నాద యోగి ఘంటసాల - అచ్చంగా తెలుగు
నాద యోగి ఘంటసాల 
బి.యన్.వి. పార్ధసారధి 
4.12.2019.


“కొందరు గాయకులు తమ గాత్రాన్ని శృతి తో మేళవించడానికి ప్రయత్నిస్తారు. కానీ, శ్రీ ఘంటసాల గారి గాత్రం లోనే శృతి పలుకుతూ వుంటుంది. ఇది ఒక అపూర్వ సృష్టి విధానం. గంధర్వాంశ సంభూతులకు గాని, ఇటువంటి గాత్ర సంపద లభించదు. “  అన్నారు వి. నాగయ్య గారు. 
సప్త స్వరాలని అవలీలగా నవరసాలని అలవోకగా అవుపోసన పట్టిన సాటి లేని మేటి గాయకులు శ్రీ ఘంటసాల. శబ్దం  లో ఆకారం నాభి నుంచి, ఉకారం ఊపిరి తిత్తులనుంచి, మకారం శిరస్సు నుంచి ఉద్భవిస్తాయని అంటారు. ఉచ్చ్వాసం లో “సో” అన్న శబ్దం నిశ్వాసం లో “హం” అన్న శబ్దం వస్తుంది. ఈ “సోహం “లో “స, హ” అక్షరాలూ తీసేస్తే ఆ “ సోహం “ లో దాగివున్న  ఓంకారం గోచరిస్తుంది. శ్వాస ని  స్వరం (నాదం) తో సమంగా మేళవించ గలిగిన గాయకులు సంగీత సాధకులవుతారు. అటువంటి సంగీత సాధకులలో అగ్రగణ్యులు , నాద యోగి ఘంటసాల.

శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవిని విద్య ని నేర్చుకోవటానికి వెళ్ళిన కచుడిని రాక్షసులు సంహరించి అతని భస్మాన్ని సురా పానం లో  కలిపి తమ గురువైన శుక్రాచార్యుల  చేత త్రాగిస్తారు. తాను  మోహించిన కచుడి జాడ తెలియక దేవయాని వ్యధ తో తన తండ్రి శుక్రాచార్యుడిని  ఆశ్రయిస్తుంది. దివ్య దృష్టి తో జరిగినదంతా గ్రహిస్తాడు శుక్రాచార్యుడు. అప్పుడు తన తపోశక్తి తో తన దేహం లో భస్మమైవున్న వున్న కచుడిని బ్రతికించి అతనికి మృత సంజీవని ని ఉపదేశిస్తాడు. ఆ పిమ్మట కచుడు శుక్రాచార్యుడి శరీరం నుంచి వెలుపలికి రాగా శుక్రాచార్యుడు విగత జీవి అవుతాడు. తాను ఉపదేశ పూర్వకం గా నేర్చుకున్న మృతసంజీవిని విద్య తో మరల శుక్రాచార్యుడిని కచుడు పునరుజ్జ్జేవితుడిని చేస్తాడు. ఈ సన్నివేశం లో శుక్రాచార్యుడి శరీరం నుంచి వెలుపలికి వస్తున్న కచుడిని వర్ణిస్తూ భారతం లో నన్నయ , “ ఉచ్చారణ దక్షు చేత అభిహితం బగు శబ్దం నట్లు బోలె “ అంటాడు.  అక్షరాలకి జీవం పోసే శక్తి ఉచ్చారణకి వుంది. అటువంటి ఉచ్చారణ శక్తి జన్మతః గలిగిన గంధర్వాంశ సంభూతులు ఘంటసాల గారు. 
ఒక వైపు అగ్ర నటులకి, మరొకవైపు హాస్య నటులైన రేలంగి వంటి మహానటులకి వారి వారి గాత్రాలకి  అనుగుణంగా తన  స్వరాన్ని మలచుకున్నా తనకంటూ ఒక ప్రత్యెక ఒరవడి ( స్వరవడిని) ని కలిగిన వ్యక్తి ఘంటసాల. లలిత సంగీతాన్ని , తెలుగు వాడికే సొంతమైన పద్యాన్ని  తెలుగు చలన చిత్ర రంగం లో ఒక ఉన్నత స్థాయిన నిలబెట్టిన సంగీత దార్శనికులు ఘంటసాల.    
బాల్యములో ఉగ్గుపాలకిబదులు
నీ తల్లి తేనె,పంచదారలు పట్టినదేమో
ఆ నాటినుంచి తేనె మాధుర్యాన్ని
పంచదార తియ్యదనాన్ని సంతరించుకున్నాయి

నీ శ్వాస లో ప్రణవనాదం
నీ నడకలో తాళం
నీ నడతలో శృతి 
నీ జీవితమే సంగీతము

సప్తస్వరాల పేటిక నీ గళము
నవరసాల మూట నీ హృదయము 
రాగాలకు పుట్టినిల్లు నీ మస్తిష్కము
ఘంటాపధముగా ఘంటసాల పాటల టంకశాల   
తెలుగు భాష వున్నంత కాలం ఘంటసాల జీవించి వుంటారు అనటం కన్నా ఘంటసాల గారి పాట ఉన్నంత ( విన్నంత) కాలం తెలుగు భాష బ్రతికి వుంటుంది అనటం సముచితం. 
(అమర గాయకులు ఘంటసాల గారి 97 వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ)
***

No comments:

Post a Comment

Pages