మానస వీణ -4 - అచ్చంగా తెలుగు
మానసవీణ - 4
(గొలుసుకట్టు నవల)
పెయ్యేటి రంగారావు. 
         

         

చిదిమి దీపం పెట్టుకోవచ్చుననేంత సౌందర్యరాశి మానస.  సంపంగి తావును, సంధ్యారుణ శోభను,మలయానిలాన్ని, వసంతాగమన సూచక పికకూజితాన్ని కలగలిపి, పోతపోసి, సృష్టికర్త రచించిన సమ్మోహక మానవాకృతి మానస.  అంతటి బాహ్య సౌందర్యాన్ని,జాహ్నవీసలిలమంతటి స్వఛ్ఛమైన అంత:కరణను ప్రసాదించిన చతుర్ముఖుడు ఆమె నొసట ఏమి లిఖించాడో మరి, పుట్టుకతోనే తలిదండ్రులకి దూరం కావలసి వచ్చింది ఆమె.  ఎందుకల్లా జరిగిందో మనమన్నా తెలుసుకోవాలి కదా? 

ఐతే అంతకన్నా ముందు మానస వ్యక్తిత్వాన్ని పరిచయం చేసే ఒక సంఘటనని ఇక్కడ ఉల్లేఖించి తీరాలి.

ఒకరోజు ఉదయాన్నే మానస అనాథశరణాలయం లోని ఉద్యానంలో వాహ్యాళికి వచ్చింది.  రోడ్డుకి ఆవలివైపు ఉన్న ఒక పాడుపడ్డ పెంకుటింటి అరుగుమీద ఒక ముదుసలి స్త్రీ పడివుంది.  ఆమె నిస్త్రాణగా దాహం,దాహం అంటూ అరుస్తోంది.  రోడ్డుమీద జనసంచారం బాగానే వుంది.  కాని ఎవరూ ఆమెను పట్టించుకోటల్లేదు.  మానస ఒక చెంబులో నీళ్ళు తీసుకుని  పరిగెత్తుకుంటూ ఆ ముదుసలి దగ్గరకు వెళ్ళి, ' అవ్వా!  ఈ నీళ్ళు తాగు'అంది.  కాని అవ్వ వినిపించుకునే పరిస్థితిలో లేదు.  అలాగే నిస్త్రాణగా పడివుంది.  మానస మెల్లగా ఆమెను లేవనెత్తి, పొదివిపట్టుకుని, నీళ్ళు కొద్దికొద్దిగా తాగించింది.  అప్పటికి అవ్వ కొంచెం తేరుకుంది.  అప్పుడు మానస అడిగింది, ' అవ్వా!  అన్నం తిన్నావా?'  అవ్వ లేదన్నట్లు తల అడ్డంగా ఆడించింది.  మానస పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళ్ళి గిన్నెలన్నీ వెతికింది.  కొద్దిగా అన్నం మిగిలివుంది.  అది కంచంలో పెట్టుకుని, అందులో కొద్దిగా మజ్జిగ కలిపి, మెత్తగా పిసికి తీసుకు వెళ్ళింది.  అవ్వ గోడకి జేరగిలబడి కూచుని వుంది.  మానస ఆమె దగ్గరకు వెళ్ళి, అవ్వకు నెమ్మదిగా ఆ మజ్జిగ కలిపిన అన్నం చెంచాతో తినిపించింది.  అవ్వకి కాస్తంత బలం వచ్చింది.  ' ఏ తల్లి కన్న బిడ్డవో!  సుఖంగా వుండు బిడ్డా.'అంది.  మానస కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.

' అవ్వా, నీకెవ్వరూ లేరా?' అని అడిగింది.

'లేకేం తల్లీ?  ముగ్గురు మగబిడ్డలు ఉన్నారమ్మా.  నా పెనిమిటికి ఆళ్ళ సంగతి బాగా తెలుసేమో మరి, ఆస్తంతా నా పేర రాసేసి చనిపోయాడమ్మా.  ఆస్తి నా పేరు మీద వున్నంత వరకూ నా బిడ్డలు నన్ను మహరాణిలా చూసుకున్నారమ్మా.  ఆళ్ళని నేను పూర్తిగా నమ్మేసానమ్మా.  ఆళ్ళు ప్రేమంతా ఒలకబోసి అడుగుతే కాదనలేక ఆస్తి ఆళ్ళ పేరు మీద రాసేసానమ్మా.  అంతే,రోజుల్లో వాళ్ళ ప్రేమంతా ఇగిరిపోయి, నన్ను వీధిలోకి గెంటేసారమ్మా'

' ఆహా, కన్నతల్లి విలువ తెలీని సుపుత్రులూ!  మీరు గడ్డినాశించి కామధేనువును బయటకు గెంటేసారు.  నేను కన్నతల్లి విలువను తెలుసుకుని కూడా ఆమెకు దూరమై ఇలా కుమిలిపోతున్నాను.' మానస దీర్ఘంగా నిట్టూర్చి శరణాలయంలోకి వెళిపోయింది. 

ఆ సాయంత్రం రోడ్డు మీద జనం గుమిగూడి వున్నారు.  మానస ఏమిటా అని చూడడానికి వెళ్ళింది.  ఆ అవ్వ చనిపోయి వుంది.  మునిసిపాలిటీ వాళ్ళు వచ్చి ఆమెను మినీలారీలో ఎక్కించుకుని తీసుకుపోయారు.  మానస మనసు విలవిలలాడిపోయింది.  ఆమెకూ తనకూ ఏ జన్మలోని ఋణానుబంధమో!  ఆమెకు తాను ఏ జన్మలో ఏమి ఋణపడి వుందో, ఈ జన్మలో ఆమెకు మంచినీళ్ళు ఇచ్చి, అన్నం పెట్టి ఆ ఋణాన్ని తీర్చుకుంది.  మానస ఆ అవ్వ ఆత్మకు శాంతి కలగాలని, ఆమెకు మరుజన్మలో సకల సంపదలు, సౌభాగ్యాలు లభించాలని భగవంతుణ్ణి ప్రార్థించింది.

**** 

శ్రావణి మంచం మీద పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది.  'పాపా, పాపా!  నా బంగారుతల్లీ!  నన్ను విడిచి ఎక్కడికి వెళిపోయావమ్మా?  పుట్టిన మూడు నెలలకే ఋణం తీరిపోయిందా తల్లీ?'  అని రోదిస్తోంది.

పదిహేను సంవత్సరాలుగా ఇదే తంతు. 

అసలేం జరిగింది?

పదిహేను సంవత్సరాల క్రితం..............

' ఇదుగో కోడలుపిల్లా!  పురిటికి పుట్టింటికి వెళుతున్నావు.  కొడుకునే కనాలి సుమా!  కూతుర్ని కన్నావో, మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కనివ్వను.' అత్తగారు అనసూయమ్మ గారి హెచ్చరిక!

' శ్రావణీ!  మీ అత్తగారు చెప్పింది విన్నావుగా?  కూతుర్ని కంటే నీ పెళ్ళి పెటాకులూ, నీకు విడాకులే.  గుర్తు పెట్టుకో.'మామ భూషణంగారి హుంకరింపు.

శ్రావణి వణికిపోతూ పుట్టింటికి ప్రయాణమైంది.

నెలలు నిండాయి.  శ్రావణికి నొప్పులు మొదలవగానే ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.  రెండుగంటల నరకయాతన అనుభవించాక కువ్వా, కువ్వా అంటూ పసిపాప ఏడుపు వినిపించింది.  శ్రావణి చెవిలో ఎవరో అన్నారు.  'మహలక్ష్మి పుట్టిందమ్మా.  నువ్వు అదృష్టవంతురాలివి.'

మూడవనెలలో శ్రావణి అత్తవారింటికి పాపతో చేరుకుంది.  తల్లి, తండ్రి దిగబెట్టి వెళిపోయారు.

అప్పట్నించీ శ్రావణికి వేధింపులు మొదలయ్యాయి.  ఆమె అత్తమామలు కొడుకు రఘురాంని రెండోపెళ్ళి చేసుకోమన్నారు.  మళ్ళీ బోలెడు కట్నం కూడా వస్తుందని ఆశ పెట్టారు.  రఘురాం ఒప్పుకోలేదు.  రెండోపెళ్ళి చేసుకుంటే తనకి జైలుగతి పడుతుందని హెచ్చరించాడు.

ఉన్నట్టుండి ఒకరోజు ఉయ్యాలలో వున్న పాప మాయమయింది.  సమయానికి అత్తమామలు లేరు.  వారు రెండురోజుల క్రితమే కూతురింటికి  వెళ్ళారు.  రఘురాం అన్ని చోట్లా వెతికించాడు.  ఎక్కడా కనపడలేదు.  చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు.

పాప మాయమైన రెండోరోజు అత్తమామలు ఊర్నించి వచ్చారు. 

శ్రావణి వారి కాళ్ళమీద పడి ఏడ్చేసింది.  '  మామయ్యా!  అత్తయ్యా!  నా పాప, నా పాప కనిపించటంలేదు మామయ్యా!  నా పాపని నాకు తెచ్చివ్వండి మామయ్యా!'

మామగారైన భూషణంగారు అన్నారు. ' అయ్యో అమ్మా!  ఇదంతా ఎలా జరిగిందమ్మా?'

అత్తగారు ఏడుస్తూ అంది, ' అంతా మా తలరాత.  మేం అసలు ఊరెళ్ళకుండా వున్నా ఈ అఘాయిత్యం జరిగివుండేది కాదు.  ఏమండీ, మీరు ఎలాగైనా నా మనవరాలిని వెతికించి తీసుకురండీ.'

భూషణంగారు అన్నారు, ' ఊరుకో అనసూయా!  నాకు మాత్రం బాధగా లేదూ?  ఎవరో దొంగవెధవలు డబ్బు కోసం నా బంగారుతల్లిని కిడ్ నాప్ చేసివుంటారు.  రేపో మాపో ఫోను చేసి డబ్బు అడుగుతారు.  వాళ్ళు ఎంత అడిగినా సరే, తీసికెళ్ళి వాళ్ళ మొహాన కొట్టి నా మనవరాలిని నేను దక్కించుకుంటాను.  అమ్మా శ్రావణీ!  ఊరుకో తల్లీ. మన పాప తప్పకుండా మనింటికి క్షేమంగా తిరిగి వస్తుంది.'

కాని పది రోజులైనా ఏ ఫోనూ రాలేదు.  పాప ఆచూకి కూడా దొరకలేదు.

'ఆ రెండురోజులూ అత్తయ్య, మామయ్య నిజంగానే కూతురింటికి వెళ్ళారా?  ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? పాలేరు ఓబులేసు కూడా ఆ రెండురోజులూ లేడు కదా? వాడు ఎక్కడికి వెళ్ళివుంటాడు?' శ్రావణి తీవ్రంగా ఆలోచిస్తోంది.

రోజులు గడిచిపోతున్నాయి.

*** 

ఓబులేసు మంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి వెళుతున్నాడు.

కృషీవలరావు అడిగాడు, ' ఎందుకు నాన్నా, దిగులుగా వున్నావు?  అనుకోని అదృష్టం మన ఇంటి తలుపు తట్టింది.  నువ్వు మంత్రి కాబోతున్నావు.  ప్రజలకి సేవ చేసే భాగ్యం నీకు దక్కింది.  ఇంతకన్నా కావల్సిందేముంది నాన్నా?'

' ఔను నాయనా.  దేశసార్వభౌమాధికారాన్ని కాపాడతానని, నీతిగాను, నిజాయితీగాను వుంటానని ప్రమాణం చెయ్యడానికి నేను వెళుతున్నాను.  కాని ఆ ప్రమాణానికి ఎంత విలువ వుంటుంది?  కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబధ్ధం చెప్పనని సాక్షులంటారు.  కాని ఎంతమంది పచ్చినిజాలు మాత్రమే చెబుతున్నారు?  అల్లా నిజాలే చెప్పినట్లైతే అసలు కోర్టుల్లో ఇన్ని లక్షల వ్యాజ్యాలు మురిగిపోతూ వుండవు కదా?  అల్లాగే ప్రజాప్రతినిధులందరూ ప్రమాణం చేసిన ప్రకారం నీతిగాను, నిజాయితీగాను పరిపాలన సాగిస్తే ఈనాడు భారతదేశం అమెరికా కన్న అగ్రభాగాన నిలిచివుండేది.  నన్ను ఎం.ఎల్.ఏ. గా చేసినది భూషణంగారు.  ఆయన గంగిగోవులా కనిపించే పులి.  ఆయన చెప్పుచేతల్లో నేనుండకపోతే నా ప్రాణాలు ఒక్క క్షణంలో గాల్లో కలిసిపోతాయి.'

' అది నువ్వు పాలేరుగా వున్నప్పుడు నాన్నా.  ఇప్పుడు నువ్వు మంత్రి కాబోతున్నావు.  ఇప్పుడు నువ్వు ఆయనను శాసించే స్థితికి ఎదుగుతున్నావు.'

ఓబులేసు విషాదంగా నవ్వాడు.  ' సర్లే, నీకీ రాజకీయాలు తెలవ్వు గాని, నీతో ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను.  మన పెరట్లో వేపచెట్టు మొదట్లో నేను ఒక చిన్నపెట్టె పాతిపెట్టాను.  అందులో నా వీలునామా రాసి వుంచాను.  నాకేమైనా ఐతే అది నువ్వు తీసి చదువు.'

కృషీవలరావు ఫక్కున నవ్వాడు.  ఉన్నది ఒక్క పూరిపాక.  అందులో తన తండ్రి, తను తప్ప ఎవ్వరూ లేరు.  ఆయన తదనంతరం ఆ పాక తనదే అవుతుంది.  ఇంక దీనికి వీలునామా ఒకటా?

' సర్లే నాన్నా.  నీకు టైమవుతోంది పద.'

' అవున్రా.  నాకు టైమయిపోయింది.'

ఓబులేసు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి వస్తూండగా భూషణం గారి ప్రత్యర్థివర్గం వారు ఓబులేసుని గొడ్డళ్ళతో నరికి చంపారు.  ఆ తర్వాత కృషీవలరావు మధ్యంతర ఎన్నికలలో నిలబడి నెగ్గడం, మంత్రి కావడం,  తరువాతి ఎన్నికలలో మళ్ళీ గెలుపొంది హోంమంత్రి కావడం జరిగాయి.

కృషీవలరావు స్వాతంత్ర్యదినోత్సవం నాడు కాలేజికి పతాకావిష్కరణ చెయ్యడానికి ఆలస్యంగా వెళితే అక్కడ ఒక పాప తనను నిలదీసింది.  ఆ పాపను చూడగానే కృషీవలరావు నిర్ఘాంతపోయాడు.  ఆ పాపను చూస్తూంటే ఎక్కడో ఎప్పుడో చూసినట్లు అనిపించింది.  తనకు బాగా పరిచయమైన మొహంలా అనిపించింది.  కాని ఆ విషయం మీద ధ్యాస పెట్టే సమయం లేదతడికి.  తరువాత ఇంకా చాలా కార్యక్రమాలకి వెళ్ళాడు.  ఆ తరువాత గవర్నరు గారు ఇచ్చిన విందుకి హాజరు అయ్యాడు.  సాయంత్రం ప్రెస్ మీట్ కి హాజరు అయి రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకుని అలిసిపోయి నిద్రపోయాడు.

మర్నాడు ఉదయం లేవగానే మళ్ళీ నిన్నటి సంఘటన గుర్తుకు వచ్చింది.  ఆ పాప మొహం కళ్ళముందు కదలాడింది.  తన పి.ఏ.కి పోను చేసి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు.  ఆయన అరగంటలో మంత్రిగారి ఇంటికి చేరుకున్నాడు.  అప్పటికి కృషీవలరావు కాలకృత్యాలు తీర్చుకుని హాల్లో కూచుని పేపరు చూస్తున్నాడు.  పి.ఏ. ప్రసాదరావు రాగానే అతడిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు.  వంటావిడ రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చి వెళిపోయింది. 

కాఫీ తాగుతూ మంత్రిగారన్నారు. ' ప్రసాదూ!  నిన్న కాలేజీలో కనిపించిన ఒక పాప బహుమతి తీసుకుంది గుర్తుందా?'

' ఔను సార్ గుర్తుంది.  ఆ అమ్మాయి పేరు మానస.  మాధవీ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతూంది.  ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న హేమలతా ప్రేమకుటీరం అన్న అనాథాశ్రమంలో ఉంటోంది.  ఆమెను పుట్టిన మూడవనెలలోనే ఆ అనాథాశ్రమంలో ఎవరో వదిలి వెళ్ళారు.  ఐతే ఎవరు చేర్చారో తెలియదు.  ఆమెను గడప దగ్గర పడుకోబెట్టి వెళిపోయారు.  పాప ఏడుపు విని తలుపు తీసి, ఆ పాపను అనాథాశ్రమం వారే పెంచుతున్నారు.  వారే ఆ పాపకు మానస అని పేరు పెట్టారు.  శ్రావణ శుధ్ధద్వాదశి,శుక్రవారం నాడు అంటే ఆగష్టు ఎనిమిదో తారీకున వరలక్ష్మీవ్రతం రోజున ఆమె అనాథాశ్రమంలో చేరింది.  ఐతే ఆ పాప తలిదండ్రుల వివరాలు ఎవరికీ తెలియవు సార్.'  

' ఐ సీ.  మన ఇంటలిజెంస్ ఏ.సి.పి. ని సాయంత్రం ఐదింటికి వచ్చి నన్ను కలవమని చెప్పు.' అనేసి కృషీవలరావు స్నానానికి వెళిపోయాడు. 

బాత్ రూములో ష వర్ తిప్పగానే చల్లటి నీళ్ళు అతడి శరీ్రాన్ని తాకాయి.  అతడి మనసు ప్రశాంతంగా ఐపోయింది.  అప్పుడు మళ్ళీ శ్రావణి మొహం గుర్తుకు వచ్చింది.  ఆమెను ఎక్కడో తను ఖచ్చితంగా చూసాడు.  కాని ఎక్కడ?  ఎక్కడ?  చల్లటినీళ్ళు అతడి తలను తడుపుతూంటే అతడిలోని ఏకాగ్రత మరింత పెరిగిపోయింది.  చటుక్కున అతడి మెదడులో ఒక మెరుపు మెరిసింది!

' ఏస్.  ఆమె శ్రావణి.  భూషణం గారి కోడలు.  ఎప్పుడో ఒక్కసారి ఆవిడని తాను చూసాడు.  ఆవిడకి మానసకి చాలా పోలిక వుంది.  ఎందుకల్లా?  శ్రావణి గారి పాపను ఎవరో కిడ్ నాప్ చేసారని కదా అందరూ చెప్పుకున్నారు?  ఆ పాపే మానస ఐవుంటుందా?  తన తండ్రి ఆ పాప కిడ్ నాప్ అయిన రోజు నించి చాలా దిగాలుగా వుండేవాడు.  ఒకటి రెండుసార్లు నిద్రలో 'అమ్మా, మహలక్ష్మీ, అమ్మా చిట్టితల్లీ!' అంటూ పలవరించాడు.  కాని ఆ పాప గురించి ఆయనకేమైనా తెలిసివుంటే తనకు చెప్పివుండేవాడు.  కాని తనకేమీ చెప్పలేదే?'

అప్పుడు చటుక్కున తన తండ్రి చెప్పిన వీలునామా గురించి గుర్తుకు వచ్చింది.  ' ఓహ్, నేనెంతటి మూర్ఖుణ్ణి? అసలు ఆ వీలునామా గురించే తను మర్చిపోయాడే!  అంటే తమకేమీ ఆసిపాస్తులు లేవుకదా అని అప్పుడు తండ్రి చెప్పిన మాటలకి అంత ప్రాథాన్యత నివ్వలేదు తను.  తరవాత తను ఎన్నికల్లో నిలబడడం, మంత్రి కావడం, తరవాతి ఎన్నికలలో మళ్ళీ నిలబడి నెగ్గడం,హోం మంత్రి కావడం జరిగిపోయాయి.  ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా వుండటంతో ఆ వీలునామా మాటే మర్చిపోయాడు. 

వెంటనే స్నానం ముగించుకుని క్షణాల్లో తమ పాత ఇంటికి,ఆ పూరి పాకకు వెళ్ళాడు.  సెక్యూరిటీని బయటే వుండమని చెప్పి పెరట్లోకి వెళ్ళి వే్పచెట్టు కింద తవ్వాడు.  తన తండ్రి చెప్పిన పెట్టె బయట పడింది.  అది తెరిచి చూస్తే అందులో ఒక కవరు కనిపించింది.  ఆ కవరు భద్రంగా జేబులో పెట్టుకుని ఇంటికి చేరుకున్నాడు.  తన పడకగదిలోకి వెళ్ళి, ఏ.సి. ఆన్ చేసుకుని ఆ కవరు తెరిచి అందులో తన తండ్రి రాసిన వీలునామా తెరిచి చదవసాగాడు.

' నాయనా కృషీ!  నేను వీలునామా అని చెప్పగానే నువ్వు పగలబడి నవ్వావు.  నిజమే.  మనకి ఆస్తిపాస్తులేమీ లేవు.  మనకి ఉన్నదల్లా ఈ పూరిపాక మాత్రమే.  మన స్థితిగతులు ఎంత మారినా, మనం ఒకవేళ ధనవంతులమైనా ఈ పూరిపాకను మాత్రం నువ్వు ఇల్లాగే వుంచు.  ఇది మన నిజస్థితిని ఎప్పుడూ గుర్తుకు తీసుకువస్తూ, మనలో అహంకారం కలగకుండా చేస్తుంది.'

కృషి కళ్ళు చెమరించాయి.  ' ఔను నాన్నా!  నేను కూడా అదే ఉద్దేశ్యంతో ఆ పాకను యధాతథంగా వుంచేసాను.'

' నా తదనంతరం ఆ పాక నీకే చెందుతుందని, దానికి ప్రత్యేకించి వీలు్నామా అవసరం లేదని నాకు తెలుసు.  కాని నా మనోవ్యధ నీతో పంచుకోడానికే నీకీ ఉత్తరం రాస్తున్నాను.  నేను చెయ్యకూడని పాపం ఒకటి చేసాను నాయనా.  దానికి నన్ను భగవంతుడు క్షమించడు.  కాని నేను చనిపోయిన తరువాతనైనా నువ్వు నేను చేసిన పాపానికి పరిష్కారం చేస్తే నాకు ఉత్తమ గతులు లభిస్తాయి.  జరిగిన విషయాలు నీకు వివరంగా చెబుతాను.  అర్థం చేసుకుని ఏం చెయ్యాలో, నేను వేసిన చిక్కుముళ్ళు విప్పి ఎలా కొన్ని జీవితాలని చక్కదిద్దాలో నీకు నువ్వే ఆలోచించుకుని ఆ ప్రకారం చెయ్యి.

*******************

భూషణం అన్నాడు, ' నేను చెప్పింది గుర్తుందిగా? ఏమన్నా తేడా వచ్చిందో నిన్ను చంపి పాతేస్తాను.  రేపు నేను, అనసూయ మా అమ్మాయి గారింటికి వెళతాము.  నువ్వు శ్రావణి కూతుర్ని ఎవరూ చూడకుండా ఎత్తుకెళ్ళి ఊరిచివర తోపుల్లోకి తీసుకెళ్ళి చంపేసి, పెట్రోలు పోసి తగలపెట్టెయ్యి.  ఏ విధమైన ఆధారాలూ దొరకకూడదు.  ఆ తర్వాత నువ్వు కూడా ఏదో ఊరికి తగలడి, రెండు రోజులుండి రా.'

ఓబులేసు ఏడుస్తూ అన్నాడు, ' బాబయ్యా, ఆ పాప సాక్షాత్తు మహాలక్ష్మేనయ్యా.  మనింటి అదృష్టదేవతయ్యా.  ఆ పాప గొప్ప జాతకమంతురాలవుతాదయ్యా.  ఆ పాపని చంపడం  చాలా పాతకమయ్యా.  వద్దయ్యా.'

భూషణం కరుగ్గా అన్నాడు, ' ఏరా, నాకే నీతులు చెబుతున్నావురా?  నువ్వు కాకపోతే నీ తల్లో జేజమ్మ ఇంకోడు నాలుగు డబ్బులు పడేస్తే ఆ పాపని చంపేస్తాడు.  కాదంటే, ఈ విషయం తెలిసాక ఇంక నిన్ను బతకనివ్వను.'

ఓబులేసు చేతులు జోడించి అన్నాడు, ' అంత మాటనకండి బాబయ్యా.  మీ ఉప్పు తిని బతుకుతున్నోడిని.  మీ కోసం పేణాలిమ్మన్నా ఇచ్చేటోడ్ని.  కాదంటే మనసుండ బట్టలేక ఏదో ఎదవ వాగుడు వాగేసాను.  సరే బాబయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాను.  అనక నా మీదకేం రాకుండా మీరే జూసుకోవాల.'
భూషణం మీసం మెలేస్తూ అన్నాడు, ' సర్లేరా, నీ ఒంటిమీద ఈగనన్నా వాలనిస్తానా?  నువ్వు మాత్రం జాగ్రత్తగా పని కానివ్వాలి సుమా?'

' అట్టాగే బాబయ్యా.'

*** 

అదిరా కృషీ, జరిగిన సంగతి.  ఆ పాపని చంపడానికి నాకు చేతులు రాక ఇక్కడికి దగ్గిరలో వున్న హేమలతా ప్రేమకుటీరం మెట్ల దగ్గిర వదిలేసి వచ్చాను.  నేను వదిలేసిన రోజు శ్రావణమాసం, వరలక్ష్మీవ్రతం రోజు.  ఆ తల్లీ బిడ్డల్ని వేరు చేసి నేను చాలా పాపం చెసానురా.  మళ్ళీ ఆ తల్లీ బిడ్డల్ని ఒక్కటి చేసే బాధ్యత నీదేరా. 
ఉంటారా మరి,
                                                                నీ మీద గంపెడాశతో నీ తండ్రి,
                                                                                          ఓబులేసు'

ఆ ఉత్తరం చదివి కృషీవలరావు బడబడా ఏడిచేసాడు.  ఐతే తన తండ్రిని ఎవరో చంపి వుండరు.  తన తండ్రి భూషణంగార్ని ఏమైనా బెదిరించడమో ఏదో చేసి వుంటాడు.  ఎప్పటికైనా తన తండ్రి ద్వారా నిజం బైట పడుతుందేమోనన్న భయంతో భూషణంగారే తన తండ్రిని చంపించి, ప్రత్యర్థి వర్గం వారు చంపించారని పుకారు పుట్టించి వుంటారు.  ఎంత దారుణం!!
 (ఇంకా వుంది.)

No comments:

Post a Comment

Pages