ఈ రోజు మేము నిరూపించాము - అచ్చంగా తెలుగు

ఈ రోజు మేము నిరూపించాము

Share This
ఈ రోజు మేము నిరూపించాము 
పోఛిరాజు శర్వాణి


ఈ రోజు...
మేం దిగ్విజయంగా నిరూపించాం..
మేము భయంకరంగా ఓడిపోయామని..
సిగ్గు లేకుండా,  లెక్క లేకుండా 
ఓడిపోయామని,
మా ఆడపిల్లలను రక్షించటం,
కామాంథ కిరాతకులను శిక్షించటం 
చేతకాని సమాజ పౌరులమని  
దిగ్విజయంగా.. ఘంటాపథంగా
నిరూపించాం

ఒక నిర్భయ సరిపోలేదు మాకు బుద్ధి రావటానికి
మళ్ళీ ఓ పిచ్చి తల్లి  ప్రియాంక..
ఇంకా వెలుగులోకి రాని కధలు ఎన్నో!
"నాకు భయమేస్తోందే చెల్లీ" అన్న నీ మాటలు విని కూడా 
ఇంకా మా గుండెలు బద్దలవటం లేదు
కన్నీళ్ళు కారుస్తాం   కాసేపు
ఆందోళనలు చేస్తాం  ఈరోజూ.. రేపూ

కానీ ఇంకో నిర్భయ, ఇంకో దిశ
బలికాకుండా 
అదను కోసం పొంచి ఉండే
అత్యంత క్రూర జీవాలను
కట్టడి చేయటం చేతకానివాళ్ళం

నీ భద్రత  భాద్యత పూర్తిగా నీదే
మా అసమర్ధ సమాజానికి చేత కాదు

చీకటి, ఒంటరి ప్రదేశాలూ 
నీకు మహా ప్రమాదాలు
మద్యమూ,   అశ్లీల చిత్రాలూ
కిరాతకులన కామాగ్నికి ఆజ్యాలు

తెలిసినా మేమేమీ చేయలేము
చేతకానివాళ్ళం కదా

అయినా నీకు ప్రమాదం లేని ప్రదేశం
ఈ భూప్రపంచంలో ఉందా?
భగవంతుడా  నీకేమైనా తెలుసా?

అంతరిక్షానికెళ్ళాం.. ఎన్నెన్నో  సాధించాం 
కానీ ఈ అత్యంత కిరాతక జీవాలనుండి నిన్ను కాపాడుకోవడం మాత్రం 
మాకు చేతకావట్లేదు

సరే. మేం నిరూపించుకున్నాం
పనికిరాని వాళ్లమని.

దేవుడా నీకేమైంది?
దేవతలను, బంగారు తల్లులను
స్వర్గంలో  సేఫ్ గా ఉంచు

ఆడపిల్లలను పుట్టించటం  మానేసేయ్..
అర్థం లేని సృష్టిని  ఆపేసేయ్.

పిచ్చి తల్లి  ప్రియాంక కు
పనికిరాని కన్నీళ్ళతో....
***

No comments:

Post a Comment

Pages