సుబ్బుమామయ్య కబుర్లు - అచ్చంగా తెలుగు
సుబ్బుమామయ్య కబుర్లు!


కృష్ణుడు మురళి వాయిస్తాడు. నారదుడు తంబుర మీటుతాడు. 
మనలో చాలామంది వీణ..సితార..ఫిడేలు..పియానో వాయించడం, డప్పు కొట్టడం, మద్దెల దరువెయ్యడం చూసే ఉంటారు. వింటుంటే ఎంత బాగుంటాయి కదా! పాటకి సంగీతం ప్రాణం. సినిమాల్లో పాటలు ఎంతటి విశేష ఆదరణ పొందుతాయో మీకు తెలుసు కదా! 
అన్నమయ్య పాటలు, త్యాగయ్య కృతులు అందరి మనసుల్లో నాటుకుపోడానికి వాద్య పరికరాల సంగీతం కూడా ఎంతో దోహదం చేసింది.
ఒక సంగీత పరికరం వాయించడం అంత సులువు కాదర్రా! ఎంతో అభ్యాసం చెయ్యాలి. ఆయా పరికరాలు ఉపయోగించడంలో పరిణతి సాధించిన వ్యక్తుల్ని విద్వాంసులు అంటారు. మృదంగ విద్వాంసుడు శ్రీ ఎల్లా వేంకటేశ్వరరావు మృదంగం వాయించడం చూడండి. షేక్ చినమౌలానా నాదస్వర విన్యాసం వినండి. మనసు ఎక్కడికో వెళ్లిపోతుంది. అలసిన మనసుకు సంగీతమే సాంత్వన చేకూరుస్తుందర్రా!
సంగీతం విలువ తెలుసు కాబట్టే మనవాళ్లు పెళ్లికి, గృహప్రవేశ సందర్భాల్లో నాదస్వరమూ, మంగళ వాయిద్యాలు ఏర్పాటు చేశారు.
మనదేశం సంగీతానికి పెట్టింది పేరు. ఎంతోమంది మహానుభావులు తమ కలంతో, గళంతో, సంగీత పరికరాల్తో సంగీతానికి జీవం పోశారు. 
ఓ శంకరాభరణం, సాగరసంగమం లాంటి సినిమాలు చూస్తే సంగీతం మీద మక్కువ కలగడం సహజం. సంగీతానికి చెవులు కోసుకుంటారని అనేది అందుకే!
మీరు కూడా ఏదో ఒక వాద్యపరికరం వాయించడం అభ్యాసం చేయండి. ఎంత అభ్యాసం చేస్తే అంత ప్రావీణ్యం మీ సొంతమవుతుంది.
మరి మీరు మీ పరికరంతో అందరినీ సమ్మోహితుల్ని చేస్తారు కదూ!
ఉంటానర్రా!
మీ సుబ్బుమామయ్య

No comments:

Post a Comment

Pages