తీరిన తిరునాళ్ళు - అచ్చంగా తెలుగు
తీరిన తిరునాళ్ళు
(మా జొన్నవాడ కథలు)
టేకుమళ్ళ వెంకటప్పయ్య
 9490400858


"ఒరే నర్సిమ్ముల.. జొన్నాడ తిర్నాళ్ళ ఇంక పట్టుమని పదిరోజులు కూడా లేదు.  మనం నెల్లూరు కు బొయ్యి స్టవునస్పేట లో సామాన్లు తేవాల్రా!" అన్న పెంచిలశెట్టి మాటలకు తలూపి గమ్మునున్నాడు ఏమీ మాట్లాడకుండా. 
"ఈసారి గూడా మన హోటల్ అమ్మకాలు అదిరిపోవాల్రో.... ఈ పెంచెలిశెట్టి పెసరట్టేశాడంటే జొన్నాడ జొన్నాడ షేకవ్వాల. ఏందిరా?  ఏందట్టా చూస్తా వుండావు? మీకందరికీ పొయినసారి మాదిరిగానే ఒక జత గుడ్డలు, తలా వెయ్యి రూపాయలు బోనసుగా యిత్తా. ముందటేడు మాదిరిగా ఆ ఎదురుగా ఉండే నారిగాడి హోటలు ఈ సమచ్చరం గూడా ఈగలు దోలుకోవాల” అని పెద్దగా నవ్వుతూ “ మనం ఈపాలి గూడా లైట్లు గీట్లు బెమ్మాండంగా బెట్టిద్దాం… ఏంది…  మీరంతా  మంచి కుశాలుగా పంజెయ్యాల.”
ఒకసారి తలెత్తి చూసిన నర్సింహులు మళ్ళీ తన వంట పనిలో బడిపోయాడు. ఎందిరా యిది…  ఉలుకూ పలుకూ లేదు…. కొద్దిగయినా ఉషారు జూపించబల్లా... అని మనసులో అనుకుని,  తువ్వాలు దులుపుకుని బయటికెళ్తూ.. "భాగ్యం..  గల్లాపెట్టె కాడ కూకోవే.. కాస్తా… నేను ఆడదాక బోయొస్తా" అని బయటికి వెళ్ళిపోయాడు. 
సమయం ఉదయం 12 గంటలయింది. దేవళానికొచ్చే జనం పల్చబడడంతో  టిఫిన్ కాఫీల జనాలూ పల్చబడ్డారు.  మళ్ళీ మాపటేళగ్గానీ  జనాలు రారు. ఈలోపు కాస్తా ఊపిరి పీల్చుకుందామని అందరూ లోపల వంటజేసే కాడ సమావేశం అయ్యారు.
"శెట్టి మళ్ళీ ముందటేడు పాటే పాడుతుండాడ్రా...ఒక జత గుడ్డలంట.. వెయ్యి రూపాయలు డబ్బులంట" అని మొదలు పెట్టాడు నరిసిమ్ములు.
"నాకూ ఏం జెయ్యాలో నాకూ అర్ధంగావడంలా.. పనిజూస్తే ఏమో బయంబుడతా ఉంది. పదిరోజులు పగులూ రాత్రీ గొడ్డు చాకిరీ జెయ్యాల. ఇచ్చేదేమో వెయ్యి." అన్నాడు రాములు.
"వాడేమో లచ్చలు సంపాదిత్తా మనకిట్టా అన్యాయం జేత్తా ఉండాడు" అన్నాడు ఆచారి.
"ఏమో ఎంజెయ్యాలో మీరే ఆలోచించి జెప్పండి" అంది పన్నెండేళ్ళ చిట్టెమ్మ.
"మనం అందరం ఒకమాటమీనే ఉండాల్రా…. ఆ..మనకు రెండువేలు రూపాయలియ్యాల. గుడ్డలు మంచివి రెండు జతలియ్యాల ఆ మాదిరిగా నైతేనే చేద్దాం. లేకపోతే వద్దు" అన్న నర్సిమ్ములు మాటలకి అడ్డుతగుల్తూ రాములు "వద్దంటే మనకెట్టా తప్పుతుంది. వోటెల్లో పనిజేత్తన్నాం గదా!
"చేస్తన్నాం గదాని యెట్టిచాకిరి జెయ్యిస్తే ఊరుకుంటామా? రోజుకెనిమిది గంటలే పనిజెయ్యాల్సింది రూల్సుకుబోతే...  మనం తిర్నాలొస్తే ఉదయం 6 కాడ్ణుంచీ రేత్రి 10 దాకా జెయ్యాల. ఎన్నిగంటలో లెక్కేసుకోండి..." అన్నాడు ఆచారి.
"అందుకే నెంజెప్పేదేందంటే.. మనం అడిగింది ఒప్పుకోకపోతే ఆ పదిరోజులు పనికిరాం  అంతే!"  అన్న నర్సిమ్ములు మాటలకు ఆలోచనలో పడి తేరుకుని "తర్వాతొస్తే మనల్ను రానిస్తాడా శెట్టి?" అన్నాడు. " ఆ..రానీకెక్కడికి పోతాడ్రా వాడి జేజినాయిన జేస్తాడా ఇక్కడ పని? చచ్చినట్టు ఒప్పుకోవాల. అంతే" అన్నాడు.  "ఇదేమన్నా తకరాదయి పని బొయిందంటే మా పిన్ని అన్నంగూడ బెట్టదు నాకు" అన్న చిట్టెమ్మ  మాటలకు వాళ్ళంతా పెద్దగా నవ్వారు. 
"ఎందిరా అందరూ లోన జేరారు. ఎంది కత? " అన్న శెట్టి మాటలకు అందరూ తలో మూలకు సర్దుకున్నారు.
*   *  *
"అబయా! నరసిమ్ములా.. రేపు మొదలవతావుళ్ళా… తిర్నాళ్ళ. మీరంతా రేపు ఆరింటికే రావాల. నేను రాత్రి 3 గంటలకే లేచి పప్పూ  గిప్పూ నానబెడతా. మోత మోగాల మన హోటల్. ఏంది? " అన్న శెట్టి మాటలకు నర్సిమ్ములు " శెట్టీ... అట్నే గానీ..  నీ మాటెప్పుడు గాదన్నాం మేము…  అయితే…మాకు జీతం గాకుండా ఎగస్టా డబ్బులు ఈ ఏడు రెండువేలు యియ్యాల. రెండు జతలు మంచి గుడ్డలియ్యాల. మేమందరం అనుకొన్నదిదే…" అన్నమాటలకు శెట్టి బిత్తరపోయి "అదేందిరా.. నీపాసు గాల…అన్నీ తెలిసినోడివి పదేళ్ళనుండి నాకాడ పనిజేస్తున్నావు. నీకు తెల్వందేముందిరా! నా ఎవ్వారాలన్నీ నీకుదెల్సుగదా!  ఈ ఏటికి ఇట్ట గానీరా నరిసిమ్ములా!" అన్న మాటలకు "మేం జెప్పిందానికి … యిట్టమైతేనే వత్తాం. లేకపోతే రాం. " అని, వాళ్ళేపు తిరిగి  "పదండ్రా పోదాం" అని వెళ్ళిపోయారు. 
"ఎందయ్యో మన  నరిసిమ్ములేందో బోడిముండ లీడరయినట్టు ఎదవ నసుకుడు నసకతా ఉండాడేంది?" అన్న భాగ్యం మాటలకు వాడి మొహం లేవే! బుడ్డ బెదిరింపులు. రేప్పోద్దున్నే వాళ్ళే వస్తార్లే! చూడు..." అని తలుపులు మూసి        లోనకొచ్చాడు.
*   *  *
పొద్దున ఏడయినా పనోళ్ళు రాకపోయేసరికి శెట్టికి ఏంజెయ్యాలో తోచడంలేదు. కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకి బయిటికీ తిరగతా ఉండాడు. మధ్య మధ్యలో వచ్చినవాళ్ళకు ఏం గావాలో చూడలేక యిద్దరిపనీ అయిపోతోంది. 
సమయం 9 అయ్యాక ఇంక ఉండబట్టలేక మామ కామిశెట్టికి ఫోను గొట్టాడు. "హలో... మావా… భాగ్యానికేమి... దిట్టంగా ఉందిగానీ… నాపనే కుడితిలో బడ్డ ఎలకలాగా అయింది. మావా! నేంజెప్పేదిను.. డేంజర్లో బడ్డా... మన హోటల్ పనోళ్ళు ఎక్కువ డబ్బులు గావాలని జెప్పి పనెగ్గొట్టారు. స్ట్రయిక్ గియిక్ గానీ చేత్తన్నరేమో తెలీదు. 9 అయింది. తిర్నాళ్ళ మొదలయింది. జనం పొర్లబడతా ఉండారీడ... ఏంజెయ్యాలో తోచడంలే" అంటూ విషయం జెప్పాడు. "అల్లుడూ దిగులుపడబాక. నేను జమాజెట్టీల్లాంటి పనోళ్ళను ముగ్గుర్ని బంపిస్తా గంటలో అక్కడికి" అన్న మాట విన్న శెట్టికి ప్రాణం లేచొచ్చింది.  వాళ్ళు రావడం పన్లు చకా చకా జెయ్యడం చూసాక పూర్తిగా తేరుకున్నాడు శెట్టి.
తలుపుదెగ్గిర నిల్చోని లోపలికి రావచ్చా అన్నట్టు నిలబడ్డ చిట్టెమ్మను  జూసి శెట్టి "ఏం మాయరోగమొచ్చిందే చచ్చినదానా! మీ పిన్ని ఎవ్వారం తెలిసేనా వాళ్ళతో గలిసావు?" అని అరిచే సరికి కళ్ళనీళ్ళు పెట్టుకుని "వాళ్ళు ఎక్కువిప్పిత్తారని మాటిచ్చేసరికి ఆశబడ్డానయ్యా!" అనే సరికి "లోపలికి బో! భాగ్గెం ఒక్కతే చస్తా ఉంది లోపల" అన్నాడు.
*   *  *
"నరసిమ్మన్నా!  ఇంట్లో పనికని జెప్పి వచ్చి ముగ్గురం యిక్కడ ఏటికాడ కూర్చుంటున్నాం . వారం రోజులయింది. పనికోసం తిరిగి తిరిగి నీరసం వత్తా ఉంది. చేలల్లో పన్లూ ఏమీ లేవంట. ఎవ్వరూ పనులు ఇయ్యడంలే! అన్న రాములు మాటలలకి "అవున్రా! వోటల్లో కావల్సినవన్నీ చక్కంగా జేసుకోని తినే వాళ్ళం". డబ్బులకు డబ్బులూ బొక్క. ఇప్పుడు బోతే ఏమంటాడో ఎందో శెట్టి భయం బుడతా ఉంది. ఇంట్లో రోజూ డబ్బులు ఎంతో కొంత ఎత్తుకరాకపోతే ఊరుకోరు.”
*   *  *
సాయంత్రం ఐదుగంటలయింది. కౌంటర్లో బిజీగా ఉన్న శెట్టి లోపలికి రాకుండా వాకిట్లో తారట్లాడుతున్న నరిసిమ్ముల్ను మిగతా యిద్దర్నీ చూసి ఇంతెత్తున లేచాడు. శాంత  పడింతర్వాత లోపలకొచ్చారు ముగ్గురూ.  "ఒరే నరిసిమ్ములా… పదిహేనళ్ళప్పుడు మీ నాయన నిన్ను నా చేతుల్లోబెట్టి నాకొడుకు జాగర్త అని చెప్పి చచ్చిపోయాడ్రా! అప్పట్నుంచీ నిన్ను ఒక్కమాట అన్నాన్రా! నేను? నా సొంత కొడుకులాగా జూసుకుంటుళ్ళా..." అనేసరికి నరిసిమ్ములకు ఏడుపు తన్నుకొచ్చింది.  "ఆశకు బొయినాం అయ్యా. పొరబాటయింది శెట్టీ! సరిగ్గా అన్నంతిని మూడ్రోజులయింది" అనే సరికి శెట్టి కరిగిపోయి "లొనకెళ్ళి ఏదో ఒకటి తినండి పోండి...  అన్నాడు. "ఒరే నరిసిమ్ములా ఇట్రారా! తిర్నాళ్ళ టైములో నా పెట్టుబడి రోజుకు ఐదువేలు. అయి అమ్మితే 10 వేలు వస్తుంది. కరెంటు ఖర్చూ..లైటింగు ఖర్చూ..తడిసి మోపెడు. మిగిలేది 3 వేలు దినానికి. 10 రోజులకు 30 వేలు మిగుల్తుంది. మీకు డబ్బుగా నాలుగు వేలు ఇయ్యాల. గుడ్డలు ఇంకో 4 వేలవుతాయి. మా అమ్మాయి ఇంజినీరింగ్ చదవతా ఉంది. అక్కడ వేలకువేలు కట్టాల డబ్బులు. నాకు మిగిలేందిరా ఇంక. ఇన్నిరోజుల్నుంచీ ఉన్న మీరే అర్ధంజేసుకోకపోతే ఎట్టారా?" అన్నాడు.
"అయ్యా! ఇంకెప్పుడూ ఇట్టా చెయ్యం. ఈ ఒక్క సారికి క్షమించు" అనే సరికి "మీరంతా నా బిడ్డల్లాంటోళ్ళురా… మనలో మనకి క్షమాపణలేందిరా! సుబ్బరంగా పనిజేసుకోండిరా.. అన్నాడు శెట్టి. దండం పెట్టి పనిలో దిగాడు నరసిమ్ములు.

*  *  *

No comments:

Post a Comment

Pages