పద్మలోచన శతకము - ధమరశింగి గురాచార్య - అచ్చంగా తెలుగు

పద్మలోచన శతకము - ధమరశింగి గురాచార్య

Share This
పద్మలోచన శతకము - ధమరశింగి గురాచార్య
పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం కవి పరిచయం:

ధమరసింగి గురాచార్యకవి 20వ శతాబ్ధపు ప్రధమార్ధంలోని కవి. విశ్వకర్మ కుల సంజాతుడు. తండ్రి బుచ్చిలింగం. కుంటినవలస నివాసి. గురువు పేరి రామయ్య గారు. ఈశతకంలో కవి తన గురించి ఇలా చెప్పికొన్నాడు.

ఉ. శ్రీరమణీరమౌధమరఁశింగివరాన్వయ బుచ్చిలింగకౌ
మారుఁడ విశ్వకర్మకుల మందు జనించినవాఁడఁనేగురా
చారిసమాఖ్యుఁడస్తమవిశాలపదంబులకంకితంబుగాఁ
గాఁరచింయించ బూనితిని గైకొని బ్రోవుము పద్మలోచనా!!

శతకాంతమున ఈకవి తన వంశక్రమమును వర్ణించినాడు.
" శ్రీలక్ష్మీనారదాండజానంతసమేత, శ్రీసత్యన్నారాయణా పరబ్రహ్మ పదారవింద ధ్యానసంప్రాప్తకవితామాధురీధురీణిండిను, వీణాగాన ప్రశంసకుండును, ధమరశింగి నామాంక విశ్వబ్రాహ్మణాకులోద్భవ గురులింగాచార్య ప్రపౌత్రుండును, తద్గర్భాభి జనాబ్ధి సంజనితేందు బుచ్చి లింగాచార్య పౌత్రుండును, అమ్మ నామాఖ్యాంబ సత్పుత్రుండును, సుబ్బారావాచార్యాను జన్ముండును, యగు గురాచార్యకవి విరచితంబగు పద్మలోచన మకుటాంచిత చంపకోత్మల పద్య శతపంచక సతకము సంపూర్ణము."

ఈ కవి గురించి ఇతర వివరాలు లభించటం లేదు. 

శతక ఫరిచయం

పద్మలోచన శతకం భక్తిరస ప్రధాన చంపకోత్పలమాల వృత్తాలలో రచింపబడిన 105 పద్యాలతో నిండిన శతకం. ఇందలి పద్యాలలోని భాష సరళంగా ఉండి, చదివేవారికి సులభంగా అర్థం అయ్యే రీతిలో ఉంటాయి. భాగవత దశమ స్కంధంలోని ఘట్టాల ఆధారంగా రచింపబడిన పద్యాలు మనకు ఇందులో కనిపిస్తాయి. దశావతార వర్ణన ఈశాతకంలో 37 వ పద్యము నుండి చేసినాడు.
కృష్ణుని బాల్యక్రీడలను వర్ణించే ఈ పద్యాలను చూడండీ

ఉ. కోరికవస్త్రముల్విడిచి గోకులకాంతలు స్నానమాడగాఁ
వారికిఁ గానరాక తరువద్దను దాగియు కట్టుకోకల
న్చోరతనంబు జేసితివి చోద్యమునీ కధలెన్ని విన్ననా
నోరునఁనీ చరిత్రములు నుడ్వుట శఖ్యమ పద్మలోచనా!

ఉ. మన్ను దినంగఁ నిన్నుఁగని మాతయశోదసహించలేకఁ నిం
దిన్నగనుండ వేటికని తీసుకముద్దిడి నీదునోటనే
మన్నుదిజూపుమన్నఁ నగి మూడుఁజగంబులఁజూపినావునీ
కన్నను ప్రౌఢలెవ్వరికఁ గల్గుదురీభువి పద్మలోచనా! (విశ్వరూప సందర్శనం)

చ. కడువడి వేడ్కతోడఁజని గజ్జలునందెలు ఘల్లుమ్రోయగ
న్మడుగున డిగ్గియిందునికి మానుమటంచును జెప్పి కాళీయు
న్పడగలపైని శాస్త్రమగు పద్ధతిఁమీరనృత్యమాడునీ
యడుగులఁ పూజజేసెదను యాశ్రితవత్సల పద్మలోచనా! (కాళీయమర్థనం)

ఉ. గోపనులేంద్ర కోపకుల కుఱ్ఱలఁ గూడియు గోగణంబుల
న్మేపనరణ్య సీమజనఁమెండగు వర్షము వజ్రినీపయిం
గోపమనస్కుడై గురియఁ గోవులఁ గోపులఁ గావగాగిరిం
గావుగఁకేల నెత్తితివిఁ కందుకమట్లుగ పద్మలోచనా!

ఉ. కృరమతంపు కౌరవులు కృష్ణుఁడద్రౌపతివస్త్రహీనముం
గారచియించఁయూహగొనగాఁ గని మానముమెల్గనీయకన్
చీరకుఁ జీరనిచ్చితివి చిత్రము నీమహిమంబు లింకనా
భారమునీదె మానినను బ్రోచిన నియ్యదె పద్మలోచనా!

కల్లు త్రాగుట, పేకాట, మొదలైన దుర్వ్యసనాలగురించి, కామక్రోధ మద మాత్సర్యాల గురించి కూడా ఈశతకంలో పద్యాలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఈ పద్యాలు చూడండి.

ఉ. కల్లునురంబుఁ ద్రావి కనుగానకఁ పాపులు చెల్లెలక్కలన్
తల్లుల నన్నదమ్ములను దారణభాషలుబల్కి పొర్లుచు
న్వొల్లునెరుంగలేక భవమొందియుఁ దుర్గతికేగువారు ని
న్నుల్లమునందుఁ యొక్క క్షణ మోపిక గొల్వరు పద్మలోచనా!

ఉ. పేకల నాడుకొంచు నిరుపేదల జూడక ముష్కరాళియి
స్తూకుఁకళావరాసుయిది జోకరుజాకి మణేలయంచుచే
రూకలఁఖర్చుబోవుచును రూఢినెరుంగకఁగొట్టులాడుచున్
లోకులుకొందరిట్లు మదిలో నినుగొల్వరు పద్మలోచనా!

కొన్నిపద్యములు ఈతర గ్రంధములలోని పద్యాలకు అనుకరణలు గా కనిపిస్తాయి.

చ. మరణ సమీపమందునిను మానసమందిడనీక రోగము
ల్మరుపునుజెందజేయుఁమతిమంతునకైననుఁ గాక కాలకిం
కరులికరమ్మురమ్మనుచుఁ గాఢకుఠారముద్రిప్పుచుండనా
తరినను యెట్లు బ్రోచెదవో తండ్రిగజావన పద్మలోచనా!

దశావతార పద్యములలో కొన్ని మచ్చుకి

ఉ. కుచ్చుగసోమకాసురుఁడు కోపరసంబున నాల్గువేదముల్
మృచ్చిలివార్ధిలోనఁయొక మూలనుడాగగఁ మచ్చరూపమై
జొచ్చిపడంగగొట్టిశృతి సంఘము దెచ్చియు బ్రహ్మకిచ్చితౌ
మెచ్చగఁవచ్చులోకములఁ మేటివటంచును పద్మలోచనా!

చ. చిరుతడుఁ నీదు భక్తులలో శేఖరుఁడౌ ప్రహ్లాదుపై నిదు
శ్చరితుఁడు హేమకశ్యపుఁడు శాత్రవుఁడైసుతుఁభధపెట్టగా
నరహరి రూపివై దనుజనాధుని చించివధించితీవు నీ
సరియగు శక్తి ధైర్యములఁ సాహసులెవ్వరు పద్మలోచనా!

చ. యిరువదియొక్కమారు నృపతీశుశిరంబులఁదృంచిమెట్టులే
ర్పరచితో స్వర్గసీమలకు భార్గవరాముడ కార్తవీర్యుని
న్దురమునదృంచినావు భవదూర నమస్కృతినీకుఁ నిన్ను నేఁ
మరువక ఖక్తిజేసెదను మానసమందున పద్మలోచనా!

ఈ ప్రహేళిక వంటి పద్యాన్ని చూడండి

ఉ. వారిజగర్భుసూతియగు వానికిమాతయుఁ దానియత్తకుం
గూరిమిగల్గు సోదరుని కోరిధరించినవానిచేతఁనా
కారముడుళ్లువాని జనకా వినునా మొర విస్తరించెదన్
ధీరునిజేసి బ్రోవుననుఁ దీక్షవహించియుఁ పద్మలోచనా!

భాగవతములోని పద్యములతో పాటు ఈ శతకములో శ్రీరాముని రూపమున తలచి వానిపై పద్యములనుచెప్పారు. చివరగా మంగళం తో శతకాన్ని పూర్తిచేసాడు కవి.

ఎంతో చక్కని శతకం. మీరు చదవండి. మీ మిత్రులచే చదివించండి.
***

No comments:

Post a Comment

Pages