జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 26 - అచ్చంగా తెలుగు
  జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 26
చెన్నూరి సుదర్శన్ 

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.)  

“అక్కయ్యకు మాట పట్టింపు ఎక్కువ.. మహేష్ తన మాటకు విలువ ఇవ్వలేదని మొదట అన్నం  తినడం మానేసింది. అయినా వాడు పట్టించుకో లేదు.. పంతం నెగ్గించుకున్నాడు.
అక్కయ్య నలుగురు ఏమనుకుంటారో అని  భయపడింది.. నాకు ముఖం చూపించ మనసు చెల్లలేదు. మా ఇంట్లో అయితే నాకు చెడ్డ పేరొస్తుందని కాబోలు.. తన ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది” 
నాకు మాటలు కరువయ్యాయి..మనసు శూన్యమయ్యింది.
ఎన్ని ఒడుదుడుకుల జీవితం..
ఎగుడు దిగుడులమయం  జీవితం.
కష్ట సుఖాలద్వయం.. జీవితం.
స్వర్గం నరకం అనుభూతుల ధ్వజం జీవితం..
మా ట్రైనింగ్ సెంటర్ బెల్ మ్రోగింది. ఆలోచనలు ఆగిపోయాయి. ఇరువురం కలిసి నెమ్మదిగా క్లాసుకు బయలు దేరాం..
పది రోజులు పది నిముషాల్లా గడిచి పోయాయి. విజయకుమార్ బోధన అలాంటిది. మ్యాథ్స్ ఎలా చెప్పేవాడో.. కంప్యూటర్ పాఠాలూ అలాగే అలవోకగా చెప్పాడు. అతడు చెబ్తుంటే బ్లాక్‍బోర్డు స్థానంలో సినిమా తెర ప్రత్యక్షమయ్యేది. ప్రతీ అంశం మస్తిష్కంలో అంటుకు పోయేది. అలా చెప్పే వారు చాలా  అరుదు.
మా చివరి క్లాసులు మా ట్రైనీ మేట్స్ అంతా  కలిసి మా జ్ఞాపకార్థం విజయకుమార్‍కు ‘చార్ మినార్’ ప్రతిమ బహుమతి నందించాం.
ఉద్వేగ భరిత మధుర క్షణాల మధ్య విడిపోయాం..
***
సూరారం కాలేజీలో నాకు కంప్యూటర్ గది అదనంగా కేటాయించాడు యాదగిరి. ఇప్పుడు నేను పరీక్షలతో బాటు కంప్యూటర్ ఇంచార్జిని. మా స్టాఫంతా నన్ను చూస్తూ ‘గడియ రికాం లేదు.. గవ్వ రాకడ లేదు’ అని ఆటపట్టించే వారు. పని ఒత్తిడి పెరిగిందే తప్ప పైసా లాభం లేదని వెటకరించే వారు.  లాభామనే  ఆలోచనే రానివ్వను నామదిలో.. లాభం చూసుకుంటే కాలేజీలో అజ్ఞానులుగా మిగిలి పోతామని అనుకునే రకం నేను.
వొకేషనల్ విద్యార్థులకు కంప్యూటర్ క్లాసు తీసుకోవడం కొత్త అనుభూతినిస్తోంది. పాఠాలు చెబ్తుంటే కలిగే ఆనందమే వేరు. అలా చెబ్తుంటే మనకు కలిగే సందేహాలను నివృతి చేసుకుంటూ పొందే జ్ఞానసమూపార్జన   అనిర్వచనీయం.
ఆ రోజు కంప్యూటర్ గదిలో కూర్చొని పే‍బిల్స్ ప్రిపర్ చేస్తున్నాను.
కామర్స్ కమల మేడం గదిలో అడుగు పెడ్తూనే “సార్.. నా ఇంక్రిమెంటుందీనెల. ఆడ్ చేసారా” అడిగింది.
“యస్ మేడం” అన్నాను కప్యూటర్లో నుండి తల తిప్పకుండా.. తను వచ్చి నాపక్కకే కూర్చుంది. ఎదో చెప్పాలనుకునే  కుతూహలం ఆమెలో కనపడింది. ఆమె పాతుకు పోవడం చూసి. వినకుంటే నన్ను పాతె       య్యాలన్నట్లుగా కనబడ్డాయి ఆమె చూపులు. 
నా తలకు కాస్తా విశ్రాంతినిచ్చి కమల వైపు తిప్పాను.
పాముకు కప్ప దొరికినట్లు సంబరపడింది. నా తల మళ్ళీ కంప్యూటర్లో దూరకుండా కామా ఫుల్ స్టాప్ లేకుండా విషయం నా తలలో దూర్చసాగింది. సూదిలో దారం అయిపోయేంత వరకు బొంతకుట్టినట్లు.
“సార్.. మీరు ట్రైనింగ్ వెళ్ళాక కాలేజీలో నమ్మశక్యం గాని చిత్రాతిచిత్రాలు జరిగాయి” అంటుంటే ఆమె  కళ్ళు బండి చక్రాలయ్యాయి. నేను విస్తుపోయాను ఏమిటా విచిత్రాలన్నట్లు.
“ఏకాంబరం భార్య.. సునీత ఇంటికి వెళ్ళింది”
ఇందులో విచిత్రమేముంది?.. వారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా..
అయితే ఈ మధ్య ఏవో కొన్ని అపార్థాలు వారిని ఎడం చేసాయి అనుకున్నాను.
“ఇందులో విశేషమేముంది” అన్నాను “వాళ్ళూ ఫ్రెండ్సే గదా..”
“ఫ్రెండ్సే సార్.. కాని చెప్పేది పూర్తిగా వినండి” అంటూ ఇంకాస్త దగ్గరికి కుర్చీ లాక్కొని గొంతు వాల్యూం 
తగ్గించింది. ఏకాంబరం భార్య మాటల్లోనే చెప్పసాగింది.
“సునీతా.. నేను పిల్లలుగలదాన్ని. నీకు తెలియంది కాదు. మా బాబు బి. టెక్. లో చేరబోతున్నాడు. పాప డిగ్రీ చేస్తోంది. వాళ్ళ భవిష్యత్తు నీ మీద ఆధారపడి ఉంది. మా ఆయనకు కాస్తా సహకరిస్తూ  పుణ్యం కట్టుకోవా ప్లీజ్..
నువ్వా కన్నెపిల్లవేమీ కాదు.. కన్నెరికం కరిగిపోయి.. కనికరం కలిగిన కళత్రానివి.. కాస్తా కటాక్షించు” అంటూ కాళ్ళమీద పడిందట. “నీకా పెద్దగా వచ్చిన ప్రమాదమేమీ లేదు. కాని వచ్చిన ప్రమాదమల్లా నాకు నాపిల్లలకు. నీ పొందు లేకుండా బతకనని భయపెడ్తున్నాడు మావారు. కాస్తా దయ చూపు” మని ప్రాధేయ పడిందట. 
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages