జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 31 - అచ్చంగా తెలుగు
జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 31
చెన్నూరి సుదర్శన్


(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్  తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతాడు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.) 
ఆరోజు క్యాంపు ఆఖరి రోజు...
మధ్యాహ్నం ఒంటి గంట భోజన సమయంలో అంతా  కలిసి మైదానంలో చెట్టు కింద భోజనం చేస్తున్నాం. 
నల్గొండ ఇంగ్లీష్ చీఫ్ ఎగ్జామినర్లు కనబడే సరికి నాకు ఇంద్రాణి మేడం గుర్తుకు వచ్చింది. 
“సార్.. ఇంద్రాణి మేడం రాలేదా..” అంటూ అడిగాను. 
“మీ పేరు సార్..” అంటూ ఒక చీఫ్ ఎగ్జామినర్ నన్నడిగాడు. 
“సార్ పేరు సూర్య ప్రకాష్” అంటూ భాస్కర్ కలుగజేసుకొని  చెప్పాడు. నేను భాస్కర్ వంక చూసాను.
“ఆ సార్ పేరు బాలరాజు.. మా జిల్లాలో చాలా సీనియర్ మోస్ట్ జూనియర్ లెక్చరర్..” అంటూ సరదాగా పరిచయం చేసాడు భాస్కర్. వారిద్దరూ చాలా  క్లోజ్ ఫ్రెండ్స్ అని అర్థమయ్యింది.  మంచి నీళ్ళు తాగుతున్న బాలరాజుకు భాస్కర్ చమత్కారపు మాటలతో పొర మారింది. మరిన్ని నీళ్ళు తాగి.. గొంతు సవరించుకున్నాడు. కళ్ళకు నీళ్ళు వచ్చాయి. 
“ఇంద్రాణి  మీకెలా తెలుసు సార్..” అడిగాడు బాలరాజు. 
“రంగనాథపురం జూనియర్ కాలేజీలో నా కొలీగ్” అన్నాను. “ఆమె రాలేదంటే.. డిగ్రీ కాలేజీ ప్రమోషనేమైనా వచ్చిందేమోననుకుంటున్నాను”
“నిజమే సార్.. ఆమె భువనగిరి డిగ్రీ కాలేజీకి వెళ్ళింది. కాని ఇప్పుడామె లేదు..” అన్నాడు.
“పెళ్లై ఉద్యోగం మానేసిందా..?”
“ఆమె అక్కయ్యకు కాలేదు.. ఆమెకూ కాలేదు. కొందరికి మానసిక నిగ్రహణ శక్తి ఉంటుంది.. మరి కొందరికి ఉండదు.. ఒక ఇంట్లోనే ఉంటున్న స్వంత అక్కా, చెల్లెళ్ళ మధ్య ఎంత వ్యత్యాసం”  బాలరాజు అదో రకంగా చెబ్తుంటే..
“సార్.. ఏమైంది?” అంటూ ఆందోళనగా అడిగాను.
“ఇంద్రాణి కాలేజీలో జాయినయిన నెల రోజుల్లో ఆమెలో మానసికంగా చాలా మార్పులు వచ్చాయి. ఆమె చేతలు పిల్లలకు ఇబ్బంది కలిగించాయి. డిగ్రీ కాలేజీ కదా.. మంచి వయస్కులు.. వారిని చూస్తుంటే అలా మార్పు 
వచ్చిందో..! ఏమో..! తెలీదు.
ఆమె పాఠం చెబుతూ అప్రస్తుత ప్రసంగం చేసేదట. పిల్లలు ప్రిన్సిపాల్‍కు కంప్లైంట్ చేసారు. 
ప్రిన్సిపల్ మెడికల్ లీవ్ గ్రాంట్ చేసి ఇంట్లో కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకొమ్మని సలహా ఇచ్చాడు.. ఇక ఆమె మళ్ళీ కాలేజీకి రాలేదు..” 
నేను తింటున్న వాడినల్లా ఆగి పోయాను. నాలో ఉద్వేగం పెరిగింది. 
“అనారోగ్యమా సార్.. ఏమైంది?” 
“ఆమెకు మతి భ్రమించింది.. పూర్తిగా పిచ్చిదై పోయింది సార్.. మెడ కనబడకుండా  పూసల దండలు.. దండలు.. ఒళ్ళు కనబడకుండా బట్టల.. మూటలు.. మూటలు.. కాళ్ళకు నగిషీల చెప్పులు.. చెప్పులు.. పాడిందే.. పాడేది.. పాటలు.. పాటలు ఇల్లు పీకి పందిరేసేది ” 
నిశ్చేష్టుడనయ్యాను.
“అదుగో.. నా పెళ్ళికి భాజబజంత్రీలు వస్తున్నాయి.. నన్ను పెళ్లి కూతురును చెయ్యండి.. అత్త వారింటికి వెళ్ళాలి.నన్ను సాగనంపండి.. అంటూ ఏడ్చేది.. అంతలోనే నవ్వేది”
“మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసారా?” ఆతృత ఆపుకో లేక అడిగాను. నా గొంతు కూరుకు పోతోంది.. తెలియని  భయం నన్నావహించ సాగింది. 
“అన్నగాడు ఎవడో గాని పాపాత్ముడు.. చూడ్డానికి గూడా రాలేదు. ఉన్నది ఇద్దరు ఆడవాళ్ళే.. వాళ్ళ తల్లి మహారాక్షసి..
ఇంద్రాణిని ఒక గదిలో వేసి అన్నహారాలకు  దూరం చేసింది.. ఎంత వరకు నిజమో..! తెలియదు గాని  గత మాసమే ఇంద్రాణి చనిపోయిందన్నది మాత్రం నిజం” అనగానే నిండు బావిలో పెద్ద బండరాయి పడ్డట్లు నా గుండె గుభేలుమంది..
(సశేషం...)


No comments:

Post a Comment

Pages