పాపభీతి - అచ్చంగా తెలుగు

సుబ్బుమామయ్య కబుర్లు
పాపభీతి
ప్రతాప వెంకట సుబ్బారాయుడు 


పిల్లలూ ఎలా ఉన్నారర్రా? బావున్నారు కదూ!!
మనం ఈ నెల పాపభీతి గురించి తెలుసుకుందామే?
ఎవరికన్నా దెబ్బతగిలినా, మరేదైనా ప్రమాదం జరిగినా మన నోట్లోంచి వచ్చే పదం..అయ్యో పాపం! కదూ..
ఎందుకనీ? మన అమ్మానాన్నా చిన్నప్పట్నుంచి ఎవరినీ మాటలతో..చేతలతో నొప్పించకూడదని..బాధ పెట్టకూడదని..చెప్పడం చేత, మన మనసు అలా స్పందిస్తుందన్నమాట! మీకు బుద్ధుడు తెలుసుగా, ఆయన పేరు మొదట్లో గౌతముడు. మనలాగే ఉండేవాడు. ఒకరోజు రాత్రి బయటకు వెళ్లి బాధలుపడే అనేక మందిని చూసి మనసు చలించి జ్ఞానబోధ పొందిన బుద్ధుడు అయ్యాడు. ప్రపంచానికి శాంతి ఎంతో అవసరమని చాటి చెప్పాడు. అశోకుడులాంటి ఎప్పుడు యుద్ధాలు చేసే రాజులు సైతం మారి అహింసా మార్గం పట్టారు. ఒక్క బుద్ధుడనే కాదు, ఏ మతమైనా. ఏ మత గురువైనా శాంతిని గురించే ప్రవచనాలు చెబుతాడు. మన దేశం కూడా శాంతిని కాంక్షించే ప్రజాస్వామ్య దేశం. అందుకే అశోకుడి నాలుగు సింహాల్ని, ధర్మ చక్రాన్ని రాజ గుర్తులుగా తీసుకుంది.
నేనివన్నీ ఎందుకు చెబుతున్నానంటే, కొంతమంది తరగతిలో ఎవరన్నా కిందపడితే నవ్వుతారు. దెబ్బ తగిలితే సహాయం కోసం వెళ్లరు. తప్పుకదా! మనం వెళ్లి మనకు తోచిన సహాయం చేయాలి. ఉపశమనం కలిగించాలి. రేపు మనకూ ఏదన్నా జరగొచ్చు కదా!
ఒక్కోసారి మనం పద్యమో పాఠమో సరిగా వల్లెవేసి చెప్పలేదని మాస్టారు మన చెవి మెలి తిప్పితే ఎంత బాధ కలుగుతుంది? మన అమ్మో, నాన్నో మనం చేసిన ఏదో అల్లరి పనికి కోప్పడి..కొడితే మనం ఏడుస్తూ ఎలా అలుగుతాం?వాళ్లతో అస్సలు మాట్లాడం. అలాంటిది..తూనీగల తోకలకు దారం కట్టడం, సీతాకోక చిలుకల్ని పట్టుకోవడం, తొండల్ని.. కుక్కల్ని రాళ్లతో కొట్టడం పాపమర్రా! అవీ మనలాంటి జీవాలే కదా! వాటికి భయం, బాధ ఉంటుంది. చెప్పుకోలేవంతే. కొంతమంది దారిలో వెళుతూ చెట్ల ఆకులో, కొమ్మలో విరిచేసి కింద పడేసి వెళతారు. అనవసరంగా అలా చెయ్యొచ్చా? తప్పుకదూ!చెట్లు..జంతువుల వల్ల మనకెన్ని ఉపయోగాలో తెలుసా? లెఖ్ఖలేనన్ని. అలాంటిది వాటిపట్ల అలా ప్రవర్తించడం తప్పుకదూ!
మంచి పిల్లలం, విచక్షణ ఉన్న మనం ఇవన్నీ తెలుసుకోవాలి. అలాంటి పాపం మనం చెయ్యకుండా ఉండడమే కాదు, ఎవర్నీ చేయకుండా అడ్డుకోవాలి.
ఇలాంటి జీవ జంతుజాలాన్ని బాధించే పనులు చేస్తామనే మన పూర్వులు పాపం, పుణ్యం ఏర్పరచారు. మనం సాధ్యమైనన్ని పుణ్య కార్యాలు చేయలి. నిరంతరం పాపభీతి కలిగి ఉండాలి. ఉంటారు కదూ..
మరి ఉంటాను మంచి పిల్లలూ..
మీ సుబ్బు మామయ్య!

*** 

No comments:

Post a Comment

Pages