జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 25 - అచ్చంగా తెలుగు

జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 25

Share This
                                                                    జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 25
చెన్నూరి సుదర్శన్ (జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.)  

“మాష్టారూ..మీరు ఫాకల్టీ అంటే కంప్యూటర్‍లో ప్రావీణ్యులు.. ఎప్పుడు నేర్చుకున్నారు? ఎలా నేర్చుకున్నారు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు?” అంటూ ప్రశ్నలు పరంపర కొనసాగించాను.
            “ప్రావీణ్యత ఏమో గాని నేర్చుకోవడమైతే నేర్చుకున్నాను. మాకూ మీలాగే కొన్నాళ్ళ క్రితం ట్రైనింగ్
ఇచ్చారు. నేను మరింత సాధన చేసాను. ప్రస్తుతం నల్లకుంట దగ్గర  శంకర్‍మఠ్‍కెదుర్గా  సాయిబాబా కాలనీలో కొందరు ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నాను”
            “సిటీలోనే ఉంటున్నారా.. తెలిస్తే ఎప్పుడో కలుసుకునే వాణ్ణి..”
            “ఈ మధ్యనే వచ్చాను. అదీ తాత్కాలికమే.. డిప్యుటేషన్”
“ ఓ.. అలాగా.. పద్మ మేడం గారు ఎలా ఉన్నారు? రికవరయ్యారనుకుంటాను”
            “లేదు మాష్టారూ.. నన్ను ఒంటరివాన్ని చేసి ఏనాడో వెళ్ళిపోయింది”.
            నా మనసు ద్రవించింది.. డీలా పడిపోయాను.
            “సారీ మాష్టారూ..” అంటూ సానుభూతి తెలిపాను.  నాకు తెలుసు.. ఆమె బతకడం చాలా  కష్టమని. ఎముకల గూడుకు చర్మం కప్పుకున్నట్లున్న ఆమె రూపం నాకింకా మదిలో కదలాడుతూనే ఉంది.
            “అయితే ఇప్పుడు మీ అల్లుడు మహేష్,అమ్మాయి  రోజారాణి వద్ద ఉంటున్నారా.. తాతయ్య అయ్యారను కుంటాను..” అంటుంటే  నా పెదవులు తృప్తిగా విచ్చుకున్నాయి.
“లేదు మాష్టారూ.. మహేష్ మా అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు”
            “అదేంటి.. మాష్టారూ..!” నిర్ఘాంతపోయాను.
“అదో పెద్ద కథ మాష్టారూ” అంటూ కాసేపు మౌనంగా ఉండి పోయాడు. నాకూ నోట మాట రాలేదు.
            “మహేష్ బి. టెక్. ఫైనలియర్లో క్యాంపస్ సెలక్షన్ వచ్చింది. ట్రైనింగ్ అంటూ పూణే వెళ్ళాడు. ట్రైనింగ్ తరువాత బెంగళూర్లో జాయినయ్యాడు.. అందులో ఒక అమ్మాయి వలలో పడ్డాడు. డబుల్ ఇన్‍కం అని సంబరపడ్డాడు. ఆ అమ్మాయినే  పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు.
నా సిస్టర్ శాంత ఒప్పుకోలేదు.
            ఇంతకాలం మామయ్య ఉప్పు తిని రోజాకు అన్యాయం చేస్తావా.. అలా అయితే నేను చస్తానని మహేష్‍ను బెదిరించింది. అయినా వాడు తల్లి మాట లెక్క చెయ్యలేదు. నువ్వు చచ్చినా మంచిదే నేను మాత్రం ఆ మూగదాన్ని
చేసుకోనంటూ కుండబద్దలు కొట్టినట్టు తన నిర్ణయం చెప్పాడు. నా రోజా కన్నీరు మున్నీరయ్యింది”
            నేను ఎప్పుడూ చూడని విజయకుమార్ కళ్ళల్లో నీళ్ళు.. నా హృదయాన్ని కదిలించింది. నా కళ్ళూ చెమ్మగిల్లాయి.
            “మా అమ్మాయిని  అర్థం చేసుకుంటాడనే కదా.. అతన్ని  చదివించింది.. అయినా ‘మ్యారేజస్  మెడ్ ఇన్ హెవెన్ అన్నారు. మనం బాధ పడి ఏంలాభం?..”
            “మరి ఇప్పుడు రోజా..” నా సందేహాన్ని వెలిబుచ్చాను.
            “పెళ్ళి అయింది మాష్టారు.. అ భగవంతుడు నిజంగా దయామయుడు.
            నా స్టూడెంట్ స్వయంగా ముందుకు వచ్చి రోజా చెయ్యి అందుకున్నాడు. అతడు మా కుటుంబానికి పరిచితుడే.. అప్పుడప్పుడు తన క్లాస్ రూమ్ డౌట్స్ క్లియర్ చేసుకోడానికి మా ఇంటికి వచ్చే వాడు. మహేష్ చేసిన ద్రోహం గురించి తెలుసుకున్నాడు.
అభ్యంతరం లేకుంటే రోజాను వివాహం చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. నేటి సమాజంలో ఇంకా కులం పట్టింపులా..? రోజా ఒప్పుకుంది.. నేను సరే అన్నాను.
ఇప్పుడు వారికొక అమ్మాయి..
అమ్మాయి మాటల్లో.. చేతల్లో రోజా మైమరచి పోతోంది. ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నారు. అల్లుడు అమెరికన్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్”
“చాలా సంతోషం మాష్టారూ..” నా ఆనందాన్నంతా మాటల్లో కుమ్మరించాను.
           “మీ అక్కయ్య గారు  మహేష్ దగ్గర ఉంటోందనుకుంటాను ”
విజయకుమార్ స్పందించ లేదు. దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనబడ్డాడు.
పాపం..! ఒంటరి.. ఎంతైనా కొడుకు. పెళ్లి విషయంలో మాట పట్టింపు వచ్చినా కొడుకు తప్ప ఆమెకు దిక్కెవరున్నారు. అని మనసులో అనుకుంటున్న నాకు విజయకుమార్ మాట పిడుగులా వినబడింది.
“అక్కయ్య ఆత్మహత్య చేసుకుంది మాష్టారూ” 
నాగుండె ఝుల్లుమంది.
***

No comments:

Post a Comment

Pages