బోధనా భాషగా తెలుగు - అచ్చంగా తెలుగు
               “బోధనాభాషగా తెలుగు - సాధకబాధకాలు.”    
            శ్రీబండ్లమూడి పూర్ణానందం. ఎం.ఏ. బి.యిడి.  
E-mail- [email protected]         
Cell-9440143670.
             
              
శ్రీగురుభ్యోనమః
ఈనాటి  విద్యావిధానములో ఎల్.కె.జి, యూ.కె.జి  అనే రెండు తరగతులను ప్రతిబాలుడు, బాలిక చదువుట మనమంతా గమనించుచున్నాము. మన పిల్లలనుకూడా అదే బాటలో నడిపించుచున్నాము. కారణం పాఠశాల వ్యవస్ఠ.ఆంగ్లముపై మోజు.ఆంగ్లభాషవర్ణమాల,పదములు,పద్యాలు లేక గేయాలు చిత్రములు మనం పిల్లలకు నేర్పించుచున్నాము.కొన్ని  పాఠశాలలలో హిందీభాష  వర్ణమాల, హల్లులకు గుణింతములు పదములు, నేర్పించుచున్నారు.సంతోషం.మరిమాతృభాష తెలుగువర్ణమాల,హల్లులకు గుణింతములు, పదములు, పద్యములు, గేయములు కూడా నేర్పించితే చాలా బాగుంటుంది.ఏయే పాఠశాలలలో పై చెప్పిన మూడుభాషలకు ప్రాధాన్యత లేదో అది బాధ. ఆ లోపాన్ని పూరించి సాధించాలి.

 ప్రాథమికతరగతులలో దస్తూరిసాధనకు కనీసం 5మార్కులు ఏర్పాటుచేయవలెను.1 వ 2వ3వ,  4 వతరగతి 5 వతరగతినుండి బాలబాలికలకు తెలుగువాచకమునకు అనుబంధముగా వర్కు బుక్కు  ఏర్పాటు చేయవలెను.దీనిని తెలుగుసబ్జక్టు రికార్డు గా పరిగణించి కొన్ని మార్కులు ఏర్పాటు చేయవలెను.ఈ తరగతులలో భాషావిషయికంగా చూస్తే పిల్లలు చక్కగా మాట్లాడుట భావవ్యక్తీకరణకు , మంచి మార్కులు ప్రతిపాదిస్తే మంచిది.
                ఇక పాఠ్యప్రణాళిక విషయానికొస్తే  వాచకములు తయారుచేయువారు విద్యార్థులకు తెలుగుభాషపై ఆసక్తి కలిగించే విధముగా చక్కగా తయారుచేయు చున్నారు.1 వతరగతి నుండి 5 వతరగతి వరకు బాలబాలికలకు ప్రాథమిక విద్య తెలుగుమాధ్యమము లో బోధించినట్లైతే మంచి ఫలితాలుంటాయని అనుభవజ్ఞుల భావనను మనం పరిగణన లోకి తీసుకొనవలెనని మనవిచేయు చున్నాను.4వ 5వ తరగతుల విద్యార్థులకు మాతృభాషలో (జి.కె.) అనగా సామాన్యజ్ఞానప్రశ్నలపరిక్ష నిర్వహిస్తే బాగుంటుంది.దీనికి కొన్ని మార్కులు ఇవ్వాలి.
                                             
మన హైద్రాబాదునగరములో కొన్ని పాఠశాలలలో తరగతి గదిలో టెలివిజన్ ద్వారా గేయాలు, పాఠములు బోధించటము మనం చూస్తున్నాము. అదే గ్రామస్థాయిలో బాలబాలికలకు టెక్నాలజీ ద్వారా నేర్చుకోగలిగే సదుపాయం కలిగిస్తే సంతోషం. ఉపాధ్యాయులకు కంప్యూటరు ,టి.వి.టెక్నాలజీ తరగతి గదిలో వినియోగించునట్లు ట్రైనింగు ఏర్పాటుచేయవలెను.
ప్రాథమికస్టాయిలో బోధించు ఉపాధ్యాయులకు అందరికీ తెలుగుకంప్యూటరు యూనికోడు ఉపయో గించుట నేర్పవలెను.దీని ద్వారా మనము  పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విద్యార్థులకు కావలసిన విషయజ్ఞానము అందించగలము. ప్రతి పాఠము విద్యార్థి మనసుకు హత్తుకొనునట్లుగా మల్టీమీడియా ద్వారా చెప్పగలము.

   తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకు మాతృభాషపై ఆసక్తి కలిగించేలా ప్రతిరోజూ ఒకకథ లేదా గేయం వినిపిస్తే చాలా బాగుంటుంది.లేదా పాఠశాలలో ఉపాధ్యాయుడు బోధించిన  గేయాన్ని ఆలపించమనికోరినా మాతృభాషకు మనం ప్రాణం పోసిన వాళ్ళమవుతాము. మన సంస్కృతిలోని కొన్ని విషయాలు ప్రాథమిక స్థాయిలోని విద్యార్థులకు నేర్పించితే చాలామంచిది. ఉదాహరణకు తల్లిదండ్రులను గౌరవించాలి,పెద్దలను గౌరవించాలి. తోటివారితో మర్యాదగా నడవాలి.తోటివారికి సాయపడుట,నీతి కథలను విద్యార్థులచే చెప్పించుట, అభినయింపచేయుట జరగాలి.మన పండుగలు అంతరార్థము తెలియజెప్పాలి.

        ఇక 6 నుండి 10 తరగతుల విద్యార్థినీవిద్యార్థులకు  తెలుగు దినపత్రిక ప్రతిరోజూ పాఠశాలలో చదువుకొనే సౌకర్యము కలుగజేస్తే సంతోషం.కనీసం ప్రతిరోజూ ఉదయపు సమావేశంలో ప్రాంతీయ, అంతర్జాతీయవార్తలు చదివింపజేస్తే పిల్లలకు చాలావరకు విజ్ఞానం అందించిన వాళ్ళము అవుతాము.
        సి.బి.యస్.సి. పాఠశాలలలో  6 7,8 వతరగతులలో తృతీయభాషగా తెలుగు బోధింపబడుచున్నది.ఈ స్థాయిలో పిల్లలు కేవలం తెలుగు చదువుట,రాయటంమాత్రం నేర్చుకోగలుగుచున్నారు.

6 వతరగతిలో తెలుగు వర్ణమాల పరిచయము 1 వ తరగతి తెలుగువాచకము చదివించుట జరుగు చున్నది.అలాగే 7వ తరగతిలో 2 వతరగతి వాచకము,8వతరగతిలో 3 వతరగతి వాచకముచదివించుట జరుగుచున్నది. ఆపైన 9,10 తరగతులలో మాతృభాష ప్రస్తావన లేకుండా విద్యార్థి జీవితం సాగిపో తోంది. వారానికి 3 పీరియడ్లు బోధించు  ప్రాంతీయభాషా పరిజ్ఞానము విద్యార్థికి ఏవిధంగా భవిష్యత్తు లో సహాయపడుతుందో మనం గమనించాలి.ప్రభుత్వం కూడా స్పందిస్తే సంతోషం.
                                               
             ఇక ఇంటర్ విద్యార్థుల విషయాని కొస్తే కేవలం గ్రూపు సబ్జక్టులలో మార్కులు వస్తే చాలు పై తరగతులలో తెలుగుకు అంత ప్రాధాన్యత లేదు అన్న భావనతో నడుస్తున్నారు. కార్పొరేటు కళాశాలల వ్యవస్థకూడా ఎలాఉందో నేడు మనందరికీ తెలిసినవిషయమే.నేటి విద్యార్థులకు కనీసం తెలుగులో పట్టుమని పది పద్యాలు రావు.సరికదా నాలుగు సంస్కృతశ్లోకాలు కూడా రాని దురవస్థ మనది. పైగా నవ్వులు.ఈ స్థితి నుండి మన సమాజం మారాలని మనం కోరుకోవాలి. ప్రతి కళాశాలలో మాతృభాషా దినోత్సవము విధిగా జరుపుకోవాలి.ఈ తరగతులలో ధారణశక్తి  పెంపొందునట్లు  మనం విద్యార్థులను తీర్చి దిద్దవలసిన బాధ్యత మనపై ఉన్నది.పద్యపఠనము, శ్లోకపఠనము, కనీసం భారతము, రామాయణ ము, భాగవతము,శతకసాహిత్యము విద్యార్థులకు ప్రతి తరగతిలో పరిచయము చేయాలి.ఈతరగతిలో  మనిషిలో మంచి విలువలు పెంచే చదువులు మనకు కావాలి, సామెతలు,లోకోక్తులు, అలంకారాలు, సంధిపరిజ్ఞానము, సమాసపరిజ్ఞానము, జాతీయాలు వాడుట, వ్యాసరచన చేయుట, కవితారచన చేయుటప్రోత్సహించవలెను.పద్యము లేదా గేయరచనకు కొన్ని మార్కులు కేటాయించాలి.తెలుగు వాచకమునకు అనుబంధముగా వర్కుబుక్కు  కూడా విద్యార్థి అభ్యసించునట్లు చేయవలెను. ఆంగ్లము నుండి తెలుగు అనువదించు ప్రక్రియ కు కొన్ని మార్కులు నిర్ణయించవలెను.తెలుగు ఉపన్యాసకులు తెలుగుసబ్జక్టు రికార్డును విద్యార్థులచే తయారుచేయించ వలెను. దీనికి  కొన్ని మార్కులు ఏర్పాటు చేయవలెను.ప్రతి విద్యార్థికి తెలుగుకవులు చరిత్ర, లేదా జాతీయనాయకుల గురించి తెలుగు ప్రాజెక్టును, లేదా నీతికధారచన  ద్వారా కొన్ని మార్కులు ఏర్పాటు చేయవలెను.
  
ఇక పట్టభద్రులస్థాయిని పరిశీలించి భారతము, రామాయణము, భాగవతము, భక్తికావ్యాలు,నీతికావ్యాలు,వర్తమాన సమాజములో సమస్యలపట్ల అవగాహన కల్గించు పాఠములు పాఠ్యప్రణాళికలో ఏర్పాటుచేయవలెను. భారతము, రామాయణము, భాగవతము లపై క్విజ్ పోటీలు నిర్వహించవలెను. భాషా, సాహిత్య పరముగా ప్రాజెక్టు వర్కులు ఏర్పాటు ద్వారా మార్కులు ఏర్పాటు చేయవలెను.కధారచనకు ,గేయరచనకు అవకాశము ఇవ్వవలెను.సంధి, సమాస పరిజ్ఞానము, అలంకారపరిజ్ఞానము, పద్యరచన, వ్యాసరచనకు ప్రాధాన్యత ఇవ్వాలి.ప్రతి కళాశాల లో మాతృభాషా దినోత్సవము విధిగా జరుపుకోవాలి.ఇంటరు,డిగ్రీ కోర్సులలో తెలుగు ఒక సబ్జక్టుగా చదివిన వారికి ఉద్యోగవిషయములో  ప్రాధాన్యత నిచ్చి తీరవలెను. పరిపాలనా భాషగా తెలుగు రాణించుటకు తగిన సూచనలతో కూడిన పాఠములు బోధింపవలెను. ఆంగ్లము ,తెలుగు అనువాద విధానమునకుఈ స్థాయిలో ప్రాధాన్యత నివ్వవలెను.     
***     

No comments:

Post a Comment

Pages