సంస్కారం - అచ్చంగా తెలుగు
సంస్కారం
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


అవంతిపుర శివార్లలో విద్యానందుడు సరస్వతీ విద్యానిలయం గురుకుల పాఠశాలని నెలకొల్పాడు. అక్కడ విద్యనేర్వడానికి పిల్లలు ఉత్సుకత చూపిస్తారు కారణం- అక్కడి ప్రదేశం పచ్చని చెట్లతో, లతలతో, రంగు రంగుల పూలతో, పక్షులతో, జంతువులతో, పొదిరిళ్లలాంటి తరగతి గదులతో, కథలతో- పాటలతో అనునయంగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయులతో ఆహ్లాదంగా ఉంటుంది. ఒకసారి నేర్చుకుంటే విషయాలు జీవితాంతం గుర్తుంచుకుంటారు. అందుకే తల్లిదండ్రులూ అక్కడ తమ పిల్లల్ని చేర్చాలని ఆసక్తి చూపిస్తారు.
ఒకరోజు శివానందయ్య అనే జమీందారు, పూర్ణయ్య అనే వ్యాపారి విద్యానందుణ్ని కలసి తమ పిల్లల్నిపాఠశాలలో చేర్చడానికి వచ్చామని చెప్పారు.
విద్యానందుడు- తమ పాఠశాలలో ఒక్కరి ప్రవేశానికి మాత్రమే అవకాశం ఉందని, కాబట్టి ఇద్దర్నీ సాయంత్రం దాకా పాఠశాలలో వదిలేస్తే, సాయంత్రం ఎవర్ని ఎంపిక చేసిందీ చెబుతానని అన్నాడు.
ఇద్దరూ తమ పిల్లల్ని అక్కడ వదిలేసి వెళ్లిపోయి సాయంకాలం తిరిగి వచ్చారు.
విద్యానందుడు ఇద్దరి వంకా కొద్ది సేపు చూసి- పూర్ణయ్య కొడుకు ఎంపికయినట్టుగా చెప్పాడు. అది విన్న జమీందారు నిప్పులు తొక్కిన కోతిలా కోపంతో గంతులేసాడు. పాఠశాలనీ, విద్యానందుణ్నీ నోటికొచ్చిన మాటలన్నాడు.
అంతలో విద్యానందుడు ఒక కాగితం పరీక్షగా చూసి ఫలితం వెళ్లడించడంలో పొరపాటైందని జమిందారు కొడుకే ఎంపికయ్యాడని చెప్పాడు.
జమీందారు వెంటనే నవ్వుతూ తన కొడుకు కాక మరెవరు ఎంపికవుతారని గర్వంగా అని మీసాలు మెలేస్తూ కుర్చున్నాడు. పూర్ణయ్య తన కొడుక్కి ఉత్తమ పాఠశాలలో చదివే యోగం లేదని చింతిస్తూ లేచి వెళ్లబోయాడు.
అప్పుడు విద్యానందుడు- ఆగు పూర్ణయ్యా, నీ కొడుకే ఈ సరస్వతీ నిలయంలో చదువుకోడానికి ఎంపికయ్యాడు. ఉదయం నుంచి మీ ఇద్దరి పిల్లల్నీ శ్రద్ధగా గమనించాం. శివానందయ్య కొడుకు ఆకులు, పూలు తెంపి, కుందేళ్లను, ఉడతలను హింసించబోతుంటే ఆపడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అదే పూర్ణయ్య కొడుకైతే తోటలోని అందాల్ని కళ్లార్పకుండా చూస్తూ మొక్కలకు,పాదులకు కుదుళ్లు తీసి, నీళ్లు పోసి, కొమ్మల్ని రెమ్మల్ని చక్కగా ఒక పక్కగా కట్టాడు. పక్షులతో జంతువులతో జత కట్టాడు. ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పే తీరుని శ్రద్ధగా గమనించి తరగతి గదిలోకి వెళ్లి కూర్చున్నాడు. చిన్న వయసులోనే పరిమళించిన సంస్కారం అది. పిల్లలకు తల్లిదండ్రులనుంచే అది అలవడుతుంది. ఇందాకటి శివానందయ్య ప్రవర్తనే దానికి ఉదాహరణ అన్నాడు విద్యానందుడు.
ఆ మాటలకి సిగ్గుపడి తన ప్రవర్తన మార్చుకుని పిల్లాడిని తీర్చిదిద్దిన తర్వాతే అక్కడికి రావాలన్న నిర్ణయం తీసుకుని పశ్చాత్తాపంతో బయటపడ్డాడు శివానందయ్య.
***


No comments:

Post a Comment

Pages