ఆ నలుగురు... - అచ్చంగా తెలుగు
ఆ నలుగురు
 వి.యన్.మంజుల.


వృత్తి ధర్మానికి పూనుకుని,
కొట్టుమిట్టాడే ప్రాణానికి..
ఊపిరి ఊదే ఊతమై,
పాకే విషానికి విరుగుడు వైద్యం చేసి,
జారే జీవానికి ప్రాణదానం చేసి,
ప్రతి మది గుడిలో వెలసిన 
ప్రాణం పోసిన దేవుడివా..
దైవానికి ప్రతిరూపమైన వైద్యుడా....

కర్తవ్యాన్ని కవచం చేసుకుని,
కాఠిన్యాన్ని లాఠీగా మలచుకుని,
దోవతప్పిన బాటసారులను
సామదానదండనలతో
పెద్దన్నగ నిలిచి నడిపి,
లక్ష్మణరేఖపై ఆంక్షలు పెట్టి,
రక్షణ భిక్షను అభయం చేసి,
తెగువ చూపే సైనికుడా...
భగవంతుని రూపమైన రక్షకభటుడా...

అంటురోగం అంటనీయక,
విషపు పురుగుల పాకనీయక,
దుమ్మూ, ధూళీతో ..చెంపా, చేయీ కలిపి,
ఇల్లు భద్రం, రోడ్డు శుభ్రం చేసి,
ప్రతి గుమ్మం, ప్రతి వీధిని..
కంపువాసనల చెత్తనెత్తి,
అందరి క్షేమం కోరే సేవకులారా...
అద్దంలా సర్దిపెట్టే ..
పారిశుద్ధ్య శ్రామికులారా...

పాలకవర్గం ప్రజలదనీ,
పాలకులంతా ప్రజా ప్రతినిధులనీ,
కూడూ, గుడ్డా సమకూర్చీ,
మంచీచెడులను విడమరచి
ఇంటికి పెద్దై, పెద్ద దిక్కై...
కాపుకాసి, చెంత నిలిచే నాయకుడా..
అభయమిచ్చి అండచూపే ప్రజానాయకుడా..

నాలుగు దిక్కులా మీరు రక్షపెడుతుంటే,
నలుచెరగులా మీరు రంకెపెడుతుంటే..
బ్రతుకులు భద్రమనే నిర్భయంతో..
మంచి రోజులు రానున్నాయనే నిశ్చింతతో..
చేతులెత్తి మొక్కాయి...
ఆశీర్వాదాలు పలికాయి...

***

No comments:

Post a Comment

Pages