అదిగో నవలోకం - అచ్చంగా తెలుగు
 అదిగో నవలోకం
లక్ష్మీ మురళి 

సీత ఒద్దిక, సంస్కారాలతో పెరిగిన సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా అబద్ధం చెప్పకూడదు, ఎవరికీ చెడు చేయకూడదు అని చిన్నప్పటి నుంచీ ఉపాధ్యాయులు కూడా అయిన తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఇప్పటికీ చెవుల్లో గింగిర్లు తిరుగుతుంటాయి.కష్టపడి చదివి, తల్లిదండ్రుల ఆదర్శాలను పుణికి పుచ్చుకుని ప్రభుత్వ టీచర్ గా  సెలెక్ట్ అయి,పాతికేళ్ళ సర్వీసు కూడా పూర్తి చేసుకుంది ఎక్కడా డ్యూటీ విషయంలో మచ్చ లేకుండా,విలువల విషయంలో రాజీ పడకుండా.
ఈ మధ్యలో ఇంట్లో పిల్లలని చూసుకోవడం, స్కూల్ పిల్లలను తీర్చిదిద్దడం,పనిమనిషి పని కూడా తనే చేసుకోవడం జీవన యంత్రం గిర్రున తిరిగిపోయింది.ఈమధ్య కొన్ని ఆరోగ్య సమస్యలు రావడం, వాళ్ళాయన శ్రీరామ్ కి దూరంగా ట్రాన్స్ఫర్ అవడం ఉద్యోగం కాస్త కష్టమనిపిస్తోంది.వాలంటరీ ఇచ్చి, శ్రీ రామ్ దగ్గరకు వెళ్ళిపోమని పిల్లలు కూడా ఒకటే గొడవ. ఇప్పట్నుంచీ ఖాళీగా ఉంటే ఏం తోస్తుందంటే,ఆన్లైన్ జాబ్ లేదా ట్యూషన్స్ చెప్పడం ఏదొకటి చేయొచ్చులే అంటుంది కూతురు.
"నేటి బాలలే రేపటి పౌరులు" అన్న నినాదం మెదడులో నిక్షిప్తమై పోవడం వలనో ఏమో,పిల్లలెవరైనా చెడు మార్గంలో వెళ్తుంటే సహించలేకపోయేది సీత.
పాఠశాలలో చూస్తే,ఒకటో తరగతి పిల్లలు కూడా కాసేపు రాయిస్తే ఇంటికెళ్ళి కంప్లైంట్,మర్నాడే వాళ్ళ పేరెంట్స్ రావడం, మా బాబు సున్నితమండీ.వాడేం చేసినా మాట్లాడటానికి వీల్లేదు. మరోసారి ఇలా జరిగితే మీపై కంప్లైంట్ ఇస్తాం అని పిల్లవాడి ఎదురుగానే సీతకి బెదిరింపు. ఇంటికెళ్ళి వాళ్ళాయనతో గోడు వెళ్ళబోసుకుంది,"పిల్లల గురించి నేనింత ఆలోచిస్తుంటే, నన్నలా పిల్లల ముందే చులకన చేశారు" అని. "మిగతా టీచర్లు కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు కదా చూసీచూడనట్లు వెళ్తే సరి"అని వాళ్ళాయన బుజ్జగింపు.మరోరోజు ఇంకో కంప్లైంట్. పెద్దలు కాల్చిన సిగరెట్ ముక్కలు వీళ్ళు కాలుస్తున్నారుట.అదో పెద్ద గొడవైపోయింది.
ఒక టెర్మ్ ఐదేళ్లు హైస్కూలు లో వేశారు.హమ్మయ్య అనుకుంటే అక్కడకి వెళ్తూనే తెలిసింది.ఎనిమిదో తరగతి లో ఒక చైన్ బ్యాచ్ లాంటిది ఉందనీ,వాళ్ళెవరి మాటా వినరనీ,వాళ్ళతో పెట్టుకోవద్దనీ మిగతా టీచర్ల సలహా.అంతటితో ఆగక,సీత కంటే ముందు నుంచీ పనిచేసే పెళ్ళికాని బయాలజీ టీచర్ కుమారిని సాయంత్రం బస్టాండ్ వరకూ వెంటపడేవాడు ఆ గ్యాంగ్ లీడర్. సహజంగా విలువలకు ప్రాణమిచ్చే,కాస్త మొండిఘటమైన సీతకి ఇది ఎంతమాత్రం కొరుకుడు పడలేదు. ఎండాకాలం అవడంతో మర్నాడు తెల్ల కాటన్ చీరతో స్కూల్ కి వెళ్ళిన సీతని "వైట్ అండ్ వైట్ లో సూపర్ గా ఉన్నారు మేడం"అన్నాడా గ్యాంగ్ లీడర్. ఇదే సమయమనుకుని వాడిని నిలబెట్టి, ఆ పీరియడ్ అంతా క్లాస్ పీకి,నాలుగు లెక్కలు అడిగింది. ఏం చెప్తాడు?"నీకెంతో తెలివి, ధైర్యం ఉన్నాయి.వాటిని చదువు,మంచి పనులకుపయోగించు" అని చివర్లో కాస్త మంచిగా,కొంత వార్నింగ్ గా ఇచ్చి బయటికొచ్చింది సీత.
వాడికి రాజకీయ పలుకుబడి కూడా ఉండడంతో అందరూ భయపడి వాడికెదురు చెప్పేవారు కాదు. తర్వాత మ్యాథ్స్ క్లాస్ లో భయంగా ఉన్నా, బయాలజీ టీచర్ కుమారిని వేధించడం మాత్రం ఆపలేదు. ఒకరోజు కుమారి స్టాఫ్ రూమ్ లో ఏడుస్తూ కూచుంది.ఆరోజు సీత బయాలజీ పీరియడ్ తనే తీసుకుని,ఎవరేం చేసినా తర్వాత చూద్దామనే మొండి ధైర్యంతో వాడిని ఈ విషయం ఎత్తకుండా అందరినీ ఉద్దేశించి అడిగినట్లు "హోంవర్క్ చేయని వాళ్ళు బెంచీ ఎక్కండి" అని ఆర్డర్ వేసింది సీత.తప్పక అందరితో పాటూ బెంచీ ఎక్కాడు.అప్పుడు ఒక నీతి కథ చెప్పి, కుమారి టీచర్ గురించి మాట్లాడింది.అసలే మొదటి సారి బెంచీ ఎక్కడం సిగ్గుతో తలవంచుకున్నాడు.తర్వాత ఆ కంప్లైంట్ లేకపోవడంతో పాటు రోజూ ఏదో ఒక నీతి కథ చెప్పి,పాఠంలోకి వెళ్ళడంతో నెమ్మదిగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాసాగింది.
పిల్లలు చిన్న వయసునుంచే ఇలా తయారవ్వడం వాళ్ళకి తల్లిదండ్రులు,కొందరు టీచర్లు, రాజకీయ నాయకులు కూడా సపోర్టివ్వడం ఇవన్నీ మనసును కలచివేస్తుండగా ఇల్లు చేరుకున్న విషయం కూడా తెలీలేదు.పక్కింటి దేవిశ్రీ పలకరిస్తే ఈ లోకంలోకొచ్చింది. దేవీవాళ్ళ అక్క కొడుకు ఈమధ్యే ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళక్క వాణ్ణి ఎప్పుడూ పట్టించుకునేది కాదుట.
దేవిశ్రీ పిల్లల్ని పలకరించి,తాళం తీసి లోపలికెళ్ళి,ఫ్రెష్ అయి,"రేపు ఆ గ్యాంగ్ లీడర్ తనపై ఏ రాజకీయ నాయకుడికి కంప్లైంట్ ఇస్తాడో ఏంటో?" అని ఆలోచిస్తూ కూర్చుంది. ఎంత బింకం ప్రదర్శించినా తనూ ఆడదే కదా.
మర్నాడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎదురింటి వరలక్ష్మమ్మ గారు"సాయంత్రం ఒకసారి ఇంటికి రావే" అని ఉదయం చెప్పడం గుర్తొచ్చింది.ఇంట్లోకెళ్తే పనితో సరిపోతుందని బయట కుళాయి దగ్గరే కాళ్ళు కడుక్కొని వరలక్ష్మి గారింటికి వెళ్ళింది సీత.వద్దన్నా, బలవంతంగా ఆవిడ వణికే చేతులతో కలిపిచ్చే టీ తాగి "ఆరోగ్యం ఎలా ఉందండీ?"అంది ఆవిడేమైనా చెప్తారేమోనని.వరలక్ష్మి గారికి ఒక్కడే కొడుకు నరేష్. అతి గారాబంగా పెంచడంతో మూర్ఖంగా తయారయ్యాడు. ఎలాగో చదువు మాత్రం అబ్బి,సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు బెంగుళూరులో.కొడుకే లోకంగా బ్రతికి, వీళ్ళ పెన్షన్ డబ్బులు కూడా నరేష్ అకౌంట్ కే కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఇద్దరూ హార్ట్ ఆపరేషన్లు అయి,ఏమాత్రం చేసుకోలేకపోతున్నారు.పోనీ, ఏదైనా ఆశ్రమం లో చేరమని సీతలాంటివాళ్ళు సలహా ఇస్తే, "వాడికి పూర్తిగా దూరమైపోవడమే కదే"అంటారు. ఎప్పటిలాగే వాళ్ళ గోడు విని ఒక నిట్టూర్పు విడిచి,ఇంత గుడ్డి ప్రేమ వల్లే కదా కొడుకు అలా తయారయ్యాడు అనుకుంటూ ఇల్లు చేరింది సీత.
మొదటి సారి టెన్త్ ఇన్విజిలేషన్ డ్యూటీ వేస్తే ఎంతో ఆనందంగా వెళ్ళింది సీత.పరీక్ష మొదలైనప్పట్నుంచీ అందరూ పక్కవాడిని కాపీ కొట్టాలనే ఆలోచనే."సంవత్సరం నుంచీ ఎందుకు చదవలేదురా?"అంటే, "మా సీనియర్లు చెప్పారు మేడం, బిట్ చూసి రాసేస్తే పాసైపోతారని".వాళ్ళ సమాధానం.బిట్ రాయనిస్తే వీళ్ళు తర్వాత వాళ్ళకీ అదే చెప్తారు కదా అని బాగా స్ట్రిక్ట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసి బయటికొచ్చింది సీత తృప్తిగా. మళ్ళీ ఇంటికొస్తూ ఇదే ఆలోచన... ఎందుకీతరం నిజాయితీ, విలువలు లేకుండా ఉందని.
కొన్ని రోజుల తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు అరుణ హైదరాబాద్ నుంచి సీతకి ఫోన్ చేసింది,"అర్జంటుగా నీతో మాట్లాడాలే.నీతో చెప్పుకుంటే నాకు కాస్త సాంత్వన దొరుకుతుంది. కానీ, ఫోన్ లో మాట్లాడలేను."అంది. "ఎలాగూ వైజాగ్ లో ఒక పెళ్లి ఉంది బంధువులది,అప్పుడు వచ్చినప్పుడు కలుస్తాలే"అని మాటిచ్చింది సీత.అరుణ,వాళ్ళాయన బ్యాంకు ఉద్యోగస్తులు. వాళ్ళకి ఇద్దరబ్బాయిలు.ఎప్పుడూ పిల్లలని పట్టించుకోకుండా ఫ్రెండ్స్, పార్టీలని తిరిగేవారు.కొంత వయసొచ్చాక,వాళ్ళు ఎక్కడ తిరుగుతారో,ఇంటికెప్పుడు వస్తారో కూడా తెలియని పరిస్థితి. ఇంట్లో అరుణ నల్లపూసలు చిన్నవాడు దొంగతనం గా పట్టుకెళ్ళి అమ్మేశాడని తెలిశాకగానీ, వీళ్ళకి అర్థం కాలేదు. ఎప్పటికప్పుడు సీత హెచ్చరిస్తూనే  ఉన్నా,"మా పిల్లలు సిటీలో పెరిగారు కదా. ఇండివిడ్యువల్ గా పెంచాం.నువ్వు మరీ పిల్లల్ని చాదస్తంగా పెంచుతావే సీతా"అని తనకే నీతులు చెప్పేది.పెళ్లి తర్వాత అరుణ ఇంటికి వెళ్ళింది సీత.సీతని చూడగానే భోరుమని ఏడుస్తూ, జరిగినదంతా చెప్పింది.వాళ్ళ పెద్దవాడు డ్రగ్స్ కి అలవాటు పడ్డాడని, పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చి వీళ్ళ మొహాలు చూసి వదిలిపెట్టారనీ,ఊర్లో అందరూ ఎంతో గౌరవించేవారే మమ్మల్ని ఇప్పుడు వెలి వేసినట్లు చూస్తున్నారనీ,ఈ విషయం బంధువులకి కూడా చెప్పుకోలేననీ సారాంశం."చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏంలాభం?ముందు వాడిని ఈ స్నేహితుల సావాసం నుంచి తప్పించాలి.కోనసీమ లోని వాళ్ళ అమ్మమ్మ ఊరికి పంపేసి,ఓ మూడు నాలుగేళ్ళు అక్కడే చదివించండి.తర్వాత నెమ్మదిగా నచ్చజెపుదాం."అని తోచిన సలహా ఇచ్చి సాయంత్రం ప్రయాణం ఉండడంతో క్యాబ్ బుక్ చేసుకుని బయల్దేరింది.
ఇంటికి వచ్చిన దగ్గర నుంచీ ఒకటే ఆలోచన. బళ్ళో ఇన్ని పాఠాలు, నీతులు చెప్తున్నా, పల్లెటూర్లలో వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం పిల్లలను మారనివ్వటం లేదు. అందరు ఉపాధ్యాయులూ పిల్లలకు మోరల్ వేల్యూస్ చెప్పటంలేదు.ప్రైవేట్ పాఠశాలలైతే మార్కులే పరమావధిగా పిల్లల్లోని ఇతర టాలెంట్ లను బయటికి తీయటం లేదు. ఇక బాగా చదువుకుని,
ఉన్నతోద్యోగాలు చేసేవారు కూడా బయటకెళ్ళిన పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవడం.ఇక డబ్బు, రాజకీయ పలుకుబడి ఉండేవారి పిల్లలు సరేసరి.సీతకి చాలా బాధగా ఉంది,"మొక్కై వంగనిది మానై వంగునా"అనుకుని,ఇందరు పెద్దలని మనం ఒక్కరం మార్చలేం. పిల్లల్లోనే మార్పు తేవాలని అనుకుంటూ,ప్రయాణ బడలిక,ఆలోచనలతో అలసిన శరీరం ఎప్పుడు నిద్రపోయిందో కూడా తెలీలేదు.
ఉదయం లేస్తూనే శ్రీరామ్ కి ఫోన్ చేసి చెప్పింది సీత,వచ్చే నెల నుంచీ ఉద్యోగం మానేస్తానని.భరించలేని నడుం నొప్పి, స్పాండిలైటిస్ తో సతమతమవుతూ కూడా ఎంత చెప్పినా ఉద్యోగం ససేమిరా మాననన్న భార్య మాటలు సంతోషాన్నీ,కొంత ఆశ్చర్యాన్నీ కూడా కలిగించాయి శ్రీకాంత్ కి.
పదవీ విరమణ చేసిన ఆరు నెలల తర్వాత తన స్నేహితురాలు,పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉద్యోగం రాని వాణితో కలసి,భర్త శ్రీరామ్ సహకారంతో 'అదిగో నవలోకం' పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి,మూడు ప్రాథమిక పాఠశాలలను దత్తత తీసుకుని,రోజూ ఓ గంట వెళ్లి, అక్కడి పిల్లలకు నీతి కథలు, ఆటపాటలు,వారానికొక దేశభక్తి గీతం నేర్పడంతో పాటు చదువు విలువ తెలియజెప్తూ,వారానికో మంచి మార్పు కనబరచిన పిల్లలకు బహుమతులిస్తూ ఎంతో మార్పు తీసుకొచ్చింది సీత.ఇప్పుడు ఆ సంస్థలో నిరుద్యోగినులైన స్త్రీలు 30 మందికి తన పెన్షన్ డబ్బులను జీతంగా ఇస్తూ మండలంలోని పాఠశాలలన్నిటినీ దత్తత తీసుకుంది.
ఆరోజు డీయీవో గారు ముఖ్య అతిథిగా హాజరై,ఎంఈవో గారు, మండలంలోని ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు తనకు చేస్తానన్న సన్మాన ఖర్చు మొత్తాన్ని 'అదిగో నవలోకం' లో తనకు సహాయపడుతున్న తన సంస్థ సభ్యులకోసం ఒక ట్రస్ట్ నెలకొల్పి ,ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. తన తదనంతరం కూడా నవతరం ముందుకు నడవాలనే ఉద్దేశ్యంతో.
"మనం వెళ్ళేటప్పుడు మంచి విత్తనాలు జల్లుకుంటూ పోతే,వచ్చేటప్పుడు అవి తీయని ఫలాలిచ్చే వృక్షాలవుతాయి".అని తృప్తిగా ఇల్లు చేరింది సీత.కోడలు ఆప్యాయంగా వడ్డించిన భోజనం చేసి, హాయిగా నిద్రపోయిందారోజు.
***
          

No comments:

Post a Comment

Pages