బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు- హనుమద్వాహనం 21-12-2019 - అచ్చంగా తెలుగు

బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు- హనుమద్వాహనం 21-12-2019

Share This

బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-  హనుమద్వాహనం
డా.తాడేపల్లి పతంజలి బ్రహ్మోత్సవాలలో ఆరవరోజు పగలు వేంకటేశుడు హనుమద్వాహనం పై విహరిస్తారు.
అన్నమాచార్యులవారి హనుమత్సంకీర్తనలు భక్తి భావ ప్రపూరితాలు.
నేలమిన్ను (1-69), సీతాశోక విఘాతక (1-366), శరణు శరణు వేద (2-347), అందరిలోన నెక్కుడు (2-207), మాతంగపర్వతం (2-223),  అంజనీ తనయుడైన (3-143), అవధారు దేవా(3-144), అన్నిటానేరుపరి (3-138), ఘనుడీతడు (3-302), కలశాపురముకాడ (3-521),  అరుదీ (4-470), అదె చూడరయ్య (4-509) అందరికి యెక్కుడైన (4-155), ఆంజనేయ అనిలజ (4-458), అఱిముఱి హనుమంతుడు (4-278), అవధారు చిత్తగించు(4-490), బిరుదుబంటితడు( 4-486), ఏలవయ్య లోకమెల్ల (4-459), మంగాంబుధి (4-441), ఒక్కడే ఏకాంగవీరుడు (4-462),ఓ పవనాత్మజ (4-327), పదియారువన్నెల (4-167),పంతగాడు (4-273), పెరిగినాడు చూడరో (4-528), శరణు కపీశ్వర (3-421),  సరిలేదితనికి (4-499), తలచరో జనులు (4-483 ) ఇలా ఎన్నో హనుమత్సంకీర్తనలు అన్నమయ్య సారస్వతాంబుధిలో మనకు కనబడతాయి.
ఈ కీర్తనల్లో చాలా విశేషాలు అన్నమాచార్యుల వారు చెప్పారు. ఒకటి రెండు  కీర్తనలు ప్రతిపదార్థ భావ విశేషాలతో తెలుసుకొని పరవశిద్దాం.

పల్లవి: మంగాంబుధి హనుమంతుని శరణ
        మంగవించితిమి హనుమంతా
చ.1:   బాలార్కబింబము ఫల మని పట్టిన
        ఆలరి చేఁతల హనుమంతా
        తూలని బ్రహ్మాదులచే వరములు
        వోలిఁజేకొనిన వో హనుమంతా
చ.2:  జలధిదాఁట నీ సత్వము కపులకు
        నలరి దెలిపతివి హనుమంతా
        యిలయు నాకసము నేకముగా నటు
        బలిమిఁ బెరిగితివి భళీ హనుమంతా
చ.3:  పాతాళము లోపలి మైరావణు -
        నాతలఁ జంపిన హనుమంతా
        చేతులు మోడ్చుక శ్రీవేంకటపతి-
        నీతలఁ గొలిచే హిత హనుమంతా (రేకు: 0376-03సం:  04-444)

 పల్లవి:
మంగాంబుధి ఆలయంలో కొలువు దీరిన హనుమంతా ! నీ శరణాన్ని ఉత్సాహంగా కోరుకొంటున్నాం.
చ.1:
        చిన్నప్పుడు ఎవరైనా అల్లరి పనులు చేస్తుంటారు. కాని నీ అల్లరి పనులు సామాన్యమా స్వామీ ! ఆ ఉదయిస్తున్న సూర్య బింబాన్ని పండనుకొని నోట్లో వేసుకొని గుట కాయ స్వాహా చేయ బోయావ్ ! ఆ బ్రహ్మ మొదలైన దేవతలు ఉన్నారే! వాళ్లు ఎవరి విషయంలోను తగ్గరు.(తూలని) ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బ హనువులకు (దౌడలకు) తగిలి నువ్వు మూర్చపొయిన సమయంలో నీ తండ్రి వాయువు కోపించి స్తంభించాడు. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలందరూ  కలిసివచ్చి నీకు వరాలిచ్చారు. ఆ వరలను కానుకగా పొందిన హనుమంతా నీకు శరణు.
చ.2:
        లంకకి వెళ్లే టప్పుడు ఆ సముద్రాన్ని దాటే సందర్భంలో  నీ శక్తి ఎలాంటిదో, వానరులకు  నీ విశ్వరూపం ద్వారా నిరూపించి సంతోషింపచేసావు. ఆ సమయంలో ఆకాశాన్ని భూమిని ఒకటిగా కలిపేటట్లుగా పెరిగావు.భళి. భళి. హనుమంతా ! నీకు శరణు.
చ.3: 
నీ లీలలు అర్థం చేసుకోవటం కష్ట మయ్యా స్వామీ ! అవతల పాతాళంలో అంతటి మైరావణుని తుక్కుతుక్కుగా చంపావు. ఇవతల ఏమీ తెలియని వాడిలా- మా వేంకటేశ్వర స్వామి దగ్గర చేతులు కట్టుకొని నిలబడతావ్. హనుమంతా ! నీకు శరణు.

పరమార్థం
మంగాంబుధి  అనే పదానికి అర్థాన్ని అన్నమయ్య తానే వ్రాసిన ఇంకొక  కీర్తనలో తెలిపాడు. ఆంజనేయ అనిలజ హనుమంత నీ/రంజకపు చేతలు సురలకెంచ వశమా! అను కీర్తన (సం:04-458) చివరి చరణంలో “అల శ్రీవేంకటపతి యండనె మంగాంబుధి/నిలయపు హనుమంత నెగడితిగా అని వ్రాసాడు.”అంటే వేంకటేశ్వరుని దగ్గరగా మంగాంబుధి నిలయంలో హనుమంతుడు ఉన్నట్లుగా అన్నమయ్య వివరించాడు.కనుక అన్నమయ్య కాలంలో తిరుపతి సమీపంలో మంగాంబుధి హనుమంతుని ఆలయం ఉండవచ్చేమో  అని పెద్దల భావన.
 
తనుఎవరిని మింగాలనుకొన్నాడో ఆ సకల శాస్త్ర పారంగతుడైన సూర్య భగవానుడి నుంచి హనుమ విద్యను అభ్యసించాడు. కాలంతోపాటు తిరిగే సూర్యునినుంచి విద్యను నేర్చుకోవడం కోసం తన శరీరాన్ని పెంచి ఉదయ పర్వతం పై ఒక కాలు, అస్తమయ  పర్వతం పైమరొక కాలును ఉంచి సూర్యుడు ఎటు తిరిగితే అటు తన ముఖాన్ని తిప్పుతూ ఆయన వద్ద శాస్ర్తాభ్యాసం చేసి సూత్రా లు, వ్యాఖ్యానాలు, సంగ్రహాదులతో కూడిన వ్యాకరణాన్ని సాధించి నవ వ్యాకరణవేత్తయై వేద వేదాంగాలనుచదువుకొన్నాడు..ఇంతకీ హనుమంతుడు అల్లరి చేతలవాడే కాదు. హృదయాన్ని అల్లుకొనే చేతల వాడు కూడా!

ఈకీర్తనలో  హనుమంత అనే సంబోధన ప్రతి  పాదం చివర ఉంటుంది.మళ్ళీమళ్ళీ దైవ నామాన్ని తలవటంలో భక్తునికి ఒక రకమైన ఆవేశం వస్తుంది.ఆ ఆవేశంలో ఆ దైవ రూపాన్ని తనలో ఆవహింపచేసుకొంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోతారు.అందుకే ఆధ్యాత్మిక గీత రచయితలు దైవ నామాన్ని వీలైనంత ఎక్కువగా వాడుతుంటారు. అన్నమయ్య కూడా ఈ పద్ధతినే అనుసరించాడు.

నేలమిన్ను నొక్కటైన నీబంటు వొక్క-
        వేలనే యక్షునిఁ దెగవేసెఁగా నీ బంటు
చ.1:   ఉంగరమెగరవేసి యుదధిలోఁ బడకుండ
        నింగికిఁ జెయిచాఁచె నీబంటు
        చంగున జలధిదాఁటి జంబుమాలి నిలమీఁద
        కుంగఁదొక్కి పదములఁ గుమ్మెఁగా నీబంటు
చ.2:  వెట్టగా రావణు రొమ్మువిరుగఁ జేతనే గుద్దె
        నిట్టతాడువంటివాఁడు నీబంటు
        దిట్టయై మందులకొండ తేజమున నడురేయి
        పట్టపగలుగఁ దెచ్చె బాపురే నీబంటు
చ.3:  అలర నన్నియుఁ జేసి అజునిపట్టానకు
        నిలుచున్నాఁ డదివో నీబంటు
        బలువేంకటేశ ఈ పవననందనుఁడు
        కలిగి లోకములెల్లఁ గాచెఁగా నీబంటు రేకు: 0011-03సం:01-069)

రామునితో మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడో అన్నమయ్య వివరిస్తున్నాడు.
ఓ రామా ! చిత్రమైన ధనస్సుతో రావణుని కుమారుడు అక్షకుమారుడు రాగా , అతని ప్రతిభనుచూసి సంతోషించి నీ సేవకుడైన హనుమంతుడు నేలా, ఆకాశము ఒకటయ్యేటట్లుగా శరీరాన్ని పెంచాడు. పాముని గరుత్మంతుడు గట్టిగా పట్టుకున్నట్లుగా అక్షకుమారుని పాదాలను గట్టిగా పట్టుకొని వేయి మార్లు గిర గిర తిప్పాడు. ఆ తరువాత నేలపై కొట్టి చంపాడు.

 చ.1: ఓ రామా ! నీ సేవకుడయిన హనుమంతుడు నువ్వు ఇచ్చిన ఉంగరాన్ని తన సహజ స్వభావముతో ఎగురవేసి సముద్రములో పడకుండా , ఆకాశము వైపు చేయి చాచాడు. హఠాత్తుగా ఒక్క గెంతు వేసి సముద్రాన్ని అవలీలగా దాటి జంబుమాలిని నేలమీద పడవేసి కుంగదొక్కి పాదాలతో నీసేవకుడయిన హనుమంతుడు నలిపాడు కదా ! ( జంబుమాలి ప్రహస్తుని కొడుకు. రావణుని సేనాధిపతులలో ఒకడు. అశోకవనభంగ సమయములో హనుమంతుడు ఇతనిని చంపాడు)

చ.2: రామా ! తాపము కలిగేటట్లుగా యుద్ధములో రావణుని రొమ్ము విరిగిపోయేటట్లుగా తన చేతితో గుద్దిన - నిలువుగా ఉన్న తాటి చెట్టులాంటి వంటి వాడు(నిట్ట తాడు) నీ సేవకుడయిన హనుమంతుడు( రావణుడు - హనుమంతుడు కొట్టిన అరచేతి దెబ్బకి భూకంప సమయంలొ పర్వతంలా వణకి పోయాడని వాల్మీకి రామాయణం)
బాపురే ! ఎంత ధైర్య వంతుడయ్యా ! మందులకొండ అయిన సంజీవని పర్వతాన్ని తేజస్సుతో నడు రేయి తీసుకువచ్చి ఆ పర్వత కాంతులతో రేయిని పట్టపగలు చేసిన వాడు నీ సేవకుడయిన హనుమంతుడు.

చ.3: రామా ! అన్నీ చేసి నీపట్టాభిషేకములో ఏమి తెలియనట్లుగా ఒక మూలగా నిలబడ్డాడు నీ సేవకుడయిన హనుమంతుడు.బలవంతుడవయిన ఓ వేంకటేశా ! నీ సేవకుడయిన హనుమంతుడు ఈ లోకములనన్నింటిని రక్షించేవాడు.
****
హనుమంతునిపై అన్నమయ్య రచించిన కీర్తనలు 54 ఉన్నాయని ఆచార్య కే. సర్వోత్తమరావుగారు నిర్ధారించి వాటిని ఒకచోట ప్రచురించి ఈ అన్నమయ్య పదసేవకునికి పంపించారు. (పుస్తకం పేరు; తాళ్లపాక పద కవుల హనుమత్సంకీర్తనలు) సంజీవని పర్వతాన్ని మందులకొండగా ఇంకోకీర్తనలోనూ (రేకు: 9111-01సం: 04-598) అన్నమయ్య పేర్కొన్నాడు.
మందుల కొండ కథ
రావణుడు ప్రయోగించిన శక్తి (బల్లెం) ప్రభావానికి లక్ష్మణుడు మూర్ఛపోయి నేల మీద పడ్డాడు.అప్పుడు సుషేణుడనే కపి వైద్యుడు రాముడికి ధైర్యం చెప్పాడు.
హనుమంతుడిని పిలిచి సంజీవని పర్వతం దక్షిణ శిఖరంలో ఉన్న 1.విశల్యకరణి( శరీరంలో నాటుకొన్న బాణాలను తొలగించి గాయాలను మాన్పేది), 2.సవర్ణకరణి(శరీర కాంతిని సహజ స్థితికి తెచ్చేది), 3.సంజీవని( స్పృహలోకి తెచ్చి చైతన్యాన్ని కలిగించేది), 4.సంధానకరణి( విరిగిన ఎముకలను జోడించేది) అనే ఔషధులను త్వరగా తీసుకు రమ్మని చెప్పాడు

హనుమంతుడు వేగంగా పర్వతం దగ్గరకు వెళ్లాడు కాని సుషేణుడు చెప్పిన నాలుగు మందులను వెంటనే గుర్తించలేకపోయాడు. వెంటనే పర్వతం మూడుసార్లు అటూ ఇటూ ఊపి పెళ్లగించి , ఆకాశములోకి ఎగిరి చెండులా దానిని ఎగరవేసి పట్టుకొని మహావేగంతో బయలుదేరి సుషేణుని దగ్గరకు ఆ పర్వతాన్ని చేర్చాడు..
సుషేణుడు ఆ పర్వతం మీద ఉన్న మందుల తీగలను పెకిలించి లక్ష్మణుడి ముక్కుపుటాల దగ్గర ఉంచాడు. లక్ష్మణుడు ఆరోగ్యవంతుడయ్యాడు.
అసలు వేంకటేశ్వరునే తిరుమల మీద ఉండే “మందు”గా చెప్పిన (రేకు:0001-02సం:01-002) అన్నమయ్య సంజీవనీ పర్వతాన్ని మందులకొండ అనటంలో పెద్దగా ఆశ్చర్య పడనక్కరలేదు. స్వస్తి.
***

No comments:

Post a Comment

Pages