ఈ దారి మనసైనది - 29 - అచ్చంగా తెలుగు
                                      ఈ దారి మనసైనది - 29
అంగులూరి అంజనీదేవి




(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత.)
మరుసటిరోజు....


ఎం.జి.ఎం హాస్పిటల్ నుండి నేరుగా ఇంటికి వచ్చాడు అనురాగ్,

బైక్ ని పార్క్ చేసి లోపలకినడిచి, తన గదిలోకి వెళ్లాడు. అతను రోజులా లేడు. తీవ్రమైన  టెన్షన్ కి గురై, మన్విత ఇంత పని ఎందుకు చేసిందోఅర్ధం కాని స్థితిలో వున్నాడు. అతని మానసికస్థితి కూడా అస్థిమితంగావుంది.

ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ న మన్వితతనకి యిచ్చినగ్రీటింగ్స్ని, గిఫ్ట్ని ఒక చోట చేర్చి, ఒకటి మార్చి ఒకటి చూస్తూ కూర్చున్నాడు. వాటినలా చూస్తుంటే . జవాబు దొరకని ప్రశ్నలు శూన్యంలో వేలాడుతూ, అతనిలో కలిగే అంతర్మదనం, భావసంచలనం వర్ణనాతీతంగా వుంది.

టూర్లో మన్విత ఎలా బిహేవ్చేసిందో కళ్ల ముందు మెదిలి ఆమె చూపులకి అర్థమేమిటో ఇప్పడు స్పష్టంగా తెలిసి మనసు విలవిల్లాడుతోంది. ఆ చూపుల్లో ఎంత ఆశ... ఎంత కోరిక... ఎంత తపన ... ఎంత కలల తపస్సు దాగి వుందో ఆ చూపులు తనకి ఏదో చెప్పాలని ఎంతగా వెంటాడాయో.

ఎంత ఆరాటపడ్డాయో ఒక్క మాటలో చెప్పేది కాదు.

దీక్షిత, తను కలిసి కబుర్లు చెప్పకుంటుంటే చూసి ఎంతగా బాధ పడిందో... అది ఎంతటి భయంకరమైన జ్వాలో ... ఆ  జ్వాలలో ఎంతగా కాలిపోయిందో . వ్యక్తం చెయ్యలేని ఆ దారుణమైన హింసను ఎలా తట్టుకోగలిగిందో ఆ దేవునికే తెలియాలి. చివరకి ప్రాణ త్యాగం చెయ్యటానికి కూడా సిద్దపడింది. అంటే ఆమె ఎంత అశాంతికి. ఎంత అలజడికి . ఎంత అసంతృప్తికి గురి అయివుంటుందో అర్థమవుతోంది. ఏది ఏమైనా ఈ తప్పుతనది కాదు.

ఎందుకంటే ...

చంద్రుడ్ని చూసి పసిపాప అన్నం తిన్నా. తప్పతాగి ఓ తాగుబోతు చంద్రుడ్ని తిట్టినా . అదే చంద్రుడ్ని చూసి ఇద్దరు ప్రేమికులు పరవశించినా. ఒక సైంటిస్ట్ ఆ చంద్రుడిపై పరిశోదనలు చేసినా ఆ చంద్రునికితెలియనట్లేమన్విత తనని ప్రేమించిన విషయం తనకి తెలియదు.

అయినా .. తనని చూసి ఎవరెలాఫీలవుతున్నారో తన కెలా తెలుస్తుంది. తనెప్పడూ తనని చూసి అలా స్పందించమని కాని, ప్రేమించమని కాని మన్వితకి చెప్పలేదు. ప్రోత్సహించలేదు. ఒక్కరోజు కూడా అలాంటి ఆశల్ని కల్పించలేదు.

అలా తన మనసుకు తను నచ్చచెప్పకుంటూ తనను తను ఓదార్చుకుంటుంటే - - - -

కాలేజి నుండి ప్రియబాంధవి వచ్చింది.

రాగానే కాఫీ కలిపి, భర్తతో కప్పుయిచ్చి మిగిలిన రెండు కప్పుల్ని ట్రేలో పెట్టుకొని అనురాగ్ గదిలోకి వెళ్లింది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages