శ్రీథరమాధురి - 71 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 71

Share This
శ్రీథరమాధురి - 71
                     (పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)



చెన్నై లోని అడ్మిషన్ దుస్సాధ్యమైన ఒక స్కూల్  లో జరిగిన ఒక కధ...
 యు.కె.జి అడ్మిషన్ కోసం నా స్నేహితుడి కూతురితో పాటు నేనూ వెళ్లాను. ఆ అడ్మిషన్ గురించి నా ఫ్రెండ్ తన కూతురి కంటే ఎక్కువే చదివాడు! ఆమెను అక్కడికి ఎందుకు తీసుకుని వెళ్ళారో ఆ పాపకు అర్ధం కాలేదు. అందరూ నిల్చుని ఉండగా, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పాపతో మాట్లాడసాగింది. నిజమే, ఇంగ్లీష్ లోనే ! నా జీవితంలో నేను చూసిన ఇంటర్వ్యూ లలో ఇది మర్చిపోలేనిది.
అదిలా కొనసాగింది...
“నీ పేరేంటి?”
“సరిత్రా”
“బాగుంది. నీకు తెలిసింది ఏమైనా చెప్పు.”
“నాకు చాలా సంగతులు తెలుసు, మీకేమి కావాలో అడగండి !”
అయ్యో, అడ్మిషన్ దొరకకపోవడానికి ఇంతకంటే బలమైన కారణం ఉండదు కదా !
సరిత్రా తల్లి ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించింది, కాని ప్రిన్సిపాల్ ఆమెను ఆపింది. ఆమె పాప వైపు తిరిగి,
“నీకు తెలిసిన ఒక కధ, లేక రైం (పిల్లల పాట) చెప్పు.”
“మీకు ఏది కావాలి? పాట లేక కధా?”
“సరే, నాకొక్క కధ చెప్పవూ...”
“నేను చదువుకున్న కధ వినిపించనా, లేక నేను రాసిన కధా ?”
ఆమె ఆశ్చర్యపోయి, “ఓహ్, నువ్వు కధలు కూడా రాస్తావా?” అని అడిగింది.
“నేనెందుకు రాయకూడదు?”
 ఇప్పుడు నేనూ అవాక్కయ్యాను, కాని, ఆమెకు ఈ సమాధానం నచ్చినట్లు ఉంది. ఆమె (మాతో సహా) అటువంటి కధను తన జీవితంలో విని ఉండదు. 
 “సరే, నువ్వు రాసిన కధనే వినిపించు.”
సరిత్రా ఇలా చెప్పసాగింది,”రావణుడు సీతను కిడ్నాప్ చేసి, శ్రీలంకకు తీసుకుని వెళ్ళాడు.” ఆరంభ సన్నివేశం ఆమెకు నచ్చకపోయినా, పాపను చెప్పమని ఆమె ప్రోత్సహించింది.
“రాముడు సీతను కాపాడేందుకు హనుమాన్ ను సాయం అడిగాడు. హనుమంతుడూ అందుకు అంగీకరించాడు.”
“అప్పుడు?”
“అప్పుడు హనుమంతుడు తన స్నేహితుడైన స్పైడర్ మాన్ ను పిలిచాడు.” కధలో ఈ మలుపును ఎవరూ ఊహించలేదు.
 “ఎందుకని?”
“ఎందుకంటే, ఇండియాకు, శ్రీలంకకు మధ్యన ఎన్నో పర్వతాలు ఉన్నాయి. కాని, మన దగ్గర స్పైడర్ మాన్ ఉంటే, మనం అతని తాడు పట్టుకుని, సులువుగా వెళ్ళచ్చు కదా !”
“కాని, హనుమంతుడు ఎగరగలడు కదా !” 
“అవును, కాని అతని ఒక చేతిలో సంజీవి పర్వతం ఉంది. అందుకే అతను వేగంగా వెళ్ళలేడు.!”
అందరూ మౌనంగా ఉన్నారు, ఒక్కక్షణం తర్వాత సరిత్రా ఇలా అడిగింది,” తర్వాత ఏమైందో చెప్పనా?”
“సరే, చెప్పు”.
“హనుమంతుడు, స్పైడర్ మాన్ ఇద్దరూ శ్రీలంకకు వెళ్లి, సీతను కాపాడారు. సీత ఇద్దరికీ కృతఙ్ఞతలు చెప్పింది.”
“ఎందుకని?”
“మీరు ఎవరి వద్దనుంచైనా సాయం పొందితే, థాంక్స్ చెప్పాలి.” అందుకే “హనుమంతుడు ఇప్పుడొక ఓడను పిలిచాడు.”
అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె మా అందరి ఉత్సుకతను గమనించి, ఇలా చెప్పసాగింది,” ఇప్పుడు సీతను జాగ్రత్తగా రాముడి వద్దకు  చేర్చేందుకు ఓడను పిలిచాడు.”
“ఏంటి???” “హనుమంతుడు తన వీపుపై సీతను తీసుకుని వెళ్ళగలడు కదా ?”
“అవును. కాని, అతనికి ఒక చేతిలో సంజీవి పర్వతం ఉంది, మరొక చేత్తో స్పైడర్ మాన్ ను పట్టుకోవాలి కదా ! అందుకని.”
ఎవ్వరూ నవ్వాపుకోలేకపోయారు. “అందుకే, వాళ్ళందరూ ఇండియా కు బయలుదేరినప్పుడు, వాళ్ళు నా ఫ్రెండ్ అక్షయ్ ను కలిసారు!”
“ఈ అక్షయ్ ఇందులోకి ఎలా వచ్చాడు?”
 “ఇది నా కధ కనుక, నేను ఇందులోకి ఎవరినైనా తీసుకురాగలను!”
ప్రిన్సిపాల్ కోప్పడకుండా తర్వాతి మలుపు కోసం ఎదురుచూడసాగింది.
“అప్పుడు వాళ్ళందరూ బయలుదేరి, చెన్నై వేలేచేరి బస్ స్టాప్ లో దిగారు!”
ఇప్పుడు నేను అడిగాను,”ఎందుకని వాళ్ళు వేలేచేరి బస్ స్టాప్ లో దిగారు?”
“ఎందుకంటే, వాళ్ళు దారి తప్పారు. ఓడకు డోరా ను పిలవాలన్న ఐడియా వచ్చింది.”
 అదే మొదటిసారి నేను డోరా గురించి వినడం. !
“డోరా అక్కడికి వచ్చి, సీతను వేలేచేరి వీనస్ కాలనీ కి తెచ్చి, దింపాడు. అంతే!”
ఆమె నవ్వుతూ కధ ముగించింది.
ప్రిన్సిపాల్ ఇలా అడిగింది,”వీనస్ కాలనీ నే ఎందుకు?”
“ఎందుకంటే సీతా అక్కడ ఉంది, నేనే సీతను !!!”
ప్రిన్సిపాల్ ఆనందంతో పాపను కౌగిలించుకుంది. ఆమెకు యు.కె.జి లో అడ్మిషన్ దొరికింది, ఆమెకు బహుమతిగా ఒక డోరా బొమ్మను కూడా ఇచ్చారు.

పిల్లలు నిజంగా అద్భుతమైనవారు. కాని మనం వారి సృజన అనే రెక్కల్ని, మనకు కావలసినట్టే వారు ప్రవర్తించాలన్న ఆరాటంతో విరిచేస్తాము. ప్రతి బిడ్డకూ తనకు కావలసినది చేసే స్వేచ్చను ఇద్దాము. వారి కలలను పండించుకోవడం చూద్దాము.
***

No comments:

Post a Comment

Pages