అటక మీది మర్మం -30 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం -30

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల-  30
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)



@@@@@@@@@@@@@@@@...
(తండ్రి కోరికపై కనిపించకుండా పోయిన ఫిప్ సాహిత్యాన్ని వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకొన్న నాన్సీ ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని గమనించి, తన స్నేహితురాళ్ళ సహాయంతో అతణ్ణి పట్టుకోవటానికి విఫలయత్నం చేస్తుంది. తరువాత అటక మీదకు రహస్య మార్గం ఉందేమోనని వెతుకుతున్న ఆమెతో, కనిపించిన అస్తిపంజరం తమకేదో సైగ జేస్తున్నట్లు బెస్ చెబుతుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బోరువాలో గాలించిన నాన్సీకి కొన్ని ఉత్తరాలతో పాటు పాటలు దొరుకుతాయి. తన స్నేహితురాళ్ళతో జెన్నర్ ఆఫీసుకి వెళ్ళిన ఆమెకు డఈట్ అన్న వ్యక్తి, బెన్ బాంక్స్ పేరుతో చలామణీ అవుతున్నట్లు గ్రహిస్తుంది. ఫిప్ వ్రాసిన పాత ఉత్తరాలను బట్టి ఆమె అటక మీద బీరువా వెనుక ఉన్న రహస్య గదిని కనుక్కొంటుంది. ఆ చీకటి గదిలో కనిపించిన పియానో మీటలన్నీ అదేపనిగా నొక్కిన నాన్సీ పియానోలోంచి ఒక రహస్యపు అర తెరుచుకోవటం, దానిలో రిగ్గిన్ అన్న వ్యక్తి పారవేసుకొన్న కార్డు కనిపించాయి. ఈ లోపున భోజనాలకు రమ్మంటూ ఎఫీ వాళ్ళను పిలుస్తుంది. తరువాత )
@@@@@@@@@@@@

"మీ వాలకాలు అలాగ ఉన్నాయేంటి? ఏమైనా జరిగిందా?" ఎఫీ అడిగింది.
"ఇక్కడో అద్భుతం జరిగింది. అంతే!" నాన్సీ బదులిచ్చింది. "కానీ మాకేం దొరుకుతుందనుకొన్నామో అది మాత్రం దొరకలేదు."
రహస్యగదిని విడిచిపెట్టే ముందు గది పైకప్పు కిటికీని, దాన్ని కప్పిన గుడ్డపై మేకులు కొట్టి ఆగంతకుడు లోనికి ప్రవేశించకుండా శాశ్వతంగా మూసివేయాలని మార్చ్ తలపోశాడు. వెంటనే ఎఫీతో భూతలంలోని గదిలో పనిముట్ల పెట్టెలో(టూల్ బాక్స్)లో ఉన్న పెద్ద సుత్తిని, మేకులను తీసుకురమ్మని చెప్పాడు. "కానీ యిది గుర్రాన్ని దొంగిలించిన తరువాత ధాన్యాగారానికి తాళం వేసినట్లు అనిపిస్తోంది" బాధగా అన్నాడతను.
"కాకపోవచ్చు" చెబుతున్న యువగూఢచారి మనసుకి కొత్త ఆలోచన తట్టింది. ఫిప్ సాహిత్యాన్నంతా దొంగ హస్తగతం చేసుకొని ఉంటే, తాను స్నేహితురాళ్ళతో మాటువేసిన రాత్రి అతను మరొకసారి వచ్చి ఉండేవాడేకాదు. "మనం అతన్ని ఆ రాత్రి భయపెట్టడం వల్లనే అతను తిరిగి రాలేదన్నది మరిచిపోకండి. తనకు కావలసినదాన్ని అతను పూర్తిగా పట్టుకెళ్ళలేదు."
"నువ్వన్నదీ నిజమే" పెద్దాయన అంగీకరించాడు. " ఇంకా చిన్న ఆశ ఉంది."
"ఇప్పుడు ఎక్కడ వెతకాలన్నదే గందరగోళంగా ఉంది" నాన్సీ అంది. "కొంతసేపు ప్రశాంతంగా కూర్చుని ఏమి చేయాలన్నది ఆలోచించాలి."
ఎఫీ సుత్తి, మేకులతో తిరిగొచ్చింది. పైకప్పు కిటికీని కప్పిన గుడ్డపై మేకులుంచి గోడలోకి కొట్టారు. ప్రస్తుతం దొంగ ఆ గుడ్డను దాటి గదిలోకి దిగే ఆస్కారం లేదు. తరువాత వాళ్ళంతా కింద అంతస్తుకి వెళ్ళారు. భోజనాల దగ్గర చీకటిగది గురించి ఎవరూ మాట్లాడలేదు. సుశాన్ వాళ్ళిద్దరితో కలిసి భోజనం చేస్తోంది గనుక గది విషయం ప్రస్తావించి పాపను భయపెట్టదలుచుకోలేదు. పాప భోజనం ముగించి ఎఫీతో మాట్లాడటానికి వంటింట్లోకి వెళ్ళింది. అప్పుడు పెద్దాయన ఆ సాయంత్రం తానేమి చేయదలుచుకొన్నాడో నాన్సీ ముందు బయటపెట్టాడు.
"రిగ్గిన్ అన్నవాడు ఈ రాత్రికి రావచ్చునని నాకు అనిపిస్తోంది. రానీ! ఏం జరగబోతోందో అతను గ్రహించేలోపే వాడు నాకు బందీ అవుతాడు."
"అంటే మీరు పోలీసులకు తెలియపరుస్తారా?'"
"లేదు. ఈ ముసలి సైనికుడే ఒంటరిగా వాణ్ణి పట్టుకోబోతున్నాడు."
నిర్ఘాంతపోయిన నాన్సీ దానికి అభ్యంతరం చెప్పింది.
"ఫిప్ కష్టఫలాన్ని దోచుకొన్న వాడిపై నా చేతులేయటం తప్ప నాకు మరేదీ ఆనందాన్ని యివ్వదు" మార్చ్ పట్టుబట్టాడు.
ఆమె అతని నిర్ణయాన్ని మార్చటానికి ప్రయత్నించలేదు. కానీ తాను కూడా అతనికి తోడు వస్తానని చెప్పింది. కానీ దానికి అతను అంగీకరించలేదు.
"నువ్వు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించాలని చెప్పావు" పెద్దాయన గుర్తు చేశాడు. "నీకేదైనా ఉపాయం తట్టొచ్చు. అటకమీదకు వెళ్ళి మా అబ్బాయి పాటలను వెతికే పనిని చూడు."
"సరే! కనీసం మనమొక సంకేతాన్ని పెట్టుకొందాం" ఆమె కోరింది. "ఆగంతకుడు మీకు కనిపించగానే ఎదైనా జంతువు అరుపును అనుకరించి నాకు సంకేతాన్ని యివ్వగలరా?"
"నేను గుడ్లగూబలా కూతపెడతాను" యికిలిస్తూ చెప్పాడతను.
"మంచిది. నేను ఆ కూత కోసమే చూస్తాను."
తాను పనివాళ్ళ నివాసాల దగ్గర మాటు వేస్తానని చెప్పి, చప్పుడు చేయకుండా మార్చ్ బయటకెళ్ళిపోయాడు. నాన్సీ మనసు అతని ప్రణాళికపై కీడును శంకిస్తున్నా, ఆమె మౌనం దాల్చక తప్పలేదు.
పాపను నిద్రపుచ్చాక ఆమె కింది అంతస్తుకి వచ్చింది. ఎఫీ వంటింట్లో పని ముగించుకొని తన గదిలో విశ్రాంతి తీసుకుంటోంది. యువగూఢచారి ఆ విశాల భవనంలో ఒంటరిగా మిగిలింది. ఒక గంటసేపు ఆమె మొదటి అంతస్తులొని గదిలో ఆలోచిస్తూ కూర్చుంది.
తాను, తన తండ్రి చిక్కుకున్న రెండు విచిత్రమైన కేసుల్లోని వివిధ కోణాలను ఆమె సమీక్షించింది.
"ముంచుకొచ్చే కాలం ముందుంది" ఆంటూ పరధ్యానంగా గొణుక్కొంది. "అది కోర్టు మెట్లెక్కి డైట్ సోదరులిద్దరూ నేరస్తులని ఋజువు కాబోతోంది. వాళ్ళిద్దరూ, వస్తువులు వేరైనా, ఏదో ఒకటి దొంగతనం చేశారు."
గ్రంధచోరుణ్ణి కోర్టుకీడ్చి శిక్షపడేలా చేయాలంటే పెద్దాయన చాలా డబ్బు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఆ విషయంలో తాను సాయం చేయలేదు. ఫిప్ కూర్చిన మరికొన్ని పాటలను మాత్రం కనుగొనటంలో సాయపడగలదు. ఉన్నట్లుండి ఆమె ఆలోచనలు పియానో డెస్క్ మీదకు మళ్ళాయి.
"దానిలో మరొక రహస్య సొరుగు ఎందుకు ఉండకూడదు?" ఆకస్మాత్తుగా ఆమెకు అనిపించింది.
ఉత్తేజితురాలైన ఆమె వంటింట్లోకెళ్ళి కొవ్వొత్తిని తీసుకొంది. దాన్ని వెలిగించి పట్టుకొని అటక ఎక్కింది.
(తరువాయి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages