తెలుగు
                                        చిన్నవాళ్ళు                                          
రామలక్ష్మి అవసరాల 
కాలింగ్ బెల్లు కూస్తే మెలుకువొచ్చింది నాకు. బద్దకానికింకా నా మీద బెంగ తీరలేదనుకుంటా.   ఇంకాసేపు పడుకోవాలని పించింది. కాని గోడమీద వాచికీ నాకూ, ఎప్పుడూ పడదుగా. నావైపు ఉరిమురిమి చూస్తోంది.. ఇంకా లేవవా అన్నట్టు..  పాత సినిమాలో సూర్యకాంతంలా.  నిజంగానే అది పూర్వజన్మలో నా అత్తగారేమో అనిపిస్తుంది..దానివంక చూడగానే..దెబ్బకి బద్దకం..బస్సెక్కి పారిపోయింది. ఒక్కసారి ఎగిరినట్టు మంచమించి దూకా.. అమ్మో 7 అయ్యిపోయిందనుకుంటూ .   వంటింట్లో హడవిడిగా నా పనులు మొదలయ్యాయి. రేడియో లో ప్రవచనాలు, కుక్కరు కూతలు, హాల్లో మా వారి టీ.వి సౌండ్ , మధ్యలో   మా పనమ్మాయి  గిన్నెలతో బ్యాక్  గ్రౌండ్ మ్యుసిక్, అన్నీ  యదావిదిగా మొదలయ్యాయి. సంసారంలో సరిగమలంటే ఇవే కాబోలు.   
ఒక గంటన్నర ప్రహసనం తరవాత పనులన్నీ  అయ్యాయనిపించా. తొలి విడత శ్రమ దానం కార్యక్రమం విజయవంతంగా ముగిసిందన్న మాట. ఆయనాఫీసుకెళ్ళాక  బాల్కనీ లోకి వచ్చి కూర్చున్నా.తెలియకుండానే నా కళ్ళు ఎదురుగా ఉన్న రేకుల షెడ్డు వైపు కదిలాయ్.  "రాణీ , నేనెల్తున్నా, తలుపేస్కో " అంటూ సైకిల్ తీస్తూ చిన్నా అరుపు వినిపించింది. వెనకాలే  బయటకొచ్చింది రాణి. ఎందుకో రోజూ  ఆ అరుపుకలవాటుపడిపోయాను  నేను.                                             
 **** 
మా ఫ్లాట్ ఎదురుగా చిన్న రేకులు షెడ్డులో ఉంటారు - చిన్నా, రాణి, వాళ్ళిద్దరాడపిల్లలూ. చిన్నప్పుడే పెళ్ళి చేసేరు కాబోలు. వాళ్ళిద్దరిదీ కాలేజికెళ్ళే వయసు. కాని అప్పుడే పెళ్ళీ, ఇద్దరు పసి పిల్లలు. ఎందుకో నాకు వాళ్ళని చూస్తే భలే  ముచ్చటేస్తుంది. చిన్నా చాల హుషారైన వాడు.. ఏడో క్లాసు వరకే చదువుకున్నాడు. రాణీ , చిన్నా బావామర్దళ్ళే. చిన్నా ఇళ్ళకి సున్నాలు వేసే పని చేస్తాడు. మంచి మాటకారి, నమ్మకస్తుడు. అందుకే ఆ పనిలో  మంచి పేరు తెచ్చుకున్నాడు. రాణీ కూడ చాల చలాకీ  పిల్ల, మంచి తెలివైంది కూడా. చదువంటే ప్రాణం రాణికి . ఇంటర్ అవ్వగానే పెళ్ళైపోయింది.. పెళ్ళయ్యాకే , డిగ్రీ చేసింది. తను చదువుకోపోయినా రాణీకి చదువు మీదున్న శ్రద్ద చూసి, చిన్నా చదివిస్తున్నాడు.ఇప్పుడు పిజి కి  ప్రిపేరౌతోంది .చిన్నా, రాణి మాకెప్పుడూ అందుబాటులో ఉంటారు. ఏ అవసరం వచ్చనా , పిలవగానే పలుకుతారు. అక్కా ,అక్కా అంటూ ఎంతో అభిమానంగా ఉంటారు. నాకు ఇంటి పనికి, బయట పని ఏది అవసరమైన చేసి పెడతారు. డబ్బులిస్తే తీస్కోరు.. అభిమానమెక్కువ.  అందుకే నేను వాళ్ళ పిల్లలకి గౌన్లని , బొమ్మలని, పుస్తకాలని ఏవో కొనిస్తూ ఉంటా.

చిన్నా వెళ్ళగానే, రాణి చిన్న పిల్లని చంకనెత్తుకుని, పుస్తకాలు పట్టుకుని మా ఇంటికొచ్చింది. కాసేపు నాకు పై పనులలో సాయం చెస్తూ నాతో కబుర్లు చెప్పి,  నా  పనయ్యాక,  పుస్తకాలుతీసి తనకున్న డౌట్స్ అడిగి  చెప్పించుకునెళ్ళింది.
మావారికెందుకో చిన్నా వాళ్ళతో నేను సరదాగ ఉండడం నచ్చేది కాదు . మనవెక్కడా, వాళ్ళెక్కడా అని ఎప్పుడూ వాళ్ళని చిన్న చూపు చూసేవారు. అలాంటి వాళ్ళని నెత్తినెక్కించుకోవద్దని, ఎక్కడుంచాలో అక్కడుంచాలని,అలాంటివాళ్ళు నమ్మించి మోసం చేస్తారని, వాళ్ళదంత నటన అని నాకెప్పుడూ క్లాస్ తీసేవారు . మా ఆయనకే కాదు, మా అత్తగారికి ఈ హోదా పిచ్చి వుంది. మనిషి హోదా చూసి ముందుకు కదుల్తారు వాళ్ళు.. కాని 2 నెలలక్రితం జరిగిన సంఘటన ఆయన్ని పూర్తిగా మార్చేసింది.  
***** 
రెండు నెలలక్రితం ……                                            
ఆ రోజు భోంచేసి కాసేపు నడుంవాల్చా, ఏదో పత్రిక చదువుతూ. ఇంతలో నా సెల్ మోగింది. ఈ  టైం లో ఎవరబ్బా అనుకుంటూ చూసా.. ఏదో కొత్త నంబరు . ఎత్తి హెలో అన్నా.. ఆయనాఫీస్ వాళ్ళు.. ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందని.. వెంటనే నన్ను ధరణి హాస్పటల్ కి రమ్మన్ని చెప్పి ఫోన్ పెట్టేసారు. ఒక్క క్షణం కాళ్ళు, చేతులూ ఆడలేదు. ఏంచెయ్యాలో తోచలేదు.నాకు తెలీకుండానే నేను.. చిన్నా, రాణీ అనరుచుకుంటూ,బాల్కనీ లోకి వెళ్ళా. నా అరుపు విని రాణి గబగబా బయటకొచ్చింది. నా గొంతులో గాబరా కనిపెట్టింది , వెంటనే పైకొచ్చింది.విషయం చెప్పగానే,  చిన్నాకి ఫొన్  చెసి, ”నేను అక్కా హాస్పటల్కొస్తున్నాం. నువ్వూ వచ్చై” అంది. నాకు ధైర్యం చెప్పి, ఆటో పిలిచి, తన పిల్లలని పక్కనే ఉంటున్న వాళ్ళ పిన్నికప్పచ్చెప్పి, నాతో హాస్పటల్కి బయల్దేరింది. దారంతా నా చెయ్యి పట్టుకుని, సార్ కి ఏంకాదక్క, చిన్న యాక్సిడెంటే అయ్యుంటుంది.నువ్వు కంగారు పడకక్క అని ధైర్యం చెప్తూనే ఉంది.  నా కళ్ళు తుడుస్తూనే ఉంది.

మేము హాస్పటల్ దగ్గర  ఆటో దిగాం ,చి న్నా కూడా మాకెదురొచ్చాడు. గబగబా అందరం లోపలికెళ్ళాం .   ఆ రోజు పొద్దున్నెవరో క్లైంట్ ని కలవడానికెల్తుంటే, ఆయన కార్ ని లారీ  గుద్దిందట. తలకి పెద్ద దెబ్బతగిలిందని, కాలు ఫ్రాక్చరైందని, రక్తం బాగా పోయిందని .ICU లోఉన్నారని చెప్పారు. నాకు కళ్ళు తిరిగినట్టై పక్కకు తూలబోయా. గబ్బుక్కున రాణి అక్కా, అక్కా అంటూ పట్టుకుని కుర్చిలో కూర్చోబెట్టి నీళ్ళిచ్చింది. నేను చిన్నపిల్లలా ఏడుస్తుంటే, రాణి నన్ను హత్తుకుని సముదాయించింది. నేను, చిన్నా, ఆ ఆఫీసాయంతో కలిసెళ్ళిడాక్టరు గారితో మాట్లాడాం .రక్తం చాల పోయిందని. అర్జెంటుగా ఆయనకు రక్తం ఎక్కించాలని, కాని ఆయన గ్రూప్ రక్తం వాళ్ళ దగ్గర లేదని, తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేరు. మమ్మల్ని కూడా ప్రయత్నం చెయ్యమన్నారు. చిన్నా వెంటనే తన జేబులోంచి ఒక కార్డ్ తీసి ఆ డాక్టర్ గారికిచ్చి “సార్ ఇందులో నా రక్తం గ్రూప్ రాసుంది , నాది మా సారుకి సరిపోతుందేమొ చూసి చెప్పండి " అనడిగాడు .  ఆయన  ఒక్క క్షణం ఆ కార్డ్ చూసి " యస్. నీది, మీ సార్ది ఒకటే గ్రూపోయ్ . B-“ అని చెప్పారు. వెంటనే చిన్నా " అయితే నేనుసారుకి రక్తం ఇవ్వచ్చు కదండి "  అన్నాడు. "యస్. తప్పకుండా. " అని ,నావైపు తిరిగి "మ్యాడం, వి ఆర్ లక్కీ " అన్నారు . ఆ మాటకి నాకు ప్రాణం లేచొచ్చింది. అలా చిన్నా ఇచ్చిన రక్తం తో ఆయనకి ప్రాణగండం గడిచింది. ఒక వారం హాస్పటల్లోనే ఉండాలన్నారు. ఈలోపు మా అత్తయ్యగార్ని దించి , బావగారు రెండు రోజులుండి వెళ్ళిపోయారు. వారం రోజులు హాస్పటల్లో రాత్రులు నేను ఆయన దగ్గరుంటే, నాకు ఏ అవసరం వస్తుందో  అని  చిన్నా కూడా హాస్పటల్లోనే పాపం రాత్రి పగలు ఉన్నాడు. ఇక ఇంటి దగ్గరంతా రాణియే చూస్కునేది .అత్తయ్యగారికి మడెక్కువ, మడి కట్టుకుని వంట చేసేవారు  . అంతే  పై పనులన్నీ రాణియే. నాకూ, ఆయనకి  టిఫిన్లూ, భోజనాలు  కారేజీలు,నీళ్ళు, పాలు అన్నీ వాళ్ళిద్దరే తిరిగారు. చిన్నా పనికెళ్ళలేదు, రాణికీ సరిగా నిద్రుండేదు కాదు  . వాళ్ళని చూస్తే ఏ జన్మ బంధమో అనిపించింది నాకు. 
వారం రోజులు గడిచాయ్ .ఆయన్నింటికి పంపించారు. తలకి దెబ్బతగలటం వల్లనేమో,ఒక నెలదాకా ఒక్కరినే బయటకు పంపొద్దని, వంటరిగా వదలద్దని చెప్పారు .వారం ,వారం చెకప్ కి తీస్కురమ్మాన్నారు. ఆయన రోజంత ఎక్కువ సేపు నిద్రపోయేవారు. నేనాయన పక్కనే ఉండేదాన్ని .ఆయన్నలా చూస్తుంటే నాకేదో భయం, బాధ. అన్ని కలిపి నీరసం. యేపని చేసేదాన్ని కాదు, చెయ్యాలనిపించేదికాదు  . రాణి ఇంట్లో పనులన్ని చేస్తొంటే మా అత్తగారికి నచ్చేదికాదు. చికాకు పడేవారు. ఏదో సూటి పోటి మాటలనేవారు. కాని పాపం రాణి ,  చిన్నా అవేమి పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్కునేవారు  . 10 రోజులు గడిచాయి. ఆయన కాస్త కోలుకున్నారు. డాక్టరుగారు కూడ చూసి పర్వాలేదు ప్రోగ్రెస్  బానే ఉందన్నారు. ఆయన మెల్లగా హాల్లోకొచ్చి కూర్చుని, కాసేపు  టి.వి చూడ్డం, అవి మొదలెట్టారు.  ఆయనలా తిరుగుతుంటే,నాకూ కాస్తోపికొచ్చినట్టుంది. లేచి మెల్లగా పనుల్లో  పడ్డా.        
ఆ రోజు సాయంత్రం రాణి కూరలు తరుగుతోంది, చిన్నా బయటనించి వచ్చాడు. ఏవో బిల్ల్స్ కట్టానని ,డబ్బులు లెక్క చెప్పబోయాడు నాకు. "నేనడిగానా చిన్నా " అని కసిరాను నవ్వుతూ. తను మాత్రం లెక్క మొత్తం రాసి , చిల్లర టేబల్ మీడ పెట్టేసి వెళ్ళాడు. కాసేపటికి రాణి కూడా  వెళ్ళిపోయింది. పాపం ఇద్దరూనాకోసమెంత నలిగిపోతున్నారో అనుకున్నా మనసులో. వాళ్ళు వెళ్లగానే మా అత్తగారు నా దగ్గరకొచ్చి" అలా పని వాళ్ళకి ఇల్లప్పగించి, నెత్తినెక్కించుకుంటే, రేపు వాళ్ళు ఇల్లు , గుల్ల చేస్తారు. " అన్నారు. వెంటనే నేను"  అత్తయ్యగారు, చిన్నా, రాణి పని వాళ్ళు కాదండి" అన్నా ఉక్రోషంతో. " మరి మన చుట్టాలా వాళ్ళూ.. ఆ సున్నలేస్కునే వాడు మనకేమవ్తాడు" అంటూ వాళ్ళని హేళనచేస్తూ  మాట్లాడారు. మా అత్తగారికి వత్తాసు మా ఆయన" అవును పద్మ. నీకెన్నో సార్లు చెప్పాను. వాళ్ళకి అతి చనువివ్వకూ అని. మన కన్నా చిన్న వాళ్ళని , ఎక్కడుంచాలో, అక్కడుంచాలి. డబ్బు కోసం వాళ్ళు ఏమైన చేస్తారు" అని మొదలెట్టారు. ఆ పరిస్తితిలో కూడా ఆయనలా మాట్లాడ్డం , అత్తయ్యగారిని సమర్ధించడం నాకు చాల బాధ కలిగించాయి. అన్నిటికంటే చిన్నాని, రాణిని తూలనాడి తప్పుగా మాట్లాడుతుంటే దుఃఖం  తన్నుకొచ్చింది. ఇక వాదించలేక అక్కడ్నుంచి  లేచి లోపలికొచ్చెసా , కన్నీళ్ళు తుడుచుకుంటూ.   

రాత్రి పడుకుబోయే ముందు ,ఆయనకి ,చిన్నా, రాణి ఈ 10 రోజులునాకెంతండగా నిలిచారో  మెల్లగా చెప్పాను. ఆయనకు రక్తమిచ్చింది చిన్నాఅని మాత్రం చెప్పలేదు. ఆ విషయమాయనకు చెప్పొద్దని  చిన్నా నా దగ్గర మాట తీస్కున్నాడు. ఆయనకి వాళ్ళంటే చిన్నచూపని  తెలిసే , అలా చెప్పొద్దన్నాడేమో అనిపించింది నాకు .  నేను చెప్పిందంతా విని మెల్లగా నిట్టూర్చారాయన.   ఏమి మాట్లాడలేదు. నేనింక ఆయనికిష్టం లేని విషయం మాట్లడలేదు.  

తెల్లారింది. ఆ రోజు నేను గుడికి వెళ్ళాలని త్వరగా లేచి అన్ని పనులు చేస్కుని బయలుదేరా. వెళ్తూ, వెళ్తూ చిన్నాకి మందుల చీటీ, డబ్బులూ ఇచ్చెళ్ళా. ఆయన పేరు మీద పూచ్చేయించుకుని ఇంటికొచ్చా. చాల రోజుల తరవాత మనసుకి కాస్త హాయిగా అనిపించింది.

తిరిగొచ్చి హాల్లో కూర్చున్నా, ఆయనకు , మా అత్తగారికి ప్రసాదమిద్దామని. ఇంతలో చిన్నా,   రాణి వచ్చారు." సర్ పిలిచారుటా అక్కా" అంటూ. ఎప్పుడూ లేనిది ఆయన వాళ్ళిద్దరిని పిలవడమెంటి అని ఆశ్చర్యమేసింది. ఇంతలో ఆయన "రా, రా , చిన్నా.. రాత్రి మీ ఇద్దరిగురించి మీ అక్క చెప్పిందోయ్.. తనకి ఈ 10 రోజులు మీరే ఎంతో సాయం చేసారోయ్. " అన్నారు. ఆయన గొంతులో నాకేదో తేడా వినిపించింది .. ఆ మాటల్లోకృతజ్ఞత, ఆనందం కంటే కూడా అవహేళనా స్వరం ఎక్కువగా వినిపించింది.ఇంతలో మా అత్తగారు లోపలినించి డబ్బులు తెచ్చి మా ఆయనికిచ్చారు. మా ఆయన "ఇంద చిన్నా.. పదివేలు....ఓకేనా. మొహమాటపడకు.. ఇంకా కావాలంటే చెప్పు " అని చిన్నా చేతిలో ఆ డబ్బు పెట్టారు. నేనేదో చెప్పబోతే..ఆయన ఇప్పుడేం మాట్లాడకూ అన్నట్టు చెయ్యూపి నన్ను వారించారు.. చిన్నా, రాణి ఒకరి మొహాలొకరు  చూస్కున్నారు. ఇద్దరూ ఒకసారి నా వైపు చూసారు. మా ముగ్గిరి కళ్ళళ్ళో బాధా, భావం అంతా ఒక్కటే. ఇక ఒక్క క్షణమక్కడుండలేక ఇద్దరూ నమస్తే సర్ అని చెప్పేసి  వెళ్ళిపోయారు. నేను గదిలోకి పరుగున వెళ్ళి తలుపేసుకుని వెక్కి వెక్కి ఏడ్చా ..ఎంత సేపు   ఏడ్చానో తడిసిన దిండుకే కే తెలుసేమో. ఇంత జరిగినా  మనిషేమాత్రంమారలేదు.. డబ్బు, హోదా ఇవి తప్ప వీళ్ళకి మనుషులు, మనసులు, బంధాలు తెలియవు. అన్నిటినీ డబ్బుతో కొనేద్దాం … అనుకునే తత్వాలు.      

సాయంత్రం నేను కిందకి వెళ్ళబోతుంటే.. మా అత్తగారు " వాళ్ళు చేసిన పనికి  డబ్బులిచ్చేసాంగా..ఇంక మళ్ళీ వాళ్ళచేత ఆ పని, ఈ పని చేయించకు. మళ్ళా డబ్బులివ్వాలి లేకపోతే" అన్నారు. అవిడ మాటలు  పట్టించుకోకుండా కిందకెళ్ళా చిన్నా, రాణి ని కలవడానికి. ఇద్దరి మొహాల్లో నవ్వులేదు..ముభావంగా ఉన్నారు. వాళ్ళనలా చూస్తే, నాకెంతో కష్టం కలిగింది. "నిన్నాయన మిమ్మల్ని అన్ని మాటలంటుంటే, అక్కడే నేను  సమాధానం చెప్పేదాన్ని, కాని నీకిచ్చిన మాట కోసం నేను నోరునొక్కుకుండిపోయా చిన్నా" అన్నా, గుండెల్లోంచి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ. " వద్దక్క.. సార్తో ఏమి చెప్పకు ..మేమేమి బాధ పడలేదక్క" అంటూ నచ్చచెప్పబోయాడు చిన్నా. "లేదు చిన్నా.. నేనింకీ విషయం దాచ దలచుకోలేదు". అంటూ అక్కడ్నించి కదలబోయా. రాణి నా చెయ్యిపట్టుకునాపి" అక్కా ..ఈ డబ్బు మాకొద్దక్కా   ..తీస్కెళ్ళిపో " అంటూ నా చెతుల్లో డబ్బులుపెట్టింది.. దాని చెంపలనుండి జారిన కన్నీటి చుక్క ఆ డబ్బుపై పడింది.  ఆ డబ్బులు తీస్కుని ఇంటికొచ్చా. కాసేపు ఒంటరిగా ఉండాలనిపించింది. గదిలోకెళ్ళి తలుపేస్కుని పడుకున్నా..మెల్లగా నిద్రపట్టేసింది.  

గది తలుపెవరో కొడుతుంటే మెలుకువొచ్చింది. తెల్లారిపోయింది. తలుపు తీసా.. ఆయన " ఏంటి పద్మ , ఒంట్లో బాలేదా.. రాత్రి బోంచెయ్యకుండా పడుకున్నావ్. " అంటూ ఏదో చెప్పబోయారు. నేను లేచి స్నానానికి వెళ్ళిపోయా. ఆయనకి విషయం అర్ధమయ్యింది... తనూ లేచి హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు మరేమి అనకుండా.  మధ్యానం దాకా అలా మౌనంగానే ఉన్నా. నా పనేదో నేను  చేస్కుంటూ. భోజనాలయ్యాక ..ఆయన పడుకుందామని గదిలోకెళ్ళారు.. నేను ఆయన వెనకాలే వెళ్ళా. మంచమీద కూర్చుని "మీతో ఒక విషయం చెప్పాలండి" అన్నా." ఉ ..చెప్పు పద్మా  .ఏంటది" అని తను నా పక్కనొచ్చి కూర్చున్నారు. నాలో బాధ కట్టలు తెంచుకుంది. ఆయనవొళ్ళోతల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసా. ఆయన కంగారుగా “'పద్మ ఏమైంది..?? ఎందుకేడుస్తున్నావ్..చెప్పు పద్మా.. విషయమేమిటి" అంటూ నన్ను బుజ్జగించారు. కాసేపటికి నేను తేరుకుని "మీకు హాస్పటల్లో  ఎమర్జెన్శీ గా బ్లడ్ అవసరం వచ్చింది తెలుసా " అన్నా" అవును తెలుసు. వెంటనే ఎక్కించారుగా హాస్పటల్ వాళ్ళు. అయినా దానికి నువ్వెడవడం దేనికి పద్మా" అన్నారు.  "ఆ బ్లడ్ హాస్పటల్ వాళ్ళు ఏర్పాటు  చెయ్యలేదు . మీ గ్రూప్ బ్లడ్ వాళ్ళకి దొరకలేదు. నాకు చాల భయం వేసింది తెలుసా". అన్నా. నా మాటలకి ఆయన కాస్త సందేహంగా " అవునా. మరి  నాకెక్కిచ్చిన బ్లడ్ ఎవరిది. ఎక్కడ దొరికింది" అంటూ అడిగారు .  " నిజంగా మీకారోజు   సమయానికి  రక్తం ఎక్కించకపోతే ..మీరీ రోజు ..నాకు.." అంటూ ఆగిపోయా ఇక  మాట్లాడలేక. ఆ ఊహకే ఆయన కళ్ళల్లో ఏదో మార్పు కనిపించింది. "పద్మా.. ఎవరిచ్చారు పద్మా నాకు రక్తం. నీకు తెలుసా వాళ్ళు.”అంటూ అడిగారు. అయనలా అడగగానే  నాలో దుఖం ,  కోపం, ఉక్రోషం అన్ని కలిపి మొండి జవాబిచ్చాయ్" ఏం తెలిస్తే,  ఏం చేస్తారు. వాళ్ళ హోదా, మన హోదా ఒకటో కాదో లెక్కలేసుకుంటారా?? ఒకవేళ కాకపోతే ఆ రక్తం తీసి తిరిగిచ్చెస్తారా??  లేక ఒక సీసా రక్తానికింతా అని దీనికీ రేటు కట్టిస్తారా??”నేను వేసే ప్రశ్నలు సూటిగా ఆయన గుండెల్లో గుచ్చుకున్నాయ్. ఆయన "పద్మ ప్లీజ్ అదేం కాదు. అలా మాట్లాడకు పద్మా.. చెప్పు పద్మా" అన్నారు. ఆయన గొంతులో దుఃఖపు జీర మొదటి సారి విన్నా.   అయినా నాకెందుకో జాలి కలగలేదు " చెప్తా.. కాని విని తట్టుకోగలరా " అన్నా కాస్త  వ్యంగ్యంగా. మౌనమే ఆయన సమాధానమైందీసారి . సరే వినండి " మీకారోజు ఎక్కడా రక్తం దొరకక పోతే.. మీకు రక్తమిచ్చి..మీకు ప్రాణదానం చేసి..నా ఐదవతనం కాపడింది  ..ఎవరో కాదండి .. మీరు చిన్న వాళ్ళు.. పని వాళ్ళు అని ఎప్పుడూ చిన్న చూపు చూసే ..మన చిన్ననేనండి. " అన్నా. "అంతేకాదు నిన్న మీరిచ్చిన పదివేలు , వాళ్ళు తీస్కోలేదు.. తిరిగిచ్చేసారు.. అసలీ విషయలన్నీ మీకు చెప్పొద్దని నాదగ్గర మాట తీస్కున్నాడు  చిన్నా.ఎందుకో తెలుసా, మీరు  తట్టుకోలేరని. మీకు డబ్బు, హోదా లేని వాళ్ళంటే ఇష్టం ఉండదని వాళ్ళకి తెలుసు. నిజంగా వాళ్ళు చాలా చిన్న వాళ్ళేనండీ. మనము చాల చాల గొప్పవాళ్ళం .. " నా మాటలు వింటూ ఆయన రాయిలా ఉండిపోయారు. అంతరంగంలో తప్పొప్పుల మధనం మొదలయ్యింది .కాసేపుఆయన్నొంటరిగా వదిలెస్తే మంచిదనిపించింది. మెల్లగా లేచెళ్ళి.. ఆయన చేతుల్లో పదివేలు కట్ట పెట్టి గది బయటకు నడిచా. .మనసుకాస్త తేలికపడ్డట్టనిపించింది.

చాలా హాయిగా నిద్ర పట్టిందారోజు నాకు. కళ్ళు తెరిచేసరికి నా పక్కన ఆయన కూర్చున్నున్నారు. గాబరాగా లేచి మంచమీద కూర్చుని" ఏమైందండి ..ఇంత పొద్దున్నే  లేచారు.. " అన్నా. ఆయన "నన్నోసారి కిందకి తీస్కెల్తావా పద్మా "అంటూ   బ్రతిమిలాడారు. ఆయన గొంతులో పశ్చాతాపం స్పష్టంగా వినిపించింది నాకు. ఎదో తెలియని  ఆనందం నాలో. "సరె రండి అంటూ ..వెంటనే లేచి ,ఆయన చెయ్యి పట్టుకుని కిందకి తీస్కెళ్ళా" "చిన్నా వాళ్ళింటికి" అన్నారు. ఇద్దరం అటు నడిచాం . మమ్మల్ని చూసి చిన్నా , రాణి గబగబా ఎదురొచ్చి "ఏంటక్కా..సార్ని ఎందుకు కిందకి రానిచ్చవ్. డాక్టర్ తిరగద్దన్నారు కదా.. కాలు నొప్పి చేస్తుందికదక్కా" అంటూ ఎంతో ఇదిగా ఆయన చెయ్యి పట్టుకుని కుర్చిలో కూర్చోబెట్టారు."నన్ను పిలిస్తే నేనే వచ్చెవాడ్నికదక్కా." అన్నాడు చిన్నా.   

ఆయన  చిన్నాని, రాణిని దగ్గరకిరమ్మని , “చిన్నా… నన్ను క్షమించమ్మా.. నిన్నర్ధం చేసుకోలేక పోయా  " అంటూ  వాళ్ళ చేతులుపట్టుకునేడ్చేసారు.. చిన్న పిల్లాడిలా.. అవును చిన్న పిల్లాడే  .. అవి పశ్చాతపంతో వచ్చిన కన్నీళ్ళు.. శుద్దమైనవి..మనసును శుద్ది చేసినవి..

***


No comments:

Post a Comment

Pages