కొన్ని న్యాయాలు - అచ్చంగా తెలుగు
కొన్ని న్యాయాలు!
శారదాప్రసాద్ 


మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం,
భ్రమర కీటక న్యాయాలను గురించి చెప్పుకున్నాం! మిత్రులు ఇంకేమైనా న్యాయాలున్నాయా? అని అడుగుతున్నారు.  చాలా న్యాయాలే  ఉన్నాయి.  అయితే, వాటిలో చాలా వాటిని  జాతీయాలుగా ఎక్కువగా వాడుతుంటారు.  కొన్ని వాడుకలో ఉన్న న్యాయాలను గురించి చెప్పుతాను!
********
మార్జాల కిశోర న్యాయం:
*********
 మార్జాలం అంటే పిల్లి.కిశోరం అంటే పిల్ల.పిల్లి తన పిల్లల్ని తనే రక్షించు కొంటుంది. పిల్లి కనిన తరువాత ఆపిల్లల్ని నోటితో పట్టుకొని వేరు వేరు ప్రదేశాలలో ఉంచుతూ అవి పెద్ద అయేదాకా కాపాడుతూ ఉంటుంది.అలాగే మనం ముందుగ భగవంతుని ఆశ్రయించి ఉంటే  ఆస్వామి ఎందరినో కాపాడినట్లు “మార్జాల కిశోర న్యాయంలా”భక్తులను కాపాడుతాడు అని ఈన్యాయం తెల్పుతుంది .
******
మర్కట కిశోర న్యాయం:  
*****
కోతి పిల్ల తల్లి పొట్టని పట్టుకొనే ఉంటుంది .తల్లి కోతి చెట్ల మించి ఎగిరి దూకేటప్పుడు పిల్ల కోతి తన రక్షణ తనే చూసుకొంటూ ఉంటుంది.అని తెల్పేదే “మర్కట కిశోర న్యాయం”  సదా ఆ స్వామినే పిల్లకోతి తల్లిని పట్టుకొని ఉన్నట్లు మనం ఆశ్రయించి ఉండాలి అనితెల్పేదే “మర్కట కిశోరన్యాయం.
***********
భ్రమర కీటక న్యాయం 
*******
దీన్ని  గురించి క్లుప్తంగా తెలుపుతాను.. భ్రమరం (తుమ్మెద) కీటకాన్ని (ఒక రకమైన పురుగు) తనతో తెచ్చుకొని  దానిచుట్టూ ఝుంకారం చేసుకుంటూ పదే పదే తిరుగుతుంది. అలా తిరిగేటప్పుడు  మొదట భయంగా,తర్వాత ఏకాగ్రతగా,అటుపై తనను తానే  పూర్తిగా మరచిపోతుంది కీటకం  .ఆ మైమరపులో కొద్దిరోజుల తర్వాత తానే భ్రమరంగా మారిపోతుంది  కీటకం  . ఇదే భ్రమర కీటకన్యాయం  ! అదే భావనతో భక్తుడు కూడా భగవంతుని మైమరచి తలుస్తే ,భక్తుడు సగుణరూపంలో ఉన్న భగవంతుడు అవుతాడని వేదాంతపరంగా చెబుతారు!    
****
శ్వానమకర న్యాయం

*****
శ్వానం అంటే కుక్క, మకరం అంటే మొసలి. మొసలి నీటిలో ఉండగా ఏనుగునయినా పట్టి బంధించగలదు. అదే మొసలి నీటిని వదలి బయటికి వస్తే ,దాన్ని కుక్క కూడా బంధించగలదు. దీనిని తెనుగులో స్థానబలిమి అని అంటారు. అన్ని స్థానాల్లో మన బలం,శక్తిసామర్ధ్యాలు పనిచేయవు. ఒక ఊరి మునసబు మొరొక ఊరి వెట్టి !అనే సామెత ఉంది. స్థానబలిమే కానీ,తన బలిమి కాదయా….  అని వేమన కూడా చెప్పాడు. ఇటువంటి సందర్భాలను గురించి చెప్పేటప్పుడు ఈ న్యాయాన్ని ఉటంకిస్తారు! 
యవ వరాహ న్యాయం.

******
తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడటం.యవల చేను పాడుచేసిన అడవిపంది తప్పించుకోగా ఊరపందికి శిక్షపడుతుంది.తప్పొకరు చేస్తే ,శిక్ష మరొకరికి వేయటాన్ని చెప్పేటప్పుడు ఈ న్యాయాన్ని చెబుతారు.
ఆంధగజన్యాయం 
గుడ్డివాళ్లు ఏనుగును వర్ణించడాన్ని అంధగజ న్యాయం అని అంటారు. మూర్ఖులు విజ్ఞుల ముందర చేసే విపరీత వ్యాఖ్యానాలు కూడా ఈ కోవలోకే వస్తాయి!
కాకతాళీయ న్యాయం
**********
కాకం అంటే కాకి, తాళం అంటే తాటి చెట్టు. ఒక కాకి తాటి చెట్టుమీద వాలింది. అప్పటికే ఆ చెట్టు మీదనుంచి  రాలిపడటానికి ఒక తాటిపండు సిద్ధంగావుండి రాలి నేలమీద పడింది. ఆ కాకి, ఆ పండు రాలడం తన వల్లనే అనుకుందట .

తమ గొప్పలను గురించి లేనిపోని ఉదాహరణలను అల్లి చెప్పేవారిని గురించి చెప్పేటప్పుడు ఈ న్యాయాన్ని గురించి చెబుతారు!  దీన్ని జాతీయంగా బాగా వాడుతుంటారు,అర్ధం తెలియకపోయినా!
అజగళస్తన న్యాయం.

******
అజము అంటే మేక, గళం అంటే గొంతు, స్తనo అంటే పాలిళ్లు . మేకకి గొంతు దగ్గర రెండు పాలిండ్లలాటివి వేలాడుతూ కనిపిస్తాయి. ఇవి నిరుపయోగమైనవి. కానీ, మేకకి ఇవి ఎలామిగిలిపోయాయో తెలీదు.  స్తనాలులాగే ఉంటాయి కానీ,వీటినుండి పాలు రావు. వాటివల్ల మేకకు కూడా ఏ ఉపయోగమూ ఉండదు ,ఇలా ఎందుకూ పనికిరాని వాటిని గురించి చెప్పేటప్పుడు అజగళస్తనాలంటారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తన ఉపన్యాసాలలో కాంగ్రెస్ వాళ్ళను గురించి చెప్పేటప్పుడు ,ఈ జాతీయాన్ని ఎక్కువగా ఉపయోగించే వారు!

గోముఖ వ్యాఘ్ర న్యాయం
********
ఇది అందరికీ తెలిసిందే!పులిని చూస్తే అందరికీ భయమే !అలా జంతువులు  భయపడటంవల్ల అది వేటాడి ,జంతువులను ఆహారంగా సపాదించుకోవటం  కష్టం!ఎందుకంటే,దాన్ని చూసి జంతువులు  భయపడి అందకుండా తప్పించుకునే అవకాశం కూడా ఉంది.అటువంటి పులి ఆవు ముఖాన్ని వేసుకొని వేటాడితే ఎలా ఉంటుందో ఊహించండి. మోసం చేయాలంటే సాధు వేషం వెయ్యాల్సిందే!రావణుడు సీతను అపహరించింది కూడా ఇటువంటి వేషంలోనే!మంచి వేషం వేసి మోసం చెయ్యటాన్ని గోముఖ వ్యాఘ్ర న్యాయం అంటారు.  ప్రస్తుత రాజకీయనాయకులను గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఎక్కువగా వాడొచ్చు!  

శాఖా చంద్ర న్యాయం
*********
ఆకాశంలో చంద్రుడు కదులుతున్నట్లు కనిపిస్తాడు . నిజానికి చంద్రుడు కదలడు.  విజ్ఞులు,రెండు కొమ్మల మధ్య కదలని చంద్రుడిని చూపించి చంద్రుడు కదలడు అని చెబుతారు. ఆజ్ఞానులు నిజాన్ని గ్రహించలేనప్పుడు విజ్ఞులు ఇలా  చెప్పడాన్ని ‘శాఖా చంద్ర న్యాయం’ అన్నారు.
అతి పరిచయ న్యాయం
**********
‘అతిపరిచయాదవజ్ఞతా’ అన్నారు. అంటే పరిచయం పెరిగినకొద్దీ ఎదుటివారిలో లోపాలు కనపడుతుంటాయి .దూరపు కొండలు నునుపు అనే సామెత అందరూ వినే ఉంటారు . దూరంనుంచి చూస్తే కొండ నున్నగా కూడా ఉంటుంది.దగ్గరకు పోయి చూస్తే ,దాని అసలు రూపం బయటపడుతుంది.అయితే, పరిచయాలు ఎక్కువగా పెంచుకున్నవారు మన హృదయాల్లో కూడా స్థానాన్ని సంపాదించుకోవటం చాలా గొప్ప విషయమే!అతి పరిచయాన్ని అలుసుగా తీసుకోవటం కూడా మంచిది కాదు !ఇటువంటి సందర్భాల్లో ఈ న్యాయాన్ని గురించి చెప్పటం కద్దు!
గజస్నాన న్యాయం
********
గజము అంటే ఏనుగు స్నానం అంటే తెలుసు కదా! ఏనుగు నదిలోకి దిగి శుభ్రంగా స్నానం చేస్తుంది.  గట్టుమీదకు వచ్చి ఆ తడి ఒంటి మీద మట్టిని చల్లుకుంటుంది. బాగున్న దానిని మన చేతులతోనే మనం పాడు చేసుకోవటాన్ని గజ స్నాన న్యాయం అంటారు.
స్తనశల్య పరీక్షా న్యాయం
********
స్తనము అంటే పాలిండ్లు , శల్యము అంటే ఎముక. స్తనంలో ఎముక ఉన్నదా? లేదన్నది అందరికీ తెలిసిన విషయమే! కాని దీనినిగురించి కొందరు శోధించాలని అని అనుకుంటారు . దీనినే తెనుగులో ’కోడి గుడ్డుకి ఈకలు పీకడం’ అని కూడా అంటారు. వ్యర్ధమైన పరీక్షలను చేసే వారిని గురించి చెప్పేటప్పుడు ,దీన్ని వాడుతుంటారు!
కాకదంత పరిక్షాన్యాయం
**********
కాకము అంటే కాకి.  కాకికి  పళ్ళు ఉన్నాయా,లేవా? ఇది కూడా అనవసరమైన పరీక్షే !కనపడే నిజాన్ని కాదని భావించే వారిని గురించి చెప్పేటప్పుడు ,ఈ న్యాయాన్ని వాడుతుంటారు !స్తనశల్య పరీక్షా న్యాయం,కాకదంత పరిక్షాన్యాయం –రెండిటి అర్ధాలు ఒకటే!

రజ్జుసర్ప భ్రాంతి న్యాయం
*********
రజ్జువు అంటే తాడు సర్పం అంటే పాము! తెలుగులో దీనినే, తాడుని చూసి పామనుకోవటం అంటారు.  మనం చీకటిలో వస్తుంటాం!రోడ్ మీద ఒక తాడు కనపడిందనుకుందాం!  ఒక్క క్షణకాలంలో మనం చూసింది పామునే అనుకొని భ్రమ పడుతాం!నిజానికి మనం చూసింది పామునే,కానీ మనస్సు  దానిని పాము అని భ్రమింపచేసింది!దీనినే ఆంగ్లంలో hallucinations అంటారు!ఒక దాన్ని చూసి మరొక దాన్ని భ్రమించటమే, రజ్జుసర్ప భ్రాంతి న్యాయం! అంటే అజ్ఞానంతో కలిగేది భయమైతే, జ్ఞానం వల్ల కలిగేది సత్యం అన్నమాట!ఈ న్యాయాన్ని గురించి వేదాంతులు ఎక్కువగా చెబుతుంటారు,ముఖ్యంగా అద్వైత సిద్ధాంతాన్ని గురించి చెప్పేటప్పుడు!

తిలతండుల న్యాయం: 
*******
తిలలు అంటే నువ్వులు .తండులాలు అంటే బియ్యం .నువ్వులు,బియ్యం కలిపి చూస్తే రెండు వేరు వేరుగానే కనపడతాయి .కాని వాటిని వేరుచేయలేము. అలాగే జీవాత్మ,పరమాత్మ వేరుగా ఉన్నా వారి మధ్య ఉండే భక్తి తత్వాన్ని వేరు చేయలేము కదా! దీనినే అద్వైత స్తితి అంటారు.అట్లే రెండు వేరువేరు విషయాలు కలిపి చెప్పినపుడు వాటిని “ తిల తండుల న్యాయంలా “ వేరు,వేరుగా పరిశీలించాలని తెలపదానికి,ఈ న్యాయాన్ని ఉపయోగిస్తారు.

దర్వీపాక న్యాయం: 
***********
దర్వీ అంటే గరిట.పాకం అంటే వండే పదార్ధాలు.(అనగా కూరలు ,పులుసులు వంటివి.)గరిట కూరలను ,పులుసులను వండేటప్పుడు కలపడానికి ఉపయోగ పడుతుందే తప్ప ఆ గరిట వాటిని రుచి చూడలేదు కదా ! అలాగే ఎంత చదువు చదివినా తెలివి తేటలు లేకుంటే ఆ చదువు వ్యర్ధమగును.కనక పులుసులో గరిటలాగా మనం ఉండకుండా జ్ఞానం కలిగి ఉండాలి అని ఈ న్యాయం తెల్పుతుంది.

స్థాలీపులాక న్యాయం
*******
వివాహ సంప్రదాయంలో,తాళిబొట్టు ,తలంబ్రాలు ..లాంటి తంతులు ముగిసిన తర్వాత ,పెళ్లి కూతురిచేత ఒక చిన్న గిన్నెలో అన్నం వందిస్తారు!దీన్నే స్థాళీపాకం అని కూడా అంటారు.ఆ బియ్యంలోనే కొంత పెసరపప్పు కూడా వేయిస్తారు !కొద్దీ సేపటికి అన్నం ఎలా ఉడికిందో చూస్తారు!అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకును పట్టుకుంటే సరిపోతుంది. పెళ్లికూతురు మనసు సరిగ్గా ఉంటే ,అన్నం కూడా సరిగా ఉడుకుతుంది .లేకపోతే ఉడకదు . పెళ్లిరోజే భార్యాభర్తల అనురాగానికి అది చిహ్నం!అన్నం సరిగ్గా వుడికినట్లే,జీవితాంతం ఆ దంపతుల దాంపత్యం కూడా కళకళ లాడుతుందని చెప్పటమే స్థాలీపులాక న్యాయం!
 ****

No comments:

Post a Comment

Pages