కరోనా పెళ్లి - అచ్చంగా తెలుగు
  కరోనా పెళ్లి
వై.ఎస్.ఆర్.లక్ష్మి


ఆఫీసు నుండి ఇంటికి వచ్చిస్కూటర్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళేటప్పటికి నా భార్య శిరీష మంచినీళ్ళ గ్లాసు అందించింది. గ్లాసందుకుంటూ ఆమెముఖం
లోకి చూసేసరికి ఏదోచెప్పాలని ఆతృత పడుతూ కనిపించింది. పగలంతా ఒక్కటే వుంటుందేమో నేను వచ్చేసరికి టి.వి లో వార్తలు మొదలుకొని ఫోనులోతను మాట్లాడిన విషయాలు బంధువుల విశేషాలు అన్నీ ఏకరువు పెడుతుంటుంది.

పిల్లలిద్దరూ దగ్గర లేకపోవడంవలన  మేమిద్దరమే ఒకరికి ఒకరం. ఆఫీసు నుండి అలసి పోయి వచ్చే నాకు రాగానే ఆమె వాగ్దాటి బాగానే అనిపించినా అనవసర విషయాలు మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఆపు సోది అని విసుక్కుంటాను.
  అందుకని నా మూడ్ గమనించడం కోసం తటపటాయిస్తోందని అర్దమయ్యింది. ఒక్కక్షణం జాలి అనిపించింది.
      “ఏమిటి సంగతి” అని అడిగాను.
      ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నట్లుగా వున్న ఆమె ఇక ఆగలేనట్లుగా వెంటనే “మీ మేనకోడలు పూజ పెళ్ళి కుదిరిందట. ఎంగేజ్ మెంట్ అవి లేకుండా ఇద్దరూ ఒకమాట అనుకొని డైరెక్టుగా పెళ్ళి చేస్తారట.పది రోజుల్లో పెళ్ళి.మనిద్దరినీ రమ్మంది మీచెల్లి. గిరిజా వాళ్ళకి తెలియపరుస్తున్నామని చెప్పారట కాని రమ్మనలేదట. వాళ్ళు కూడా ఇదే వూళ్ళో వున్నారు కదా!వాళ్ళనీ రమ్మనవచ్చు కదా! ఏమిటో  ఈ పిలుపులు. మంచీ మర్యాద వుండటం లేదు ఎవరికీ...”
   “శిరీ నాకు కాస్త కాఫీ ఇస్తావూ ! వాళ్ళ మర్యదల గురించి తర్వాత ఆలోచిద్దాము కాని”ఆ వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేయకపోతే ఎంతసేపయినా కొనసాగుతుంది.
    “అయ్యో!నా మతిమండా .ఈ కబుర్లులో పడి మీకు కాఫీ ఇవ్వడమే మరచిపోయాను.ఇదిగో ఇప్పుడే తెస్తాను” అంటూ వంటింట్లోకి వెళ్ళింది.
      నేను షర్ట్ బటన్స్ రెండూ తీసి సోఫాలో వెనక్కి జారబడి కూర్చుని మధ్యాహ్నం సరోజ చేసిన ఫోన్ గురించి ఆలోచిస్తున్నాను. సరోజ నాకు ఒక్కగానొక్క చెల్లెలు.
    ఆమె కూతురే పూజ.ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పెళ్ళి నిరుడు అయ్యింది.అమెరికా లో జాబ్ చేసుకుంటున్నారు ఇద్దరూ. కొడుకు మీద ఆశ ఎలాగూ లేదు, కూతుర్నన్నా ఇండియా సంబంధం చేయాలన్న వారి ఆశకు అదృష్టం తోడయ్యి ఈ వూళ్ళోనే సంబంధం నిశ్చయం అయ్యింది.ఇద్దరూ ఇక్కడే. వారిది వ్యాపారస్తుల కుటుంబం. మా బావ కూడా గెజిటెడ్ ఆఫీసరు గా పనిచేస్తున్నాడు.అంగరంగవైభవంగ పెళ్ళి చెయ్యాలని ముందునుంచి అనుకున్నారు.పనిలో పనిగా నా శ్రీమతి కూడా పూజ పెళ్ళి కుదిరితే తను మంచి పట్టుచీర కొనుక్కోవాలని ఆడపడుచుకి మేనకోడలికి ఖరీదు చీరలు వారి స్థాయికి తగ్గట్టు పెట్టాలని కలలుకంది. ఈ లోగానే హడావిడిగా పెళ్ళి కుదరడము, కరోనా ఇప్పుడప్పుడే తగ్గే సూచనలు లేకపోవడంతో  వైభవంగా చేయాలంటే సంవత్సర కాలమన్నా ఆగక తప్పదన్న సత్యాన్ని గ్రహించి ఇరుపక్షాలవారు కలసి తీసుకున్న నిర్ణయ ఫలితమే ఇప్పుడు ఈ వివాహం. 

ఇరవైమంది అతిథులతో శుభకార్యాలు చేసుకోవచ్చన్న సర్కారు వారి సూచన మేరకు నాకు ఆహ్వానం అందింది.స్వయాన మేనమామనవడం తల్లితండ్రుల స్థానంలో నేను జరపాల్సిన ఆనవాయితీలు కూడ కారణం  కావచ్చు. గిరజ మా బాబాయి గారమ్మాయి. తనను పిలిస్తే పెదనాన్న పిల్లలు కూడ వున్నారు. అందర్నీ పిలిస్తే బంధువులు ఎక్కువ అవుతారని పిలవలేదు.
   మధ్యాహ్నం సరోజ ఫోన్ చేసి చెప్పింది. శిరి సరోజతో కంటే గిరజతో సన్నిహితంగా వుంటుంది. అంతస్థుల అంతరమో మనస్తత్వాల భేదమో తెలియదు. అందుకే గిరిజను పిలవలేదని ఫీలైపోతోంది.
  నా ఆలోచనలను భగ్నం చేస్తూ కాఫీ కప్పుతో వచ్చింది శిరీష “ఏమిటి ఆలోచిస్తున్నారం"టూ.
      “ఏమీ లేదు. సరోజ నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పింది. అదే ఆలోచిస్తున్నాను.”అన్నాను క్లుప్తంగా.
  “నేను ఇంతగా వాగుతుంటే సరోజ ఫోన్ చేసిందని ముందే చెప్పవచ్చుగా”
  “ఎక్కడ నువ్వు చెప్పనిస్తేనా రాగానే నువ్వే మొదలుపెట్టావుగా ఫుల్ స్టాప్ కామా లేకుండా “
  “నేను ఎప్పుడూ మీకు వాగుడుకాయ లాగానే కనిపిస్తాను.సరేలే ఎప్పుడూ ఇది వుండేదే కాని మనం ఎప్పుడు వెళదాము.”
 “ఎప్పుడు వెళ్ళడమేమిటి?నిన్నేమీ పదిరోజులు ముందువచ్చి అక్కడ తిష్టవేయమనలేదు మీ ఆడబడుచు.ఆ రోజు వెళితే చాలు.”
  “అయ్యో!అదేమిటి చోద్యం కాకపోతే.ఉదయమే దీపారాధన పెళ్ళికూతుర్ని చెయ్యడం వుంటాయి కదా!మనం ముందు వెళ్ళవద్దూ.మనం బట్టలు పెట్టాలి కూడా”
       “ఏమో!అవ్వన్నీ నాకు తెలియదు. సరోజ పెళ్ళికి మాత్రమే రమ్మని చెప్పింది. నువ్వు బట్టలు కొనడానికి పెట్టడానికి షాపులు ఎక్కడ వున్నాయి.అన్నిటికీ కలిపి కాష్ పూజ చేతిలో పెడదాములే.నువ్వేమీ ఎక్కువ ఆలోచించకు.అంతగా సరోజ అడిగితే అదే విషయం చెబుదాము.”అన్నాను తేలిగ్గా.
        “మీరు సమర్థించుకుంటానంటే మధ్యలో నాదేం పోయింది.మీకు ఎలా తోస్తే అలా చేయండి.నాకూ శ్రమ తప్పింది కదా!స్నానం చేసి రండి. భోజనం వడ్డిస్తాను.” అంటూ లేచింది అక్కడితో ఆ సంభాషణ ముగిస్తూ.
  చూస్తుండగానే పది రోజులు గడిచిపోయి పెళ్ళిరోజు రానే వచ్చింది.కళ్యాణమండపాలు ఏమీ లేకపోవడంతో పెళ్ళి ఇంటిదగ్గరే. ఉదయం  పదిన్నరకు పెళ్ళి . ఎనిమిది కల్లా బయలదేరదామనుకున్నాము. పూజకు యిద్దామనుకున్న బహుమానాన్ని గిఫ్ట్ కవర్ లో పెడుతూ” శిరీ రెడీ అయ్యావా  రా వెళదాము”అని పిలిచాను.
        “వచ్చేసానండీ “అంటూ వచ్చింది శిరీష.ఒక్కసారే షాక్ అయ్యాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఎందుకంటే ఎంతదూరపు బంధువుల పెళ్ళికైన పెద్ద పట్టుచీర కట్టుకొని నగలు అన్నీపెట్టుకొని తయారవుతుంది. చిన్న ఫంక్షన్ కి కూడ ఇంత సింపుల్ గా తయారవదు.”ఎందుకు అంత ఆడంబరం” అంటే,
 “ఇలాంటప్పుడే కదా పెట్టుకునేది కొనుక్కునేది కట్టుకోవడానికి పెట్టుకోవడానికే కదా నలుగురూ ఇప్పుడే చూసేది.కొన్నవి దాచుకోవడానికైతే షాపులో వున్నాఇంట్లో వున్నా ఒకటే” అని నా నోరు మూయించేది.అలాంటిది సాదాసీదా చీర నానుతాడు నల్లపూసలు రెండుజతల గాజుల తో సింపుల్ గా తయ్యారయ్యిందంటే ఆశ్చర్యమేగా మరి.
           నోరూరుకోక “ఇలాగే వస్తావా”అని అడిగా!
        “ఇలాకాక ఎలా వస్తాను. కరోనా తో బ్యాంక్ కు వెళ్ళి నగలు తెచ్చుకునే వీలులేదు.పట్టుచీర కడదామంటే రాగానే వాష్ చెయ్యాలి. అయినా అక్కడఇప్పుడు ఎవరూ నా నగలు చీరలూ చూడరులెండి. పదండి వెళదాము. టైము అవుతోంది.”అంటూ ముందుకు నడిచింది.ఆమె జ్ఞానోదయానికి సంతసిస్తూ వెనక నడిచాను.
    అరగంటలో పెళ్ళింటికి చేరుకున్నాము.గేటు ముందు నాలుగు కార్లు మాత్రమే వున్నాయి. వాటి పక్కన స్కూటీ పార్క్ చేసి వెళ్ళాము. గేటు పక్కనే
        టేబుల్  మీద  ఒక ట్రేలో మాస్క్ లు దాని పక్కనే శానిటైజర్  వున్నాయి.మేము మాస్క్ లు తీసుకొని ధరించి శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకొని లోపలికి వెళ్లాము.హాలు పెద్దగానే వుండటంతో మధ్యలో వేదిక ఏర్పాటు చేసారు.రెండు బల్లలు కలిపి దానిమీద పరుపు దుప్పటి వేసారు.నాలుగు మూలల పెరటి లోని కొబ్బరి ఆకులు అరటి పిలకలతో  అలంకరించారు.వాటిని కలుపుతూ హెచ్చుతగ్గులుగా మల్లెలమాలలు వేలాడదీసారు.నా కైతే ఆ పచ్చదనము మల్లెల వాసన ఆహ్లాదకరంగా అనిపించాయి. హాలుచుట్టూ సోఫాలు కుర్చీలు దూరంపాటిస్తూ సర్దారు.అందరూ వాటిలో ఆసీనులయ్యారు. సరోజ తరఫున మేమిద్దరము మా బావగారి అమ్మ నాన్న,వాళ్ళ తమ్ముడు మరదలు వచ్చారు.పెళ్ళి కొడుకు తరుఫున తల్లిదండ్రులు, తమ్ముడు, ఒకవృద్ధజంట, ఒక పడచు జంట  వున్నారు. పూజారి,ఫొటోగ్రాఫర్ పై పనులకు కుర్రాడు.అక్కడ సభ్యులు ఇంతవరకే.
 నిరుడు పూజ అన్న ప్రవీణ్ పెళ్ళి ఘనంగాచేసారు. రెండు మూడు వేలమంది వచ్చివుంటారు.ఎవరు వచ్చారో రాలేదో కూడ తెలియదు.
      సరోజ కూడ మేము వెళ్ళిన అరగంటకు ఇప్పుడే వచ్చారా అని పలకరించంది. అంతే తరువాత బిజీ అయిపోయంది.వెళ్ళి వస్తామని వచ్చేముందు చెబుదామన్నా మళ్ళా కనిపించలేదు. నలుగురయిదగురు బంధువులు తప్ప మిగతా ఎవర్నీ కలవలేకపోయాము.వేదిక మీద అయితే అటు పదిమంది పంతుళ్ళు ఇటు అరడజను ఫొటోగ్రాఫర్లు. అక్కడ ఏమి జరుగుతాందో ఏమీ తెలియనంతగా  దడిగా కట్టడం పైన వున్నవాళ్ళు అక్షింతలు వెయ్యడంజూచి  ఓహో జీలకర్ర బెల్లం పెట్టారన్నమాట అనుకొని లేచి అక్షింతలు వేయడానికి క్యూలో నించోవడం.ఫొటోలో పడకపోతే మనం వచ్చినట్లుగా పెళ్ళి వారికి తెలియదుగా మరి. 
పట్టుచీరల పెళపెళలు నగల ధగధగలతో పెళ్ళిమండపం లో హడావుడిగా తిరుగుతూ వుంటారు అవసరమున్నా లేకపోయినా.ఇప్పుడు అందరూ ఎవరి సీట్లలో వారు కూర్చొన్నారు. పెళ్ళి కూతురు,పెళ్ళికొడుకుకి తప్ప అందరి నోటికి మాస్క్ లు వున్నాయి.పంతులు గారు కూడా వేరే కార్యక్రమాలు లేకపోవడం వలన తాపీగా పెళ్ళితంతు జరిపిస్తున్నాడు.స్నేహితుల అల్లరి హడావుడితో తామేం జేస్తున్నారోకూడా తెలియకుండ పెళ్ళితంతులో యాంత్రికంగా పాల్గొనే పెళ్ళిజంట ఇప్పుడు మనసుపెట్టి పంతులుగారు చెప్పే ప్రతి విషయాన్ని సావధానంగా వింటూ చేస్తున్నారు.వచ్చిన కొద్దిమంది అతిథులు సాదాసీదాగా వచ్చారు. బహుశా వారికి కూడ శిరీషకు వచ్చిన సమస్యే వుందేమోమరి. బిగుసుకు పోయి కూర్చోకుండా స్వేచ్ఛగా వున్నారు.పెళ్ళి కార్యక్రమం ముగిసి భోజనాలు ఆరంభమైనాయి.
   కాటరింగ్ లేకపోవడంతో ఇంట్లోనే తయారు చేసారు.ఒక స్వీటు,హాటు రెండు కూరలు,పచ్చడి,సాంబారు,పెరుగు అంతే. తృప్తిగా భోజనం చేసాము.పేరు తెలియని, అవి వేటితో తయారుచేసారో కూడ తెలియని పదార్థాలు విస్తరి నిండా వడ్డించుకుని సగం తిని సగం పారేసే వాళ్ళము.
  భోజనాలు అయినాక అందరం కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకున్నాము దూరం పాటిస్తూ.ఈ మధ్య కాలంలో ఏ పెళ్ళి లోను ఇంత సావకాశంగా కబుర్లు చెప్పుకున్న దాఖలాలు లేవు.సాయంకాలం వరకు వుండి ఇంటికి బయలు దేరి వచ్చాము.
   వచ్చీరావడంతోనే”ఇదేం పెళ్ళి ఒక హంగుఆర్భాటం లేకుండా .నాకు పెళ్ళి లాగానే అనిపించలేదు.”అని తన అసంతృప్తిని  వ్యక్తపరిచింది శిరీష.
           “నా కైతే బాగా నచ్చింది.మీ దృష్టి లో పెళ్ళంటే వేడుక పేరుతో లక్షలు లక్షలు ఖర్చుపెట్టాలి. మీరు మూరెడు వెడల్పు జరీ పట్టుచీరలు మెడనిండా నగలు దిగేసుకుని ఎగ్జిబిషన్ కు వెళ్ళినట్లుగ వెళ్ళడం అనుకుంటారు.దాని వలన ఎంత వృధాప్రయాసలో మీకు అర్థం కాదు .పెళ్ళి అనుకున్నాక రెండుమూడు నెలల ముందు నుంచి కళ్యాణమండపం బుక్ చేయడంతో మొదలు పెడతారు.డెకరేషన్ పేరుతో పూలకు కరెంట్ కు కొన్ని లక్షల ఖర్చు.భోజనాల దగ్గర కూడ ఒకరు ఇరవై రకాలు పడితే మరొకరు పోటీపడి ముఫ్పై రకాలు పెడతారు.విస్తరి నిండా పెట్టుకొని సగం తిని సగం పారేస్తారు.ఎవరికీ బాథ్యత వుండదు.
        ఒకపూట తిండిలేక ఎంతమంది ఆకలి చావులు చస్తున్నారో తెలుసా!ఎంత ఆహారం వృధా అవుతోంది వేడుకుల పేరుతో .అలా వృధా చేసే ఆహారం కొన్ని వందల మంది కడుపునింపుతుంది.ఇవాళ చూడు తక్కువ వెరైటీస్ వల్ల అందరూ పారేయకుండా తిన్నారు. పెట్టుకున్న నగలు, కట్టుకున్న పట్టుచీర ఎక్కడ పాడవుతాయో అన్నట్లు ఒకరికొకరు అంటీముట్టనట్లు తిరిగేవారు.ఇవ్వాళ చూడు పెళ్లికొడుకు తరుఫు వారితో సహా భేషిజం లేకుండా గిరగిర తిరుగుతూ తలా ఒక పని చేసారు.అఫ్ కోర్స్ కరోనావల్ల  పనిమనుషులు రాకపోవడం కూడా కారణం కావచ్చు.పట్టుచీరలు నగల ఖర్చు కూడా చాలా వరకు తగ్గింది.
        అనవసరపు ఆర్భాటాలు లేకుండా ఇలా సింపుల్ గా వేడుక చేసుకుంటే ఎంత బాగుంటుందో.షాపింగుల పేరిట తిరిగే సమయమూ ఖర్చూ కూడ ఆదా
అయ్యింది. బ్లాక్ మనీ బాగా వున్న వాళ్ళు దాన్ని కరిగించడం కోసం హంగులు ఆర్భాటాలు చేస్తారు. లేనివాడు ఒకపూట తాగుడు బిర్యానీతో అయిందనిపిస్తాడు.
       ఎటూగాని మధ్యతరగతి వారు అటు ఎగరాలేక ఇటు తక్కువగా చేయలేక ఒకరిని చూసి మరొకరు అప్పులు చేసి మరీ ఆడంబరాలకు పోతున్నారు. అవి తీర్చలేక ఇబ్బందులు పడుతుంటారు.ఒక పూట గొప్పకోసం ఇతరులకు మన ఆధిక్యత నిరూపించుకోవడం కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరమేముంది చెప్పు. ఏది ఏమైనా కరోనా ఉపద్రవంలో జరిగిన ఈ పెళ్ళి సాదాసీదాగా జరిగినా సంప్రదాయబద్ధంగా వున్న కొద్దిమంది ఆత్మీయుల హృదయాలను గెలుచుకొని పదిమందికైనా ఆదర్సప్రాయంగా వుండాలని కోరుకుంటున్నాను”శిరీష కు నచ్చదని తెలిసినా నా మనసులో మాట చెప్పే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను.
            “ఏమిటో మీ ఆదర్శాలు,సిద్దాంతాలు నాకెప్పటికీ  అర్థం కావు.”అని గొణుక్కుంటూ లోపలికి వెళ్ళింది శిరీష.
***

No comments:

Post a Comment

Pages