నాకు నచ్చిన నా కథ - నీలాగ ఎందరో...!!! - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కథ - నీలాగ ఎందరో...!!!

Share This
నాకు నచ్చిన నా కథ - నీలాగ ఎందరో...!!!
కొత్తపల్లి ఉదయబాబు 

ఆర్. టి. సి. బస్సు కాంప్లెక్స్ లో బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాను. నేను పాలకొల్లు నుంచి తాడేపల్లిగూడెం వచ్చి పదినిముషాలైంది.

oపూళ్లలో మా బ్రాంచ్ కి వెళ్ళాలి. అందుకోసం ఏలూరు పాయింట్ లో బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. 
''సార్. మీకు అన్ని రకాలైన బుక్స్ నాదగ్గర లభిస్తాయి సర్. బుక్స్ సర్ బుక్స్'' అంటూ ఒక ముసలాయన నా దగ్గరకు వచ్చాడు.
నేను ఆయనను పరిశీలించాను. 
మాసిపోయి అక్కడక్కడా చిరుగులు కనిపిస్తున్న ఖద్దరు పంచె, జబ్బలు దగ్గర కుట్లు విడిపోయి భుజాలు కొద్దిగా కనిపిస్తున్న లాల్చీ , మేడలో నవ్వారు పట్టీని దండ గా ధరించి దానికి పాతకాలం చెక్క టేబుల్ సొరుగును వేలాడ దీసి అందులో రకరకాల పుస్తకాలు దొంతరలు దొంతరలుగా అమర్చి చేతిలో రెండు పుస్తకాలు పట్టుకుని ప్రపంచంలోని ఆశ నంతటినీ కళ్ళల్లోకి పోగేసుకుని ఆతృతగా ఎదురు చూసాడు. 
''ప్లీజ్ సర్. ఒక్క రెండు పుస్తకాలు కొనండి సార్. ప్లీజ్.'' నన్ను ప్రాధేయపడ్డాడాయన.
''చూడండి నాన్నగారు, నాకు సాహిత్యం అంటే విపరీతమైన అభిమానం. అయితే ఉదయం లేచినదగ్గరనుంచి క్యాంపులు లేదా ఆఫీస్ వర్క్. ఇలా ప్రయాణాలలో ఎదో ఒక వార్తాపత్రికో, మాసపత్రికో కొని పది పేజీలు చదవకముందే ఏదో పని తగులుతుంది. అంటే ఆ పుస్తకం ఇంట్లో పడేస్తాను. మా ఇంట్లో ఎవరికీ పుస్తకాలు చదివే అలవాటు లేదు. దాంతో ఇంటినిండా పుస్తకాలు పేరుకుపోయి ఇంట్లో ఆడవాళ్లు పచ్చ గడ్డి పెట్టేస్తున్నారు. నాకేమో సర్దడానికి టైం ఉండదు. అలా అని ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కుని కేజీకి రూపాయి చప్పున అమ్మేస్తుంటే గుండె పిండేసినట్టు అవుతుంది నాకు.
నా కష్టార్జితం అలా దుర్వినియోగం అవుతున్నందుకు కాదు సర్. ఒక పుస్తకం అలా తయారవ్వడానికి ఎందరి సమిష్టి కృషో అవసరం.పత్రిక స్థాయిని నిలబెట్టడానికి రచయితలూ ఏంటో శ్రమించి రాయాలి.వారికి పత్రికాధిపతులు సజావుగా పారితోషకం అందించే స్థాయి లో ఉండాలి. దానిని ఎంతో పకడ్బందీగా ఎడిటింగ్ చేసి అందంగా ప్రచురించి మార్కెటింగ్ చేయగలగాలి. ఇంతాచేస్తే చివరకు అమ్మేవాడికి పుస్తకానికి రూపాయి మిగిలితే గొప్పే. ..''
ఇంకా ఏదేదో చెప్పబోతున్నాను. 
మరోసారి చెప్పండి బాబూ. ...'' అన్నాడాయన మార్దవం నిండిన కళ్ళతో. 
ఆయన తత్తరపడ్డాడు. 
''అది కాదు బాబూ. మొదట్లో మీరు నన్ను అదేదోలా పిలిచారు.''
''ఓ. అదా..నాకు వూహ వచ్చిన రోజుల్లో మా నాన్నగారు పోయారు.ఇంగిలీషు చదువులు చదివిస్తున్నా''డాడీ'' అంటే ఆయన చిరాకు పడేవారు. ఆప్యాయంగా ''నాన్నగారూ'' అని పిలవడం నేర్పారు. ఆలా పిలిస్తే పెద్దల ఎదుట గౌరవం తో పాటు తండ్రి మాటకు చక్కని విలువ ఇస్తారని - ఆయన అభిప్రాయమన, నేను తండ్రినయ్యాకా తెలిసింది. ఇది నా స్వంత అభిప్రాయం అనుకోండి. అప్పటినుంచి వయసులో వృద్ధులైన మీ లాంటి పెద్దలను'నాన్నగారూ'అని పిలవడం అలవాటు చేసుకున్నా..నాన్నగారూ.""
నా మాటలు పూర్తి కాకుండానే ఆయన కళ్ళు ఊటబావులై స్రవించసాగాయి. 
నిస్సత్తువగా ఆయన బెంచీ మీద కూలబడ్డాడు. 
నాకు మనసు అదోలా అయిపొయింది. ఆయనను ఎలా ఓదార్చాలో అర్ధం కాక వెర్రిచూపులు చూస్తున్న నాకు ఎడారిలో స్ప్రైట్ డ్రింక్ దొరికినట్టుగా చక్రవర్తి కనిపించాడు. వాడు నా క్లాసుమేట్ . చాలా కాలం తర్వాతనైనా తేలికగానే గుర్తుపట్టాను. 
''ఒరేయ్ చక్రవర్తీ.'' అంటూ గట్టిగా అరిచాను.
వాడు ఇటు తిరిగి నన్ను చూసి విస్తుబోయాడు. 
''ఒరేయ్ ప్రభాకర్. నువ్వు ఇక్కడా...అంటూ ఆనందంగా చేతులు చాస్తూ నావైపు రాబోయినవాడల్లా ఆగిపోయి 'ఒక్క పది నిముషాలలో'వస్తానురా. ఓ ఫ్రెండ్ ను కలవాలి అర్జన్ట్ గా. వాడు ముందు నడుస్తున్నాడు. ప్లీజ్.వెయిట్ చెయ్యి. బస్సు వచ్చినా ఎక్కేయకు.'అంటూనే వడివడిగా అడుగులు వేసుకుంటూ కాంప్లెక్స్ బయటకు వెళ్ళిపోయాడు చక్రవర్తి.
ఇంతలో ముసలాయన సంబాళించుకుని లేచాడు. 
''వస్తాను బాబూ. నాదగ్గర పుస్తకం కొనకపోయినా, లక్షలు విలువ చేసే పదం తో నన్ను పిలిచారు. నాకు చాలా ఆనందం గా ఉంది బాబూ. ''అంటూ లేచి ఆయన మేడలో వేలాడుతున్న టేబుల్ సొరుగును సరిగ్గా అమర్చుకుని '' ఈవేళ్టి మందుబిళ్ల వేసుకునే యోగం లేనట్టుంది.''
అని గొణుక్కుంటూ చేతిలోని పుస్తకాలతో ముందుకు నడవబోయారు.
నేను ఎలెర్ట్ అయ్యాను. 
''ఒక్క క్షణం నాన్నగారు. మందుబిళ్ల వేసుకోవడం ఏమిటి?'' అడిగాను.
''ఏంలేదు బాబు. ఉదయం ఆరింటి నుంచి ఎనిమిది గంటల లోపుగా పుస్తకాలు అమ్మిన డబ్బులతో రెండు ఇడ్లీ తిని, టీ తాగి, మూడు మాత్రలు మింగుతాను. మధ్యాహ్నం రెండింటివరకు అమ్మిన డబ్బులతో వీలయితే భోజనం చేస్తాను. లేదా మల్లి ఇంత టిఫిన్ తిని మూడు మాత్రలు మింగుతాను. రాత్రి ఎనిమిది గంటలవరకు అమ్మగా వచ్చిన డబ్బులతో మళ్ళీ అదే పని చేస్తాను. ఏమీ తినకపోతే మాత్రలు కడుపులో పేగుల్ని మెలి తిప్పేస్తాయి బాబు. ఏవ్ నన్ను బతికించే సంజీవనులు'' అన్నారాయన నిస్సత్తువగా.
ఆయనకు నీరసం ఆవహిస్తోందని నాకు అర్ధమైంది. 
''నేను టిఫిన్ పెట్టిస్తా, రండి నాన్నగారు.''అన్నాను ముందుకు దారి తీయబోతూ.
''వద్దు సర్. బతికినంతకాలం మన కష్టార్జితం తోనే బతకాలి. అదీ న్యాయ బద్ధంగా సంపాదించిన సొమ్ముతోనే -అని ఆలస్యంగా తెలుసుకున్నాను .వద్దులెండి''అంటూ వెళ్లబోయారాయన.
''నేను మీ దగ్గర పుస్తకాలు కొనుక్కొవద్దా?'' అంటూ చనువుగా ఆయన చెయ్యి పట్టి ఆపి ఆపుస్తకాలు పరిశీలించాను.
గుడిపాటి వెంకటాచలం కధలు, కొడవగంటి కుటుంబరావు కధలు, ఆరుద్రగారి కూనలమ్మ పదాలు పుస్తకాలు తీసుకున్నాను. నేను అసలు చదవనివి అవి. కొత్తరంగు పోయి మాపురంగుకు చేరుకున్నాయి. వాటికి డబ్బు ఇచ్చేసాను. 
ఆయన సంతోషంగా కళ్ళకద్దుకుని నమస్కరించబోయి ఆశీర్వదించినట్లుగా చెయ్యి ఊపి వెళ్లిపోయారు. 
ఆయన అటు వెళ్ళాడో లేదో ఇటు చక్రవర్తి ఇంతమొహం చేసుకుంటూ వచ్చి కౌగలించుకున్నాడు. 
నా సంతోషానికి కూడా అవధులు లేకుండా పోయింది. వాడి రాకతో అప్పటివరకు బరువుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా తేలిక పడ్డట్టుగా అనిపించింది. వాడితో కబుర్లలో పడిపోయాను.
*****
''ఏరా ఎంతకాలమైంది రా నిన్ను చూసి. బాగున్నావా? ''అంటూ పలకరింపుగా నా రెండు చేతులు పట్టుకుని అన్నాడు చక్రవర్తి.
''ఒరేయ్. నన్ను...నన్ను... ముందుగా నువ్ క్షమించాలిరా. నీ పుస్తకావిష్కరణ ఫంక్షన్ కు రాలేకపోయాను. నా మిత్రుడు మంచి కధా రచయిత - అని నాకు ఈ మధ్య తరచూ వివిధ పత్రికలలో నీ పుస్తకం మీద సమీక్షలు చదువుతుంటే అర్ధం అయింది.మనం చదువుకునే రోజుల్లో రాసేవాడివి కాదుకదురా? ఎలా అబ్బింది నీకు ఈ అలవాటు?''
నేను వాడి భుజం మీద అరచి పక పక నవ్వాను. 
''చూసావా నువ్వు గుర్తు చేసేవరకు నేనో కదారచయితను అనే విషయమే మర్చిపోయాను. అనుభవం నేర్పిందిరా. మనసులో ఎవరితోనూ చెప్పుకోలేని బాధ కలిగినప్పుడు పేపర్ మీద పెట్టడం అలవాటు చేసుకున్నాను.నా పేరే వ్రాసుకుంటే 'మిమ్మల్ని అంత కష్టపెడుతున్నానా ' అని నా భార్య అడుగుతుందేమో అని పాత్రల పేర్లు మార్చి రాయడం అలవాటు చేసుకున్నాను. దాంతో అది కధ అయ్యేది. ఓసారి సరదాగా ఎదో కధపోటీకి పంపితే మూడవ బహుమతి వచ్చింది. ఆ స్పూర్తి తో కధారచయితనయ్యాను. అన్నట్లు మీ ఫ్యామిలీ విశేషాలేంటి? మీ నాన్నగారు ఎలా ఉన్నారు? ఏమిటి?''
''మా నాన్నగారిని నువ్వు ఎపుడూ చూడలేదు కదరా.''ఆశ్చర్యపోతూ అడిగాడు చక్రవర్తి.
''ఒక్కొక్కరి ఒక్కొక్క పిచ్చిరా. నాకు మా నాన్నగారి పిచ్చి. అందరినీ మీ నాన్నగారు ఎలాఉన్నారు అని అడిగి తిట్లు, చివాట్లూ తింటుంటాను. ''అంటూ ఎదో అనబోయేటంతలో ఏలూరు బస్సు వచ్చి ఆగింది.
''ఒరేయ్ చక్రీ.ఇది నా విజిటింగ్ కార్డ్. అందులో నా ఫోన్ నెంబర్ ఉంది,నీకు ఖాళీ అయినప్పుడు ఫోన్ చేస్తే అన్ని వివరాలు మాట్లాడుకుందాం.ఈ సారి వచినప్పుడు మీ ఇంటికి తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి.సరేనా?''అని వాడికి పర్సు లోంచి విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాను.
''అలాగేరా.''అంటూ నా విజిటింగ్ కార్డ్ ను అందుకుని ''వస్తారా.బై.'' అని వెళ్ళిపోయాడు చక్రవర్తి.
నేను కదులుతున్న బస్ ఎక్కుతూ ముసలాయనకోసం ఆత్రంగా ఆ పరిసరాలన్నీ వెతికాను.ఆయన ఎక్కడా కనపడలేదు.
బస్ బయల్దేరింది.
*****
సుమారు నెలరోజుల తర్వాత -
నాకు ఒక ఉత్తరం వచ్చింది .అందులో ఇలావుంది .
''మాన్యులు గౌరవనీయులు ప్రముఖ కధారచయిత ప్రభాకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు.
నాపేరు ఉమా మహేశ్వరరావు. పుట్టుక తోనే ఆస్థి పరుణ్ణి.ఏకైక కుమారున్ని కావడం తో నన్ను గారంగా పెంచారు.దాంతో స్నేహితులు, వ్యసనాలు పుష్కలంగా నా చుట్టూ చేరాయి. వివాహం చేస్తే మారతాననే ఉద్దేశంతో పెళ్లి కూడా చేసారు. ఈలోగా నేను వెలగబెట్టిన డిగ్రీ తో మా నాన్నగారు ఓ గవర్న్మెంట్ ఉద్యోగం కూడా వేయించారు.
పెళ్లి అయింది. ఎంత కాలానికి సంతానం కలగలేదు నాకు. నా భార్య సలహాతో తన తమ్ముడి కొడుకుని దత్తత తీసుకుని పెంచడం మొదలుపెట్టాను. ఎవరో ఇంటి పిల్లవాడు నా ఇంట్లో పెరగడం నా అసమర్ధత గా భావించి వెక్కిరించడం మొదలుపెట్టారు స్నేహితులు.
ఆ ప్రయత్నంలో నన్ను చేతబడి చేయించే వాడి దగ్గరకు తీసుకు వెళ్ళారు. ఎవరైనా ఎనిమిదేళ్ళ బాలుణ్ణి బలి ఇస్తే నా భార్యకు నా వల్ల సంతానం కలుగుతుందని ఆటను ఇచ్చిన సలహా మేరకు పక్కింటి వారి అబ్బాయిని ఎవరూ లేని సమయం చూసి కిడ్నాప్ చేసి చేతబడి వాడికి అప్పగించాను.అతను నా ముందే ఆ పిల్లవాడిని క్షుద్రదేవతకు బలి ఇచ్చాడు. సరిగ్గా ఆ కార్యక్రమం పూర్తీ అయింది అనుకున్న సమయంలో పోలీసులు వచ్చి నన్ను అతన్ని సాక్ష్యాధారాలతో సహా అరెస్ట్ చేశారు.సలహా ఇఛ్చిన స్నేహితులెవ్వరూ కనీసం పరామర్శకు కాదు కదా కన్నెత్తి చూడలేదు. నా ఉద్యోగం పోయింది. జైలు శిక్ష పడింది. కేవలం కిడ్నాప్ చేసిన నేరానికి ఏడు సంవత్సరాలు కారాగార శిక్ష అనుభవించి బయటకు వచ్చాను.
జైలు లో నాకు జ్ఞానోదయం అయింది. నాకు సంస్కారం లేదు. నేను చదివిన చదువు నాకు సంస్కారం నేర్పలేదు. అయినా నా విజ్ఞత, విచక్షణాజ్ఞానం ఏమయ్యాయో ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు. చేతబడిని నమ్మి నరబలి ఇస్తే పిల్లలు కలుగుతారనుకున్న నేను ఒక మానసిక రోగిని. పిల్లలు పుట్టకపోవడంతో నా అసమర్ధతో, నా శారీరక లోపమో కారణం అని అర్ధమైంది. అపుడు నేను చేసిన తప్పు నాకు తెలిసింది. 
నేను ఇంటికి వచ్చేసరికి నాన్నగారు పోయారు. నా భార్య మంచం లో ఉంది. చెరువులో కప్పల్లా ఆమె మంచం చుట్టూ ఆమె తమ్ముడూ భార్య చేరారు. కొడుకును పెంచే నెపంతో నా మాటకు విలువ లేకుండా పోయింది. దత్తత తీసుకున్న నా కొడుకు నన్ను అసహ్యించుకున్నాడు. 
'పిల్లలు కనే ఉద్దేశ్యం ఉన్నప్పుడు నన్ను ఎందుకు దత్తత తీస్కున్నావు' అని నిలదీసాడు. నేను బదులు ఇవ్వలేక పోయాను. 
చదువు పూర్తయ్యాకా వాడు ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి వెళ్లిపోయారు వాడి అమ్మ, నాన్నా. 
అంతే . ఆరోజుతో నేను పూర్తిగా చచ్చిపోయాను. 
నేను బ్రతికి ఉన్నంతకాలం వడ్డీ మాత్రం తీసుకునేలా కొంత సొమ్ము బ్యాంకు లో డిపాజిట్ చేయించారు. నా కొడుకు నామి నీ తన[పేరే పెట్టుకున్నాడు. అధైనా నా మందులకు మాత్రమే అని చెప్పాడు. 'మరి భోజనం? 'అడిగాను నేను, 'ఏదైనా పని చేసుకుని బయట తినేయ్ 'అన్నాడు. వాడి పట్ల నేను తప్పుగా ప్రవర్తించిన మాట వాస్తవమే. దాంతో నాకు పౌరుషం వచ్చింది. నేను ఇంటిలొంచి బయటకు వచ్చేసాను. 
జైల్లో ఉండగా పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్న నాకు ఈ నాడు అదే జీవనాధారమైంది. వీక్లీ లలో చివర పుస్తక సమీక్షలు పడుతుంటాయి. ఆయా రచయితల అడ్రస్ కు నా పరిస్థితి తెలియచేస్తూ ఒక పుస్తకం పంపమని రాస్తూ ఉంటాను. అలా దయతలచి పుస్తకం వారు పంపాకా దాన్ని ఆసాంతం చదివేసాకా అమ్మేస్తాను. అంటే నేను మొబైల్ బుక్ సెల్లర్ ను. ఆ అమ్మిన కష్టార్జితం తోనే నేను మందులు వేసుకుంటాను. నా కొడుకు ఉన్న వూరిలో నేను ఉన్నా, తటస్థపడినా ఒకరినొకరు పలకరించుకోము. కన్నెత్తి చూడనైనా చూసుకోము. 
మీ కథామాలిక సమీక్షను ఇటీవల చదివాను. కావున నా పరిస్థితి గమనించి మీకు వీలైతే మీ పుస్తకం ఉచితంగా పంపండి. లేదా ఈ ఉత్తరాన్ని చించి ముక్కలుగా చేసి డస్ట్-బిన్ లో వేయండి. 
మీ కధల మీద సమీక్ష చదివాక మీరు మానవతావిలువలకు ఇచ్ఛే ప్రాధాన్యత అర్ధం చేసుకుంభి ఇంత పెద్ద ఉత్తరం రాస్తున్నాను. సాధారణం గా నా కథని ఎవరికీ తెలియ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే తెలియక తప్పు చేసిన వాడిని క్షమించవచ్చు. తెలిసి తప్పు చేసేవాడు క్షమాబిక్ష కు అనర్హుడు. వాడు నిర్దాక్షిణ్యంగా శిక్షింపబడవలసిందే. అవతలి వ్యక్తి ప్రాణం విలువ ఎంతో తన ప్రాణం విలువ అంటే అనే విషయాన్ని అనుభవపూర్వకం గా తెలుసుకునేలా ఉండాలి ఆ శిక్ష .ఆనాడే సమాజం లో నేరాలు, ఘోరాలు తగ్గుతాయి. అమాయకులు బలికాకుండా కొంతవరకూ నిరోధించవచ్చు. 
ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే మీకు ఒక కదాంశం గా నా అనుభవం ఉపయోగపడాలని.
మీరు రచయితగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ , మీ పుస్తకం తప్పక పంపుతారని ఆకాంక్షిస్తూ -
అశీసులతో - ఉమా మహేశ్వరరావు. ''
అక్షరాలూ మసకబారుతుంటే అర్ధమైంది నాకు తెలియకుండానే కళ్ళు చెమర్చాయని. 
నాకు నెలరోజుల క్రితం బస్సు స్టాన్డ్ లో కలిసిన ముసలాయన గుర్తుకు వచ్చాడు. ఆనాడు ఆయన దగ్గర కొన్న పుస్తకాలు గుర్తుకు వచ్చాయి .అసలు ఆనాడు వాటిని బస్సు లో కూడా తీయనేలేదు. కారణం బస్సు ఎక్కాకా విపరీత వర్షం. దాంతో పక్కవాడిని ఒక పాలిథిన్ కవరు అడిగి , అందులో భద్రంగా దాచి ఇంటికి వచ్చాకా నా పుస్తకాల రాక్ లో పడేసాను.
వెంటనే లేచి ఆ కవరు అందుకుని పుస్తకాల మొదటి పేజీ తిరగేసాను. 
'ఆత్మీయ సాహితీ పోషకులు - శ్రీ ఉమా మహేశ్వరరావు గారికి - అభినందనలతో - ఆరుద్ర ' అని ఉంది కూనలమ్మ పదాలు పుస్తకం లో.
అలాగే మిగతా రెండు పుస్తకాలలో కూడా. 
నాకు ఆయనే ఉమా మహేశ్వరరావుగారు అని రూఢి అయింది. 
*****
ఆ ఉత్తరం తో నాలో ఎన్నాళ్ళుగానో ఉన్న ఆలోచన రూపు దిద్దుకుంది. దాని ఫలితమే, నేను ఉమా మహేశ్వరరావుగారిని కన్వీనర్ గా నియమించి మా వూరిలో ఏర్పాటుచేసిన వృద్ధాశ్రమం. 
దానిని, చక్రవర్తిని ప్రత్యేక అతిధి గా పిలిచి ప్రారంభోత్సవం చేయించాను. తనకు అంత ప్రత్యేక స్థానం ఇచ్చి గౌరవించినందుకు చక్రవర్తి సంబరపడిపోయాడు. 
హుందాగా నిండైన విగ్రహంతో తెల్లని వస్త్రాలతో మెరిసిపోతున్న ఉమామహేశ్వరరావు గారిని చక్రవర్తికి 'మా 'నాన్నగారు గా పరిచయం చేసాను. 
''ఈయన మీ నాన్నగారా?''విస్తుబోయాడు చక్రవర్తి.
''కాదురా. నాకు దేవుడు ఇచ్చిన తండ్రి.''అన్నాను.
ఉమామహేశ్వరరావుగారు చక్రవర్తికేసి నిర్లిప్తంగా చూసి 'వెళ్లి నా పని చూసుకుంటాను బాబూ ' అని వెళ్లిపోయారు. 
''నువ్వు వృద్ధాశ్రమం పెట్టడం వరకు బాగానే ఉంది. ఈయన నీకు ఎక్కడ దొరికారురా?'' చక్రవర్తి విసుగ్గా అడిగాడు.
'' ఏం ? ఆయనగాని నీకు తెలుసా?'' అర్ధోక్తిగా అడిగాను నేను.
''......................''
''చూడు చక్రవర్తీ. జీవితం పేకలతో ఆడే సీక్వెన్స్ ఆట లాంటిది. నీకు అక్కర్లేని ముక్క కింద పడేస్తే, అది అవసరమైన వాడు దాన్ని వాడుకుని సీక్వెన్స్ చేసుకుంటాడు. అలాగే ఆయన వాళ్ళ వాళ్లకు అక్కర్లేదు. నేనాయనను చూడటం తటస్థించడం వల్లనే ఎన్నాళ్ళుగానో నాలో బీజం వేసుకున్న నా ఆశయం రూపం దాల్చింది. ఇక్కడ కాస్తో కూస్తో పేరు ప్రఖ్యాతులు ఉన్నందువల్ల నాకు విరాళాలు బాగానే వచ్చాయి. దాంతో ట్రస్ట్ ను ఏర్పాటు చేసి, నేను చైర్మన్ గా, ఆయనను కన్వీనర్ గా ఏర్పాటు చేయడం జరిగింది.''
'' నీ మొహం. ఆయనది మా వూరే. ఆయన జైలుకు వెళ్లి వచ్చాడు తెలుసా? ''
''ఆయన జైలుకి ఎందుకు వెళ్లి వచ్చాడో కూడా తెలుసు చక్రవర్తీ. మనిషి తప్పు చేయడం సహజం. కానీ చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాప పడి తన కాళ్ళ మీద తానూ ఈ వయసులో ఎవరిమీదా ఆధారపడకుండా బ్రతుకుతున్న ఆయన మనిషే కాదు మహనీయుడు కూడా.
అంతెందుకు? నువ్వు ఏనాడూ తప్పు చెయ్యకుండానే పెరిగావా? అవతల వాళ్ళ తప్పులు ఎత్తి చూపడం చాలా తేలిక చక్రీ . అది చాలా తప్పు పద్దతి కూడా. 
ఆయనను ఈ వయసులో నిర్లక్ష్యం చేశారు ఆయన కుటుంబ సభ్యులు. ఆయనే నీ తండ్రి అయితే అలా వదిలేసేవాడివా? ''సీరియస్ గానే అడిగాను. 
''నీకు ఆయన సంగతి తెలీదు. ఘోరమైన నేరం చేసాడు. కొడుకుమీద పౌరుషంతో ఇల్లు వదిలి వచ్ఛేసి బస్ స్టాన్డ్ లో పుస్తకాలు అమ్ముకునేవాడు. అందరి ముందు కొడుకు పరువు తీసేసాడు. పదిమందిలో కొడుకు అవమానపడేలా చేసాడు.'' చక్రవర్తి కోపంగా అన్నాడు.
''నువ్వు కొడుకు వైపే ఆలోచించి మాట్లాడుతున్నావు. ఏతండ్రీ తనకొడుకు తనను భవిష్యత్తులో చూడడేమో అని పిల్లల్ని కనడు. అలా అనుకుంటే పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడతాడు.అంతెందుకు? రేపు నీ పిల్లలు నిన్ను సవ్యంగా చూస్తారని నమ్మకమేమిటి? నీలోనే తండ్రి అంటే ఇంట అసహ్యం ఏర్పడినప్పుడు నీ జీన్స్ నీ పిల్లలకు వచ్చి వారు నిన్ను భవిష్యత్తులో ఏవగించుకోరని నమ్మకం ఏమిటి?''
చక్రవర్తి నిరుత్తరుడయ్యాడు. 
''అవును చక్రీ. ఎన్నో ఊహించని మలుపులతో కధలు రాయగలిగిన నేను ఆయన నీ కన్న తండ్రి అని, బస్సు స్టాప్ లో నన్ను చూసి ఆనందంగా నా దగ్గరకు రాబోయి పని ఉందని వెళ్ళిపోయి, ఆయన వెళ్ళిపోయాక వచ్చావే...ఆనాడే గ్రహించాను. నువ్వే కాదు. నీలాగా ఎందరో ఈనాడు జన్మ నిచ్చిన కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యంతో దూరం చేసుకుంటున్నారు. ఆస్తి కోసం హత్యలు చేస్తున్నారు. నా పాయింట్ ఏమిటంటే, నీకే నీ తండ్రిని హత్య చెయ్యాలని ఆలోచన వస్తే, నీ జీన్స్ ను పంచుకు పుట్టిన కొడుకు చేతిలో నువ్ ఏమవుతావో ఆలోచించుకోమని. తల్లి నవమాసాలు మోసి కంటే, తండ్రి పోషణలో ఇంతగా ఎదిగి మన బ్రతుకు మనం బతికేలా పెంచిన కృతఙ్ఞతకే ప్రతీ కొడుకు తల్లి తండ్రుల కాళ్ళకి సాష్టాంగ పడాలిరా.అందుకే తల్లితండ్రులను ప్రత్యక్ష దైవాలు అన్నారు పెద్దలు. మనం అసక్తులుగా ఉన్నపుడు వారి పొత్తిళ్లలో ఉన్నప్పుడే ఓ వడ్ల గింజ నోట్లో పడేస్తే నీ బతుకేంటి? ఆలోచించు.
మనం పిల్లలుగా ఉన్నపుడు వారు మనకు ఆధారమైనట్టే. వారు వృద్ధులయ్యాక మనం వారి ఆధారం కాకపోయినా కనీసం చేయూతనైనా ఇవ్వగలగాలి కదా. ఇదే ఓ కన్న తండ్రికి కొడుకుగా తీర్చుకునే ఋణం. ఇపుడే అక్కర్లేదు. బాగా ఆలోచించు. ఏనాడు నువ్ పశ్చాత్తాపడి వచ్చినా నిన్ను క్షమించే పెద్ద దిక్కు నా దగ్గర ఉందని మర్చిపోకు. ఆరోజు నీతో సహా నీలాంటి కొడుకులందరికీ రావాలనే నిన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పిలిచాను. ...''నా మాట పూర్తి కాకుండానే -
'' ప్రభూ వెళ్ళొస్తానురా.. మళ్ళీ తప్పకుండా వస్తాను. ...తప్పకుండా వస్తాను.'' గొండెపొరల్లోని దుఃఖం తో గొంతు పూడుకుపోయి, గాద్గదికంగా అంటూనే సుళ్ళు తిరుగుతున్నా కన్నీళ్లు నాకు కనిపించకూడదని కాబోలు నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా వేగంగా వెళ్ళిపోయాడు చక్రవర్తి.
ఏదో ఒకనాడు అతను తప్పక తిరిగి వస్తాడు. వస్తాడు కదూ!
 ***

No comments:

Post a Comment

Pages