ఉయ్యాలబల్ల - అచ్చంగా తెలుగు
 ఉయ్యాలబల్ల
చివుకుల పద్మజ 

"వసంత కూతురు చిట్టికి పదకొండు ఏళ్ళు వచ్చాయి. మేనమామవి.. వోణీలివ్వాలి రా" సుభద్రమ్మ చెప్పింది పేపర్ చదువుతున్న కొడుకు శ్రీధర్ తో.
"దానిదేముంది. నువ్వు, గాయత్రీ వెళ్లి కొనుక్కురండి.ఇద్దాం" తలెత్తకుండానే సమాధానం చెప్పాడు శ్రీధర్.
"ఒట్టి బట్టలతోనే సరిపోదురా. ఏమన్నా బంగారం కూడా పెట్టాలి" 
తలెత్తి "ఎంతా?" అడిగాడు శ్రీధర్.
"నువ్వూ, గాయత్రీ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారయ్యే. కాస్త గాత్రంగా పెట్టకపోతే ఆనక వసంతకి మాట వస్తుంది వాళ్ళ అత్తగారి దగ్గర. నువ్వు నెక్లెస్ తీసుకో, గాయత్రి పాపిటి బిళ్ళ తీసుకుంటుంది" నిర్ణయించేసింది సుభద్రమ్మ.
"అదేంటి అత్తయ్యా, మేమిద్దరం ఒకటి కాదా?" తెల్లబోతూ అడిగింది గాయత్రి.
"మీ ఇద్దరు ఒకటి కాదని ఎవరన్నారు. వాడిస్తే నేనిచ్చినట్లు, నువ్వు ఇంకొకటి తీసుకుంటే మీరిచ్చినట్లు" సరికొత్త సిద్ధాంతం నిర్వచించింది సుభద్రమ్మ.
ఇదే.ఈ విడదీయటమే నచ్చదు గాయత్రికి.. ఇలా రెండుగా ఇచ్చే బదులు ఒకటే మంచిది ఇస్తే బాగుంటుందిగా. అయినా నా వుద్యోగం కాదు కానీ పెట్టుపోతలకే సరిపోతోంది.. మనసులోనే గొణుక్కుంటూ శ్రీధర్ కేసి చూసింది గాయత్రి ఏమంటారన్నట్లు.
"అమ్మ చెప్పింది బాగానే వుంది. ఏ విషయమైనా, ఏమి కొన్నా ఒకటి నువ్వు, ఒకటి నేను చేద్దాం" తేల్చి చెప్పి లేచి గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీధర్.
"శుభస్య శ్రీఘ్రం.మంచి రోజు చూసుకుని వసంతకు చెపుదాం. నువ్వు ఆ బంగారం పని చూడమ్మాయి" కోడలికి పురమాయించి తానూ పూజ గది కేసి నడిచింది సుభద్రమ్మ.
"సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ వెళ్తానులెండి" చెప్పి ఆఫీసుకు రెడీ అవ్వసాగింది గాయత్రి.
ఆ సాయంత్రం గంట ముందు గా పర్మిషన్ అడిగి బయటపడింది గాయత్రి. జ్యువలరీ షాపుకి వెళ్ళేదారిలో 'అమ్మ ఆక్షన్ హాల్' అన్న షాపు కేసి యథాలాపం గా చూసింది. అక్కడ కొత్త ఫర్నిచరే కాక, సెకండ్ హ్యాండ్ వస్తువులు కూడా అమ్ముతారు. బయట ఆగివున్న ట్రక్కు లోంచి లోపలికి  దింపుతున్న వస్తువును చూడగానే కళ్ళు పెద్దవిచేసి టక్కున స్కూటీ పక్కకి తీసి ఆపింది. ఆ వస్తువు ఉయ్యాలబల్ల. దాన్ని చూస్తూనే చిన్ననాటి మధుర జ్ఞాపకాలు చుట్టుముట్టాయి గాయత్రిని.
***
ఆ ఊళ్ళోనే శివాలయం దగ్గర అద్దెకుండేవాళ్లు గాయత్రి వాళ్ళు. గాయత్రికి ఎనిమిదేళ్లు, చెల్లెలు శాంతికి ఐదేళ్లు. ఇంటివాళ్లకి ఒక్కతే మనవరాలు, భవాని. గాయత్రి ఈడుదే. భవాని అమ్మ, నాన్న ఉద్యోగరీత్యా బదిలీల మీద తిరుగుతూ భవాని ని అమ్మమ్మ, తాత దగ్గర దించారు.
రోజు ముగ్గురు కలిసి ఆడుకుంటూ వుండేవాళ్ళు. భవాని వాళ్ళ ఇంట్లో మధ్య హాలు లో ఒక పెద్ద ఉయ్యాలబల్ల ఉండేది. అది ఎక్కాలంటే ఎంతో సరదా గాయత్రికి. 
మధ్యాహ్నాలు భవాని తాతగారు భోజనం చేసాక దాని మీదే విశ్రమించే వారు. గాయత్రి ముందుగది వారగా నిల్చుని ఆ బల్ల కేసే చూస్తూండేది. అది గమనించిన అమ్మమ్మ గారు నవ్వి "దా.. తాతగారు లేవగానే నువ్వు వూగుదువు గాని" అని గాయత్రిని తీసుకెళ్లింది.
ఇక అప్పటి నుంచి సాయంత్రం నాలుగుదాటితే చాలు, గాయత్రి మకాం అక్కడే. స్కూలు నుంచి రాగానే సంచి ఇంట్లో పడెయ్యటం, పోయి వాళ్ళ ఉయ్యాలబల్ల ఎక్కి ఊగడం.
"నీ చోద్యం గూలా. ఏముందే ఆ ఉయ్యాల్లో" నిరసనగా అనేది గాయత్రి బామ్మ. ఏదో ఉందని తెలుసుగాని, అదేందో చెప్పే వయసు లేదు గాయత్రికి.
గాయత్రి, శాంతి కూచుంటే భవాని ఊపటం, భవాని ని గాయత్రి, శాంతి ఊపటం... ఇలా వంతులేసుకుని ఊగే వాళ్ళు.
వూగేటప్పుడు, కిర్రు కిర్రు మని శబ్దం చేసే గొలుసులకేసి చూడటం గొప్ప అనుభూతి గాయత్రికి. కళ్ళు విప్పార్చుకుని అలాగే చూస్తుండేది నాలుగు గొలుసులకేసి. ఎంతో ఎత్తునున్న పైకప్పు.. నాలుగు కొక్కేలకి నాలుగు ఇనప గొలుసులు.. ఒక చక్రం లోకి ఇంకో చక్రం ఇమిడిపోయి అలాగ కిందికి బల్ల మీదకి చేరే గొలుసులు డిజైన్ చూసి మురిసిపోయేది. ఆ గొలుసులు బల్లకి బిగించే చోట నాలుగు మూలలా వెండి పూలు తాపడం చేసి ఉండేవి. విచ్చుకున్న కమలం లాగ వున్న తెల్లటి వెండి పువ్వుల్ని చేతులతో సుతారంగా స్పృశించేది. గుండె ఝల్లుమనేది.
అసలా ఉయ్యాలబల్ల ఎక్కుతూనే గాయత్రికి మరోలోకం లోకి వెళ్లిన అనుభూతి కలిగేది. ఒకసారి ఉయ్యాలబల్ల ఎక్కిందంటే అంత సులభం గా దిగేది కాదు. "పొద్దు పోయింది.. రామ్మా అన్నం తిందువు" అని అమ్మ ఒక వందసార్లు పిలిస్తే కానీ వెళ్ళేది కాదు. చిన్నది శాంతికి ఇంకా అంత పూర్తిగా ఊహ తెలీదు కాబట్టి, అక్క కూడానే తిరుగుతుండేది.
"పోన్లేమ్మా.. పిల్లలు కదా.. మా ఇంట్లోకే తెచ్చిపెట్టు అన్నం" అనేది ఇల్లుగల అమ్మమ్మగారు.
బల్ల ఊగుతూ, గుళ్లో పెట్టిన భక్తి పాటల రికార్డు వింటూ, అమ్మ చేతి గోరుముద్దలు తినటం.. ఓహ్..మరపురాని అనుభూతి గాయత్రికి. 
ప్రతి నెల మొదటి శనివారం వసారాలో అరుగులపై చీటీపాట జరిగేది. పక్కనున్న పల్లెటూరు నుంచి ఒక పెద్దాయన వచ్చి అది నిర్వహిస్తుండేవారు. సాయంత్రం ఖచ్చితంగా అయిదు గంటలకి వచ్చేవారు అయన. వస్తూనే "పాపలూ.. చాప తెండమ్మా" అని పిలిచేవారు పిల్లల్ని. పిల్లలు ముగ్గురు అప్పటికే రెడీగా ఉండేవారు. పిలవగానే చెంగు చెంగుమని చాపలు పట్టుకొని తీసికెళ్ళి ఇచ్చేవారు. మొయ్యలేక మొయ్యలేక అవస్థపడుతూనే తెస్తున్న పిల్లల్ని చూసి ముచ్చటగా చెంపల మీద తట్టి తలా ఒక పిప్పరమెంట్ల పొట్లం ఇచ్చేవారు. ఆ క్షణంలో పిల్లల మొహాల్లో ఆనందాన్ని కొలవటం ఎవరి వల్లా కాదు. వీటికోసం నెలంతా ఎదురుచూసేవారు. అయితే.. ఒకవేళ ఆ టైము లో గాని గాయత్రి ఉయ్యాలబల్ల మీద ఉందంటే మాత్రం పిప్పరమెంట్లు గిప్పరమెంట్లు జాన్తానై. శాంతి, భవాని ఎగురుకుంటూ తెచ్చుకునే వాళ్ళు గాని గాయత్రి మాత్రం లేశమైన లొంగేది కాదు, బల్ల దిగేది కాదు.
గాయత్రి ముచ్చట చూసిన అమ్మమ్మగారు వాళ్ళ అమ్మ తో  "రేపు గాయత్రి పెద్దయ్యాక ఉయ్యాలబల్ల ఉన్న సంబంధం వెతికి మరీ చెయ్యండి" అనేది నవ్వుతూ.
ఈ సందట్లో చిన్న అపశృతి దొర్లింది. ఒకరోజు.. పిల్లలే వంతులేసుకుని ఎక్కుతుంటే జరిగిందో లేక గాయత్రి భవానీని ఉపటంలో జారిపోయిందో తెలియదు గాని మొత్తానికి భవాని ఊగే బల్ల మీదనుంచి జారి ముందు గోడమీద పడింది. గోడ అంచు తగిలి కనుబొమ్మ దగ్గర బాగా దెబ్బ తగిలింది. పైపెదవి చిట్లింది. మొహం అంతా రక్తమయం.
అందరూ ఖంగారు పడి గబగబా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కనుబొమ్మల దగ్గర బాగా చీలిపోయి మూడు కుట్లు పడ్డాయి. కొంచెం కిందకి తగిలి ఉంటే కన్ను పోయేది అన్నారు డాక్టర్ గారు. ఇది విని మూడో రోజు నాటికి భవాని వాళ్ళ అమ్మ, నాన్న పరిగెత్తుకొచ్చారు. పిల్లని చూస్తూనే వాళ్ళమ్మ శోకాలు పెట్టి గాయత్రిని తిట్టి పోసింది. పనిలో పని వాళ్ళ అమ్మను కూడా "పిల్లని జాగ్రత్తగా చూస్తావని మీ దగ్గర దింపితే అడ్డమైన వాళ్లందరినీ రానిచ్చి దాని మొహం పచ్చడి చేశారు" అని అరిచి "ఇహ పిల్లను ఇక్కడ వుంచం. మేమే తీసుకుపోతాం" అంది.
అనటమే కాదు.. కాస్త తగ్గగానే స్కూలు లో టి.సి. తీసుకుని భవానీని తీసుకెళ్లిపోయారు. కూతురు అరిచినందుకు ఉక్రోషం.. మనవరాలు వెళ్లిపోయిందని బాధ.. ఇల్లుగల అమ్మమ్మగారు, తాతగారు ఇదివరలాగా ఉండలేకపోయారు గాయత్రి వాళ్ళతో.. "పాడుబల్ల..ఎంత పని చేసింది" అని తిట్టుకుంటూ దాన్ని వూడదీయించి పక్కన పెట్టేశారు. గాయత్రి చాల రోజులు ఏడ్చింది.
ఇంత పొరపొచ్చాలు వచ్చాక ఇంకా ఇక్కడ ఉండకూడదు అని వేరే ఇంటికి మారిపోయింది గాయత్రి కుటుంబం. ఎవరూ ఆ తరువాత అటుకేసి వెళ్ళిందే లేదు.
అయినా ఉయ్యాలబల్ల జ్ఞాపకాలు వదల్లేదు గాయత్రిని. కాస్త పెద్దయ్యాక ఏ సినిమాలో ఉయ్యాలబల్ల కనబడ్డా అట్లా నిలబడిపోయి చూసేది. ప్రత్యేకించి "రుద్రవీణ" సినిమాలో జెమినీ గణేశన్ ఉయ్యాలబల్ల సన్నివేశాన్ని ఇప్పటికీ చూస్తూనే ఉంటుంది యూట్యూబ్ పుణ్యమా అని.
***
గాయత్రి ఆలా గేటు దగ్గరే ఆగిపోవటం చూసిన షాపతను "రండి మేడం" అని పిలిచేదాకా గాయత్రి స్పృహ లోనే లేదు.
"ఆ.." తేరుకుని లోపలికి వచ్చింది. షాపు అతను పరిచయమే గాయత్రి వాళ్లకు. గాయత్రి పనిచేసే బ్రాంచ్ ఏజెంట్ అతను. అంతకు ముందు కొడుక్కి ఇక్కడే కొన్నారు స్టడీ టేబుల్ ఒకటి.
"ఏం చూస్తారు మేడం" 
అప్పటికే గాయత్రి ఆ ఉయ్యాలబల్ల దగ్గరకి వెళ్ళిపోయి చూస్తోంది. ఆరున్నరడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పు. వెండి పూలు.. ఉలిక్కిపడి మరింతగా పరిశీలనగా వెనకవైపు చూసింది. 'గాయత్రి'.. వంకర టింకర అక్షరాలు. అదే.. ఆ బల్లే. చిన్నప్పటి అమ్మమ్మగారి ఉయ్యాలబల్ల. సంతోషం పొంగుకొచ్చింది గాయత్రికి. ఒక ఇనప తీగెతో గట్టిగా తన పేరు రాసింది చిన్నప్పుడు ఆ బల్ల వెనక వైపు. పైన రాస్తే పాడైపోతుందని అప్పట్లోనే ఆలోచించిందన్నమాట. నవ్వొచ్చింది..
"ఒకరు అమెరికా వెళ్ళిపోతూ అమ్మేశారు మేడం దీన్ని. మంచి బర్మా టేకు. ఏ మాత్రం పాడవలేదు. కాస్త పాలిష్ పట్టి వార్నిసు కోటింగ్ వేస్తే చాలు" చెప్తున్నాడు షాపతను.
ఏ మాత్రం ఆలోచించలేదు గాయత్రి. వెంటనే ఆ పని చేయించి ఇంటికి పంపమని డబ్బులు కట్టి బయల్దేరింది.
బంగారం షాపుకి వెళ్లి, కావాల్సినవి సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని వచ్చేసరికి ఇంటి దగ్గరకి వచ్చేసింది ఉయ్యాలబల్ల ట్రాలీ.
పైకి తెమ్మని ఇంట్లోకి వెళ్లేసరికి సుభద్రమ్మ, శ్రీధర్ హాల్లోనే వున్నారు. ట్రాలీ డ్రైవర్ ఉయ్యాలబల్ల తెచ్చి లోపల గోడవారగా జాగ్రత్తగా దింపి వెళ్ళిపోయాడు.
"ఏంటిది?" ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్.
"ఉయ్యాలబల్ల. ఏది కొన్నా చెరొకటి కొందామన్నారు కాబట్టి, ఉయ్యాలబల్ల నేను కొన్నాను, అది పెట్టుకునేందుకు ఇల్లు మీరు కొనండి" టిట్ ఫర్ టాట్ సమాధానం చెప్పి ఇంట్లోకి దారితీసింది గాయత్రి.
***


No comments:

Post a Comment

Pages