తెలుగువారి విశిష్ట పండుగ ''సంక్రాంతి ''! - అచ్చంగా తెలుగు

తెలుగువారి విశిష్ట పండుగ ''సంక్రాంతి ''!

Share This
తెలుగువారి విశిష్ట పండుగ ''సంక్రాంతి ''!
-సుజాత. పి.వి. ఎల్. సంక్రాంతి మూడురోజుల పండుగ. మొదటి రోజును 'భోగి 'అని, రెండో రోజును 'మకర సంక్రాంతి 'అని, మూడో రోజును 'కనుమ' అని పండుగను జరుపుకుంటారు. మకరసంక్రాంతిని 'తిల సంక్రమణం', 'పంటల పండుగ', 'ఆమని పండుగ', 'అల్లుళ్ళ పండుగ', 'జానపదుల పండుగ' వంటి పేర్లతో పిలుస్తారు.
మొదటిరోజు భోగి. భోగినాడు తెల్లవారుజామున స్నానానంతరం ప్రతి ఇంట ముంగిట భోగి మంటలు వేస్తారు. ఈ మంటలలో నెలరోజుల ముందు తయారు చేసుకుని ఎండబెట్టుకున్న భోగి పిడకలు, పనికిరాని వస్తువులను వేసి, పీడ తొలిగిందని సంతోషిస్తారు. ఇలా పాతవస్తువుల్ని మంటలో వేయడం వెనుక ఒక పరమార్థం ఉంది. ''పాతకు వీడ్కోలు కొత్తకు స్వాగతం!'' అని అర్థం.
రెండో రోజు మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని 'మకర సంక్రాంతి' అంటారు. ఉదయాన్నే మేల్కొని సున్ని పిండిని ఒంటికి పట్టించి తలంటు స్నానం చెయ్యాలి. ఈ మకర సంక్రాంతి రోజున తినే కూరగాయల్లో గుమ్మడి కాయను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఎదుకంటే గుమ్మడి వాతాన్ని హరిస్తుంది. సంక్రాంతి పండుగ రోజుల్లో చలి వాతావరణానికి అనువుగా గుమ్మడి కాయను ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యరీత్యా చాలా మంచిది.
మూడో రోజు కనుమ. ఇది రైతుల పండుగ. పాడిపంటలనిచ్చే పశువులను, పశువుల కొట్టాలను శుభ్ర పరచి గోవులను అలంకరించి భక్తి శ్రద్దలతో పూజించడం జరుగుతుంది.
'సంక్రాంతి' అంటేనే ఒక కొత్తదనానికి స్వాగతం పలికే శుభతరుణంగా పేర్కొనవచ్చు. ఏడాదికొకసారి వచ్చే మకరసంక్రాంతి తెలుగువారి విశిష్ట పండుగ. అన్ని పండుగల మాదిరిగానే ఈ పండుగకు కూడా కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆంగ్ల సంవత్సర ప్రారంభంలోనే వచ్చే మొట్ట మొదటి తెలుగు పండుగ.
దక్షిణాయనానికి స్వస్తి పలికి పుణ్య కాలమైన ఉత్తరాయణానికి స్వాగతం చెప్పే పండుగ సంక్రాంతి. ఆ రోజు నుంచే మంచి రోజులకు శ్రీకారం.
సర్వ సంహారక శక్తికి మూల పురుషుడు సూర్యుడు. సూర్యుని భ్రమణ విభ్రమణాలను బట్టి కాలగణన జరుగుతుంది.
సూర్యుడు పన్నెండు రాశులలో సంచరించే సంక్రమణాలను బట్టి ఒక్కో నెల ఏర్పడుతుంది. ఇలా సూర్యుడు ప్రతిరాశిలో ప్రవేశించే ప్రతి సమయాన్ని సంక్రాంతి అనవచ్చు. కాకపొతే, వాటిని 'మాస సంక్రాంతు'లంటారు. ఇవి నాలుగు రకాలు. 'ఆయన సంక్రాంతులు', 'విషువస్సంక్రాంతులు', 'షడశతి సంక్రాంతులు', 'విష్ణుపద సంక్రాంతులు'. ఇందులో విచిత్రమేమిటంటే, ఆంగ్లవత్సరాది తేదీలననుసరించి సూర్య సంక్రమణాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక తేదీన జరుగుతూ ఉంటాయి. అయితే, ప్రతి సంవత్సరం ధనుస్సంక్రమణం డిసెంబర్ నెల 16వ తేదీనే జరుగుతుంది. అలాగే మకర సంక్రమణం జనవరి 14వ తేదీన జరుగుతుంది. ఇందులో ఎటువంటి మార్పూ ఉండదు. అందుకే సర్వ సాధారణంగా సంక్రాంతి జనవరి 13,14,15 తేదీలలోనే వస్తుంటుంది.
ఈ సంక్రాంతి పండుగను 'ఉత్తర సంక్రాంతి', 'మహా సంక్రాంతి' అని కూడా వ్యవహరిస్తారు. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలో ప్రవేశించే సమయం అత్యంత సూక్ష్మoగా ఉంటుంది. అది గ్రహించడం సాధ్యం కాదు. మనిషి కనురెప్ప వేయడానికి పట్టేకాలంలో 30 వ భాగానికి 'తత్పర' అని పేరు. 'తత్పర'లో నూరవ వంతును 'తృటి' అంటారు. ఆ 'తృటి' లో వందోవంతు కాలంలో సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ కాలాన్ని కనిపెట్టడం అసాధ్యం. అందుచేతనే సంక్రమణానికి కొన్ని ఘడియలు అటు, కొన్ని ఘడియలు ఇటు పుణ్య కాలంగా పరిగణిస్తారు. (కొన్ని ఘడియలు అంటే కాలమాన గణాంకాల ప్రకారం ఇక్కడ పదహారు ఘడియలు).
సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలు, యువతీ యువకులు గాలిపటాల సంబరాలు మొదలవుతాయి. పండుగకు ముందు నుండే ఆకాశంలో పగటి నక్షత్రాల్లా పతంగులు విహరిస్తుంటాయి. గాలిపటాలను ఎగురవేసే ఆచారం చాలా కాలంగా వస్తోంది. ఒకప్పుడు ఇది గ్రామీణ క్రీడగానే ఉన్నా, ఇప్పుడిది నగరాల్లోనూ, పట్టణాల్లోనూ పతంగాల విహంగం అధికమయ్యాయనే చెప్పాలి. ఈ పతంగులు ఎగరేయడంలో పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
మిగిలిన అన్ని పర్వ దినాల మాటెలా ఉన్నా ఈ సంక్రాంతి తెలుగు ఆడపడుచుల పండుగలా అభివర్ణించవచ్చు. ధనుర్మాస ప్రారంభం నుండే తెలుగు వాకిళ్లు పండుగ సంబరాల్ని సంతరించుకుంటాయి. మామిడి తోరణాలతో, గడపలకి పసుపు కుంకుమలద్ది, పూల దండలతో ఇంటి గుమ్మాలని శోభాయమానంగా అలంకరిస్తారు. ప్రతి ఇంటి ముంగిట రంగు రంగుల రంగవల్లికలు, తివాచీలు పరిచినట్లుండే ఆ ముగ్గుల్లో తీర్చి దిద్దినట్టుండే గొబ్బెమ్మలు, బంతిపూల అలంకరణలు, డూ..డూ బసవన్నలు, గంగిరెద్దుల ఆటపాటలు, హరిదాసు కీర్తనలతో కళకళలాడుతూ 'సంక్రాంతి లక్ష్మి'కి ప్రతి గుమ్మం స్వాగతం పలుకుతున్నట్లుంటుంది.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సంక్రాంతి నాడు 'నాస్తి' (అనగా 'లేదు') అనేమాట రాకుండా దానం చేయాలని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. స్త్రీలు మాంగల్యాభివృద్ధికి పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, బెల్లo, నువ్వులు, బట్టలు దానమివ్వాలని పురాణాల్లో తెలుపబడింది.
''తస్యాం కృష్ణ తిలైస్నానం కార్యంచోద్వర్తవంశభై:
తిలాదేయాశ్చ విప్రేభ్యో: సర్వదేవత్తరాయణే
తిలతైలేన దీపాశ్చ దేయాశ్శివగృహే శుభా: "
ఇంకా ఈ పండుగ రోజున మామూలు తర్పణాలే కాకుండా పొంగలి, నువ్వులు, కొత్త బెల్లం,చెరకుగడలు దానం ఇస్తే ఎంతోశుభం. వ్రతచూడామణి (ఘటం)లో మజ్జిగను చిలికి, దానిని వెన్న మీగడలతో పాటు ఘట సహితంగా దానమివ్వాలని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది.
ఇంతటి ప్రాశస్త్యం గల సంక్రాంతి పండుగ తెలుగువారికే సొంతం అవడం ఎంతో గర్వకారణం.!
******

No comments:

Post a Comment

Pages