బసివిరెడ్డి - అచ్చంగా తెలుగు
బసివిరెడ్డి
డా॥ వి.బి. కాశ్యప M.D. 


ఆ ఎర్రమట్టిదారిలో నడక ఈ సారి భారంగా తోచింది. దూరంగా కనపడుతున్నఇంటి ప్రహరి మీద నుంచి నన్ను చూసి, నా ప్రాణస్నేహితుడిని పిలచి, ఆపేక్షగా నవ్వేసేదేవుడిచ్చిన చెల్లెమ్మ లేదక్కడ. తన చేతిలో ఆనందంగా పెరిగి దారివెంట వెళ్ళే ప్రతి ప్రాణాన్ని ప్రేమగా పలకరించే పూలమొక్కలన్నీ ముఖం వేలాడేసి దీనంగా చుస్తున్నాయి, కన్నీళ్ళని ఎండుటాకుల్లా రాలుస్తూ.
ఆ ఇంటి ఆవరణలో అడుగుపెట్టేసరికి, ఎప్పుడూ చవులూరించే పిండివంటల  ఘుమఘుమల స్థానంలో ఘాటైన చుట్టవాసన గుప్పుమంది. వరండాలోని పడకకుర్చీలో పడుకుని చేతిని కాలుస్తున్న చుట్టని పట్టించుకోకుండా ఆకాశాన్ని పరికిస్తున్న బసివిరెడ్డిని చుస్తుంటే హృదయం చిక్కబట్టింది. ఆ మహతల్లిని మరొక్కసారి కళ్ళారా చూసేభాగ్యం దక్కనందుకే బరువెక్కిన గుండె, ఆప్తమిత్రుడి దయనీయ స్థితి చూసి ద్రవించింది. కనుకొనల నుండి జాలువారిన కన్నీటిని లెక్కచేయకుండా బసివిరెడ్డి దగ్గరకెళ్లి చేతిలో చుట్టలాగేసి అవతల పడేసాను. అప్పుడు స్పృహలోకి వచ్చి గాజుకళ్లతో నన్ను పలకరించాడు. ఆ ముఖం నేను చుడని ఆరు నెలల్లోనే ఆరుపదుల వయసునద్దుకుందనిపించింది.
"ఎప్పటినుంచి మొదలెట్టావురా ఇది? చెల్లెమ్మ ఒట్టు వెయించుకుందిగా." దూరంగా ఉన్న మరొక కుర్చీని దగ్గరకు లాక్కుని కుర్చుంటూ కొంచెం కసిరాను. చెల్లెమ్మ మరణం గురించి సరాసరి ప్రస్తావించే ధైర్యం చాల్లేదు, వాడిని చూశాక.
"వచ్చి మళ్లీ ఒకసారి కోప్పడితే బాగుణ్ణు కదరా!" లేని నవ్వుని పులుముకుని సర్దుకు కూర్చున్నాడు బసివిరెడ్డి.
"అయ్యగారు చుట్టతాగడంలేదు సామి! ఒకదాని తర్వాత ఒకటి కాల్చి వదిలేస్తున్నారంతే." మల్లన్న వచ్చి కింద గట్టుమీద కూర్చుంటూ అన్నాడు. నా వెనుకే లోపలికి వచ్చినట్టున్నాడు. ఇంకా జరిగిన విషయం అడగటానికి మనసొప్పలేదు. ఆరునెలల క్రితం నా కూతురి దగ్గరికి వెళ్ళేప్పుడు ఆనందంగా బోలెడు పిండివంటలు ఇచ్చిన చెల్లెమ్మ లేదన్న విషయం నాకే మింగుడు పడటంలేదు. ఆటుపోట్లని కలిసి ఎదుర్కొని ముప్పైసంవత్సరాలు కలసినడిచిన వాడి స్థితి అగమ్యగోచరమైంది. ఎదొక సాకుతో మాటమార్చాలని ఆలోచిస్తుండగా, "అయ్యా! మీరెప్పుడు వచ్చారు మనదేశంలోకి?" ప్రశ్నించాడు మల్లన్న.
"నిన్న రాత్రి వచ్చాను, మల్లన్న." అని, "ఇంతకీ పిల్లలెక్కడరా? ఊరినుంచి మూడునెలల క్రితమే వచ్చారని విన్నాను చాలా సంవత్సరాల తర్వాత." అన్నాను ఖాళీగా కనపడుతున్న లోఇంటిని పరీక్షిస్తూ. సమాధానం వినేలోగానే తిరిగి మల్లన్నను "మీ అమ్మాయి ఎలా ఉంది? పెళ్లివయసు వచ్చిందిగా. సంబంధాలు చుస్తున్నావా?"అని అడిగాను.
సమాధానం ఇవ్వకుండా మల్లన్న వేగంగా లేచి, "పొలంలో మోటరు పని ఉంది. వెళ్లొస్తానయ్యా!" అనేసి ముఖంలో వేగంగా మారుతున్న రంగుల్ని దాచేసుకుంటూ బయటకెళ్లిపోయాడు.
ఎంజరిగిఉంటుందో అర్ధంకాక అయోమయంలో పడ్డాను నేను. "పక్కఊరిలో ఎడ్లపందేలకి వెళ్లారు." నిర్లిప్తంగా సమాధానమిచ్చాడు బసివిరెడ్డి. ఈ సారి అవాక్కయ్యాను. ఐదురోజులవ్వలేదు తల్లి మరణించి, వీళ్లసలు ఆ తల్లిబిడ్డలేనా అనే అనుమానం వచ్చింది. ఊర్లో ఎవరు మరణించినా కనీసం వారంరోజులు ముద్దముట్టలేకపోయే చెల్లెమ్మ గుర్తొచ్చి దు:ఖం కమ్ముకొచ్చింది. వాడికి కనపడకుండా మరోవైపు తిరిగి కళ్లుతుడుచుకున్నాను.
"అయ్యా! అయ్యా!" అని అరుచుకుంటూ వగరుస్తూ ఇంటిలోకి పరిగెత్తుకువచ్చాడు ఒక యువకుడు. నేను ఎదురెళ్లి, "ఎమైందిరా?" అని అడిగాను ఆతృతగా. మనసెందుకో కీడు శంకించింది.
"అయ్యా...! అయ్యా...!" ఇంకా రొప్పుతూనే ఉన్నాడు. చాలాదూరం నుంచి పరిగెత్తుకు వచ్చినట్టున్నాడు. "అయ్యా...! రెడ్డిగారి పిల్లలు... ఎడ్ల పందేలు..." అంటూ గాలి పీల్చుకోడానికి ఒక్కక్షణం ఆగి, "ఎడ్లపందేలు జరిగేప్పుడు, కాలుజారి దారిలో పడి, ఎడ్ల తాకిడికి చనిపోయారయ్యా.." అని ముగించి తలదించుకుని మళ్లీ బయటకు పరుగందుకున్నాడు. అదివిన్న నాకు భూమిబ్రద్దలైందా అనిపించింది. వాడిని తల్చుకోగానే స్థాణువైన నేను చివుక్కున వెనక్కు తిరిగాను. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన ఆ చేతుల్తోనే కన్నకొడుకులకు కొరివిపెట్టాల్సి వచ్చిన ఖర్మకి క్రుంగిపోతుంటాడనుకున్న నాకు సన్నగా నవ్వుతున్న వాడిని చూసి, మతిభ్రమించిందేమోనన్న అనుమానమొచ్చింది.
అలా కొంతసేపు నవ్వాక, నిరత్తరుడినై చుస్తున్న నావైపు తిరిగి, "ఏంటిరా! పిచ్చెక్కిందనుకుంటున్నావా? ఇలారా." అని చేతిసైగతో కుర్చీచూపించి మొదలెట్టాడు. "మొదటిబిడ్డ పుట్టినప్పుడు తన స్థితి నాకు కాక నీకొక్కడికే తెలుసు. తనను చెరిచిన వాడిని తనచేతుల్తో చంపించినా, తనని ఈ ప్రపంచంలోకి తీస్కుని రావడానికి రెండేళ్లు పట్టింది. వాడికి పుట్టిన ఆ బిడ్డపై ప్రేమచూపడం తనకి కష్టమైపోయింది. మళ్లీ మా ఇద్దరికీ మరో సంవత్సరానికి రెండో వాడు పుట్టేదాక అలానే ఉంది. ఆ తర్వాత మెల్లిగా పసికందు చేసిన తప్పుఏం ఉంటుందని దగ్గరకుతీసింది. ఇద్దరినీ సమానంగా చూడటం మెదలెట్టింది, మంచిబుద్ధులు నేర్పింది. ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మిత్రుల్లా కలిసిపోయారు. పదేళ్ల తర్వాత మూడు నెలలక్రితం ఇంటికివచ్చారు. మరుసటివారంలో మల్లన్న కూతురు ఆత్మహత్య చేస్కుంది కారణం తెలీక అందరం బాధపడ్డాము. ఇంకోవారం తర్వాత మరో అమ్మాయి శవం ఊరిచివర పొదల్లో దొరికింది. ఎవరో అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. ఆ తర్వాత కొన్ని రొజులకే మళ్లీ ఉద్యొగాలకి వెళ్లిపోయారు. మన ఇంట్లో పనిచేసే అనాధ పిల్లకూడా కనిపించకుండా పోయింది.
నాకు అనుమానం రావడం మొదలయ్యింది. వారు వెళ్లాక మళ్లీ ఎటువంటి ఇబ్బందీ రాలేదు. హఠాత్తుగా ఒకరోజు నా ప్రాణం ఇంటివెనుక కూలపడిపోయింది. ఆ రోజునుంచి తన ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. ఈలోపు నేను అనుమానపడ్డ విషయం నిజమని తెలిసింది. కానీ ఆ స్థితిలో తనకు చెప్పలేకపోయా. చివరిరోజు నన్ను దగ్గరకు పిలిచి, 'నేనారోజే పోవలసింది' అని కన్నీళ్ళు పెట్టుకుంది. అప్పుడు అర్ధంఅయింది. నిజం నాకన్నా తనకే ముందు తెల్సిందని, ఆ నిజాన్ని ఆ బలహీన హృదయం తట్టుకోలేకపోయిందని." ఊపిరిపీల్చుకోవాలన్నట్టు కాసేపాగాడూ.
నేను తేరుకోలేకపోతున్నా. బిడ్డలు పైకి రాకపోయినా తల్లిదండ్రులు సహిస్తారు కానీ, ఆ బిడ్డలవల్ల ఇతరులు బాధపడితే వారి పెంపకానికే అవమానంగా భావిస్తారు. నా చేతులు పట్టుకుని, "తులసికోటలో ఉన్నంతమాత్రాన, మట్టిలో కలుపుమొక్కలు పెరగలేవని అనుకోవడం తప్పని తెలిసింది." అని నీరునిండిన కళ్లతో వివరించాడు.
"వాళ్లముఖాలు మళ్లీ ఈ ఊరిలో చూపడం ఇష్టంలేక, తను మరణించేదాక చెప్పలేదు వాళ్ళకి. ఈ ఊరు నాకు అమ్మలాంటిది. చిన్నతనంలో అమ్మ పోయిన లోటు తెలీకుండా చేసింది ఈ ఊరిలోని ప్రతి గడప. చివరికి నా భార్యను తన అమ్మలా స్వీకరించి, తల్లికి ఏ కష్టం లెలీకుండా పంటిబిగువున బాధ భరించింది. ఆ ప్రేమను నా భార్య ప్రాణంతో పూజించింది. కానీ తను ఏ కన్నీటితో ఈ ఇంట్లో అడుగుపెట్టిందో, ఆ కన్నీటితోనే నన్ను విడిచిపోయింది. ప్రాణంలా ప్రేమించిన నాకు తను చెప్పిన చివరి పదం 'క్షమించు' అని. దీనికోసమా నేను బ్రతికిఉంది?" కుర్చీలోంచి లేచాడు బసివిరెడ్డి. మెల్లగా ఇంట్లోకి దారితీసాడు, నాకు దారిచూపుతూ. వెనుకనుంచి చూస్తేఇదివరకటి గాంభీర్యం స్థానంలో, మనసు మాయమైన ఒంటరితనం కనపడింది. తను గడప దాటుతుండగా నా నోరు మెదిలింది. "వాళ్ళు చేసిన అన్యాయాలకు దైవం సరైన శిక్ష విధించింది." అనే పేలవమైన మాటే బయటపడింది.
ఆగి భుజంమీదుగా తల వెనక్కుతిప్పి ఎర్రటి కళ్ళతో నన్నుచూశాడు బసివిరెడ్డి. "దైవం ధర్మం పట్టించుకున్నా లేకున్నా, నరుడే న్యాయం చెయ్యాలి. అయినా కాలుజారి కిందపడటానికి వారేమైనా పదేళ్ల పసికందులా, పాతికేళ్ల రాక్షసులు".
***

No comments:

Post a Comment

Pages