బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-11 -మోహినీ అవతారం - అచ్చంగా తెలుగు

బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-11 -మోహినీ అవతారం

Share This
బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-11  -మోహినీ అవతారం
డా.తాడేపల్లి పతంజలి 


శ్రీకృష్ణుడు దంతపువల్లకిపై వెంట వస్తుండగా బ్రహ్మోత్సవాలలో అయిదవరోజు  పగలు వేంకటేశ్వరుడు  మోహినీ రూపం ధరిస్తాడు.  జగన్మోహినిగా మారతాడు.  బంగారుపల్లకిలో సిగ్గులు ఒలకబోసే ఆ స్వామిని చూసి అన్నమయ్య పరవశించి ఈ గీతం పాడి ఉంటాడు. 
జగన్మోహనాకార చతురుఁడవు పురుషోత్తముఁడవు
వెగటు నా సోదంబు ఇది నీ వెలితో నా వెలితో ॥పల్లవి॥
01.యెన్నిమారులు సేవించినఁ గన్నులూ దనియవు
విన్న నీకథామృతమున వీనులుఁ దనియవు
సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు దవియదు
విన్న కన్నది గాదు ఇది నావెలితో నీవెలితో ॥జగ॥

02.కడఁగి నీప్రసాదమే కొని కాయమూఁ దనియదు
బడిఁ బ్రదక్షిణములుసేసి పాదములు నివిఁ దనియవు
నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూ దనియదు
వెడగుఁదన మిది గలిగె నిది నావెలితో నీవెలితో ॥జగ॥

03.చెలఁగి నిను నేఁ బూజించి చేతులూఁ దనియవు
చెలువు సింగారంబు దలఁచి చి త్తమూ దనియదు
అలరి శ్రీవేంకటగిరీశ్వర అత్మ నను మోహించజేసితి
వెలయ నిన్నియు దేరే మును నీవెలితో నావెలితో ॥జగ॥

విశ్లేషణ
అయ్యా ! వేంకటేశ్వరా !  నీ ప్రసాదము తీసుకొన్నా నా   శరీరానికి  తృప్తి కలగటంలేదు.   ప్రదక్షిణలు చేసినా పాదాలకు   తృప్తి కలగటంలేదు.   సాష్టాంగ నమస్కారం చేసినా   నుదుటికి   తృప్తి కలగటంలేదు     నిజానికి తృప్తి కలగాలి. కాని కలగటం లేదు.  ఇంకా ఇంకా చేయాలనే  వెడగుదనము ( వెర్రి తనం, వివేకం ) నాకు కలుగుతోంది. ఇది నాలోపమా? నీ లోపమా?
భక్తుని  భక్తికి పరాకాష్ఠ ఇందులో కనబడుతోంది.     
ఈ గీతంలోని మూడవచరణంలో ఇలా పుష్పంలా విరిసిన భావానికి మొగ్గ  రూపం పల్లవి. 
జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు
వెగటు నా సోదంబు ఇది నీ వెలితో నా వెలితో ॥పల్లవి॥
ఇందులో వెగటు, ఆసోదము అను పదాలకు అర్థాలు ఇవి.
వెగటుగా=  వెక్కసంగా, దుస్సహంగా.ఆసోదము -  కోరిక, ఆశ, కామం
నిన్ను చూడాలనే కోరిక (ఆసోదము)  దుస్సహంగా(వెగటు) ఉంది. ఎంత చూసినా ,  నిన్ను  ఇంకా ఇంకా చూడాలని కోరిక. ఇది భరించలేకపోతున్నాను. ఇది నా     లోపమా? నీ లోపమా?
భగవంతుని  ఒకసారి    చూసిన తర్వాత కూడా భక్తుని  కోరిక   పరిపూర్ణం కావటంలేదు.  ఒకసారి చూస్తే చాలు. కాని    ఇంకా ఇంకా చూడాలని కోరిక  .ఇది భక్తుని లోపం.ఇక చాలు నన్ను చూడటం అనే తృప్తిని - భక్తునికి భగవంతుడు ఇవ్వలేకపొతున్నాడు. ఇది  ఆయన లోపం. 
నిజానికి ఇవి లోపాలు కావు. నిజానికి ఇద్దరి లోపము కాదు.ఇవి లోపాలు కావనే విషయాన్ని కవి ఈ పల్లవిలోని మొదటి  పాదంలోనే చెప్పాడు.ఆయన రూపం జగన్మోహనాకారం. అందుకే ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది.  స్వామికి ఎంత చేసినా  , ఇంకా చేయాలనుకోవటం, చూడాలనుకోవటం ఉన్నత శిఖరాలకు చేరిన భక్తి భావం. 
ఆయన చతురుడు. అందుకే  అసలు విషయం   జీవునికి  తెలియనీయకుండా,    ఆ పురుషోత్తముడు  మాయ కప్పుతూ భక్తి సామ్రాజ్యాన్ని నేర్పుగా పరిపాలిస్తున్నాడు. జీవుడూ కర్మ ఫలాన్ని ఆనుభవించేంత వరకు ఆయన సాక్షి. 
అన్నమయ్య కు ఈ విషయం తెలియదా? కాని  భక్తులయెడల ఇది  నీ లోపం కాదా ? అని  అన్నమయ్య  లోపాల గడుసు ప్రశ్నలు వేసాడు ఈ గీతంలో..అన్నమయ్య ఉక్తి వైచిత్రి ఇది. 
ఈ అవతారంలో మోహిని అలంకారంలో నిలుచున్న భంగిమలో  కాకుండా కూర్చున్న భంగిమలో వేంకటేశ్వరుడు  స్త్రీలు ధరించే అన్ని ఆభరణాలతో  కనువిందు చేస్తాడు. ముక్కుకు  వజ్రపు ముక్కుపుడకతో , శంఖచక్రాల స్థానంలో రెండు వికసించిన పద్మాలతో ఉండే స్వామి వారి రూపం మనోహరం.  అలంకరిస్తారు. 
అన్ని వాహన ఊరేగింపులు బ్రహ్మోత్సవాలలో వాహన మండపం నుండి  మొదలుపెడతారు. .కాని ఒక్క  మోహిని అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుంచి  ప్రారంభమౌతుంది.
***

No comments:

Post a Comment

Pages