జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 30 - అచ్చంగా తెలుగు
జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 30
చెన్నూరి సుదర్శన్


(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్  తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతాడు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.) 
చీఫ్ ఎగ్జామినర్ విధులు మీకందరికీ తెలిసిందే.. 
విధి నిర్వాహణలో భాగంగా ఒక అసిస్టెంట్ ఎగ్జామినర్ వాల్యూ చేసిన బండిల్ నుండి యాదృచ్చికంగా ఒక పేపర్ తీసి రీవాల్యూ చేసాను. మార్కుల్లో చాలా తేడా వచ్చింది. అనుమానమేసి అన్ని పేపర్లూ చెక్ చేసాను. అతడు వాల్యూ చేసిన పదిహేను  పేపర్లలో ఎనిమిది మంది ఫెయిలయ్యారు. నేను రీవాల్యూ చేస్తే ఒక్కడే  ఫెయిలయ్యాడు. అతడు కీ సరిగా ఫాలో కావడం లేదని అర్థమయ్యింది.
నాకు తెలిసియన ఒక లెక్చరర్ ఉండే వాడు. అతడు ఎవరినీ ఫెయిల్ చేసే వాడు కాదు. సమాధానాలు తప్పో.. ఒప్పో.. తెలియదు కాని మార్కులు గుప్పించే వాడు. ఫెయిల్ చేస్తే అడుగుతారు గాని పాసైతే మన జోలికెవరూరారు.. అనుకునే రకం.
కాని ఇతను మరో రకం.. మార్కులు వెయ్యాలో లేదో.. తెలియదు.
నాకు దాదాపు రంగారెడ్డి జిల్లాలోని మ్యాథ్స్ లెక్చరర్లందరూ తెలుసు. 
రిజిస్టర్ తెరచి చూసాను. నల్గొండ జిల్లా రాయిగిరి  ప్రభుత్వ  జూనియర్ కాలేజీ. పేరు రాజలింగం. దాదాపు అయిదు సంవత్సరాల సర్వీసుంది.
రెండు ప్రశ్నల విభాగంలో ఒక ప్రశ్న ఇలా అడిగారు. 
‘చరురస్ర మాత్రికను నిర్వచించి ఒక ఉదాహరణనిమ్ము’.
           ఎగ్జామినరుకిచ్చిన కీ లో మాత్రికను నిర్వచించినందుకు ఒక మార్కు.. ఉదాహరణకు ఒక మార్కు అని ఉంది. 
విద్యార్థి చక్కగా నిర్వచించాడు.. ఉదాహరణ ఇచ్చాడు. కాని మన రాజలింగం సమాధానాన్ని  కొట్టి వేసి సున్నా మార్కులు వేసాడు. నాకు ఆశ్చర్యమేసింది. అతడికి సబ్జక్ట్ రాదా.. లేక సరిగ్గా చూడలేదా అని అనుమానమేసి  దగ్గరికి వెళ్లాను.
“రాజలింగం సార్.. ఈ రెండు మార్కుల సమాధానాన్ని కొట్టి వేసారు.. నాకర్థం కాలేదు. చతురస్ర మాత్రిక అంటే ఏమిటి? సార్..” అంటూ నెమ్మదిగా  ప్రశ్నించాను.
నీళ్ళు మింగసాగాడు. చేతిలో రెడ్ ఇంకు పెన్ గజ, గజ వణకుతోంది. 
“సార్.. ఈ రోజు కాదు. రేపు మీరు ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు సాంతం  సాధించుకొని తెచ్చి పేపర్ వాల్యూ చేయండి. అంత వరకు నేను మీకు పేపర్లు ఇవ్వను” అంటూ సీరియస్‍గా వెనుతిరిగాను.
క్యాంపు ప్రారంభదినం.. పిల్లలు బతికి పోయారనుకున్నాను.
చీఫ్ఎగ్జామినర్లమంతా కలిసి క్యాంటీన్‍కు బయలు దేరాం. అందులో నల్గొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేసే భాస్కర్ నాకు బాగా తెలుసు. అతడు గతంలో రంగారెడ్డి జిల్లాలో పనిచేసాడు.
టీ తాగుతూండగా రాజలింగం బాత్ రూమ్ వైపు  వెళ్ళడం  కనబడింది. 
“భాస్కర్ సార్ అలా వెళ్తున్నాడే రాజలింగం సార్.. మీకు తెలుసా” అడిగాను.. రాజలింగంను చూపిస్తూ.
తాగుతున్న టీ గ్లాసు పక్కకు పెట్టి నిండు నీటి కుండ బద్దలైనట్లు భళ్ళున నవ్వాడు భాస్కర్. మిగతా చీఫ్ఎగ్జామినర్లమంతా వింతగా చూడసాగాము.
“సారీ సార్.. అతడి పేరు వినగానే నవ్వొచ్చింది. మీ అసిస్టెంట్ ఎగ్జామినరా?” అంటూ అడిగాడు. అవునన్నట్లుగా తలూపాను.
“అతడికి కోళ్ళ ఫాంహౌస్ ఉంది సార్. కోళ్ళు ట్వియ్యం.. ట్వియ్యం అనుకుంట నడుస్తుంటే వాని వెనుక భాగం చూస్తూ మురిసిపోతాడే గాని అవి పెట్టె గుడ్లు  లెక్క పెట్టుకోవడమే చేత గాదు. పేపర్లు దిద్దుదామని 
వచ్చాడా..! ” అంటూ మళ్ళీ నవ్వసాగాడు. 
భాస్కర్ నవ్వుతో మిగిలిన వారమంతా శృతికలిపాం. 
నేను నవ్వనైతే నవ్వాను గాని మరోపక్క అనుమానం పీకుతూనే వుంది. 
“భాస్కర్ సార్.. మరి రాజలింగం క్లాసులేలా తీసుకుంటాడు” అడిగాను ఆశ్చర్యంగా.
“అదో హిస్టరీ సార్.. కాసు వుంటే మార్గముంటుంది“ అంటూ మొదలు పెట్టాడు. “ముందుగా అతడు కాలేజీకి వెళ్ళిన ప్రిన్సిపాల్‍ను ప్రతీ నెల తన స్యాలరీ నుండి కొంత ముట్టజెప్తానని ప్రిన్సిపాల్‍పల్స్ పట్టుకుని బుట్టలో వేసుకుంటాడు. ఆ తరువాత క్లాసుకు వెళ్తాడు. అందులో పంచపాండవులో.. సప్తఋషులో.. అష్టదిగ్గజాలో.. లేక నవగ్రహాల్లా  పిల్లలుంటారు.. అలాంటి కాలేజీలనే ఎన్నుకుంటాడు. వారిని తన గారడీ మాటలతో బురిడీ కొట్టించి రెండు ఆప్షన్లు ఆఫర్ చేస్తాడు. 
ఒకటి.. ఎక్కడైనా ప్రైవేటు చెప్పించుకోండి.. డబ్బులిస్తాను.
రెండవది.. ఊళ్ళో ఎవరైనా ఉంటే మీకు నచ్చినవారితో పాఠాలు చెప్పించుకోండి. అతడికి డబ్బులిచ్చు కుంటాను. 
నేను మాత్రం చెప్పేది లేదు.. నాకు వస్తే గదా.. మీకు చెప్పేది. నాకు నా వ్యాపారలతోనే సరిపోతుంది.. అంటూ నిజాయితీగా ఒప్పుకుంటాడు”
నేను అవాక్కయ్యాను. ఎంత ధైర్యం..? అనుకున్నాను మనసులో.. 
“అతడి మీద ఎవరూ కంప్లైంట్ చేయరా..”
“ఎందుకు చేయరు.! అందరినీ తన నోట్ల కట్టలతో నోర్లు మూయిస్తాడు. డబ్బుకు లోకం దాసోహం.. మీకు తెలియందేముంది? సూర్యప్రకాష్ సార్..” అంటూ చిరునవ్వు పూయించాడు పెదవులపై.. 
అంతా  కలిసి తిరిగి వాల్యూయేషన్ హాల్లోకి వెళ్తుంటే నేను నేరుగా క్యాంపు ఆఫీసర్ వద్దకు వెళ్లాను. 
రాజలింగం గురించి కంప్లైంట్ చేసాను. అతడికి పేపర్ వాల్యూయేషన్ తప్పించి పొట్ట మీద కొట్టకుండా 
క్యాంపులో మరేదైనా డ్యూటీ అలాట్ చేయుమన్నాను. 
తిరిగి హాల్లోకి వచ్చి సీట్లో కూర్చో బోతుంటే..
“రాజలింగంతో కాస్తా జాగ్రత్త“ అంటూ హెచ్చరించాడు.. భాస్కర్.
నిజమే అతడు చేసిన తప్పులు ఒక్కొక్క సారి క్యాంపులో  అందరికీ చుట్టుకునే అవకాశం లేకపోలేదు.. 
ఇంతలో పరుగు పరుగున వచ్చాడు రాజలింగం. చేతిలో చిన్న చీటీ.. క్యాంపు ఆఫీసర్ రాసిచ్చాడు. రాజలింగంను పేపర్ వాల్యూయేషన్ నుండి తప్పించి  స్క్రుటినైజర్‍గా మార్పు చేసినట్లు అనుమతి.  
వాల్యూచేసిన పేపర్ల లోని మార్కులను లెక్కించడం.. 
తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను.
***
(సశేషం)


No comments:

Post a Comment

Pages