బహుముఖ ప్రజ్ణాశాలి శ్రీగొల్లపూడి మారుతీరావు - అచ్చంగా తెలుగు

బహుముఖ ప్రజ్ణాశాలి శ్రీగొల్లపూడి మారుతీరావు

Share This

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీగొల్లపూడి మారుతీరావు.
                                                         డా.పోడూరి శ్రీనివాసరావు

          

ఇటీవలే పరమపదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ గొల్లపూడి మారుతీరావుగారి మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకే కాకుండా, సాహితీ లోకానికి, నాటక రంగానికి తీరని లోటు. నటునిగా, నాటక రచయితగా, దర్శకునిగా, TV Anchor గా, జర్నలిస్ట్ గా, ఎడిటర్ గా, నాటక ప్రయోక్తగా, విభిన్న రంగాలలో, ప్రాముఖ్యత సంతరించుకున్న శ్రీ గొల్లపూడి మారుతీ రావుగారు – వీరిగురించి తెలియని ఆంధ్రుడుండడు.
          శ్రీగొల్లపూడి మారుతీరావుగారి జననం విజయనగరంలో ఏప్రిల్ 14, 1939 వ తేదీన, శ్రీ సుబ్బారావు- అన్నపూర్ణ దంపతులకు శ్రీ మారుతీరావు 5వసంతానం. వారిది మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం. శ్రీమారుతీరావు విద్యాభ్యాసమంతా విశాఖపట్టణంలోనే, సి.బి. ఎం. ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్. కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయములలో జరిగింది. వారి తల్లితండ్రులు విశాఖలోనే నివాసముండడంతో మారుతీ రావుగారి విద్యాబ్యాసమంతా విశాఖలోనే జరిగింది. వారు మ్యాథమేటికల్ భౌతిక శాస్త్రంలో బి.ఎస్.సి (ఆనర్స్) చేసారు.
          మారుతీరావు 1959 లో ఆంధ్రప్రభ దినపత్రికలో ఉప సంచాలకునిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు. 1960 జనవరి 13వ తేదీన చిత్తూరుతో పత్రిక యొక్క మరో ఎడిషన్ ప్రారంభించినప్పుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశారు. తరువాత ఆకాశవాణిలో ట్రాన్స్ మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికై హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేసారు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేసారు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొంది, సంబల్‌పూర్ వెళ్లారు. ఆ తర్వాత చెన్నై, కడప కేంద్రాల్లో కూడా కార్యక్రమ నిర్వాహకుడిగా బాధ్యతలు నిర్వర్తింూడు, 1981 లో ఆకాశవాణి, కడప కేంద్రం ఉపడైరెక్టరుగా పదోన్నతి పొందారు.మొత్తం 20 సంవత్సరాలు పనిచేసి, అసిస్టెంటు స్టేషన్ డైరెక్టరు హాదాలో పదవీ విరమణ చేశారు. పిమ్మట 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమా తో నటుడిగా చలనమత్ర రంగ ప్రవేశం చేసాడు.
          మారుతీరావు రచించిన తొలికథ ఆశాజీవి. ప్రొద్దుటూరు నుంచివెలువడే స్థానిక పత్రిక 'రేనాడు' లో 1954, డిశెంబరు 9 వతేదీన ప్రచురించబడింది. చిన్న వయసులోనే, రాఘవ కళానికేతన్' పేరున
మారుతీరావు ఒక నాటక బృందాన్ని నడిపేవాడు. పినిశెట్టి రచించిన ఆడది,రావికొండలరావు రచించిన కుక్క పిల్ల దొరికింది, స్వయంవరం, సోమంచి యజ్ఞన్నశాస్త్రి రచించిన రిహార్సల్స్;డి.వి నరసరాజు రచించిన వాపస్ ; గొగో వ్రాసిన An Inspetor calls ఆధారంగా సోమంచియజ్ఞన్న శాస్త్రి చేసిన రచన మహానుభావులు మొదవైన నాటకాలకు నిర్వాహణ, దర్శకత్వం వహించడంతోబాటు, ప్రధాన పాత్రధారిగా కూడా నటించారు.
          విధ్యార్తి దశలో  ఉండగానే, శ్రీవాత్సవ రచించగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిష్టారు శ్రీ కె.వి.గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాలగది నాటకంలోనూ, భమిడిపాటి రాధాకృష్ణ రచించిన  మనస్తత్వాలు నాటకంలోనూ నటించాడు , మనస్తత్వాలు నాటకాన్ని ఐదవ అంతర విశ్వవిదాలయ యువ జనోత్సవాల్లో భాగంగా కొత్త ఢిల్లీలోని తల్కతోరా ఉద్యానవనంలో ప్రదర్శించారు. ఆయన రచించిన అనంతం, ఉత్తమ రేడియో నాటకంగా అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటి సమాచార ప్రసారశాఖామాత్యుడు డా. బి.వి.కేశ్కర్ చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నారు. మనస్తత్వాలు నాటకాన్ని ఆంధ్రా అసోసియేషన్, కొత్త డిల్లీ వారి కోసం ప్రదర్శించారు. ఆ అసోసియేషన్ కు వి.వి.గిరి అధ్యక్షుడు. చైనాఆక్రమణపై తెలుగులో మొట్ట మొదటి నాటకం రచించి, చిత్తూరు, మదనపల్లె, నగరిలలో ప్రదర్శించగా వచ్చిన  సుమారు యాభై వేల రూసాయల నిధులను ప్రధానమంత్రి రక్షణనిధికి ఇచ్చారు.
          చైనా విప్లవంపై తెలుగులో వచ్చిన  మొట్టమొదటి నాటకం 'వందేమాతరం ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పి.వి.నరసింహారావు దానికి ఉపోద్ఘాతం వ్రాశారు. 1959 డిశెంబరు 16'రాగరాగిణినాటకం, అప్పటి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శింపబడింది. దానిని పత్తర్ కే ఆంసూ అనే పేరుతో హిందీలోకి కూడా అనువదించబడింది.
          ఆయన రచనలను భారతదేశంలోని కొన్ని విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని థియేటర్ ఆర్ట్స్ విభాగం లో పాఠ్య పుస్తకంగా నిర్ణయించారు. ఆయన వ్రాసిన కళ్లు' నాటకం ఉస్మానియా విశ్వవిధాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్య పుస్తకం. ఆయన రచనలమీద పరిశోధనచేసి ఎం.ఫిల్ మరియు డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా, వ్యవహరించాడు. తెలుగు సాహిత్యం మీద ఆయన వ్రాసిన రెండు పరిశోధనపత్రాలు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి.
          మారుతీరావు వివాహం 1961నవంబరు 11న విద్యావంతులు, సంగీతజ్ఞుల కుటుంబంలో జన్మించిన శివకామసుందరితో హనుమకొండలోజరిగింది. ఆమె తండ్రి సి. నారాయణరెడ్డి,కాళోజీ నారాయణరావు వంటి ప్రముఖులకు ఉపాధ్యాయునిగా వ్యవహరించారు . ప్రముఖ రచయిత విమర్శకుడు డా, శ్రీపాదగోపాలకృష్ణమూర్తి, మనోధర్మ సంగీతంబాణీ ప్రముఖుడు పద్మభూషణ్ శ్రీ పాద పినాక పాణి ఆమెకు సమీప బంధువులు, మారుతీరావు దంపతులకు ముగ్గురు మగసంతానం - సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్
1992 ఆగష్టు 12న మారుతీరావు చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీ నివాస్ తన తొలి ప్రయత్నంగా ప్రేమ పుస్తకం' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిత్రీకరణ సమయంలో ప్రమాదవశాత్తు జల ప్రమాదంలో మరణించాడు. మారుతీ రావు తనకుమారుని జ్ఞాపకంగా, గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి ప్రతీయేటా ఉత్తమ నూతనసినిమా దర్శకునికి రూ. 1.50 లక్షలు నగదు బహుమతి, ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు శ్రీ బాపు రూపొందించిన బంగారు జ్ణాపికను ప్రధానం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఏదైనా అంశంపై విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవసూచికంగా రూ. 15000/- గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ లెక్చర్ పేరిట బహుకరిస్తారు. ఇప్పటి వరకు అలా ప్రసంగించి, బహుమతులు స్వీకరించిన ప్రముఖులు – సునీతదత్, నసీరుద్దీన్ షా, మృణాల్ సేన్,శ్యాంబెనగల్, జావేద్ అక్తర్, అనుపమ్ ఖేర్ మొదలైన వారు. శ్రీనివాస్ మరణించగా మిగిలిన కుమారులిద్దరూ చెన్నైలో ట్రావెల్ ఏజెన్సేస్ నడుపుతున్నారు.
          సినీ జీవిత రంగప్రవేశానికి వస్తే శ్రీ మారుతీ రావు 1963లో డాక్టర్ చక్రవర్తి' చిత్రానికి స్క్రీన్ ప్లే వ్రాశారు. మారుతీరావుకు అదే తొలిచిత్రమైనప్పటికీ, తొలి ప్రయత్నంలోనే ఉత్తమకథారచనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డ్ లభించింది. నటునిగా ముఖ్య పాత్రధారిగా శ్రీనూరుతీరావుకు "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య " తొలి చిత్రం. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో, మారుతీరావుకు ఇక వెనుకకు చూడవలసిన అవసరం కలగలేదు. 250చిత్రాలకు పైగా నటించిన శ్రీమారుతీరావు సహాయ నటునిగా, హాస్యనటునిగా, ప్రతి నాయకునిగా .. వివిధ పాత్రలలో నటించి మెప్పించారు. సంసారం ఒక చదరంగం, తరంగిణి,త్రిశూలం, అసెంబ్లీ రౌడీ, ముద్దులప్రియుడు, ఆదిత్య 369 .... ఇలా ఎన్నెన్నో మరెన్నో సినిమాలలో ఆయన మరపురాని పాత్రలు పోషించారు.
          శ్రీమారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా, వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కధారచయితగా, స్కీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా –ఐదుసందర్భలలో శ్రీ మారుతీరావు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు స్వీకరించారు. అంతేగాక నాటకాలలో ఉత్తమనాటకానికి, నటనకు, దర్శకత్వ ప్రతిభకు ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.
·         1963 లో డాక్టర్ చక్రవర్తి సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే రుయితగా
·         1965 లో ఆత్మ గౌరవం సినిమాకు ఉత్తమ రచయితగా
·         1989 లో కళ్లు సినిమాకు ఉత్తమరచయితగా
·         1991 లో మాస్టారి కాపురం సినిమాకు ఉత్తమ సంభాషణల రచయితగా
·         2002 లో రాజలక్ష్మి ఫౌండేషన్ విశిష్ట పురస్కారం
·         1975 లో కళ్లు నాటకానికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం
·         ఉత్తమ హాస్యరచనకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారి సర్వరాయమెమోరియల్ బంగారు పతకం
·         2002 లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచిపైడిలక్ష్మయ్య ధర్మనిధిపురస్కారం
·         1985 ల వంశీ ఆర్ట్ థియేటర్స్ నుంచిఉత్తమ నాటక రచనకుగానుగురజాడ పారావు మెమోరియల్ బంగారుపతకం .
·         1959 లో ఆకాశవాణి నిర్వహించిన ఢిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ రేడియో నాటక పోటీలలో ఉత్తమ రచనకుగాను బహుమతి 
·         ప్రశ్న అనే నాటకానికి అఖిలభారత స్థాయిలో మహాత్మా గాంధీసృజనాత్మక సాహిత్య పురస్కారం.
·         1984 లో ఉత్తమ నాటక రచనకు వంశీ బర్కిలీ పురస్కారం.
·         1983లో తరంగిణి సినిమాలో ఉత్తమ హాస్య నటుడి పురస్కారం
·         1985 లో రామాయణంలో భాగవతం సినిమాకు అప్పటి ఆంధ్రప్రదేశ్గవర్నర్ డా. శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా ఉత్తమసహాయనటుడి పురస్కారం
·         1987లో సంసారం ఒక చదరంగం సినిమాలో ఉత్తమ క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎంపిక
·         2015లో లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం
·         ఇవేగాక 2009 లో గుంటూరుకు చెందిన సాహితీ సమాఖ్య,అలనాటి ప్రముఖ రచయిత శ్రీ కొండముది శ్రీ రామచంద్రమూర్తి పేరుమీదుగా నెలకొల్పిన అవార్డును శ్రీ మారుతీరావుకు ప్రధానం చేయడం జరిగింది.
·         అదేసంవత్సరంలో పాలమూరుకు చెందిన బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ నుంచి శ్రీపాద సుబ్రహణ్య శాస్త్రి పురస్కారం అందుకున్నారు .
·         2017లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న పురస్కారం.
          ఈటీవి నిర్వహించిన ప్రతిధ్వని' కార్యక్రమానికి వాఖ్యాతగా వ్యహరించిన శ్రీ మారుతీరావు, విభిన్న రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసారు. ఈ
          ఈటీవి నిర్వహించిన మనసున మనసై అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. ఇది భార్యా భర్తల కోసంఉద్దేశించినది.
          జెమినీ టివి నిర్వహించిన 'ప్రజావేదిక', మా టీవి నిర్వహించిన'వేదిక', దూరదర్శన్, హైదరాబాద్ ప్రసారం చేసిన 'సినీ సౌరభాలు' మొదవైనవి ఆయన నిర్వహించిన ప్రజాదరణ పొందిన కార్యక్రమాలు.
          ఇంకా ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరిగోల వారిదే; ప్రేమలు-పెళ్లిళ్లు, భార్య రూపవతి శత్రు, ఏది నిజం మొదలైన  ధారావాహికల్లో నటించారు.
          ఇక సన్మానాలు, సత్కారాల విషయానికి వస్తే..... . 
·         1994లో బెంగళూరుకు చెందిన మేలుకలయిక
·         1996లో విజయనగరానికి చెందిన విజయభావన
·         2004 ప్రవాసాంధ్రనవ్యకళాపరిషత్, ఖరగ్ పూర్ వారి నుంచి సన్మానం
·         2005లో విపంచి తెలుగు అసోషియేషన్ షార్జా వారి సన్మానం
·         2005లో రసమయి, దుబాయ్ వారిచే సన్మానం
          ఇలా ఎన్నో .... ఎన్నెన్నో .....
          ఇక నిర్వహించిన పదవుల విషయానికి వస్తే..
·         ఆంధ్ర ప్రదేశ్  సాహిత్య అకాడమీ నిర్వహించిన అనేక పోటీల్లో జ్యూరీ సభ్యులలో ఒకరిగా వ్యవహరించారు
·         జాతీయ చలనచిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్ పరిశీలనావిభాగంలో పనిచేశారు.
·         1958లో  జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన అంతర్ విశ్వవిదాలయయువజనోత్సవాలలో, ఆంధ్ర విశ్వవిద్యాలయం తరఫున మనస్తత్వాలు అనే నాటకాన్ని ప్రదర్శించారు.
·         1978లు మద్రాసులో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆకాశవాణి తరఫున సమీక్షకునిగా వ్యవహరించారు.
·         1996లో జరిగిన ఇండియన్ పనోరమాలో  జ్యూరీ సభ్యునిగా వ్యవహరించారు.
·         2000,డిశెంబర్ 8న జరిగిన ప్రపంచ తెలుగు సమావేశంలో కళలు, సంస్కృతి మీద జరిగిన సెమినార్ కు అధ్యక్షునిగావ్యవహరించారు.
·         2007 జూన్ 2,3 తేదీల్లో చెన్నైలో జరిగిన అఖిల భారత తెలుగు సమావేశంలో కవిసమ్మేళనానికి అధ్యక్షత వహించారు.
·         2007 సెప్టెంబర్ 23న కృష్ణాజిల్లాలలో జరిగిన తెలుగు రచయితలసమావేశంలో కీలకోపన్యాసకునిగా వ్యవహరించారు .
          కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న మారుతీరావు, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2019 డిసెంబర్ 12 న మరణించారు.
          బహుముఖ ప్రజ్ఞాశాలి, విభిన్న రంగాలలో తన ప్రతిభను చాటుకున్న శ్రీ గొల్లపూడి మరణం చలన చిత్ర పరిశ్రమకు , సాహితీలోకానికి ఒక గొప్ప తీర్చలేని లోటు. సాహితీ ప్రపంచంలో ఒక ధృవతార రాలిపోయింది.
***No comments:

Post a Comment

Pages