నెత్తుటి పువ్వు - 16 - అచ్చంగా తెలుగు
నెత్తుటి పువ్వు - 16
మహీధర శేషారత్నం

(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తుంటాడు రాజు.) 

“మా ఆవిడ నీలాంటిది కాదు. మాత్ర వేసుకో! ఇదిగో మంచినీళ్ళ బాటిల్. ఇక్కడే వుంది.” లేచి దుప్పటి మడతపెట్టి తీసుకెళ్ళబోయాడు.
          “నాకా దుప్పటి కావాలి” అంది చిన్నగా.
          ఎందుకు? అనబోయి దుప్పటి లేదేమో ననుకున్నాడు. తీరా చూస్తే రెండు కొత్త దుప్పట్లు పక్కనే కనపడ్డాయి.
          “ఉన్నాయిగా! ఇదెందుకు?”
          “పక్కన మనిషున్నట్లుంటాది.” చిన్నగా అంది.
          ఒక్కక్షణం మాటలు రానట్లయాడు. దుప్పటి పక్కన ఉంచి మౌనంగా తలనిమిరాడు.
          “తలుపు వేసుకు పడుక్కో! నిద్రపట్టినా!” అన్నాడు. నాగరాజు దుప్పటి చెంపకానించుకుని ఒత్తిగిల్లి పడుకుంది. ఎప్పుడో నిద్రపట్టేసింది. మెలుకువ వచ్చుసరికి నాలుగయింది. లేవాలనిపించలేదు. ఏమీ తినాలనిపించలేదు. అలాగే పడుక్కుంది. చెరుపూ,మరుపూగా నిద్ర. నిద్రా కాకుండా మెలకువా కాకుండా ఉన్న స్థితి. తలుపు కొడుతున్న చప్పుడికి మెలకువ వచ్చింది. లేవ లేక లేవలేక లేచి తలుపు తీసింది. తూలిపడబోతే పట్టుకున్నాడు. మళ్ళీ జ్వరం వచ్చేసింది. మెల్లిగా లోపలికి తీసుకొచ్చాడు.
          “టాబ్లెట్ వేసుకోలేదా!” గమనించి అడిగాడు.
          “లేవలేకపోయా!”
          మౌనంగా టాబ్లెట్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చాడు. వేసుకుంది.
          “కోపం వచ్చిందా!”
          “మందు వేసుకోకపోతే ఎలా తగ్గుతుంది తొందరగా తగ్గకపోతే ఇబ్బంది కదా!
          “నిన్ను ఇబ్బంది పెట్టనులే!” మూతి ముడుచుకుంది.
          ఏమిటి ఈ అమ్మాయి దబాయింపు అనుకున్నాడు మనసులోనే. పగలంతా కష్టపడ్డ నాగరాజుకి నిద్ర పట్టేసింది. పగలంతా నిద్రపోయిన సరోజ దెయ్యంలా లేచి కూచుంది. ఆ బెడ్ లైట్ వెలుగులో నాగరాజునే చూస్తూ కూచుంది. ఈ నల్లనోడి మనసెంత మెత్తనో అనుకుంది. ఏమీ తోచలేదు. మెల్లగా లేచి వచ్చి పక్కన పడుకుంది. ఎంతో సుఖంగా అనిపించింది. మెల్లగా నిద్రలోకి జారుకుంది. నిద్రలోనే నాగరాజు దగ్గరగా లాక్కున్నాడు. మెలకువ వచ్చినా ఏమీ తెలియనట్టు మరింత దగ్గరగా జరిగింది. ఒంటరితనం తీరినట్టు, దాహం తీరినట్టు అనిపించింది. అలాగే పడుకుని నిద్రలోకి జారుకుంది.
          లక్ష్మీ! లక్ష్మీ! అంటూ కళ్లు తెరిచాడు. పక్కన సరోజ. ఒక్కక్షణం అతనికి అర్థం కాలేదు, తానెక్కడున్నాడో. ఇదేమిటి ఈ పిల్ల! రాత్రంతా ఇలాగే పడుకుందా! పాపం పిచ్చిపిల్ల. ఒంటరితనం ఫీలవుతున్నట్టుంది అనుకున్నాడు. లేచి తలుపు దగ్గరగా వేసి టిఫిన్ తెచ్చిలేపాడు. టాబ్లెట్లు ఇచ్చాడు. “నేను డ్యూటీ కెళ్ళిస్తాను. వస్తే రాత్రి వస్తాను. నువ్వు మధ్యాహ్నం కాస్త ఏదయినా తిని మాత్రవేసుకో! లేకపోతే తగ్గదు.” అన్నాడు.“కాసేపుండ రాదా!”
          “భలే దానివే! ఇంటికెళ్ళి అక్కణ్ణుంచి డ్యూటీ కెళ్ళాలి. ఇంటి నుంచి స్టేషన్ కెడుతూ ఏదో గుర్తొచ్చినట్టు ఆదినారాయణ షాపు కెళ్ళాడు. “ఆ పిల్లకు జ్వరం ఆదినారాయణగారూ! ఇంకొక వారందాకా రాలేదు. జీతం కటీచేసినా ఉద్యోగం ఉంచండి” అన్నాడు. 'అలాగే సార్!'అన్నాడు.
          రేపటికి కూడా తగ్గకపోతే ప్రజావైద్యశాలలో చేర్చాలి అనుకున్నాడు. అక్కడి డాక్టర్ రవికిషోర్ ఎథిక్స్ ఉ న్నవాడు అనుకున్నాడు.
*****

          “ఎవరా ఫ్రెండ్?” అడిగింది లక్ష్మి.

          “నీకు తెలియదులే! ఆంజనేయులని చిన్నప్పుడు నాతో చదువుకున్నాడు. ఈ రోజొక్క రోజేలే! రేపువాళ్ళావిడ వచ్చేస్తుంది.” చెప్పులు వేసుకుంటూ గబగబా జవాబుచెప్పి బయటపడ్డాడు.
          అసలు తానెందుకు అబద్దం చెప్పాడు. ధైర్యంగా నిజం ఎందుకు చెప్పలేదు? ఆడపిల్ల అనేసరికి అనుమానించచ్చనుకున్నాడా? లేక తన మనసులోనే ఏదో... ఛీ! ఛీ! అనుకున్నాడు. తానెవరికో ఒకరికి ఏదో ఒక అవసరానికి తిరుగుతూనే ఉంటాడు. అందుకే లక్ష్మి గట్టిగా ఏదీ అడగదు.
          ఏమిటో తప్పుచేసినట్టు అనిపించింది. స్టేషన్లో కూడా ఫ్రీగా అనిపించలేదు. అక్కడికీ తోడి కానిస్టేబుల్ అడగనే అడిగాడు ఏమిటలా ఉన్నావని, తలనొప్పని తప్పించుకున్నాడు. చివరికి సరోజని హాస్పటల్లో చేర్చక తప్పలేదు. నాగరాజు రిక్వెస్ట్ పై సరోజకి కావల్సినవి చూడడానికి అక్కడి ఆయాని ఏర్పాటు చేసాడు రవికిషోర్.
          సరోజ కోలుకున్నంత వరకూ హాస్పటల్ లోఉంచడానికి కూడా ఏర్పాటు చేసాడు. సరోజ ఆరోగ్యంగా ఇంటికొచ్చింది. పోగుచేసిన డబ్బులు ఆదుకున్నాయి. సరోజకి అర్ధమయింది, డబ్బు జాగ్రత్తగా వాడాలని మళ్ళీ బట్టలషాపుకి వెళ్ళడం మొదలు పెట్టింది.
*****

          కాలం సాదా సీదాగా వెళ్ళిపోతే విశేషమేం ఉంది. రచయితలు కథను చక్కగా తాము కోరుకున్నట్లు నడపగలరు. ముగించగలరు. కాని మనిషి తన జీవితాన్ని తాను తనకు కావలసినట్టు నడపలేడు. పైవాడు నడుపుతాడు. మనిషి అలా అడుగులు కదుపుతాడు. అంతే..

          సరోజ వచ్చి చూస్తూండగానే సంవత్సరం గడిచిపోయింది. కాస్త నలుగురితో కలవడం, నాలుగూ నేర్చుకోవడం మొదలెట్టింది. నాలుగు రూపాయలు దాచుకుంది. అవసరాలకి అమర్చుకుంటోంది. ఆదినారాయణ షాపులో దొంగతనం జరిగింది. అందులో పనిచేసే వాళ్ళందరినీ మొదలు స్టేషన్ కి తరల్చారు. ఆ జైలు వాతావరణం, స్టేషను వాతావరణం చూసి సరోజ బెదిరిపోయింది. సరోజ ఒంటిమీద చెయ్యి వెయ్యలేదుకాని వాళ్ళ ప్రశ్నలు సరోజని ఇబ్బంది పెట్టాయి. తప్పనిసరి పరిస్థితులలో నాగరాజు పేరు చెప్పింది. పోలీసని తెలుసు కాని ఏ స్టేషన్ తెలియదు. మొత్తానికి వాళ్ళే తెలుసుకుని నాగరాజుకి ఫోను చేసారు. నాగరాజుని చూస్తూనే సరోజ బావురుమంటూ అల్లుకు పోయింది. నాగరాజు నలుగురు చూస్తూండడంతో కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఏడ్చి ఏడ్చి వాచిన సరోజ కళ్ళు, కందిపోయిన ముఖము, చెదరిన జుట్టు చూసి తల్లడిల్లి పోయాడు. ఇలాంటి వన్నీ మామూలేనని తెలిసినా సరోజ దుస్థితి అతనిని కదిలించింది. శంకరానికి ఫోన్ చేసి పిలిచాడు. ఇద్దరూ మాట్లాడి బాధ్యత తీసుకుని సరోజని ఇంటికి తీసుకువచ్చారు. జరిగిన సంఘటనకి సరోజ బెదిరిపోయింది. డాంభికముగా కబుర్లు చెపుతుంది కాని భయస్తురాలని తెలిసిపోయింది. నాగరాజు ప్రాణం తల్లడిల్లిపోయింది. ఆ దెబ్బకు సరోజకు జ్వరం వచ్చేసింది. నన్ను ఒక్కరాన్నీ వదలకు అని ఒకటే ఏడుపు. నాగరాజు తల పట్టుకున్నాడు ఏం చెయ్యాలో తెలియక. భార్యకు తెలియకుండా ఎన్నాళ్ళుండగలడు? ఆ కష్టసమయంలో రాములమ్మే ఆదుకుంది. రోజూ రాత్రి వచ్చి పడుక్కుంది ఓ పదిరోజులు. సరోజ తప్పులేదని ఆ షాపులో పనిచేసే కుర్రాళ్ళలో ఒకడు ఈ పనిచేసాడని తెలిసినా, వాణ్ణి వాడి స్నేహితుల్నీ పట్టుకున్నా సరోజ నేనాచోట పనిచేయనని తెగేసి చెప్పింది.
***

No comments:

Post a Comment

Pages