థాంక్యూ కరోనా - అచ్చంగా తెలుగు
 థాంక్యూ కరోనా 
- శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి 



లాక్ డౌన్ తో మా వారు, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. కంచిలో ఇంజనీరింగ్ చదివే మా పెద్దాడు కూడా ఇంటికొచ్చేశాడు. మా వారు ముందు జాగ్రత్తగా ఓ రెణ్ణెల్లకి సరిపడా సరుకులు తెచ్చిపెట్టారు. కూరగాయలు కూడా వెళితే ఒకేసారి పది రోజులకి సరిపడా తెచ్చి పెడుతున్నారు. 

కరోనా వచ్చి కొంచెం మేలు చేసింది. మునుపట్లా పొద్దున్నే లేచి టిఫిన్లు చేయడం, వంట చేసి క్యారియర్లు పెట్టి పంపడం వంటివి లేవు. ఎంచక్కా పొద్దున్న కొంచెం ఎండబడే వరకు పడుకోవడం కుదురుతోంది. కానీ మా వారు, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారా.... వాళ్ల కోర్కెలకి హద్దే లేకుండా పోతోంది. ఏ కూర చేసినా..... ఒక ఆమ్లెట్ వేసుకోవచ్చు కదోయ్ అంటారు మా వారు. ఇక ఆయన పుత్రరత్నాలు ఊరుకుంటారా? వాళ్లకీ వేసి తీరాల్సిందే. ఇక టీ కోసం మా వారు చేసే మారాం తిరునాళ్ళలో బొమ్మ కోసం పిల్లాడు చేసే అల్లరిని తలపిస్తుంది. గంటకోసారన్నా టీ అడుగుతూనే ఉంటారు. ఏదైనా కవితో, పాటో, వ్యాసమో వ్రాస్తూ కూర్చున్నారనుకోండి ఇక అది అర్థరాత్రయినా, అపరాత్రైనా టీ చేసివ్వవలసిందే. 

దానికి తోడు లాక్ డౌన్ "ఖాళీ సమయంలో తినడానికి ఏదైనా చేసి పెట్టొచ్చు కదా? నోరు ఉర ఉరమంటే తినటానికి ఏమీ లేదు కదోయ్" అంటూ మా వారు ఒకటే నస. నాకేమో ఓపిక లేదు. రెండు మూడు రోజులు అలా చెప్పి మా వారు ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మీ అమ్మ "నా కూతుళ్ళంత బంగార్లు లేరు" అని చెప్పుకుంటూ ఉంటుంది కదా? ఇదేనా మీ గొప్పతనం? అంటూ ఎత్తిపొడుపు ఒకటి. అంతటితో ఊరుకున్నాడా? హైదరాబాదులో ఉన్న మా అత్తగారికి ఫోన్ చేసి కంప్లైంట్ వేరొకటి. “తినడానికి ఏదన్నా చెయ్యమంటే నాలుగు రోజులనుంచి నానుస్తూనే ఉంది నీ కోడలు “అంటూ. “వాడు, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కద విజయా... ఏ సున్నుండలో చేసుంచక పోయావా?” అంటూ మా అత్తగారి ఉచిత సలహా. 

“ఆమెకేం భేషుగ్గా చెబుతుంది. చేసేది నేను కదా...” అనుకుంటూ సున్నుండలు చేయడానికి సిద్ధమయ్యాను. మినప్పప్పు వేయించి, మిక్సీలో పొడిచేసి, దానికి బెల్లం కలుపబోతూ ఉన్నాను. ఇంతలో మా చిన్నాడొచ్చాడు. “వీడు అప్పుడే తినడానికి రెడీ అయిపోయినట్టున్నాడు” అనుకున్నాను. ఇంతలో వాడు “అమ్మా ముద్దలు చేసివ్వనా?” అంటూ దగ్గరకొచ్చాడు. నా కొడుకని చెప్పడం కాదు కానీ వాడు ఏ పనైనా వేగంగా చేసేస్తాడు. నేను సరే చెయ్యమని అనడం ఆలస్యం... చకచకా ఉండలు చేసేశాడు.

బాగున్నాయంటారేమోనని మావారికి ఓ రెండు ఉండలు ప్లేట్లో పట్టుకెళ్ళి ఇచ్చాను. "ఈ మాత్రం దానికేనటోయ్ నాలుగు రోజుల్నుంచి తెగ బడాయి పోయావ్?" అంటూ కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాడిలాగా గబగబా తినేశాడే తప్ప బాగున్నాయి, బాగాలేవు అంటూ మాట మాత్రమైనా చెప్పలేదు మహానుభావుడు. పైగా “షుగర్ కదోయ్ స్వీటెక్కువ తినకూడదు. పనిలో పని ఏ పప్పు చెక్కలో, చెక్కిలాలో చేసెయ్యకూడదూ? సర్లే గానీ నీ స్టైల్ లో ఓ మాంచి టీ ఇచ్చుకో” అంటూ సరికొత్త ఆర్డరేశారు మా కవి శ్రీవారు. “ఆ.... తప్పుతుందా?” అనుకుంటూ నేను వంటగదిలోకి వెళ్ళిపోయాను.

తెల్లవారి పొద్దున లేవగానే “ఏంటీ ఇవాళ పప్పు చెక్క ల్లాంటివి ఏమైనా చేస్తున్నావా?” అంటూ గుర్తు చేశారు మా వారు. అలా గుర్తు చేశాక కూడా నేను ఫలహారం చెయ్యకపోతే ఏమవుతుందో నాకు ఈ ఇరవై ఏళ్లలో అనుభవమే. మా ముత్తాత, ముత్తవ్వల నుంచి అందరూ దానికి బాధ్యులేనన్నట్టు వాళ్ల పేర్లు నన్నడిగి తెలుసుకుని మరీ దండకం మొదలెడతారు. అందుకే ఆయనకా ఛాన్సివ్వకుండా ఆ పూట పప్పు చెక్కలు చెయ్యడానికి సిద్ధమయ్యాను. ఈరోజు ఇంకా విచిత్రమైన సంఘటన ఎదురయింది. తనకు కావలసింది ఏమిటో అడిగి చేయించుకుని తినడం తప్ప ఏనాడూ వంటగదిలోకి తొంగి చూడ్డం కూడా తెలీని నా పెద్ద కొడుకు "కెన్ ఐ హెల్ప్ యూ మా?" అంటూ వంటగదిలోకి రావటం. అంతేకాదు నా పక్కనే ఉండి చెక్కలకి పిండి తట్టివ్వడం. వామ్మో ఇంట్లో వాళ్ళకేమైంది? అనుకుంటూ తెగ ఆశ్చర్యపోయాను నేను.

పప్పు చెక్కల తయారీ తర్వాత కాస్త అలసటగా అనిపించి బెడ్రూంలోకొచ్చి పడుకున్నాను. పక్కన మా వారు ల్యాప్ టాప్ లో ఏదో చూసుకుంటున్నారు. ఒక అర్ధగంటయ్యుంటుందేమో.... మెలుకువొచ్చి చూస్తే గదిలో మా వారు లేరు. "ఏమైపోయాడీ మనిషి?" అనుకుంటూ హాల్లోకొచ్చాను. వంట గదిలో ఏదో అలికిడవుతోంది. ఏంటి చెప్మా అనుకుని చూస్తే... మా వారు. టీ కాచుకుంటున్నారు. "అలసిపోయినట్టున్నావ్ పడుకోకూడదటోయ్" అంటూ మా వారు తన పనిలో తానున్నారు. " నేను చేసివ్వకపోయానా?" అంటూ నే వెళ్ళబోయాను. "నీ టీ కంటే నా టీ బ్రహ్మాండంగా ఉంటుంది చూడవోయ్" అంటూ మా వారు మొత్తానికి టీ చేసేశారు. ఏదో సాధించేసిన ఫీలింగ్ ఆయనలో. వెంటనే టీ కప్పుని ఫోటో తీసి " సెల్ఫ్ మేడ్ టీ" అంటూ వాట్సప్ స్టేటస్ లో కూడా పెట్టేశారనుకోండి.

ఇక ఈరోజు ఆదివారం. హైదరాబాదులో ఉండే మా తోడికోడలు టమోటా రైస్ చేసిందని విని చిన్నపిల్లాడిలా గెంతుతూ మా వారు “సాయంత్రం టమాటా రైస్ చేసెయ్యవే...” అంటూ మొదలెట్టారు. సరిగ్గా నేను టమాటా రైస్ చేస్తున్నప్పుడు వచ్చి “ఏమేవ్ ఎగ్స్ ఉంటే ఉడకబెట్టు. దీంట్లోకి చాలా బాగుంటుంది.” అన్నారు. చూస్తే మూడే గుడ్లు ఉన్నాయ్. సరే ఆయనకి, పిల్లలకి సరిపోతాయి కదా? అనుకుని మూడు గుడ్లు ఉడకబెట్టాను. 

మావారికి భోజనం వడ్డిస్తున్నప్పుడు “ఏమోయ్ కప్పొకటి పట్రా” అన్నారు. కప్పు తెచ్చి పెట్టాను. తన ప్లేట్లో వడ్డించిన గుడ్డులో సగం తుంచి ఆ కప్పులో వేశారు. ఎందుకండీ అంటే “మా కండలేం కరిగిపోవు లేవోయ్” అంటూ ఫోన్లో ఏదో చూసుకుంటూ తినడం మొదలెట్టారు. ఆయన భోజనం అయ్యాక నేను హాల్లోకి వెళ్ళేటప్పటికి పిల్లలిద్దరూ చెరో ప్లేట్లో టమాటా రైస్ వేసుకుని తింటూ కనిపించారు. ఎగ్స్ వేసుకున్నారా? లేదా? అని చూస్తే ఇద్దరి ప్లేట్లలోనూ కనిపించాయ్.  వారిద్దరూ తినడం పూర్తయ్యాక ప్లేట్లు రెండూ సింకులో వేసి మరో ప్లేట్లో నేను వడ్డించుకోబోయాను. హాట్ బాక్స్ లో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. అక్కడ కోడిగుడ్లు మరో రెండు సగాలున్నాయ్. అంటే పిల్లలిద్దరూ కూడా నాకోసం చెరో సగం గుడ్డు ఎత్తి పెట్టారన్నమాట. ఆశ్చర్యమో, ఆనందమో తెలీదు. ఒక్కసారిగా నా కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. నా కళ్ళముందు దృశ్యమంతా మసకబారినట్లైంది. నెమ్మదిగా కళ్ళు తుడుచుకుని భోజనం చేస్తూ ఆలోచిస్తున్నాను.

మా వారు సరేగాని మా పిల్లలు కూడా నా గురించి ఇంతగా ఆలోచిస్తారని, ఇంట్లో పరిస్థితిని ఇంతగా గమనిస్తారని, అర్ధం చేసుకుంటారని నేనెప్పుడూ అనుకోలేదు. నేను టైంకి టిఫిన్ చేయలేదనో, క్యారియర్ పెట్టివ్వలేదనో, శుక్రవారం నాడు వాడు వేసుకెళ్లాలనుకున్న జీన్స్ ప్యాంట్ ఉతికి పెట్టలేదనో  విసుక్కోవడమో, “నువ్వెప్పుడూ ఇంతేనమ్మా సమయానికేదీ అందుబాటులో ఉంచవు” అంటూ నిష్ఠూరపడడమో మాత్రమే నాకు తెలుసు. వాళ్ల గుండెలలో నా మీద ఇంత ప్రేమ దాగున్నదని, నా పట్ల వాళ్లు ఇంత బాధ్యత ఫీలవుతున్నారని నాకు అర్థం అయింది ఇప్పుడే.... లాక్ డౌన్ కారణంగా ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఏర్పడింది. అంటే... మామూలు రోజుల్లో ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమను కూడా వ్యక్తం చేసుకునే సమయం, అవకాశం కూడా మనకు ఉండడం లేదన్న మాట. అందుకే థాంక్యూ కరోనా.

***

No comments:

Post a Comment

Pages